క్రికెట్ కథకు 200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ నా ఆలోచనలకు ప్రతిరూపమే. ఒక ఆలోచనను కమర్షియల్ ఫార్మాట్‌కు అన్వయించి కథగా మలచుకున్న చిత్రాలనే చేశాం. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నామన్న ఇమేజ్ రావడం ఆనందంగా ఉంది. ఇకపై -మంచి కంటెంట్‌తో దర్శకులు ముందుకొచ్చినా, అలాంటి ప్రాజెక్టులూ చేసే ఆలోచన చేస్తున్నా. ఏడాదిలో ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్‌లో చేస్తూనే -సౌత్ ఇండస్ట్రీపై దృష్టిపెట్టాలన్న ప్రణాళికకు పదును పెడుతున్నాం అంటున్నారు నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి. విభిన్న భాషా చిత్రాలుగా ’83, జయలలిత బయోపిక్‌లను తెరకెక్కించే బిజీలోవున్న ఇందూరి -గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

క్రికెట్‌లో తొలిసారి భారత జట్టు సాధించిన ప్రపంచ కప్ కథ చెప్పాలనిపించి ప్రాజెక్టు మొదలెట్టాం. యూకెలో వంద రోజుల షెడ్యూల్‌లో 80శాతం చిత్రీకరణ పూరె్తైంది. మిగిలిన 20 శాతం భారత్‌లోని వివిధ లొకేషన్స్‌లో పూర్తి చేస్తాం. నా ఆలోచనకు సంజయ్ పురాన్ సింగ్ కథారూపాన్నిచ్చారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రణవీర్‌సింగ్, దీపిక పదుకొనె లీడ్ పాత్రల్లో సినిమా తెరకెక్కుతోంది.
భారత్‌లో క్రికెట్ ఇంత బలంగా పాదుకోవడానికి ’83లో మనం సాధించిన ప్రపంచ కప్ అన్నది నా అభిప్రాయం. అప్పటి ఆటగాళ్ల స్ట్రగుల్, విజయం సాధించడానికి చేసిన కృషి.. ఆ కథ అందరికీ చెప్పాలనిపించింది. ఆ ఎలిమెంట్స్‌కు కమర్షియాలిటీ ఉందనిపించి ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేస్తాం. తెలుగు, తమిళంలో అనువాద చిత్రంగా వస్తుంది.
ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నీ నా ఆలోచనలకు ప్రతిరూపాలే. ముందు నేనొక ఐడియా అనుకుంటాను. దాన్ని రచయితకు వివరించి కథారూపంగా మలచుకుంటాం. ఎన్టీఆర్ బయోపిక్, జయ బయోగ్రఫీ కూడా అలా అనుకున్నవే.
బయోపిక్స్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. ఆ కథలకు కమర్షియాలిటీ ఉంది కనుక ప్రాజెక్టులు చేస్తున్నాం. ఇదే విధానం కొనసాగిస్తామని లేదు. ఎవరైనా దర్శకులు మంచి కంటెంట్‌తో ముందుకొస్తే, అది మాకు ఓకే అనిపిస్తే ఆ ప్రాజెక్టుల్నీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం.
ఎన్టీఆర్ బయోపిక్ చేయడంపట్ల ఇప్పటికీ గర్వంగా ఫీలవుతా. మొదట్లో అనుకున్న ప్రిన్సిపుల్స్‌కి కట్టుబడి లేకపోవడం వల్ల సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంటే -సినిమా 60 శాతం షూటింగ్ పూరె్తైన తరువాత రెండు భాగాలు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ ఆలోచన కరెక్ట్ కాదని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. కాకపోతే, మెజారిటీ ఓపీనియన్ అప్పుడలా ఉంది కనుక చేసేశాం. మహాభారతం, మహాత్మాగాంధీ చిత్రాలను సైతం ఒక్క్భాగంగా చేయడానికి కారణమదే. ఒకరి కథను రెండు భాగాలు చేయడం వల్ల ఇంటెన్సిటీ దెబ్బతిందని నా అభిప్రాయం. మాకు అదొక ఖరీదైన గుణపాఠం.
నిర్మాతల భాగస్వామ్యంతో సినిమాలు ఎందుకు చేయాల్సి వస్తుందంటే -నా శక్తి నాకు తెలుసు. నేను చేస్తున్నవన్నీ భారీ ప్రాజెక్టులు. ఉదాహరణకు ’83 చిత్రం 200 కోట్ల ప్రాజెక్టు. అంత ప్రాజెక్టును ఒక్కడినే నడిపించటం కష్టం. అందుకే -కంటెంట్‌పట్ల ఆసక్తివున్నవాళ్ల భాగస్వామ్యంతో సినిమాలు చేస్తున్నాం.
జయలలిత బయోపిక్‌ను అక్టోబర్ 15ను మొదలు పెట్టాలనుకుంటున్నాం. ప్రీప్రొడక్షన్స్ పనులు పూర్తవుతున్నాయి. రచయిత విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. హిందీ సంభాషణలు రజిత్ అరోరా అందిస్తున్నారు. ఎఎల్ విజయ్ దర్శకుడు. కంగనా రనౌత్ లీడ్‌రోల్ చేస్తున్నారు. హిందీ తమిళంలో స్ట్రెయిట్ సినిమాగా, తెలుగు, మలయాళం అనువాద చిత్రంగా విడుదల చేస్తాం. 2020లో సినిమా విడుదల చేయాలన్నది ఆలోచన. ఆర్టిస్టుల పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాం.
కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పే వీలున్న కథ జయలలిత బయోగ్రఫీ. ఆమె లైఫ్ మొత్తం స్ట్రగుల్స్‌తో కూడుకున్నదే అయినా.. కోట్లాది ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. మెలాడ్రామాలాంటి లైఫ్ స్టోరీ మరింత లోతుగా అందరికీ చెప్పలనే ఈ ప్రాజెక్టు అనుకున్నాం. ఆమె తొలిసారి ముఖ్యమంత్రి అయినంత వరకే కథ ఉంటుంది.
భవిష్యత్ ప్రాజెక్టులకూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బయటివాళ్లనుంచి కొన్ని కథలూ వింటున్నాం. కంటెంట్ బేస్డ్ కథలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తూనే, సౌత్‌లోనూ సినిమాలు చేయాలన్న ఆలోచన లేకపోలేదు.

-మహాదేవ