గ్లామర్,నటనా ముఖ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ రాశీఖన్నా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుని యువతరం హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ చిత్రం తరువాత గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రాశీ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుని కెరీర్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న ‘జై లవకుశ’లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా రాశీఖన్నాతో ఇంటర్వ్యూ...
* ‘జై లవకుశ’లో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
- ఇందులో నా పేరు ప్రియ. ఓ మ్యారేజ్ బ్యూరో నడిపించే అమ్మాయిని. క్యారెక్టర్ సరదాగా ఉంటూనే లవకుమార్‌తో ప్రేమలో పడే అమ్మాయిగా నటించాను. చాలా బబ్లీ పాత్ర ఇది.
* మీ పాత్రకు డబ్బింగ్ మీరే చెప్పారా?
- లేదు. నిజానికి ఈ క్యారెక్టర్‌కు నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంవల్ల కుదరలేదు. దర్శకుడు బాబి కూడా అడిగాడు డబ్బింగ్ చెప్పమని. కానీ తదుపరి చిత్రం విషయంలో మాత్రం ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను.
* ఎన్టీఆర్‌తో నటించడం ఎలా ఉంది?
- ఎన్టీఆర్ నిజంగా బ్రిలియంట్ ఆర్టిస్టు. ఈ షూటింగ్‌లో చూశా. నిజంగా ఆయన ఎనర్జీ ఊహించలేం. ఆయన చేసిన హార్డ్‌వర్క్, డెడికేషన్ చూసి షాక్ అయ్యా. అందుకే ఎన్‌టిఆర్ అంత గొప్ప స్టార్ అయ్యారు.
* ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మీకు ఏది నచ్చింది?
- తప్పకుండా జై పాత్ర అనే చెబుతాను. ఎందుకంటే ఆ పాత్రలో ఎన్‌టిఆర్ నటన చాలా బాగా నచ్చింది. పైగా సెట్‌లో కూడా ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయేది.
* డాన్స్ విషయంలో ఎన్‌టిఆర్‌తో పోటీ పడ్డారా?
- ఎన్టీఆర్ నిజంగా గొప్ప డాన్సర్. ఈ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అద్భుతంగా స్టెప్స్ వేస్తారు. ఈ సినిమాలో తనతో కలిసి డాన్స్ చేయడం కాస్త కష్టమే అనిపించింది. కానీ ఏదో అలా మానేజ్ చేశా.. (నవ్వుతూ)
* మరో హీరోయిన్‌తో కలిసి పనిచేయం ఎలా అనిపించింది?
- అందులో తప్పేముంది? ఎవరి పాత్రలు వారివే. ఇందులో నివేదతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. నివేద ప్రతిభగల నటి. పైగా ఈమధ్యే తాను నటించిన ‘నిన్నుకోరి..’ చిత్రం చూశాను. అద్భుతంగా చేసింది.
* మళ్లీ రవితేజతో సినిమా చేస్తున్నారు?
-‘రాజా ది గ్రేట్’లో ఓ చిన్న గెస్ట్ పాత్ర అది. రవితేజ, మెహ్రీన్ కౌర్ కలిసి చేస్తున్న పాటలో కాసేపు స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తా. దర్శకుడు అనీల్ రావిపూడి అడిగితే కాదనలేకపోయా.
* హీరోయిన్‌గా మీ ప్రాధాన్యత దేనికి? గ్లామర్‌గా లేక నటనకా?
- ప్రతి హీరోయిన్‌కు ఎదురయ్యే ప్రశే్న ఇది. తెలుగులో హీరోయిన్ అన్నాక గ్లామర్ తప్పనిసరి. అలాగే నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు కూడా చేయాలి. అప్పుడే మనం అనుకున్న ఇమేజ్ దక్కించుకోగలం. కెరీర్‌లో నిలబడగలం.
* తెలుగులో గ్యాప్ రావడానికి కారణం?
- తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. దాంతోపాటు మలయాళంలో ‘విలన్’ చిత్రంలో నటిస్తుండడం వల్ల ఇక్కడ డేట్స్ కుదరలేదు. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఇలాంటి గ్యాప్ ఇకపై రాదులెండి..
* తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
- సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే బాలకృష్ణుడు సినిమాలో నటిస్తున్నా.

- శ్రీ