మెయిన్ ఫీచర్

వ్యర్థానికి అర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెత్తతో కంపోస్టు తయారీ
ఇంటిలోనే ఉద్యానవనాల సృష్టి
పాఠాలు నేర్పుతున్న
మాజీ అధికారిణి
81 ఏళ్ల వయసులోనూ
తగ్గని ఉత్సాహం

రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపిస్తే మనం ఏం చేస్తాం? ముక్కు మూసుకుని తిట్టుకుంటూ వెళ్లిపోతాం! కానీ సుధాపాయ్ అలా చేయలేదు..ఇంతకీ ఆమె ఎవరు? ఓ ఆయుర్వేద వైద్యుని కుమార్తె ఆమె.. మాజీ అధికారిణి.. పర్యావరణ ప్రేమికురాలు... మహారాష్టల్రోని పూనెలో ఆమె పేరు తెలియనివారుండరు. దేశవిదేశాల్లో ప్రకృతి ప్రేమికులకు ఆమె మార్గదర్శి. ప్రస్తుతం ఆమె వయస్సు 81 ఏళ్లు. ఇంతకీ ఆమె ఏం చేశారో తెలుసా?
***
ఇంట్లోని చెత్త రోడ్డుమీదకు రాకుండా ఏం చేయచ్చో ఆలోచించారు. దానిని వృధా చేయకుండా ఏం చేయాలా అని మదనపడ్డారు. ఇంట్లో తడి, పొడి చెత్తను విడదీసి, కంపోస్టుగా మార్చి తోటల పెంపకం, ఇంట్లో పూలు, కూరగాయల మొక్కలకు వాడి సత్ఫలితాలు సాధించొచ్చని భావించారు. ప్రఖ్యాత మేగజైన్లకు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. రాయడం, చెప్పడం ఎందుకు చేసి చూపిస్తే చాలదూ అనుకున్నారు. రంగంలోకి దిగారు. ఆమె ఏం చెప్పారో, ఏం చేశారో ఆమె ఇంటిని చూస్తే తెలుస్తుంది. విశాలమైన ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అక్కడ పచ్చటి మొక్కలు కనిపిస్తాయి. చివరకు కిటికీల్లోను, మేడమెట్ల కిందకూడా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ క్వార్టర్స్ నుంచి పదవీ విరమణ తరువాత పూనేలోని ఓ మోడల్ కాలనీకి మారారు. అక్కడ రోడ్లమీద చెత్త చూసి బాధపడ్డారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వాటిని ఎలా ఉపయోగించాలా అని మార్గాలు అనే్వషించారు. పొడి, తడి చెత్తలను విడదీసి రెండు రకాల కంపోస్టులను తయారు చేయొచ్చని తెలుసుకున్నారు. బయటినుంచి ఏమీ కొనకుండా వాటినే ఎరువుగా మార్చే మెలకువలు నేర్చుకున్నారు. ఇంట్లో ఖాళీ స్థలం ఉన్నచోటల్లా పూలమొక్కలు, కూరగాయల మొక్కలు పెంచారు. ఔషధ మొక్కలనూ తీసుకొచ్చారు. ఒకటేమిటి పర్యావరణ హిత విధానాలతో వ్యర్థాలను ఉపయోగిస్తూ అద్భుత ఫలితాలు సాధించారు. ‘నా చెత్త, నా బాధ్యత’ అన్న నినాదంతో ముందుకు కదిలారు. ‘గార్బేజ్ టు గార్డెన్’ అన్న బ్లాగ్‌ను నిర్వహిస్తున్నారు. మున్సిపాల్టీతో కలసి వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ పాఠాలు బోధిస్తారు. తన ఇంటికి తీసుకొచ్చి తోటను చూపిస్తారు. కనీసం రోజుకు రెండు గంటలపాటు ఆమె ఈ పని చేస్తారు. ఇక పత్రికల్లో రచనలు మామూలే.
ప్రస్తుతం స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాలు ఊపందుకున్నమాట నిజమే. కానీ ఆమె ఈ పనిని ఎప్పుడో, అంటే దాదాపు పాతికేళ్ల నుంచీ చేస్తున్నారు. మహిళలు, పెద్దలనూ చైతన్యపరుస్తూ వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తున్న సుధాపాయ్ ప్రజలకు మరింత చేరువ కావడానికి కంప్యూటర్ విద్యను నేర్చుకున్నారు. చిన్నపిల్లలకు ఈ విషయాలు నచ్చేలా చెప్పడానికి ఆమెకూడా చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరించడం నేర్చుకున్నారు. అందుకే ఆమె పెద్దలకు, పిన్నలకూ దగ్గరయ్యారు.