వెండితెరపై ముక్కంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది సినిమా అని తెలిసినా భక్తి సినిమాల్లో మునిగితేలిపోయే తెలుగు ప్రేక్షకుడు నిజంగా భోళాశంకరుడిలాంటివాడే. శివుడైనా, రాముడైనా, కృష్ణుడైనా సరే తెరమీదకనిపిస్తే ఆధ్యాత్మికతత్వంలో మునిగిపోయి పులకించిపోవడం కొత్తకాదు. ఇప్పుడైతే కొత్తతరం ఇష్టాలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. కానీ గతంలో పౌరాణిక సినిమాలకు పెద్దఎత్తున ఆదరణ లభించేది. పూర్వం పూర్తితరహా ఆధ్యాత్మిక సినిమాలు వస్తే ఆ తరువాత ‘శంకరాభరణం’లాంటి సినిమాలూ ప్రేక్షకులను అలరించాయి. భక్తకన్నప్పలాంటివి జనసామాన్యంపై చూపించిన ప్రభావం తక్కువేమీకాదు. శివుడిగా ఎన్టీఆర్ రాణిస్తే కృష్ణంరాజు, కొన్ని సినిమాల్లో చిరంజీవి అలరించారు. మొత్తంమీద తెలుగుసినీ యవనికపై ముక్కంటికి జనం జేజేలు పలికారు.
తెలుగులో భక్తి చిత్రాల కోవలో శివుడిపై రూపొందించిన చిత్రాలు అఖండ విజయం సాధించి ప్రేక్షకుల మనసుల్లో భక్త్భివాన్ని నింపాయి. కేవలం శైవారాధనే ప్రధానంగా చేసుకొనే సినిమాలలో శివుడి లీలలే వుంటాయి. మొత్తం కథనం అంతా శివమహత్మ్యం గురించే చెబుతాయి. అలా కాకుండా సాంఘిక చిత్రాల్లో సైతం శివుని లీలలు, మహాత్మ్యాల గురించి వివరిస్తూ చిత్రీకరించిన పాటలు మన తెలుగు చిత్రాలలో కోకొల్లలు.
1954లో వచ్చిన ‘కాళహస్తి మహత్మ్యం’ శివుని యొక్క లీలలను తెలియజేసేదే. కన్నడ నటుడు రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ‘్భక్తకన్నప్ప’ కథనంతో రూపుదిద్దుకున్నదే. ఆ తరువాత బాపు దర్శకత్వంలో 1976లో కృష్ణంరాజు, వాణిశ్రీ నాయికా నాయకులుగా ‘్భక్తకన్నప్ప’ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ శివుడిగా నటించిన ‘దక్షయజ్ఞం’ చిత్రంలో శివుని జటాజూటం నుండి విడుదలైన కాలభైరవుల క్రోధాగ్ని ఎలా వుంటుందో అద్భుతంగా కళ్లకు కట్టారు. సతీదేవి దక్షుడి యజ్ఞంలో దూకడానికి కారణభూతమైన అనేక విషయాలను ఈ చిత్రంలో అద్భుతంగా తెరకెక్కించారు. భక్తమార్కండేయ, భూకైలాస్, భక్తఅంబరీష లాంటి చిత్రాలు శైవారాధకులకు ఆనందాన్నిచ్చాయి. భూకైలాస్ చిత్రంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ పోషించిన రావణుడు, నారదుడు పాత్రలు అద్భుతమైన గుర్తింపును పొందాయి. ‘మూగమనసులు’ చిత్రంలో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ అన్న పాటలో కూడా శివుని భిక్ష యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నమే జరిగింది.‘స్వర్ణమంజరి’ చిత్రంలో జలకంఠుడి స్థావరమైన నీటిమడుగులో దూకిన కథానాయిక ‘కదలిరావా మహాదేవా నను కావ’ పాటలో ప్రత్యక్షమైన శివుణ్ణి తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. ‘వినాయక విజయం’ చిత్రంలో వినాయకుడు జననం, విజయం లాంటి అంశాలను తెలియజేస్తూ శివుని గొప్పతనాన్ని వివరిస్తారు. 1981లో విడుదలైన ‘్భక్తశిరియాళ’ చిత్రంలో బసవపురాణం నుండి తీసుకున్న శిరియాలుడి కథలో శివలీలలను అద్భుతంగా చిత్రీకరించారు. ఆ తరువాత ఇదే కథనంతో నందమూరి తారకరత్న, అర్చన జంటగా మహాభక్త శిరియాళగా వచ్చింది. చిరంజీవి తన కెరీర్ మొదట్లో ‘శివుడు శివుడు’ చిత్రంలో శివుని పాత్రను అద్భుతంగా అభినయించారు. ఆ తరువాత 2001లో చిరంజీవి కథానాయకుడిగా శ్రీ మంజునాధ చిత్రం ఎంత విజయవంతం అయిందో తెలిసిందే. శివుడిగా ప్రేక్షకులకు ఆయన చూపిన అభినయం ఆ తరువాత వచ్చినవారికి ఓ ఒరవడి పెట్టింది. ‘మావూళ్లో మహాశివుడు’ చిత్రంలో శివుడు ఆధునిక ప్రపంచంలోకి దిగివచ్చి తన భక్తులకు వరాలు ఇస్తే అవి ఎంతవరకు భక్తులు ఉపయోగించుకుంటారు అన్న కథనంతో సోషియో ఫాంటసీగా రూపొందించారు. ఆ తరువాత ‘దేవుడు’ కిందికి దిగివచ్చిన కథనాలతో అనేక చిత్రాలు వచ్చాయి. ‘రహస్యం’ చిత్రంలో గిరిజాకల్యాణం ఘట్టం చిత్రీకరణలో ఇప్పటికీ ఆపాత మధురమైన పాట వినిపిస్తుంది. ‘మహాకవి క్షేత్రయ్య’ చిత్రంలో శివుడు కైలాసంలో ఆనంద తాండవంలో విరిగిన గజ్జె కథానాయకుడిగా అవతారం ఎత్తిన విషయాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే శివుని లీలలు తెలుగు చిత్రాలలో అద్భుతంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది కనుక మళ్లీ పౌరాణిక మార్గంలోకి వచ్చి భోళాశంకరుడిపై చిత్రాలను రూపొందిస్తారేమో చూడాలి!

-శేఖర్