చిన్న సినిమాకు ఏదీ రక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో సినిమా పరిశ్రమ అగ్రస్థానంలో నిలిచే స్థాయికి ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. రోజురోజుకూ సినిమాల నిర్మాణం పెరుగుతుండటం, మరోపక్క మల్టీ ప్లెక్స్ థియేటర్ల నిర్మాణం జోరందుకోవడంతో సినిమా పరిశ్రమ అగ్రస్థానంవైపు బలమైన అడుగులేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో సినిమా ఒక్కటే సులువుగా అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులూ పెరుగుతున్నారు. దానికితోడు షార్ట్ఫిలింస్, యాడ్స్ రూపంలోనూ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి ఒకవైపు అయితే, అసలైన రూపం సినిమా. దాదాపు 2 గంటలపాటు ప్రేక్షకులను అలరించేందుకు స్క్రీన్‌ప్లే, కథ, కథనాలతో, సంగీతం, పదునైన పాటలతో రూపొందించే చిత్రానికి సంబంధించిన వెలుగుల వెనుక అదృశ్యంగావున్న చీకటి శక్తులూ రాజ్యమేలుతున్నాయని గత కొనేళ్లుగా టాలీవుడ్‌లో కొందరు పెద్దలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ గొడవ రోజురోజుకూ పెరుగుతోందే కానీ తరగడంలేదు. ఇందులో ప్రధానమైనది చిన్న సినిమా చితికిపోతుందనే వాదన. ఒకప్పుడు నూతన తారలతో చిన్న సినిమా వస్తోందీ అంటే, అది ఖచ్చితంగా విషయంవున్న సినిమాగా ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు ఉండేది. అందుకు తగ్గట్లు విడుదలైన వెంటనే కొత్తొక వింతగా భావించి ప్రేక్షుకులు ఆయా చిత్రాలను చూసేవాళ్ళు. ఆ తరువాత ఆ చిత్రంలో నటించినవారే టాప్‌గేర్‌లో పెద్ద తారలుగా మారిపోయేవారు. అంత స్థాయివున్న చిన్న సినిమా నేడు హీనస్థితిలో ఉందని, పరిశ్రమలో ఎదిగిన పెద్దలు నిరంతరం దీనికి సంబంధించిన మందు కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో థియేటర్లన్నీ గుత్త్ధాపత్యం క్రిందకి వెళ్లిపోవడంతో, సినిమా రూపొందించిన నిర్మాతలకు థియేటర్ దొరకడంలేదు. సినిమా ప్రదర్శించడంలేదు. దాంతో ఏ సినిమా ఎక్కడుందో, ఎవరు తీశారో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. థియేటర్లు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న ఆ నలుగురు, అగ్రహీరోలతో రూపొందించిన చిత్రాలకు మాత్రమే థియేటర్లు కేటాయిస్తుండటంతో చిన్న సినిమా కుదేలైపోయింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఈ అంశంపై చిన్న సినిమా రక్షణే తమ ధ్యేయమంటూ ఇందుకు నిరాహార దీక్షకూ సిద్ధమవుతున్నామంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమలో రెండు రకాల వ్యవస్థల ద్వారా పరిశ్రమ అంతా ఛిన్నాభిన్నమవుతోంది. థియేటర్ లెస్ విధానంవల్ల ఒక నలుగురైదుగురు చేతుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు ఇరుక్కుపోయాయని వారి వాదన. చిన్న సినిమాలే కాక కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలకాకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఉదాహరణకు ‘అమ్మకు ప్రేమతో’ అనే చిత్రం సెన్సార్ అయినా థియేటర్ దొరకని కారణంగా విడుదల కాలేదని రామకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యవస్థను ముగ్గురు పెద్ద నిర్మాతలు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. పక్క రాష్ట్రాల్లో వారానికి రెండున్నర వేల చొప్పున ఒక సినిమా రెంట్ వుంటే, ఇక్కడ మాత్రం 11 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ. మల్టీప్లెక్స్‌ల్లో 13 వేలు వారానికి అద్దెను ముక్కుపిండి వసూలు చేసి, చిన్న, మీడియం చిత్రాల నిర్మాతలను నష్టాలపాలు చేస్తున్నారని, ఈ డిజిటల్ థియేటర్ల ఇబ్బందులవల్ల నిర్మాతలు చిన్న సినిమాలను విడుదల చేయడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దాదాపు 40వేల మంది పరిశ్రమలో కార్మికులుగా బ్రతుకుతున్నారు. 4వేలమంది సినిమా నిర్మాతలుగా ఉన్నారు. దాదాపు వెయ్యిమంది దర్శకులు ఉండగా, వీరంతా నలుగురైదుగురు పెద్దోళ్ల ఆర్థిక వ్యూహాలకు బలవుతున్నారని ప్రతాని వ్యాఖ్యానించారు. షూటింగ్‌లు జరుపుకొని సినిమాలు విడుదలకాక నిర్మాతల డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని, ఏడాదికి 200 తెలుగు సినిమాలు విడుదలైతే, అందులో 150 నుండి 160 చిత్రాల వరకూ చిన్న సినిమాలు ఉన్నాయని, డిజిటల్ వ్యవస్థ ఈ చిత్రాలకు ఎక్కువ రేట్లు తీసుకుంటూ దాదాపు నెలకి 15 కోట్ల వరకూ సంపాదిస్తోందని అభియోగం ఉంది. ఈ సంపాదనకు గవర్నమెంట్‌కు టాక్స్ కూడా కట్టే అవసరం లేదు. థియేటర్ లీజ్ విధానంపైన కూడా నెలకు 15 కోట్లు పైగా సంపాదిస్తున్నారు. దీనిపైనా టాక్స్‌లేదు. అటు ప్రేక్షకులను ఇటు పరిశ్రమలోని చిన్న నిర్మాతలను, మరోవైపు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ దోచుకుంటున్నారన్నది ప్రతాని ఆరోపణ. పరిశ్రమలోని చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి కార్మికులను, నిర్మాతలను ఆదుకోవాలని, లీజ్ విధానాన్ని, మరియు డిజిటల్ విధానాన్ని రూపుమాపి సమస్య పరిష్కరించాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోరుతోంది. 15 రోజుల్లో ఈ డిజిటల్ వసూళ్లల్లో వున్న తేడాలను సరిదిద్దాలని తెలంగాణ ఛాంబర్ డిమాండ్ చేస్తోంది. అలా చేయలేని పక్షాన ఫిలిం ఛాంబర్ వద్ద నిర్మాతలు, కార్మికులు అంతా ఏకమై నిరహారదీక్ష చేస్తామన్న హెచ్చరికలూ చేసింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇప్పటివరకూ 9 సినిమాలు సెన్సార్ అయ్యాయి. కానీ థియేటర్ల ఇబ్బందులవల్ల ఒకే ఒక చిత్రం విడుదల కావడం విశేషం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతలు చేయనున్న దీక్షలు ఏవైపు దారితీస్తాయో, పరిశ్రమను ఏ కుదుపు కుదుపుతాయో చూడాల్సిందే! రెండు రాష్ట్రాల సిఎంలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనని పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, కార్మికులు ఉత్కంఠతో చూస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం ఓ పెద్ద సినిమానే తలపిస్తోంది.

-యు