సెంటర్ స్పెషల్

అద్దాలబండి.. అదిరిందండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే ఆంధ్రా ఊటీ... ప్రకృతి అందాల్లో మేటి... ఎటుచూసినా ఆహ్లాదం... ఆనందం... ఇక పర్యాటకుల కనువిందుకు కొదవేముంది? భిన్నమైన వాతావరణంతో ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసినట్లుగా ఉండే అరకు సోయగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనివితీరా ఆస్వాదించాలే తప్ప మాటల్లో ఒదిగిపోయేది కాదు. మనసును ఆహ్లాదపరిచే అలాంటి అందాలను రైలు బోగీలోంచే తిలకించే సౌలభ్యం ఉంటే ఇక చెప్పేదేముంది? తొంగి తొంగి చూడాల్సిన అవసరం లేకుండా రివాల్వింగ్ చైర్‌లో ఎటు కావాలంటే అటు తిరిగి చూసే సౌకర్యం ఉంటే అంతకంటే మించిన ఆహ్లాదం ఏముంటుంది? అలాంటి ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించాలంటే అరకును సందర్శించాల్సిందే... అద్దాల రైలులో ప్రయాణించాల్సిందే! ఆ అద్దాల రైలు పేరే విస్టాడోమ్ కోచ్. అరకు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్న విస్టాడోమ్ కోచ్ అరకు అందాలకు అదనపు శోభను చేకూర్చింది.
విస్టాడోమ్ అంటే...
సహజ సిద్ధమైన ప్రకృతి అందాల అనుభూతిని పర్యాటకులు ప్రత్యక్షంగా పొందే విధంగా విశాఖ-అరకు మధ్య నిర్వహించే ఏసి అద్దాల కోచ్ పేరే విస్టాడోమ్. దేశ, విదేశీ పర్యాటకులను, ప్రయాణికులను మంత్రముగ్ధులను చేసే విధంగా రూపొందించబడిన విస్టాడోం ఏసి కోచ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రివాల్వింగ్ చైర్స్, ఫుష్‌బ్యాక్‌తో కూడిన సీట్లు ఉంటాయి. వీటిలో కూర్చొనే ప్రయాణికులు ఎటు నుంచి అయినా ఏ విధంగానైనా తిరిగేందుకు సౌలభ్యంగా ఉంటుంది. అన్నింటికంటే ప్రధానంగా విస్టాడోమ్ కోచ్‌లో కూర్చొనే ప్రయాణికులు రెండువైపుల ప్రకృతి అందాలను అద్దాల ద్వారా వీక్షించవచ్చు. అతి విశాలమైన గ్లాసుల కిటికీలు, పైన ఆకాశాన్ని కూడా చూసేలా అద్దాల టాప్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. కోచ్ నుంచి 360 డిగ్రీలు తిరిగేలా కుర్చీలను ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత. కోచ్‌లో జీపీఎస్‌తో అనుసంధానించిన ఎల్‌సీడి ఆడియో, వీడియోలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయ.
దేశంలోనే తొలి ప్రయోగం... వాల్తేరుకు సొంతం...
భారతదేశంలోనే విస్టాడోమ్ ఇక్కడే తొలి ప్రయోగంగా నిలిచింది. మరే ప్రాంతంలోను నిర్వహించని విస్టాడోం కోచ్‌ను తొలిసారిగా ఒక్క వాల్తేరు డివిజన్‌లోనే ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వేజోన్లలో ఎక్కడా లేనివిధంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం-అరకు మధ్య తొలిసారిగా విస్టాడోం ఏసి కోచ్‌ను రైల్వే పట్టాలెక్కించింది. దీంతో వాల్తేరు డివిజన్ ప్రతిష్ట విశ్వవ్యాప్తంగా నిలిచింది.
చెన్నై పెరంబూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో విస్టాడోం కోచ్‌ను నిర్మించారు. విశిష్టత కలిగిన విస్టాడోం ఏసి కోచ్ తయారీకి రైల్వే ఏకంగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ కోచ్ తయారీకి 120 రోజులకు పైనే సమయం తీసుకుంది. మెకానికల్, ఇంజనీరింగ్, ఆపరేషన్ విభాగాలకు చెందిన నిపుణులు దాదాపు 50 మంది దీని తయారీలో పాలుపంచుకున్నారు.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎప్పటికపుడు విస్టాడోం కోచ్ నిర్మాణం జరిగింది.

ఇదే తరహాలో మరో కోచ్‌ను తయారు చేశారు. ఇది కూడా త్వరలో విశాఖకు రానుంది.
విశేష ఆదరణ
తొలి రోజు నుంచి దీనికి పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. విస్టాడోమ్ కోచ్‌లో 40 మంది ప్రయాణించవచ్చు. ఆన్‌లైన్ లేదా నేరుగా ప్రధాన రిజర్వేషన్ కాంప్లెక్స్‌లో కౌంటర్ల ద్వారాను టికెట్ రిజర్వు చేసుకోవచ్చు. నెల రోజుల ముందుగానే ఈ కోచ్ నిండిపోతుంది. వెయిటింగ్‌లిస్టు చూపితే రిజర్వేషన్ టికెట్ అనేది జారీ కాదు. అందువల్ల రిజర్వేషన్ టికెట్ పొందిన ప్రతిఒక్కరూ ఇందులో ప్రయాణించవచ్చు. అసలే వేసవి సీజన్ కావడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. విశాఖ-అరకు మధ్య నడిచే విస్టాడోమ్ ఏసి కోచ్ ఈ ఏడాది ఏప్రిల్ 16న ప్రారంభమైంది. తొలి రోజు ఉ. 10 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళింది. అప్పటినుంచి ప్రతిరోజు ఉ. 7.05 గంటలకు విశాఖలో ప్రారంభమై ఉ.11.05కు అరకు ప్రాంతానికి చేరుకుంటుంది. 128 కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతుంది. మార్గమధ్యలో 11 స్టేషన్లలో ఆగుతుంది. ఈ విధంగా సాగే ప్రయాణంలో పర్యాటకులకు అనుభూతిని అందించే 58 టనె్నల్స్, మరో 84 వంతెనలు దర్శనమిస్తాయి. అరకులో ఈ కోచ్‌ను తొలగిస్తారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖపట్నం పాసింజర్‌కు దీనిని తగిలిస్తారు. ఈరైలు అక్కడ నుంచి సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరి రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
పదేళ్ళనాటి కల...
పదేళ్ళనాటి పర్యాటకులు, ప్రయాణికుల కల ఇన్నాళ్ళకు సాకారం అయ్యింది. 2007లో తొలిసారిగా విశాఖ-అరకు మధ్య అద్దాల ఏసి కోచ్ గురించి వాల్తేరు డివిజన్ ప్రతిపాదనలు సిద్ధంచేసి రైల్వేబోర్డుకు పంపించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది చర్చ జరుగుతున్నా కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు పర్యాటక ప్రదేశం మరింతగా అభివృద్ధి చెందాలన్నా, దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలన్నా ఖచ్చితంగా అద్దాల రైలు సమకూర్చాల్సిందేనని రైల్వేబోర్డు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సర్వేను నిర్వహించింది. కొంతమంది అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు వెచ్చించి మరీ దీనిని పట్టాలెక్కించాల్సి ఉందంటూ నివేదించారు. ఈ విధంగా గత పదేళ్ళ నుంచి నలుగుతున్న అద్దాల రైలు ప్రజాప్రతినిధుల వత్తిళ్ళు, ప్రయాణికుల కోరిక మేరకు ఎట్టకేలకు పట్టాలెక్కింది.
కాశ్మీర్‌లో మరో ప్రయోగం
వాల్తేరు డివిజన్‌లో తొలి ప్రయోగంలో భాగంగా పట్టాలెక్కిన విస్టోడోమ్ కోచ్ అద్దాల రైలును రానున్న రోజుల్లో కాశ్మీరులో ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. విశాఖ-అరకు మధ్య ప్రవేశపెట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలో పలుచోట్ల ఈ విధానం అమలు చేసే అంశాన్ని రైల్వే తీవ్రంగా పరిశీలిస్తోంది.
అద్దాల్లో అరకు అందాలు...
విశాఖ-కిరండూల్ రైలుకు జతచేసి విస్టాడోమ్ కోచ్‌లో వెళ్ళే 40 మంది ప్రయాణికులు అద్దాల రైలులో నుంచి

ఎత్తయిన కొండలు, లోతైన లోయలు, సొరంగ మార్గాన్ని తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. అరకు తదితర ప్రాంతాల నుంచి స్థానికులు సైతం దీనిని తిలకించేందుకు రైల్వేస్టేషన్‌కు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన అనంతగిరి మండలం బోర్రా గుహల రైల్వేస్టేషన్‌లో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. పర్యాటకులు, స్థానికులు ఇది బయలుదేరినంత వరకు విడిచిపెట్టడంలేదు. విస్టాడోమ్ రక్షణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) సిబ్బంది పహారా కాస్తున్నారు. విశాఖ నుంచి అరకు ప్రాంతం వరకు దీనికి కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుంది. విశాఖ నుంచి అరకు వెళ్ళే పర్యాటకులు, ప్రయాణికులు ఒక్కొక్కరు చార్జీలుగా రూ.650లు చెల్లించాలి. అత్యాధునిక సదుపాయాలు కల్పించడంతో కూడిన ఏసి కోచ్‌ను అద్దాలతో తీర్చిదిద్దడంతో అధిక చార్జీలను రైల్వే నిర్ణయించింది. అయతే ఈ చార్జీని కొంత తగ్గించాల్సిందిగా పర్యాటకులు కోరుతున్నారు.
కొత్త అనుభూతి
కిరూండల్ పాసింజర్‌లో ప్రయాణానికి కొత్తగా పట్టాలెక్కిన విస్టాడోమ్‌లో వెళ్ళే దానికి చాలా వ్యత్యాసం ఉంది. అసౌకర్యాల మధ్య, ఎపుడూ రద్దీగానే ఉండే కిరూండల్ పాసింజర్‌లో వెళ్ళడం విసుగెత్తిస్తుందని, అదీ తూర్పుకనుమల్లో సహజసిద్ధమైన అందాలను వీక్షించే అవకాశం ఇందులో లభించదని ప్రయాణికులు చెబుతున్నారు. అదే విస్టాడోమ్ ప్రయాణం కొత్త అనుభూతికి లోనవుతున్నామని పర్యాటకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
త్వరలో మరో కోచ్
చెన్నై పెరంబూరు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో (ఐసిఎఫ్)లో మరో విస్టాడోమ్ కోచ్‌ను నిర్మించారు. ఇది కూడా త్వరలో ఇక్కడకు రానుంది. దీంతో విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్య రెండుకు చేరుకోనుంది. ఈ విధంగా రెండు ఏసి అద్దాల కోచ్‌లతో పూర్తిస్థాయిలో దీనిని నిర్వహించాలని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ణయించారు.

- రాజన్‌రాజు