చిత్తూరు

అన్నమయ్య సంకీర్తనలతో ఆధ్యాత్మిక జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 12: తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీతాళ్లపాక అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామిపై రచించిన సంకీర్తనలను వినడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అలవడతుందని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య చెప్పారు.స్థానిక అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అన్నమాచార్యుల 609వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన సభలో ఆయన పాల్గొని అన్నమయ్య- ఆధ్యాత్మిక తత్వము అనే అంశంపై ప్రసంగించారు. మోక్ష సాధనకు భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలని, వీటిలో భక్తి మార్గం అత్యంత సులభమైందని తన సంకీర్తనలు ద్వారా అన్నమయ్య వివరించారని చెప్పారు. జీవుడు దేవునికి దగ్గరై స్వామిలో ఐక్యం కావటానికి తోడ్పడే మహోన్నత సాధనం భక్తి అన్నారు. భగవంతునిపై ఎడతెగకుండా నిరంతరం భక్తి ప్రదర్శించాలని అన్నమయ్య ఉద్బోధించినట్లు తెలిపారు. భగవంతుడు, భక్తుడి మధ్య సంబంధాన్ని భాగవతం తెలియజేస్తుందన్నారు. అన్నమయ్య తన సంకీర్తనల్లో ఇదే విషయాన్ని వివరించారన్నారు. అనంతరం అన్నమయ్య సంకీర్తనలపై ఆళ్వారుల ప్రభావం అనే అంశంపై తిరుపతికి చెందిన డాక్టర్ టి.జయప్రకాష్ ప్రసంగిస్తూ అన్నమయ్య సంకీర్తనలపై ఆళ్వారుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. 12 మంది ఆళ్వార్లు 4వేల పాశురాలతో రచించిన నళాయిర దివ్య ప్రబంధాన్ని అన్నమయ్య పూర్తిగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఆళ్వార్లు తరహాలోనే అన్నమయ్య కూడా స్వామి, అమ్మవార్ల క్షేమాన్ని శ్రేయస్సును కాంక్షించారని తెలిపారు. అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలమురళీకృష్ణ ప్రసాద్‌చే అన్నమయ్య సంకీర్తనాలాపన వీనులవిందుగా సాగింది. అలాగే స్థానిక మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6నుంచి రాత్రి 8గంటల వరకు హైదరాబాదుకు చెందిన డాక్టర్ వై.రమాప్రభ బృందంచే నామసంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ఉపకార్యనిర్వహణాధికారి శారద, ఏఇఓ పద్మావతి, అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్ డాక్టర్ సి.లత ఇతర అధికారులు పాల్గొన్నారు.

అటవీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించండి
*టిటిడి డిఎఫ్ ఓకు డిసిఎల్ విద్యాసాగర్‌రావు ఆదేశం
తిరుపతి, మే 12: టిటిడిలో పనిచేస్తున్న అటవీకార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిసిఎల్ విద్యాసాగర్‌రావు డిఎఫ్‌ఓ శివరాం ప్రసాద్‌ను ఆదేశించారు. శుక్రవారం డిసి ఎల్ కార్యాలయంలో సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళితో కలసి చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు చట్టబద్ధమైన ప్రతినెలా 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వేతనాల పెంపుపై నిర్ణయం తెలియజేయాలని స్పష్టం చేశారు. దీనిపై శివరాంప్రసాద్ సానుకూలంగా సానుకూలంగా స్పందించారు. టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకువెడతామని చెప్పారు. ఈసమావేశాన్ని తిరిగి ఈనెల 19వ తేదీకి వాయిదావేస్తున్నట్లు డిసిఎల్ తెలిపారు. ఈసందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ టిటిడి అటవీశాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడంతప్ప టిటిడి అధికారులు వాటిని పరిష్కరించడానికి చొరవ చూపడంలేదన్నారు. డిసి ఎల్ సమక్షంలోనైనా ఈ సమస్యక పరిష్కారం లభిస్తే చాలన్నారు. ఈకార్యక్రమంలో సి ఐటియు నగర కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఫారెస్ట్ కార్మిక సంఘం నాయకులు కె.సురేష్, ఈశ్వర్ రెడ్డి, వాసు, మల్లి, మునిక్రిష్ణ, పురుషోత్తం, వేణు, రమేష్, శ్రీనివాసులు, క్రిష్ణా, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో కమిషనర్ ముఖాముఖి
* సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశం
* ప్రతి శుక్రవారం ఇక పరిశుభ్రత దినం
* నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్
తిరుపతి, మే 12: తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పలు డివిజన్లలో పర్యటించి అక్కడి సమస్యలపై ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలపై ఆరా తీశారు. దీంతో అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులతో కలసి ఆయన ముందుగా స్థానిక డిఆర్ మహల్ వద్ద ఉన్న గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. ఈప్రాంతంలోని ప్రజలతో కలసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికినీటి కాలువల్లో నీరు ప్రవహించకుండా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ కాలువలను ఎత్తు పెంచాలని, కాలువలు లేనిచోట్ల కొత్తవాటిని నిర్మించి వాటిలోకి చెత్త పోకుండా కాలువలకు ఇనుప కంచెను ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంట్ వద్ద నుంచి రైల్వే ట్రాక్ వరకు ఉన్న కాలువలో పూడికతీత పనులను సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. రామానుజ సర్కిల్ వద్ద నుంచి రిలయన్స్ మార్ట వరకు రోడ్డుపక్కనే ఉన్న ముళ్ళపొదలను తొలగించి అందంగా కనిపించేలా తయారు చేయాలన్నారు. అలాగే శ్రీనివాసం ఎదురుగావున్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి పిఎస్‌ఆర్ హోటల్ వరకు ఉన్న కార్పొరేషన్‌కు సంబంధించిన స్థలాలను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని, కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య, రోడ్లు, కాలువలు,డ్రైనేజీ సమస్యలను, వీధిలైట్లు, కుక్కల బెడద తదితర ఫిర్యాదులు వచ్చిన వెంటనే వారిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇకపై ప్రతి శుక్రవారం తిరుపతిని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి గృహిణి శుక్రవారం రోజున తన ఇంటిని ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటుందో అలాగే తమ ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అప్పుడే రోగ కారకాలైన దోమలు నశించి నగరంలో పరిశుభ్రంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుందని వివరించారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి బాలాస్వామి, ఇంజినీర్-1 చంద్రశేఖర్, డి ఇ గోపాలకృష్ణ, ఏ ఇ నరేష్, శానిటరీ సూపర్‌వైజర్లు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
శ్రీకాళహస్తి, మే 12: ఏర్పేడు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఏర్పేడు మండలం కోర్పాక గ్రామానికి చెందిన శరవణ నాయుడు (40) శ్రీకాళహస్తి పట్టణంలోని మిట్టకండ్రిగలో కూల్‌డ్రింక్ వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూల్‌డ్రింక్ షాపు మూతవేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఏర్పేడు మండలం మోదుగుల పాలెం గ్రామానికి చెందిన మిత్రుడు సుందరం(34)ను తన ద్విచక్రవాహనం ఎక్కించుకుని వెళ్తుండగా ఏర్పేడులో ఎఆర్‌సి కల్యాణ మండపం వద్ద తిరుపతి నుంచి శ్రీకాళహస్తివైపు వెళ్లే వాహనం అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న శరవణ నాయుడు, సుందరం ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఏర్పేడు ఎస్ ఐ వెంకటరమణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం ఏర్పేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తోటి వేషంలో భక్తుల సందడి
* జాతరకు ముస్తాబవుతున్న గంగమ్మ ఆలయం
తిరుపతి, మే 12: తిరుపతి గంగ జాతరలో మూడోరోజైన శుక్రవారం భక్తులు తోటివేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవేషం వేసే భక్తులు శరీరమంతా బొగ్గుపొడిని పూసుకుని, దానిపై అక్కడక్కడా నామకొమ్ముతో తెల్లటి బొట్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లలకు మీసాలు, వీపుపై నెంబర్లు వేసుకుంటారు. తలకు, నడుముకి వేపాకు కట్టుకుంటారు. పాత పొరక లేకుంటే చేటను పట్టుకుని ఇంటి నుంచి గుంపులు గుంపులుగా బయలు దేరుతారు. రోడ్డు పొడవునా బూతులు తిడుతూ కనిపించిన వారిని తమ చేతిలోని పొరక, చేటతో కొడుతూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయం వద్ద అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి కర్పూర నీరజాలిస్తారు. అనంతరం ఆలయంలో సర్వాలంకారభూషితురాలైన గంగమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి తిరిగి ఇంటికి చేరుకుంటారు. కాగా శుక్రవారం నగరంలో ఎండ తీవ్రత పెరగడంతో తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 11గంటల్లోగా అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు సాయంత్రం ఎండ తగ్గాక ఆలయానికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్ళు పెట్టుకుని, అమ్మవారికి చీర, రవికె, పసుపు, కుంకుమ, గాజులను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా ఈనెల 16వ తేదీన జాతర నేపథ్యంలో ఆలయం వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఆలయంకు చేరుకునే రోడ్డులో చలువ పందిళ్లు వేశారు. ఆలయం వద్ద తాగునీటి సమస్యలేకుండా ప్రత్యేకంగా కొళాయిలు ఏర్పాటు చేశారు. అలాగే క్యూలైన్లు ఏర్పాటు చేసి తొక్కిలసలాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని ఆలయ ఇ ఓ సుబ్రహ్మణ్యం, చైర్మన్ ఆర్ సి మునికృష్ణ విజ్ఞప్తి చేశారు. కాగా శనివారం దొరవేషాన్ని కైకాల, చాకలి కులస్థులు మాత్రమే వేస్తారు. అయితే నగర ప్రజలు తమకు నచ్చిన వేషంలో అమ్మవారిని దర్శించకుంటారు. అలాగే టిటిడి గంగజాతరను పురస్కరించుకుని అమ్మవారికి సారెను అందింస్తుంది. తిరుమల నుంచి ఊరేగింపుగా స్థానిక గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకువచ్చి అక్కడ నుంచి ఊరేగింపుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి తీసుకువస్తారు.

మరింత మెరుగ్గా వయోవృద్ధులు, దివ్యాంగుల
క్యూలైన్ నిర్వహణ: ఇ ఓ
తిరుపతి, మే 12: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల్లో ప్రత్యేకంగా దర్శనం అందించే వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహించే క్యూలైన్‌లో మరింత మెరుగైన వసతులను ఏర్పాటుచేస్తామని టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అందులో భాగంగా వయోవృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్, సుపథం, లడ్డూకౌంటర్‌లు, లడ్డూ తయారీ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఉండే క్యూలైన్‌లో ఆయన అక్కడ భక్తులతో ముచ్చటించి వారి సమస్యలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఎస్ ఇ 2 రామచంద్రారెడ్డిని భక్తుల కోసం మరింత సౌకర్యవంతంగా కుర్చీలను ఏర్పాటుచేయాలన్నారు. అదేవిధంగా ఇక్కడి భక్తులకు మరింత మెరుగ్గా అన్నప్రసాదాలను, తాగునీటిని అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో ఇ ఓ తో పాటు ఎస్ ఇ 2 రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, విజి ఓ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారిణి శర్మిష్ట తదితర అధికారులు పాల్గొన్నారు.

‘్ఫ్లరెన్స్ నైటింగేల్ నేటి వైద్యులు, నర్సులకు ఆదర్శం’

* స్విమ్స్‌లో ఘనంగా నర్సింగ్ దినోత్సవం
తిరుపతి, మే 12: ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి తెలియని వారుండరంటే ఆతిశయోక్తి కాదు. వైద్య రంగంలో ఆమె చేసిన సేవలకు ప్రపంచమే సరిహద్దయింది. నేడు ప్రపంచంలో వైద్యరంగంలో వైద్యుడిగా, నర్సుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ఆదర్శం. 1820 సంవత్సరం, మేనెల 12వ తేదీన ఇటలీలో ఆమె జన్మించారు. రోగులకు ఆమె అందించిన అమూల్యమైన సేవలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. రోగికి అందించే సేవలకు డబ్బుతో ముడిపెట్టకుండా మానవత్వంతో సేవలిందించిన ఆమె సేవలకు ఆమె జన్మదినం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవంగా యావత్ ప్రపంచం చాటుకుంటోంది. ఈసందర్భంగా స్విమ్స్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తులను చేతపట్టుకుని నర్సింగ్ కళాశాల వద్ద ఉన్న ఆమె విగ్రహం ఎదుట నిలబడి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ నర్సింగ్ విద్యార్థినులు,సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకుని రోగులకు సేవలు చేస్తామని, ప్రేమతో నిస్వార్థంతో రోగుల పట్ల వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైటింగేల్ చేసిన సేవలకు గాను అంతర్జాతీయ నర్సింగ్ కౌన్సిల్ మే 12వ తేదీని నర్సింగ్ డేగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 2017 సంవత్సరానికి ‘శాశ్వత అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం గొంతు కలపడం’ అనే నినాదంతో ముందుకు వెడుతున్నట్లు చెప్పారు. నర్సింగ్ వ్యవస్థకు ఆమె రోల్‌మోడల్ అన్నారు. స్విమ్స్ నర్సింగ్ సిబ్బంది కూడా నాణ్యమైన, నిస్వార్థమైన నర్సింగ్ సేవలను ఆదించాలని అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఇస్కా సభల్లో ప్రతినిదులకు వైద్య సేవలు అందించిన హెడ్‌నర్స్ రమణమ్మ, స్ట్ఫా నర్స్ రమాదేవిలను ఎస్వీ యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ భూపతి శాలువా కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో స్విమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత, డాక్టర్లు అలోక్‌సచన్, కళావతి, గోవిందనారాయణ, శివకుమార్, ఏ వై లక్ష్మి, ఇతర ఫ్యాకల్టీ డాక్టర్లు, డాక్టర్ వై.వెంకటరామిరెడ్డి, దిలీప్‌కుమార్, భూపతి నాయుడు, ఆదిక్రిష్ణయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.

జెసి - 2గా చంద్రవౌళి బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు, మే 12 : చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్-2గా విఆర్ చంద్రవౌళి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెండవ జెసిగా జిల్లాకు వచ్చానని, జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న, జిల్లా మంత్రి అమరనాధరెడ్డి సూచనల మేరకు, అందరి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఉన్న అన్నిశాఖలకు చెందిన అధికారులను సమన్వయం చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో చిత్తూరు జెసి- 2గా పనిచేసిన వెంకటసుబ్బారెడ్డి నెల్లూరు జిల్లాకు బదిలీ అయిన విషయం విదితమే. కాగా జెసి- 2గా బాధ్యతలు స్వీకరించిన చంద్రవౌళిని పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి
కలెక్టర్ ప్రద్యుమ్న
వికోట, మే 12: మండల పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీ-నీవా కాలువ పనులను మండలంలో వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో కాలువ పనులను వారు శుక్రవారం పరిశీలించారు. కృష్ణాపురం, జవ్వనపల్లి, కొమ్మరమడుగు తదితర ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన కాలువ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు సత్వరం భూసేకరణ కింద రావాల్సిన నిధులను అందించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. రైతులు గతంలోనే స్వచ్చందంగా భూములు అందచేశారని వాటిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని తహశీల్దార్‌కు సూచించారు. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ హైవే పనుల వివరాలను తహశీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన మండలంలో భూసేకరణ చేసి హైవే అధికారులకు భూములు అందచేయాలని తహశీల్దార్‌కు సూచించారు. త్వరితగతిన హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పంకు నీరు తీసుకు వచ్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. వీరి వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి, ఎంపిడిఒ రమేష్, ఎంపిపి సులోచనరంగనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.