తెలుగుసీమలో మలయ మారుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువే?. ఈ విషయం తెలుగు సినిమా రంగానికీ వర్తిస్తుంది. తెలుగు తెరపై మెరిసిన కథానాయికల విషయంలో చూస్తే తెలుగు అమ్మాయిల అందం కంటే పొరుగు అమ్మాయిల అందానికే దాసోహం అయ్యారు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా నిర్మాతలు. పక్క రాష్ట్రాలనుండి కథానాయికలను దిగుమతి చేసుకోవడం సాధారణమైపోయింది. ఇది ఇతర సినీరంగాల్లోనూ సాధారణమైపోయింది. తెలుగు అమ్మాయిలు.. తమిళ, మలయాళ భాషల్లో రాణించినవారు ఉన్నారు. తెలుగులో హీరోయిన్ కోసం ఎక్కువగా ముంబై ఫ్లైట్ ఎక్కే దర్శక నిర్మాతలు ఈమధ్య రూటు మార్చి కేరళ, చెన్నై ఫ్లైట్‌లు ఎక్కుతున్నారు. ముంబై భామలకంటే కేరళ కుట్టీలే అందంగా ఉన్నారని ఎక్కువగా వారికే అవకాశాలు అందిస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే తెలుగు సినీరంగంలో ఇప్పుడు మలయమారుతం వీస్తోంది.
స్టార్ హీరోల నుండి.. చిన్నా చితకా హీరోల వరకూ మెజారిటీ సినిమాల్లో కేరళకి చెందిన కథానాయికలే నటిస్తున్నారు. రానున్న రోజుల్లో వారి హవా మరింతగా కనిపించబోతోంది. మొన్నటిదాకా తెలుగు సినిమా నాయిక అంటే ముంబై ముద్దుగుమ్మే. మన కమర్షియల్ హంగులకి తగ్గట్టుగా కనిపించేది వాళ్ళు మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అందుకే కథానాయిక కావాలంటే హిందీలో మెరుస్తున్న తారల్నో, లేదంటే అక్కడ ర్యాంప్‌పై హొయలొలికే మోడల్స్‌నో తీసుకొచ్చేవాళ్ళు నిర్మాతలు. ఇలా దశాబ్దాలపాటు మన తెరపై ముంబై భామల హవా కొనసాగింది. ఇక ముంభై భామలకు చెక్ పెట్టడానికి ఎవరూ లేరా అనుకులోగా.. ఇప్పుడు తెలుగు తెరపై మలయాళ మారుతాలు దర్శనం ఇస్తున్నాయి. అసిన్, మీరాజాస్మిన్, కల్యాణి, గోపిక, ప్రియమణి, మమతామోహన్‌దాస్, నయనతార, భావన, వేదిక.. ఇలా ఒకరేమిటి వరుసగా వస్తూనే ఉన్నాయి గ్లామర్ అందాలు..
ఒకట్రెండు సినిమాల్లో నటించగానే తెలుగు మాట్లాడటం బాగానే నేర్చుకునే ప్లాన్ చేస్తున్నారు ఈ కథానాయికలు. దాంతో బాలీవుడ్ భామలపై గట్టి పోటీ పడింది. అందుకే వారు కూడా ఇక్కడ రెండు మూడు సినిమాలు చేసి తెలుగు నేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేరళ అమ్మాయిల దండయాత్ర చూస్తుంటే వచ్చే రెండు మూడేళ్లలో తెలుగు తెరపై వారి ఆధిపత్యమే ఉండబోతోందన్న విషయం అర్థమవుతోంది. ఇప్పటికే జోరుమీదున్న నయనతార, నిత్యామీనన్‌లే కాకుండా మరికొంతమంది కేరళ భామలు టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిపోయారు.
ఈ సంవత్సరం ప్రారంభంలోనే శైలజగా మెరిసి ఆకట్టుకుంది ఓ మలయాళీ భామ. తొలి చిత్రం ‘నేను శైలజ’తో మెరిసిన ఆ కేరళ కుట్టి కీర్తిసురేష్. తొలి సినిమాతోనే అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందని మార్క్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కాస్త గ్లామర్‌ని పండించగలిగితే కీర్తి సురేష్... హవా మామూలుగా ఉండదేమో. ఇక ఆమె తరువాత ఎంట్రీ ఇస్తున్న మరో ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. మలయాళంలో ఒకే ఒక్క సినిమాతో యువత మనసు దోచేసుకుంది. అందంతోపాటు అభినయం కూడా ఆమె ప్రత్యేకత అవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల్ని పడేసింది. లేటెస్టుగా ‘అ ఆ’లో నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం ‘ప్రేమమ్’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు రవితేజతోనూ అనుపమ నటించనున్నట్టు తెలుస్తోంది.
నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్‌మన్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకొని అందానికి అందం, గ్లామర్‌తోపాటు అభినయాన్ని ప్రదర్శించింది. ఈ సినిమా తరువాత ఈమెకు తెలుగులో పలు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సెలెక్టివ్‌గా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇక అనుపమా పరమేశ్వన్‌తో పాటే ‘ప్రేమమ్’లో ఎంట్రీ ఇచ్చిన మరో కేరళ సుందరాంగి మడొన్నా సెబాస్టియన్. మలయాళ ‘ప్రేమమ్’లో రెండో కథానాయిక. ఈ సినిమాతో మడోన్నాకి కూడా మాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమా తెచ్చిన పాప్యులారిటీతో ఈ భామకి కోలీవుడ్‌లో కూడా ఆఫర్స్ ముంచెత్తాయి. తమిళ్‌లో ఈ సంవత్సరం రిలీజైన విజయ్ సేతుపతి సినిమా కాదల్ కడందుపోగుమ్‌లో మడోన్నా కథానాయిక ఛాన్స్ కొట్టేసింది. తొలి సినిమాతోనే అమ్మడు కోలీవుడ్‌లో మంచి పాప్యులారిటీ సంపాదించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మిస్కిన్ సినిమా తుప్పారివాలన్‌లో నాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం అమ్మడు ‘ప్రేమమ్’ తెలుగు వెర్షన్ ‘ప్రేమమ్’లో కూడా నాగచైతన్య సరసన నటిస్తోంది. ఈ లిస్టులోనే వుంది మరో భామ మాళవిక నాయర్. నాని హీరోగా వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’తో ఇంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ తెలుగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆ తరువాత ‘కళ్యాణ వైభోగమే’లో నటించి మరింత ఇమేజ్ పెంచుకుంది. ఇక నాగచైతన్య చిత్రంతో మంజిమ మోహన్ అనే మరో కొత్త భామ కూడా తెలుగు తెరపై సందడి చేయబోతోంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ‘సాహహం శ్వాసగా సాగిపో’లో నాగచైతన్య సరసన మంజిమ నటించింది. ఆ చిత్రం ద్వారా తెలుగులోనూ అవకాశాల్ని అందుకోవాలని ఆమె చూస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’లో రాజ్‌తరుణ్ సరసన కనిపించిన అర్థన కూడా కేరళ అమ్మాయే. ఆది హీరోగా నటిస్తున్న ‘చుట్టాలబ్బాయి’లోని కథానాయిక నమితా ప్రమోద్‌ని కూడా అక్కడ్నుంచే దిగుమతి చేసుకొన్నారు. వీళ్లిద్దరికీ కూడా చిన్న చిత్రాల్లో నటించే అవకాశాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీతో జతకట్టిన కేథరిన్ ట్రెస్సా కూడా కేరళ భామే. బన్నీతో మరోసారి ‘సరైనోడు’లో ఎమ్మెల్యేగా నటించి అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన నయనతార, నిత్యామీనన్‌లు తెలుగు తెరమీద ఇంకా తమ హవా కొనసాగిస్తున్నారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ సినిమాలతో బిజీగా వున్నారు. అలాగే తెలుగు అమ్మాయిల్లో అందం, అభినయం కూడా ఉంది.. వారిని కూడా తెలుగు సినిమా ప్రోత్సహిస్తే మంచిది?!

చిత్రాలు.. అనుపమ, కీర్తి సురేశ్

-శ్రీ