స్టార్‌డమ్ అంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెర వెలుగుల వెనుక వున్న తారల పరిస్థితి చూస్తే వారి జీవితాలు ఇలా కూడా వుంటాయా? అనిపించక తప్పదు. సినీమాయ ప్రపంచలో వెలుగులు వెలగాలని వచ్చేవారికి ఎన్నో అవరోధాలు, ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు జరుగుతూనే వుంటాయి. ఒక్క అవకాశం దొరికితే చాలు పరిశ్రమలో స్థిరపడవచ్చని ఎన్నో అపోహలతో వచ్చేవారి బాధలు వర్ణనాతీతం. నటనమీద వున్న ఆసక్తితో ఎన్నో వందలమంది చిత్రసీమకి వచ్చినా కూడా వారిలో ఏ కొంతమందికో ఆ అవకాశం లభిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవారికి నూటికి నూరుశాతం ఖచ్చితంగా అవకాశాలు రావనే చెప్పాలి. నేరుగా సినిమాల్లో నటించాలని వచ్చినవారు కూడా కష్టమని భావించి అసిస్టెంట్ డైరెక్టర్లుగా కొంతకాలం పనిచేయడం నూటికి నూరుపాళ్లు జరుగుతుంది. అలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తూనే సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుని చిన్నచిన్నగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ వాళ్ల టైమ్ బాగుంటే చిన్న బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే నిర్మాతల దృష్టిలో పడినట్లయితే అలాంటి నిర్మాతలు తీసే సినిమాల్లో హీరోలుగా నటించగలుగుతారు. ఆ సినిమా కనుక సక్సెస్ అయితే వరసగా సినిమాలు చేతిలో వుండి మంచి పొజిషన్‌కి వెళతారు. లేకుంటే ఇక అంతే సంగతులు. ఒక్కసారి స్టార్‌డమ్ వచ్చాక తిరుగుండదు. తిరిగి చూసుకోవాల్సిన అవసరం వుండదు. కానీ ఖర్మకాలి అవకాశాలు రాకనో, తీస్తున్న సినిమాలు ఏదో సమస్యవల్ల విడుదల కాకపోయినట్లయితే అంతకుముందున్న పొజిషన్ కాపాడుకోవడం కష్టమే.
మనిషికి ఆశ వుండటం సహజం. కానీ అత్యాశ వుండటం చాలా ప్రమాదకరం. కానీ చిత్ర పరిశ్రమలో ఆశ కూడా పెట్టుకోకూదు. ఎవర్ని ఎప్పుడు ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. రంగుల ప్రపంచంలో తారస్థాయికి ఎదిగిపోవాలని వచ్చినవారి జీవితాలు, ఆశలు మధ్యలోనే ఆవిరైపోతున్నాయి. ఎందుకంటే పొజిషన్ మెయింటైన్ చేయకపోతే ప్రేక్షకుల్లో, జనాల్లో గుర్తింపు వుండదు. యధావిధిగా పొజిషన్ మెయింటైన్ చేయాలంటే సినిమాలు ఎక్కువ చేతిలో వుండాలి. ఏదో తమకున్న నాటక పరిజ్ఞానంతో, యువతులైతే మోడలింగ్‌లో చేసిన అనుభవంతో సినీ పరిశ్రమకి వచ్చి అవకాశాలు దొరక్క, ఈ కలల ప్రపంచాన్ని వీడి సాధారణ జీవితం గడపలేక, వేరే ఎలాంటి భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి నిలుపలేక వారివారి జీవితాలను, వారిని నమ్ముకున్నవారిని మోసం చేయలేక జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చినా స్టేటస్ నిలుపుకోవడానికి చెడుమార్గాలు అనే్వషించాల్సి వస్తుంది.
హీరోయిన్ కావాలని వచ్చిన యువతులు నేరుగా హీరోయిన్ వేషాలు లభించక చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూనే అవకాశాల కోసం పోరాడుతూనే వున్నారు. చివరకు సీరియల్‌లోనైనా హీరోయిన్ పాత్రలు దొరకవా అన్న ధోరణిలో సినిమాల కోసం, ఇండస్ట్రీలో పేరు సంపాదించడం కోసం వెంపర్లాడుతున్నారు. ఇక కొత్తగా ఎవరైనా అమ్మాయిలు సినిమా అవకాశాల కోసం పరిశ్రమలో కనపడితే వారికి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తమ మాయమాటలతో లోబరచుకుని వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా వచ్చినవారికి తీరా తాము మోసపోయామన్నది గ్రహించాక అది బయటపడితే పరువుపోతుందని కొందరు యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక నటిగా, నటునిగా సినిమా పరిశ్రమలో వెలిగిపోవాలని ఆశతో, ఆశయంతో, అకుంటిత దీక్షతో ఇంటి ని కుటుంబాన్ని వదిలి సినీ మోజు లో వచ్చినవారు కాస్త పొజిషన్ వచ్చాక మళ్లీ అవకాశాలు రాకపోయేసరికి జీవితాల్ని చాలించుకునే పరిస్థితికి వస్తున్నారు.
ఒకప్పుడు సినిమాల్లో నటించాలంటే నాటకాలు వేసిన అనుభవం, వారి కుటుంబ నేపథ్యం చూసిగానీ సినిమాల్లో అవకాశాలు దక్కేవికావు. కానీ ఇప్పుడలా లేదు. నటనమీద ఆసక్తి, అనుభవం వుండి కాస్త గ్లామర్‌గా వుంటే చాలు. అయితే కొంతకాలంగా సినిమాల్లో నటించాలనే ఆశతోకాక టివీ చానళ్లు నిర్వహించే షోల్లో అవకాశం దక్కించుకుని తమ సత్తాను చాటుతున్నారు. టివీ చానళ్లు కూడా నటనాసక్తి వున్నవారికి వారిలో వున్న కళను బయటకు తేవడానికి ఎంతో ముందుకొస్తున్నాయి. కొత్తగా వచ్చే నటీనటులకు టీవీ చానళ్లు మంచి జీవితాన్నిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న నటులంతా కూడా తాము కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియళ్లలో, షోలలో నటించి ప్రేక్షకులను గంటల తరబడి టీవీల ముందు అతుక్కు పోయేలా చేస్తున్నాయి. చిన్న సినిమాల్లో హీరోలుగా నటించేవారు టీవీ షోల్లో నటించి వారి టాలెంట్‌ను వెండితెరపై ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలుగొందినవారు కూడా ఇప్పుడు టీవీ సీరియళ్లలో నటించి మెప్పిస్తున్నారు. నటన ఎక్కడ వున్నా అది ప్రేక్షకుల్ని మరచిపోకుండా చేయాలి. అది హీరో పాత్ర, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్, విలన్ కావచ్చు ఏదైనా నటించిన పాత్రకు న్యాయం చేస్తే చాలు.
ఈమధ్య డజన్ల సంఖ్యలో కొత్తవారు వెండితెరకు పరిచయమైనారు. టీవీ షోల్లో చిన్న చిన్న పాత్రలుచేసిన కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వెండితెరకు వస్తున్నారు.
అనుకున్నంత తొందరగా ఏదీ కూడా తమ సొంతం కాదు. సాధించడానికి ఎంతో శోధన చేయాలి, కష్టపడాలి, కష్టనష్టాలు అనుభవించాలి. అలా అయితే గెలుపులోని తీయదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు కామెడీ ఆర్టిస్టులుగా బుల్లి తెరమీద కనిపిస్తున్నవారంతా ఎంతో ప్రావీణ్యం కలవారే. ఒకరికి మంచి మరొకరు అన్నట్లు ఎవరికివారే గొప్పవారు.సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో ఇంటి నుంచి వచ్చినవారు రాగానే ఎలాగు అవకాశాలు రావన్నది నిజం. కాబట్టి తెలిసి కూడా అవివేకంగా ప్రవర్తించకూడదు. ఒక్క సినిమాతోనే జీవితంలో స్థిరపడలేం. అలాంటి అవకాశాలు ఎన్ని రావాలి? ఎన్ని సినిమాల్లో నటించాలి. ఒక్క సినిమా హిట్ కాగానే మిడిమిడి జ్ఞానంతో పొజిషన్ మారిందనుకోవద్దు. ప్రేక్షకులు ఎవర్ని ఎప్పుడు ఎలా దీవిస్తారో ఎలా స్టార్‌డమ్ కల్పిస్తారో ఎవరికీ తెలియదు. స్టార్‌డమ్ అంటే మాటలు కాదు...! కాబట్టి నటించే పాత్రలు మంచిగా వుండేలా, కథ జనాలను మంత్రముగ్ధుల్ని చేసేలా వుండేవిధంగా ఎంపిక చేసుకోవాలి. లేకుంటే సినీ వినీలాకాశంలో కనుమరుగు కావాల్సిందే. తమకున్న నటన, ఏదైనా రంగంలోకాని వున్న ప్రావీణ్యాన్ని నెమ్మదినెమ్మదిగా పరీక్షించుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కాలి. కానీ ఒకేసారి ఎగిరి మెట్లన్నీ దాటాలని చూస్తే వెనక్కి రావాల్సిందే. స్టార్‌డమ్ కోసం అహర్నిశలు కష్టపడాలి. అవకాశాలు రాకుంటే నిశ్చలత్వంతో వుండాలి. మన దగ్గర టాలెంట్, అదృష్టం వుంటే అన్నీ ఏదో ఒక సమయాన మన దగ్గరికి వస్తాయి.

- శ్రీనివాస్ పర్వతాల