మెయిన్ ఫీచర్

పేలిపోతున్నాయి ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమాలు చాలావరకూ -పేలాల్లా పేలిపోతున్నాయి. అదృష్టం కలిసొచ్చి పెద్ద సినిమాలు అడ్డురాకుంటే.. ఆశించినట్టుగా థియేటర్లు దొరికితే.. ఇబ్బందిలేకుంటే సినిమా ఆడకపోతుందా? అన్న ఆశలతో చిన్న సినిమాలు టాలీవుడ్ కార్ఖానాలో తయారవుతూనే ఉన్నాయి. విడుదలవుతూనే ఉన్నాయి. అయినా -చిన్న సినిమా పేలిపోతుంది. ఎందుకు?
**
తుపాకి తిప్పడం ఒకడు నేర్పాలేంటి..? ఎన్ని సినిమాలు చూడట్లేదు -అంటాడు పోకిరిలో మహేష్. అవున్నిజమే -తెలుగు ఇండస్ట్రీకి, క్యూగట్టి వస్తున్న కొత్త దర్శకులకు సరిగ్గా సరిపోయే డైలాగ్ ఇది. గతంలో దర్శకుడికో తపనుండేది. ఉద్దండుల దగ్గర పనిచేసిన అనుభవముండేది. మంచి చెడూ విశే్లషణ ఉండేది. ఇప్పుడు -సినిమాను డైరెక్ట్ చేయడం ఒకడు నేర్పాలేంటి? ఎన్ని సినిమాలు చూడట్లేదు. సినిమాను చుట్టేయడానికి ఆమాత్రం అనుభవం చాలదూ! అందుకే -సినిమాలు పేలిపోతున్నాయి. పేలాల్లా పేలిపోతూనే ఉన్నాయి.

సినిమా ఎట్లా తీశామన్నది కాదన్నయ్యా విషయం.. థియేటర్లు దొరికాయా? లేదా? ఆడిందా? ఆరిపోయిందా? అనేదే అసలు విషయం. ఈమాత్రం సినిమాలు తీయడం పెద్ద
విషయమా? ఎన్ని చూళ్లేదూ..!!

****
ఈ డైలాగులు వింటుంటే పోకిరి చిత్రంలో మహేష్ డైలాగులకు పేరడీలా అనిపిస్తున్నాయి కదూ! ఇంచుమించు అంతేమరి. ‘తుపాకి తిప్పడం ఒకళ్ళు నేర్పాలేటి..? ఎన్ని సినిమాలు చూడట్లేదు’ అన్న డైలాగ్ పవర్ అలాంటిది మరి. సరే విషయానికొస్తే -ఈ డైలాగ్ ఇపుడు తెలుగు సినీ పరిశ్రమకు చక్కగా అమిరిపోతుంది. గతంలో దర్శకుడిగా అవకాశం రావడం అంటే గగనం. ఇపుడో కొత్త దర్శకుడు ఎవరున్నారా? అని కొవ్వొత్తులు మరీ వెతికి అవకాశాలు ఇస్తున్నారు నిర్మాతలు. అవకాశం అందిన తరువాతే కథల వంట మొదలెడుతున్నారు కొత్త దర్శకులు. అదీ -కొరియన్ సినిమాలు చూసి! పోనీ అవైనా సంసారపక్షంగా, తెలుగు సినిమా నేటివిటీకి దగ్గరగా రాసుకుంటున్నారా? అంటే అదీలేదు. కొరియా భాషలో ఎలావుంటే అలా.. డిటో డిటో అంటూ లోకల్‌మేడ్ పాత్రలతో వండి వండిచ్చేస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితులకి ఇక్కడి పరిస్థితులకు, అక్కడి వ్యవహారాలకు ఇక్కడి వ్యవహారాలకు, సంప్రదాయాలకు సరైన లింక్‌లేక సినిమాలు ఎక్కడివక్కడ పేలిపోతున్నాయి. థియేటర్లు కూడా దొరకని ఈ రోజుల్లో నిర్మాతలు అడ్డమైన బాధలు పడి థియేటర్లు సంపాదించినా, సరైన కథ, కథనాలు చిత్రాల్లో కనపడక తేలిపోతున్నాయి. దీనంతటికీ కారణం ఏంటి అనంటే, సరైన కథ కథనాలు కొరవడడం. అన్నీ మాకే తెలుసనుకునే కొత్త దర్శకుల భావదారిద్య్రం, పైగా అనుభవం లేకపోవటం!
ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో దాదాపు 60 శాతం చిత్రాలు ఎప్పుడొచ్చాయో, ఎవరికి కనిపించాయో (కనీసం పోస్టర్లైనా), ఎక్కడాడోయో, ఎప్పుడు వెళ్లిపోయాయో.. ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇలా ఎందుకు జరుగుతోంది? పెద్ద సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీ లేకపోవడంతో అరకొర చిత్రాలు ఎక్కడో మారుమూల వున్న థియేటర్లలో విడుదలకు నోచుకుంటున్నాయి. ఆ సినిమా విడుదలయ్యాకైనా వౌత్ టాక్ బాగుంటే పెద్ద థియేటర్లు ఆహ్వానిస్తున్నాయి. కానీ సినిమాలో ఏ విషయం లేక తేలిపోవడంతో అవి ఎపుడు విడుదలయ్యాయో ఎపుడు వెళ్లిపోయాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొంది. కొత్త దర్శకులతో, నటీనటులతో రూపొందిస్తున్న చిత్రాలు చాలావరకూ కథ, కథనాలు లేక నీరుగారుతున్నాయి. కథున్నా అందుకు తగ్గ సన్నివేశాల బలంగా రాసుకోలేక పోవడం కొత్త దర్శకుల్లో కనిపిస్తున్న మరో వైఫల్యం. అనుభవం లేకుండా అడుగుపెటటడం, సంపాదించుకున్న అనుభవాన్ని అర్థవంతంగా వెచ్చించలేకపోవడమే ఈ పరిస్థితి కారణమని గట్టిగా చెప్పొచ్చు. పట్టుదలగా సినిమాను పూర్తిచేస్తున్న దర్శకులు -అంతకుముందే అంతే పట్టుదలతో కథను తయారు చేసుకోవడలో పూర్తిగా విఫలమవుతున్నారు. సినిమాను ఎలా చెప్పాలో తెలియనితనానికి గురవుతున్నారు. తమకన్నీ తెలుసన్న అతి కూడా కొన్ని సినిమాల కొంప ముంచుతుంది. ఎవరి దగ్గరా పని నేర్చుకోకపోవడం, ఒక సన్నివేశాన్ని ఏవిధంగా పిక్చరైజ్ చేస్తే వర్కటవుతుందో తెలియకపోవడం, సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసన్న భ్రమలతో ముందుకెళ్లడం..లాంటి పొరబాట్లు ఫలితాన్ని తారుమారు చేస్తున్నాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద దర్శకులు తమకేం తెలీదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం అనుకునే స్థాయిలోవుంటే, ఇపుడొస్తున్న కుర్ర దర్శకులు మాత్రం తమకన్నీ తెలుసన్న బిల్డప్పుల్లో బతికేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారాన్ని ఎలా చేయాలో, మార్కెటింగ్ పద్ధతులేమిటో తెలుసుకుంటున్నారు తప్ప సినిమాలో కథ కథనాల గూర్చి పట్టించుకోవడంలేదు. కథలు చూడ్డం మానేశారని, కథనంతో ముందుకెళ్తేనే బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్కవుట్ అవుతాయన్న నమ్మకాలతో అడుగులేస్తున్నారు. ఒకవిధంగా ఈ వాదనా కరెక్ట్ కావొచ్చు. కానీ ఆ కథనమే సరైన దిశలో సాగడంలేదు. ఇది పరిశ్రమకు గొడ్డలిపెట్టులా మారింది.
మరో కోణం
నూతన దర్శకులు, నటీనటులతో రూపొందించిన చిత్రాలు పరిశ్రమలో ఈవిధమైన అపఖ్యాతిని పొందుతుంటే -దీనికి నాణేనికి మరోవైపు అన్నట్టు కొత్తవారితోనే చిత్రాలు తీస్తామనే నిర్మాతలకు కొదువలేదు. ఎందుకంటే పెద్ద నటులను, దర్శకులను భరించే స్థితిలో కొత్త నిర్మాతలు లేకపోవడం, వారు పెట్టే సవాలక్ష కండిషన్‌లను ఒప్పుకున్నా అది అనుభవంలోకి వచ్చేసరికి కొత్త నిర్మాతలు లెంపలేసుకుంటున్నారు. వారు కోరుతున్న కోరికలు, అడుగుతున్న లెక్కలు, ఏరియాలవారీగా ఇమ్మనే హక్కులు లాంటి గొంతెమ్మ కోరికలను తీర్చలేక సతమతం అవుతున్నారు. సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, వచ్చినా మిగతా పారితోషికం చెల్లించేదాకా డబ్బింగ్ చెప్పననడం, ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణంలో కొత్త నిర్మాతలు సినిమాలు తీసే సాహసం చేయలేకపోతున్నారు. అందుకే కొత్తవాళ్ళతో ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ఎలావున్నా సరే రాజీపడిపోయి సినిమా రూపొందిస్తున్నారు. చివరికి అన్నిట్లో రాజీపడ్డట్టుగా సినిమా విడుదల విషయంలో, కలెక్షన్లను రాబట్టే విషయంలోనూ రాజీపడిపోయి అనవసరంగా సినిమా రూపొందించానని చెంపదెబ్బలు వేసుకొని మళ్లీ కనపడకుండా వెళ్తున్నారు. ఇదేనా టాలీవుడ్ కొత్త నిర్మాతలకు స్వాగతం చెప్పే పద్ధతి. నిర్మాత అనేవాడు బాగుంటునే పరిశ్రమ బాగుంటుందనే వాళ్ళంతా, కొత్త నిర్మాతలను ఇబ్బంది పెడుతూనే వున్నారు. ఎవరి మనస్సాక్షి వారికి తెలుసు. అప్పట్లో ఎన్టీఆర్, ఎఎన్నార్‌లు క్రమశిక్షణతో వున్నారు కనుకనే అనేక చిత్రాల్లో నటించగలిగారు. ఇపుడు అలాంటి వాతావరణం దర్శకులలో, నిర్మాతలలో, నటీనటులలో ఎవరివద్దా కనపడటంలేదని పాత నటీనటులు చెబుతూనే ఉంటారు. ఇప్పటి కాలానికి తగ్గట్టు ఇప్పటి నటీనటులు కూడా వున్నారు. థియేటర్లు దొరకని నిర్మాతలు కొద్దోగొప్పో థియేటర్లలో విడుదల చేసుకున్న తరువాత దానికి వౌత్ టాక్ బాగా వస్తే, వెంటనే థియేటర్ల యజమానులు ఆయా సినిమాలను తమ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం సినిమాలో స్పార్క్‌వున్నా, ఆదరించే థియేటర్లు వున్నాయని ఈ సంఘటన నిరూపిస్తోంది. దర్శక నిర్మాతలు, రచయితల మధ్య గొడవలు వచ్చి ఆ సినిమాకి మంచి క్రేజ్ వచ్చినా కానీ కొన్ని సినిమాలు పేలిపోయాయి ఇటీవలికాలంలో. గొడవలతోనే హిట్ రేంజ్‌కు చేరుకుంటామనేది టీవీ మాథ్యమానికి సంబంధించిన సూత్రం. అది సినిమాకు వర్కవుట్ కావడంలేదు. మీరెన్ని గొడవలు పడ్డా పర్లేదు, సినిమా బాగుంటేనే ఆదరిస్తామంటున్నారు ప్రేక్షకులు. అందుకనే చెప్పొచ్చేదేమిటంటే, కొత్త కథనాలు మీరు తీసుకురాలేరు. కనీసం అలా కొత్తగా కథ చెప్పేవాళ్ళను ప్రోత్సహించనూ లేరు. కనీసం కొత్తగా చెప్పే ప్రయత్నమన్నా చేయండి. అపుడే సినిమాలు థియేటర్ల సాక్షిగా పేలాల్లా పేలిపోకుండా కొద్దోగొప్పో కలెక్షన్లను రాబడతాయి. పరిశ్రమ కళకళలాడుతుంది.

-జి రాజేశ్వరరావు