కథ నచ్చితే కనెక్టవుతా.. - రాజ్‌తరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పక్కింటబ్బాయిలా కనిపించే యువహీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాలా జంపాలా’తోకెరీర్ మొదలుపెట్టి ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21ఎఫ్’తో హ్యాట్రిక్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా రాణిస్తున్న రాజ్‌తరుణ్ తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. దీనికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. శైలేంద్ర బాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి సంయుక్తంగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా రాజ్‌తరుణ్ చెప్పిన విశేషాలివి..
చిన్నప్పటి ప్రేమ..
నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఈ కథను తీర్చిదిద్దారు. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఇది చిన్నప్పటి ప్రేమ కథ. ప్రతి సన్నివేశం కొత్తగా, తాజాగా ఉంటుంది.
నా పాత్ర
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఊరిలో ఖాళీగా తిరిగే ఏడెనిదిమంది బేవర్స్ బ్యాచ్‌లో నేనూ ఒకడిని. సీతమ్మ కోసం రాముడు ఏం చేసాడు అనేదే కథనం. కథ రాసుకున్న తర్వాత డైరక్టర్‌కి ఈ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చింది.
మూడు హిట్ల నేపథ్యంలో..
ఇప్పటివరకు నేను నటించిన మూడు చిత్రాల కోసం పెద్దగా కష్టపడింది లేదు. కథ నాకు కనెక్ట్ అయితేచాలు. ఆ పాత్రలో ఎంజాయ్ చేస్తూ నటిస్తాను. సక్సెస్ వచ్చిందని ఆనందపడను. ఫెయిల్యూర్ ఎదురైందని బాధపడను. నా తప్పులు తెలుసుకుని మరొక చిత్రం కోసం ప్రెపేర్ అవుతాను. నాకు ప్రతి సినిమా ఫ్రెష్‌గానే ఉంటుంది.
పోటీ ఉండాలి
ఈరోజు మా సినిమాతో పాటు మరో మూడు చిత్రాలు విడుదల అవుతున్నాయి. సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటే చాలా కష్టం. కచ్చితంగా పోటీకి చిత్రాలు ఉండాలి. సినిమాలో కంటెంట్ ఉంటే అన్ని సినిమాలు హిట్ అవుతాయి. దానికి ఉదాహరణ సంక్రాంతికి విడుదలైన నాలుగుచిత్రాలే. ఈ వారం విడుదలయ్యే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటా.
దర్శకుడి పట్టు...
దర్శకుడు శ్రీనివాస్ ఎప్పటినుంచో నాకు మంచి స్నేహితుడు. కుమారి 21ఎఫ్ లాంటి ఓ ప్రయోగం తర్వాత నేను ఎలాంటి సినిమాలో నటిస్తే బాగుంటుందో ఆలోచించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస్‌కు ఎమోషన్స్ మీద మంచి పట్టుంది. ఆ సంగతి ఈ చిత్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా రాసుకున్నారు.
ఫ్యాషన్ లేదు
యాక్షన్ హీరోగాను, మాస్ హీరోగాను పేరు తెచ్చుకోవాలని ఫ్యాషన్ లేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని మాత్రం ఉంది. ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావా’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి చిత్రాలు తీయడానికి రాజ్‌తరుణ్ లాంటి హీరో ఉన్నాడని అందరూ అనుకుంటే చాలు. ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాల్లో పెద్దపెద్దఫైట్స్, పాటలు లేవు. భారీ సెట్స్ లేవు. కానీ ఆ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. నా దృష్టిలో ప్రేక్షకులకు రీచ్ అయ్యే సినిమానే కమర్షియల్ సినిమా.
చెప్పింది చేయడమే..
ఒకసారి సినిమా సెట్స్‌మీదకి వెడితే ప్రపంచాన్ని మరిచిపోతా. నా ఫోన్ కూడా నా దగ్గర ఉండదు. స్నేహితులతో మాట్లాడను. మొదట కథ మీద క్లారిటీ తెచ్చుకుంటా. డైరెక్టర్ ఊహకు తగ్గట్టుగా అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఒకసారి ఓకే అనుకున్నాక దర్శకుడు చెప్పింది చేయడమే.
కొత్త అని ఏమీ లేదు
మంచి సినిమా తీయాలని, తీసే సినిమా హిట్ అవ్వాలని ప్రయత్నిస్తునే ఉంటాం. యువదర్శకులు, కొత్తదర్శకులలో ‘ఫైర్’ ఉంటుంది. వాళ్లకి మొదటి సినిమా అనేది ‘లైఫ్ అండ్ డెత్’ ప్రశ్న. మంచి సినిమా చేయాలనే జీవితాశయం ఉంటుంది. అయితే అలాంటివారితోనే చేయడానికి ఇష్టపడతానని మాత్రం అనను.
షూటింగ్ లేనప్పుడు
‘ఉయ్యాలా జంపాలా’ సినిమా తర్వాత చాలా గాప్ తీసుకుని ‘సినిమా చూపిస్త మావా’లో నటించా. ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్’లో, ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే మంచి స్క్రిప్ట్‌లు వస్తున్నాయి. ఖాళీగా ఉండడం నాకు నచ్చదు. సంవత్సరంలో 365 రోజులు నటించడానికే ఇష్టపడతాను. షూటింగ్ లేకపోతే మాత్రం ఏదైనా స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ఇష్టపడతాను.
మల్టీ స్టారర్
మంచు విష్ణు, నేను కలిసి ఓ పంజాబీ సినిమా రీమేక్‌లో చేస్తున్నాం. దానికి నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు. ‘మంచు’ కుటుంబం నుండి వచ్చిందని ఒప్పుకోలేదు. కథ నచ్చే ఒప్పుకున్నాను. సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తర్వాతి చిత్రాలు
ప్రస్తుతం విష్ణుతో ఒకటి, గీతా ఆర్ట్స్ పతాకంలో ఒకటి, రాజు బ్యానర్‌లో మరొక చిత్రం చేయడానికి ఒప్పుకున్నా.

-శ్రీ