దర్శకత్వం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగుజాతికి ఖ్యాతిని తెచ్చిన మహావీరుడు శాతకర్ణి. అలాంటి గొప్ప వ్యక్తి కథ తెలియచేద్దామన్న ఆలోచనలో వచ్చిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చిన విజయం మరిచిపోలేనిది’- అంటున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా రూపొందిన ప్రతిష్ఠాత్మక వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పాత్రికేయుల సమక్షంలో తన మనోభావాలను ఆవిష్కరించారు. అన్ని రకాల పాత్రలూ చేస్తానని, దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేకపోలేదని ఆయన అన్నారు. బాలయ్య చెప్పిన విశేషాలు ఇవీ...
* ‘శాతకర్ణి’కి స్పందన ఎలా వుంది?
- ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మొదటినుండి మేము ఏదైతే నమ్మామో దాన్ని నిజం చేశారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు జాతి ఖ్యాతిని చాటిన మహాయోధుడు శాతకర్ణి జీవిత గాథ అందరికీ నచ్చింది.
* వందో సినిమాగా ఇదే ఎందుకు?
- అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన చరిత్ర చాలామందికి తెలియదు. కథ నచ్చి చేయడానికి రెడీ అయ్యానే తప్ప, కావాలని వందో సినిమాగా ప్లాన్ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో క్రిష్ చెప్పిన ఈ కథ విపరీతంగా నచ్చింది. నిజానికి ఇలాంటి ఒక ప్రత్యేక సినిమా నా వందో సినిమా కావడం యాదృచ్ఛికం కావచ్చు.
* ఇలాంటి సినిమా రిస్క్ కదా?
- కావచ్చు.. కానీ, నాకు క్రిష్ ఈ కథను చెప్పినప్పుడే.. సంక్రాంతికి విడుదల చేద్దాం అని చెప్పడం నచ్చింది. ఇలాంటి కథతో సినిమా అంటే భారీతనం, గ్రాఫిక్స్ లాంటి వాటికి చాలా సమయం పడుతుంది. కానీ దర్శకుడు క్రిష్ విజన్, ప్లానింగ్ వల్లే ఈ సినిమాను 78 రోజుల్లో తీయడం సాధ్యమైంది. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్ గొప్ప సినిమా తీశాడు. సినిమాకు ఏది అవసరమో దానే్న చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్ చూపిన ప్రతిభవల్లే ఇది సాధ్యమైందనుకుంటున్నా.
* ఈ సినిమాకు అన్నీ కుదిరాయా?
- నిజమే.. ఈ సినిమా షూటింగ్‌కు ప్రకృతి కూడా సహకరించింది. ఈ సినిమా షూటింగ్ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు వర్షం వల్ల ఇతర షూటింగ్‌లు ఆగిపోయినా, మా లొకేషన్‌లో వర్షం పడలేదు. అలాగే వర్షం సీన్ తీద్దామని అనుకుంటే ఠక్కున వర్షం వచ్చేసింది. ఇలాంటి అద్భుతాలు ఈ సినిమాకు చాలా జరిగాయి. పైగా ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తిచేశామంటే ఆ క్రెడిట్ అంతా టీమ్ ప్లానింగ్‌కు దక్కాలి. ఒక మంచిపని చేస్తున్నప్పుడు పంచభూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా మాకు ఏ ఇబ్బందీ కలగలేదు.
* భిన్నత్వం కోసమేనా?
- ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు చేస్తే బోర్ కొడుతుంది కదా.. అందుకే విభిన్నంగా ఏదైనా చేయాలనే తపన నాలో ఉంటుంది. అది రిస్క్ అనుకోను. ఎప్పుడైనా ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదటి నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు అదే నిజమైంది.
* నాన్నగారు చేద్దామనుకున్నారా?
- అవును.. శాతకర్ణి కథతో నాన్నగారు సినిమా చేద్దామనుకున్నారు. కానీ, అప్పట్లో రాజకీయాలతో ఆయన బిజీ అయిపోవడంతో చేయలేకపోయారు. శాతకర్ణి పాత్రను చేయడానికి ఎలాంటి రిఫరెన్స్‌లు లేవు. అప్పటి కొన్ని శాసనాలు, చిత్రాలను ఆధారంగా చేసుకున్నాం. శాతకర్ణి పాత్ర కోసం కసరత్తులు ఏమీ చేయలేదు. దర్శకుడు క్రిష్ విజన్, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం.. ఇవన్నీ నన్ను ముందుకు నడిపించాయి.
* క్రిష్ గత సినిమాలు చూశారా?
- క్రిష్ అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలూ వేటికవే ప్రత్యేకమైనవి. నేను ‘కంచె’ చూశాను. మూసకథలతో కాకుండా భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు క్రిష్.
* మీ నుండి దంగల్ లాంటి సినిమాలు..
- దంగల్ సినిమాను నేను చూడలేదు. అయినా.. నేను ఇప్పుడు సిక్స్ ప్యాక్ లాంటివి చేస్తే ఎవరైనా చూస్తారా? ఏది ఏమైనా భిన్నమైన నేపథ్యంలో వున్న సినిమాలు చేయాలన్న తపన వుంది. అది ఆయా కథలను బట్టి ఉంటుంది.
* ఇక పౌరాణికాలు, చారిత్రక సినిమాలేనా?
- తప్పకుండా.. ఆమధ్య నర్తనశాల సినిమా నా దర్శకత్వంలో మొదలుపెట్టాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ సినిమా మళ్లీ ప్రారంభించే ఆలోచన లేదు. ఎందుకంటే ఆ సినిమాలో సౌందర్య పాత్రలో మరో హీరోయిన్‌ని ఊహించలేం. అలాగే చాలా పాత్రలు కుదిరాయి. ఇప్పుడు అవన్నీ మార్చాలంటే కుదరని పని.
* ‘రైతు’ సినిమా ఎప్పుడు?
- డైరెక్టర్ కృష్ణవంశీతో రైతు సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయాల్సి వుంది. ఆయన చేస్తానంటే తప్పకుండా ఈ సినిమా చేస్తా. రైతు కథ తెలంగాణ నేపథ్యంలో వుంటుంది.
* మీ అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ ?
- దానికోసం ప్రత్యేకంగా అనుకోలేదు. ఇప్పుడు తను బిబిఎ చదువుతున్నాడు. ఈ ఏడాది చివర్లో సినిమా మొదలుకానుంది.
* నటనలో శిక్షణ ఇప్పించారా?
- కొన్ని విషయాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక నటన అంటారా..? మమ్మల్ని చూసి నేర్చుకోవలసిందే. నాన్నగారిని చూసి నేను ఎలా నేర్చుకున్నానో.. తాను కూడా అలాగే నేర్చుకోవాలి.
* మల్టీస్టారర్ ఏదైనా?
- ఎందుకు చేయను. అలాంటి కథ కుదరాలిగా.. అయితే ప్రస్తుతం ఓ ప్రాజెక్టు రెడీగా వుంది. అందులో హీరో ఎవరనేది ఇప్పుడు చెప్పను.
* మీ ప్రాధాన్యం కథకా? పాత్రకా?
- ఏవైనా కథ బట్టే ఉంటుంది. కొన్ని సినిమాలు ఆయా పాత్రల చుట్టూ అల్లుకున్న కథతో ఉంటాయి. లారీడ్రైవర్, నరసింహనాయుడు లాంటివి, పాత్రను ప్రధానంగా తీసుకుని స్క్రీన్‌ప్లేతో నడిపిస్తుంటారు.
* దర్శకత్వం ఆలోచన ఉందా?
- తప్పకుండా దర్శకత్వం చేస్తా. అయితే- ‘ఈ కథను ఎవరూ డీల్ చేయలేరు’ అని అనుకున్నప్పుడు ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తా.
* మరి నిర్మాతగా?
- నిర్మాతగా త్వరలోనే ఓ బ్యానర్‌ను ప్రారంభిస్తున్నా.
* ‘ఆదిత్య 369’కు సీక్వెల్ వస్తుందా?
- ఆదిత్య 999 పేరుతో సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరింది. వీలైతే మోక్షజ్ఞతో కలిసి ఈ సినిమా చేసే అవకాశం వుంది.

-శ్రీ