అక్షర

నేతన్నల వెతలకు ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరళీకృత ఆర్థిక విధానాలవల్ల ప్రపంచం యావత్తూ ఒక ‘గ్లోబల్ విలేజ్’గా మారిపోతున్నది. సాంకేతిక రంగంలో విప్లవం, మెరుగుపడిన ఆర్థిక పరిస్థితి ఒక పార్శ్వం; కుల వృత్తులు కూడుపెట్టలేక పోవటం, క్షీణిస్తున్న మానవ సంబంధాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు మరో పార్ష్వం. ఈ సందిగ్ధ కాలం (Transition Period)లో ఆకలి చావుల్నీ, ఆత్మహత్యల్నీ తప్పించలేమా? అన్న ప్రశ్న యావత్ సమాజం వేసుకోవలసిన అవసరం ఉంది. ఈ ‘విప్లవం వెల్లువ’ యావత్ ప్రపంచానే్న ముంచేస్తుంటే, పాశ్చాత్య దేశాలు ఈ వెల్లువలో కొట్టుకుపోకుండా ఎలా మనగలుగుతున్నాయి? అన్నది మరో ప్రశ్న.
ఏది ఏమైనా, నిరంతరం మార్పులకు లోనుకావటం తప్పనిసరి. రాతి యుగంనుండి, నేటి సాంకేతిక/ కంప్యూటర్ యుగం వరకూ, ఎన్నో మార్పులు వచ్చాయి. వీటికి అనుగుణంగా మనిషి మార్పు చెందుతూ వస్తున్నాడు.
ఒకప్పుడు ‘జన జీవనం’లో ప్రభుత్వం పాత్ర చాలా తక్కువగా ఉండేది. గ్రామాలన్నీ స్వయంపోషకంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అంతర్లీనంగా, ప్రతి వ్యక్తి జీవితాన్నీ ప్రభుత్వం శాసిస్తోంది. ‘అందువల్ల మనిషి సమాజ జీవనంలో ప్రభుత్వం పాత్ర ఎంతగానో ఉంది. ఈ పాత్ర పోషణలోని అస్తవ్యస్తమే. నేడు చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్య.
ఈ సమస్యకు స్పందన.. ‘‘చేనేత కవిత’’- కవితా సంకలనం. ఈ సంకలనకర్త పున్న అంజయ్య. వీరి కలం పేరు ‘‘పున్నమి’’. తెలుగు ఉపన్యాసకులైన వీరి ప్రవృత్తి రచనా వ్యాసంగం. పలు పత్రికలకు సంపాదకత్వం వహించిన అనుభవజ్ఞులు.
వీరు నేటి చేనేత వృత్తిపనివారల దుస్థితి చూసి చలించిపోయారు. రెండు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖ గేయ రచయితల్ని సంప్రదించి వారి రచనల్ని సేకరించి ఈ సంకలనం మన ముందుకు తెచ్చారు. డా.ఎన్.గోపీ, డా.పత్తిపాక మోహన్, డా.తిరునగరి వంటి 24 మంది ప్రముఖులు చేనేత దుస్థితిపై వ్రాసిన కవితల్ని, మరియు మరో 25గురి నానీలు, హైకూల్నీ ఇందులో పొందుపరిచారు పున్నమి. చేనేతోద్యమ పితామహుడు డా.కొండాలక్ష్మణ్ బాపూజీగారి శత జయంతి సందర్భంగా 27-9-2015న ఆవిష్కరింపబడిందీ సంకలనం.
తెలుగు తీగలకు మరాఠీ పూలు పూయిస్తూ, రైలు వేగంకన్నాముందే రాజయ్యను బొంబాయి చేరుస్తూ, పట్టుచీరలు నేసిన అద్భుత హస్తాలని గుర్తుచేస్తారు డా.ఎన్.గోపీగారుల కన్నీటి ప్రవాహం/మానేరు తీరం/ బాధల ముఖచిత్రమై సిరిసిల్ల’’అంటూ, ‘‘కార్మిక జనవాసాలన్నీ / కన్నీటి తీరాలైన సముద్రాలు’’ అంటూ వలపోస్తారు డా.పత్తిపాక మోహన్. ఇక ‘‘ఎవడు రాసిందో రాత/ రాసినోడు పాడుగాను’’ అంటూ విధాతపైనే ఆక్రోషం వెళ్ళగ్రక్కుతారు పున్న సుదర్శన్.
‘‘మగ్గం గోతులే సమాధులు’’అంటూ, మొగ్గంగుంట సజీవ సమాధి’’ అంటూ, ‘‘అవార్డులు పొందిన/పుట్టపాక/ తెలంగాణం కట్టిన/ పట్టుకోక//’’అంటూ, ‘‘చీర/ మేడిపండు/ బతుకురాచపుండు’’ అంటూ పలువురు రచయితలు తమ నానీల్లో, హైకూల్లో, తమ ఆవేదనల్ని ప్రకటించారు.
లక్షలాది మంది చేనేతన్నలకు ఉపాధి కల్పించి ఒకనాడు గొప్ప వెలుగు వెలిగి నేడు, డొక్కలెండిన చిక్కుముడిపడ్డ చేనేత పరిశ్రమ గురించి అతి ప్రతిభావంతంగా వ్రాయబడ్డ గేయ సంకలనం ఇది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఈ సమస్యను అవగాహనం చేసుకుని నేతన్నలనూ, పరిశ్రమనూ కాపాడాల్సిన అవసరం ఎంతో అవసరం. **

-కూర చిదంబరం