ఎందరికో స్ఫూర్తి ఎల్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్వీ ప్రసాద్. తెలుగు సినిమాకు ఆద్యుడు, దిక్సూచి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, ఓర్చిన కష్టనష్టాలను కథలుకథలుగా చెప్పుకోవాలి. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని సోమవరప్పాడులో 1908 జనవరి 17న జన్మించారు అక్కినేని లక్ష్మీవరప్రసాద్. తొలితరం నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించి, తరువాత అభిరుచిమేరకు దర్శక, నిర్మాతగా మారారు. ఆయన 111వ జయంతి వేడుకలు ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్, కుటుంబీకుల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ -తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆద్యుడు ఎల్వీ ప్రసాదేనని గుర్తు చేశారు. తెలుగు పరిశ్రమ సత్తాను భారతదేశానికి చాటిన మహనీయుడి దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ చిత్రంలో తన తండ్రి ఎన్‌టి రామారావు నటించారన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నిఘంటువులాంటి ఎల్వీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని, సామాన్యుడిగా పుట్టి కృషితో మహనీయుడిగా ఎదిగిన వ్యక్తి ఎల్వీ ప్రసాద్ అన్నారు. నటుడిగా తనలో స్ఫూర్తినింపిన వ్యక్తుల్లో ఎల్వీ ప్రసాద్ ఉన్నారని చెప్పుకున్నారు. ఏ రంగంనుంచి ఎదిగారో అదే రంగానికి పదింతలు తిరిగిచ్చిన ఎల్వీ ప్రసాద్ జీవితం ఆదర్శప్రాయమన్నారు.
దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ తెలుగు సినిమా ప్రపంచంలో ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్‌లు దిగ్గజాలని, వాళ్ల వారసత్వాన్ని పిల్లలూ కొనసాగించడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ చరిత్రను తరువాతి తరాలకు తెలియజెప్పేందుకు ‘బయోపిక్’ తీస్తున్నట్టే -ఎల్వీ వారుసులు సైతం ఆయన గొప్పతనం తరువాతి తరాలకు తెలిసేలే బయోపిక్ తీయాలని సూచించారు.
సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ ‘సీతారామకల్యాణం’ చిత్రం చేసిన తరువాత తనను అంతా సీతమ్మగా పిలుస్తున్నారంటే కారణం ఎల్వీ ప్రసాద్ అన్నారు. ఎల్వీ ప్రసాద్ సినిమా పరిశ్రమకు చేసిన సేవలను పలువురు కొనియాడారు.
రైతు కుటుంబంలో పుట్టి నటనపై ఆసక్తితో సినీరంగానికి వచ్చిన ఎల్వీ, తొలుత ముంబయిలోని వీనల్ ఫిల్మ్ కంపెనీలో సహాయకుడిగా పనిచేశారని, తరువాత స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నిశ్శబ్ద చిత్రంలో చిన్న పాత్ర పోషించారని వక్తలు గుర్తు చేసుకున్నారు. 1931లో భారతదేశ మొదటి టాకీ ‘ఆలం అరా’లో నటించిన ఎల్వీ, మొదటి తమిళ టాకీ ‘కాళిదాస్’లోనూ చిన్న పాత్ర పోషించారు. తొలి తెలుగు టాకీ భక్తప్రహ్లాద సహా, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించిన ఆయన తరువాత దర్శకుడయ్యారు. 1940వ దశకంలో గృహప్రవేశం, పల్నాటియుద్ధం, ద్రోహి, మనదేశం చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 1950లో సంసారం, షావుకారు, మిస్సమ్మ లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించారు. మనదేశం చిత్రం ద్వారానే ఎన్టీఆర్, ఎస్వీఆర్, అమర గాయకుడు ఘంటసాలనూ పరిచయం చేశారు. తాను సంపాదించింది సినీరంగంలోనే పెట్టుబడులు పెట్టి కళామతల్లికి ఎనలేని సేవలు అందించారని వక్తలు కొనియాడారు. సినిమా రంగంకోసం స్టూడియోస్, లాబ్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడమే కాదు, హైదరాబాద్‌లో ఎల్పీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని నెలకొల్పి ఎందరికో చూపునిచ్చారు. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఎల్వీ ప్రసాద్ నెలకొల్పిన సంస్థలు నేటికీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.