బన్నీతో అనుకున్నాం.. సునీల్‌తో చేశాం (‘కృష్ణాష్టమి’ నిర్మాత దిల్‌రాజు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమా అంటేనే బిజినెస్. నాలుగు డబ్బుల కోసమే సినిమా తీసేది. అంతేకాని, మనం తీశాం, అమ్మేశాం అనుకుంటే, కొనుక్కున్నవాడు నాశనమవుతాడు. అలాంటి సినిమా చేయకూడదు’ అని అంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’. సునీల్, నిక్కీ గల్రాణి, మన్నారా చోప్రా ముఖ్యపాత్రల్లో వాసూవర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ముఖాముఖి..
‘కృష్ణాష్టమి’ విడుదల విషయంలో ఆలస్యమైనట్టుంది?
అవును. నిజానికి ఈ సినిమా ఆగస్టులోనే పూర్తయింది. సెప్టెంబర్‌లో నాదే మరో సినిమా వుండడంవల్ల అక్టోబర్‌లో విడుదల చేయాలనుకున్నాను. కానీ ఆ సమయంలో వరుసగా పెద్ద సినిమాలు వుండడంతో ఇంత అనుభవం వుండి, రాంగ్ డేట్‌లో విడుదల చేయడం కరెక్టు కాదని వాయిదా వేశా.
ఈ కథ స్టార్ హీరో కోసం అనుకున్నారట?
దర్శకుడు గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ సినిమాకు ముందు ఈ కథ చెప్పాడు. బావుందని అల్లు అర్జున్‌కు వినిపించాము. ‘ఆర్య’, ‘పరుగు’, సినిమాల తరువాత మన కాంబినేషన్‌లో కొత్తగా వుండాలని బన్నీ అనడంతో నిజమే అనిపించి సునీల్‌తో చేస్తున్నాం.
కథకు సునీల్ ఎంతవరకు సూట్ అవుతాడు?
ఈ కథను ఎవరితోనైనా చేయవచ్చు. కథను డెవలప్ చేస్తూ వాసూవర్మకు చెప్పాను. అప్పుడే తను సాయిధరమ్‌తో ‘లవర్’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ సాయిధరమ్‌తో సినిమా చేస్తున్నాం కాబట్టి ముందు ఈ సినిమా చేయమని చెప్పాను. స్క్రిప్ట్ కూడా బాగా డెవలప్ చేశాడు. ఈ కథ చెప్పగానే సునీల్ ఫ్రీజ్ అయ్యాడు. ఈ సినిమా కోసం మరే సినిమా కూడా చేయడానికి ఒప్పుకోలేదు.
వాసూవర్మ చేసిన ‘జోష్’ ఆడలేదు కదా?
నా బ్యానర్‌లో పరిచయమైన సుకుమార్, వంశీ పైడిపల్లి, భాస్కర్, శ్రీకాండ్ అడ్డాల, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు ఈ రోజు మంచి స్థానంలో వున్నారు. కానీ, నేను చేసిన 20 సినిమాల్లో 16 సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. దర్శకులలో ఇద్దరు మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దానికి కారణం వాళ్ళది కాదు. అప్పటి పరిస్థితుల ప్రభావం. వాసూవర్మతో ‘దిల్’ సినిమా నుండి ట్రావెల్ చేస్తున్నాను. తనలో మంచి టాలెంట్ వుంది. కాలేజీల్లో జరిగే గొడవలు అంశాలతో సినిమా చేయడం, దాన్ని జనాలమీద రుద్దాలనుకోవడం పొరపాటు. దానికితోడు సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి వారసుణ్ణి హీరోగా ఎంచుకోవడం కూడా తప్పే. ఆ సినిమాపై అంచనాలు కూడా భారీగా వుండడం, అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చనిపోవడంతో ఆ సినిమాపై చాలా ప్రభావం పడింది.
సునీల్ కెరీర్‌కు కృష్ణాష్టమి ఎలా హెల్ప్ అవుతుంది?
సునీల్ నటించిన ‘అందాలరాముడు’, ‘పూలరంగుడు’ సినిమాలతో పోలిస్తే ఇది చాలా కొత్తగా వుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవకుండా హీరోయిజాన్ని చూపించే విధంగా కథ సాగుతుంది. అందమైన రివెంజ్ డ్రామా అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది.
మీ బ్యానర్‌లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే వస్తాయెందుకు?
నేను ఏ సినిమా చేసినా మొదట ప్రేక్షకుడిగానే ఆలోచిస్తా. ఒక సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలేంటి అనేదే నా ప్రధాన పాయింట్. నాతోపాటు అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడం, ముఖ్యంగా నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటాను.
పైరసీ వల్ల సినీ పరిశ్రమకు ఎలాంటి నష్టం వుంటుంది?
పైరసీవల్ల పరిశ్రమకు నష్టమే. కానీ, దానివల్లే మొత్తం సమస్య వస్తుందంటే నేను నమ్మను. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల శాతమే ఎక్కువగా వుంటుంది. పైరసీ చూసేవారు చూస్తుంటారు కానీ పైరసీవల్లే సినిమా కమర్షియల్‌గా దెబ్బతింది అంటే మాత్రం నేను నమ్మను.
సినిమాలపై రివ్యూల ప్రభావం ఎంత?
70 శాతం ప్రేక్షకులకు సినిమా నచ్చితే అది హిట్ కిందే లెక్క. మనం తీసిన సినిమా ప్రేక్షకుల కోసం ఏ 20 మందికోసమో లేదా పరిశ్రమలో కొందరికోసమో కాదు. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా రివ్యూలు మాత్రం మామూలుగానే వుంటాయి. ఏదేమైనా సినిమాల సక్సెస్‌లో రివ్యూల ప్రభావం పెద్దగా వుండదు.
కృష్ణవంశీతో చేసే సినిమా గురించి?
కృష్ణవంశీ దర్శకత్వంలో చేసే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఆ టైటిల్ ఫైనల్ కాలేదు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేస్తాం.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు వర్కింగ్‌లో వున్నాయి. ప్రస్తుతం నాకు మాన్‌పవర్ పెరిగింది. నాతోపాటు శిరీష్, హర్షిత్‌లు ప్రాజెక్టులు చూసుకుంటున్నారు. ఇకపై సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేయాలనుకుంటున్నాం.

-శ్రీ