సెంటర్ స్పెషల్

పుస్తక పెరుమాళ్లుకు తిరునాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుస్తకం హస్త్భూషణం’ అన్నది ఆణిముత్యం లాంటి మాట. చదువు రాని వాడు పుస్తకాన్ని కేవలం అలంకార ప్రాయంగా ధరిస్తాడు - అన్న అర్థంలో ఆ మాట లోకంలో వ్యాప్తిలో ఉన్నప్పటికినీ, అసలు గాజులూ, గడియారాలూ, ఉంగరాలూ - ఇవి చదువుకున్న మనిషి చేతికి అలంకారాలు కావు. మంచి పుస్తకమే మనిషి చేతికి నిజమైన భూషణం.

‘‘ఈ యుగంలో కూడా పుస్తకాలు కొని చదవడం ఏమిటి? ఇంటర్నెట్టు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంటేనూ’’.. అనే వాళ్ల సంఖ్య ఎక్కువే లోకంలో! ఇంటర్నెట్టు పుస్తకానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కానే కాదని చాలామందికి తెలీదు. ‘పేపరు చూశావా?’ అనడుగుతారు గానీ, పేపరు చదివావా? అనడం లేదీ రోజుల్లో! అక్షరాలు చూడబడుతున్నాయగానీ చదవబడడం లేదు. చూసి వదిలేయాల్సిన వాటికి ఎక్కువగా ఇంటర్నెట్టు, చదివి పదిల పరుచుకోవలసినవాటికి పుస్తకం ఉపయోగపడతాయి. పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు.
పుస్తకాల తిరునాళ్లలో ప్రతి పుస్తకమూ పెరుమాళ్లే! పుస్తకాన్ని దేవుడిగా భావించుకునే సంస్కృతి మనది. ఒకనాడు జాతీయోద్యమంలో భాగంగా గ్రంథాలయోద్యమం నడిచింది. గ్రంథాలయాలను ఆనాడు పవిత్ర దేవాలయాలుగా భావించుకున్నారు. అదే జాతీయోద్యమ స్ఫూర్తితో పుస్తక మహోత్సవాలకు తగిన రాయితీలిస్తూ ప్రభుత్వమే నిర్వహించవలసి ఉంది. తెలుగులో అచ్చయిన ప్రతీ పుస్తకాన్నీ నిర్దేశిత సంఖ్యలో కొనుగోలు చేసే విధానాన్ని తెలుగు ప్రభుత్వాలు ఆచరణలోకి తేవాలి.
చేతిలో నోట్లు లేని ఈ కాలంలో పొదుపుగా జీవిస్తున్న జనవాహినికి పుస్తకాలు కొని సంబరం చేసుకునే అదను లేకపోవడం నిజమే! ‘పాతచొక్కా తొడుక్కో - కొత్త పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి సర్వకాలాలకూ వర్తిస్తుంది. ఇతర అవసరాల్ని వాయిదా వేసుకుని, నచ్చిన పుస్తకాన్ని కొనుక్కునే పెద్దమనసున్న ప్రజలకు ఇంకా కొదవలేదు కాబట్టే, పుస్తక మహోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి.
సినిమా రచయితలకు, ఒకరిద్దరు వాణిజ్యాత్మక రచయితలకు తప్ప తెలుగు నేలమీద ఏ రచయితా తాను వ్రాసిన పుస్తకాలపైన బతికే పరిస్థితి లేదు. అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రచురణకర్తలకూ రచయితలంటే గౌరవ ప్రదర్శనమూ లేదు. సాధారణంగా రచయిత తమ ప్రచురణకర్త బాగుండాలనే కోరుకుంటాడు. పబ్లిషరుకు నాలుగు రూపాయలొస్తే, తన పుస్తకం పదిమంది పాఠకులకు చేరిందని గర్వపడతాడు. రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు ఈ ముగ్గురి మధ్యా చక్కని సమన్వయం ఏర్పడితే, ఉత్తమ సాహిత్యానికి దారులు పడతాయి.
చాలామంది రచయితలు తమ పెన్షను డబ్బులనో, పొదుపు మొత్తాలనో, బ్యాంకు అప్పులనో వెచ్చించి ముద్రించిన పుస్తకాలు ఇంట్లో అడ్డంగా పడున్నాయనే ఈసడింపులకు గురౌతున్నారు. అవి పాఠకులను చేరడానికి తగిన యంత్రాంగం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇప్పటివరకూ గొప్ప పురస్కారాలు పొందిన పుస్తకాలలో రచయితల స్వీయ ప్రచురణలే ఎక్కువ! ఫలానా పురస్కారం పొందిన పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ అని గర్వంగా చెప్పుకోగలిగిన ప్రచురణ సంస్థలు మనకు అరుదు. అయినా, రచయితలకు సమున్నత గౌరవం లేదు.
ఉత్తమ రచనలు పాఠకులను చేరడానికి అవరోధాలు చాలా ఉన్నాయి. ‘ఇలాంటి పుస్తకాలు పోవండీ’ అంటూ ప్రచురణకర్తల ఈసడింపులకు, ఇలాంటివి పెట్టుకునే చోటు లేదని పుస్తక విక్రేతల తిరస్కరణలకూ గురై, ఉత్తమ గ్రంథాలు అనేకం చెదలకు ఆహారంగా మారుతున్నాయి. రాయని భాస్కరులైన సీనియర్ రచయితల్ని ఇప్పుడు రాయడం లేదేమని అనడిగితే ‘రాసి ఏం చేసుకోవాలి?’ అని సమాధానం చెబుతున్నారు. మంచి రచనలకు ‘ఔట్‌లెట్’లు లేని పరిస్థితి.
తెలుగులో జ్ఞానపీఠాలు, జాతీయ పురస్కారాలు తక్కువ అని ఆవేదన చెందేవారిలో పుస్తకం కొని చదివేవాళ్లు ఎందరన్నదే ప్రశ్న. విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వాహకులు రచయితల స్టాలు ఉచితంగా ఇవ్వడంతో కృష్ణాజిల్లా రచయితల సంఘం చొరవగా ముందుకువచ్చి 125 మంది రచయితల స్వీయ ప్రచురణలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. ఈ సౌకర్యం మరింత ఉదారంగా కొనసాగాలి. అది సామాజికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. సాంకేతికం కావచ్చు. ప్రతీ రచనకూ పాఠకుడు ఉంటాడు. ఆ పాఠకుడికి ఆ పుస్తకం చేరాలి. అది రచయితల స్టాలు వలనే సాధ్యం అవుతుంది. రచయితల స్వీయ ప్రచురణలను ప్రత్యేక విభాగంగా పరిగణించి ప్రోత్సహించాలి. పుస్తక మహోత్సవాలు రచయితలను గౌరవించే వేదికలుగా ఉండాలి.
2017 జనవరిలో జరిగిన విజయవాడ పుస్తక మహోత్సవంలో రెండు రాష్ట్రాల నుండి 350 మంది రచయితల్ని ఒక రోజు అతిథులుగా వచ్చి పుస్తక ప్రదర్శన సందర్శించమని ఆహ్వానించి, దారిఖర్చులూ, వసతి సౌకర్యాలూ ఇచ్చి, సత్కరించి పంపడం ఒక అపూర్వ సందర్భం! ఇది ప్రతీ పుస్తక ప్రదర్శనలోనూ ఒక ఆనవాయితీ కావలసిన అవసరం ఉంది. గత రెండు పుస్తక మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్టులు భాగస్వాములయ్యాయి. అందువలన ఉత్తమ సాహితీవేత్తలను ఆహ్వానించి, మాట్లాడించి, గౌరవించే అవకాశాలు కలిగాయి. పుస్తక ప్రదర్శనలు ప్రతీ జిల్లాలోనూ జరగాలి. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని స్కూలు-కాలేజీ విద్యార్థులు వచ్చి సందర్శించే వీలు కల్పించాలి. పెళ్లిళ్లకు, పెరంటాలకు, సభలూ సమావేశాలకు మంచి పుస్తకాలను జ్ఞాపికలుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రజలు అలవరుచుకుంటే, ఉత్తమ సాహిత్యం జనాన్ని కొంతైనా చేరుతుంది.

-డా.జి.వి.పూర్ణచందు 9440172642