నేటి తరానికి సంస్కృతిని చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కార్తి. తాజాగా ఆయన చినబాబుగా వస్తున్నాడు. పాండీరాజ్ దర్శకత్వంలో తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ తెలుగు ప్రేక్షకులకు చినబాబు పేరుతో అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా కార్తి చెప్పిన విశేషాలు..
ఆయనతో పనిచేయాలని..
పాండీరాజ్ ఇంతకుముందు పసంగ అనే తమిళ సినిమా చేశారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. కేవలం చిన్నపిల్లలకోసమే కాకుండా అందరికీ నచ్చేలా అద్భుతంగా తీశాడు. ఆయనతో పనిచేయాలన్న కోరిక చాలారోజులనుంచి వుంది. అది ఈ సినిమాతో తీరింది.
చినబాబు అంటే..
ఈ సినిమాలో ఐదుగురు అక్కల తరువాత పుట్టిన తమ్ముడిగా కనిపిస్తాను. వ్యవసాయం చేసే తండ్రి బాధ్యతలు తీసుకొని వ్యవసాయం చేస్తూ అందులో కూడా రాణించవచ్చు అని తెలిపే పాత్ర. రైతుగా గర్వంగా తలెత్తుకునేలా చేసేందుకు కృషిచేసే యోగ్యుడు. దాంతోపాటు అక్కలను తన కుటుంబాన్ని బాధ్యతగా నడిపే వ్యక్తి అనుకోకుండా సమస్యల పాలైతే ఎలా వుంటుందనే ఆసక్తికర అంశంతో ఈ చిత్రం ఉంటుంది. మన కుటుంబాలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ప్రత్యేకంగా నేటి తరానికి తెలిసేలా వుంటుంది. ఇప్పటివరకూ నేను ఇంత పెద్ద ఫ్యామిలీ సినిమా చేయలేదు.
రైతు కష్టాలు కాదు
ఈ సినిమాలో రైతులు పడే కష్టాల గురించి చెప్పడంలేదు. ఒక రైతు యువకుని కథ. ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయం వచ్చేసింది. చాలా దేశాల్లో ఇలాగే పండిస్తున్నారు. కేరళలో ఇప్పటికే కొంతమంది ఏడాదికి రెండు మూడు కోట్లు సంపాదిస్తున్నారు. అలా వ్యవసాయం గురించి గొప్పగా చెప్పాలనే కథ ఇది. ఈ సినిమా కోసం నేను కూడా వ్యవసాయం చేశాను. ఉదయం 6 గంటలకే పొలానికి వెళ్ళేవాడిని. అన్నిరకాల ఎమోషన్లు వుంటాయి. మా బాబాయి, మావయ్య ఇద్దరూ రైతులే.
సూర్య నిర్మాతగా..
సూర్య ఈ సినిమా కోసం అన్ని చక్కగా చూసుకున్నాడు. షూటింగ్ స్పాట్‌కి ఒక్క రోజు కూడా రాలేదు. అంతా దర్శకుడిమీదే వదిలేశాడు. పాండీరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ లాంటి అంశాలు హైలెట్‌గా నిలుస్తాయి.
వ్యవసాయం అవసరం
ప్రస్తుతం నగరాలు విస్తరిస్తున్నాయి. దానివల్ల వ్యవసాయం తగ్గుతోంది. కానీ, మనం రోజూ చక్కగా తినాలంటే వ్యవసాయమే కావాలి. దానికోసం అందరూ ప్రయత్నం చేయాలి. రైతులకూ సమస్యలు ఉంటాయి కానీ అందులో కూడా లాభాలున్నాయి. నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తున్నాం. ప్రస్తుతం మన జనరేషన్‌కు వ్యవసాయమంటే తెలియదు. కాబట్టి సెలవుల్లో అయినా పిల్లలను గ్రామాలకు తీసుకెళ్లి వాటిని గురించి పరిచయం చేయాలి.
జల్లికట్టు..
ఈ సినిమాలో సంస్కృతి గురించి చెప్పాలని జల్లికట్టులాంటి ఆట గురించి టచ్ చేయలేదు. అలా చేస్తే సినిమా విడుదలకు సమస్య అవుతుంది. కేవలం వ్యవసాయం, దాన్ని పండించే యువకుడి కథే ఇది. ఇక ఈ సినిమా తరువాత రకుల్ హీరోయిన్‌గా ఆవారా లాంటి సినిమా చేస్తున్నాను. దాంతోపాటు ఖాకి సినిమాకు సీక్వెల్ చేద్దామని దర్శకుడు చెప్పాడు. ఆలాగే తెలుగులో కూడా మంచి స్క్రిప్ట్‌వస్తే తెలుగులోనూ చేస్తా.

-శ్రీనివాస్ ఆర్.రావ్