మెయన్ ఫీచర్

మన మహానగరాలు మృత్యుకుహరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి కాదు, రెండు కాదు- ప్రకృతి విపత్తుకు గురికాని నగరం లేదు. గురైతే సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి చేపట్టినా ఆర్థులందరికి సహాయమందించని స్థితి? ఏ విపత్తూ మనకు గుణపాఠం నేర్పదు. నేర్పినా ఆచరించడం మనకు అసలే గిట్టదు. ఈ విపత్తుల్ని కూడా సహాయక చర్యల పేరున, సహకారం పేరున నిధుల్ని రాబట్టడం, సేకరించడం సొమ్ముచేసుకోవడం జరుగుతున్నది. మొన్నటి చెన్నై వరదల సందర్భంగా దేశస్థాయిలో పేరుపొందిన ఏడు సంస్థలు సహాయాన్ని అర్ధిస్తూ ప్రకటనల్ని ఇచ్చాయి. వీరు సేకరించిన నిధులు నిజంగా బాధితులకు అందుతాయా, అందినా నిజమైన పునఃరావాసం జరుగుతుందా అనేవి ప్రశ్నలే!
గత 15 సంవత్సరాల నుంచి చూసినా హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, విశాఖ, చెన్నైలతోపాటు, ఉత్తరాఖండ్, జమ్ము, కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలు జలప్రళయాల్ని చవిచూసిన విధం తెలిసిందే! మనుషుల్లో మార్పు వచ్చినట్లే, వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఎండా కాలం వర్షాకాలంగా వర్షాకాలం శీతాకాలంగా, శీతాకాలం వేసవిగా మారిపోయాయి. ఎప్పుడు వర్షాలు పడుతాయో వాతావరణ శాఖకే అంతుపట్టకుండా పోయింది. ఓవైపు ఎండలుంటే, మరోవైపు అతి శీతలంగా వుంటున్నది. ఈసారి లడక్ మైనస్ 12డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందంటే, పరిస్థితులు ఎంతగా దిగజారాయో తెలుస్తున్నది. వాతావరణ శాఖలు రాబోయే విపత్తుల గూర్చి హెచ్చరికలు చేసినా, తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు శూన్యం. ఈ హెచ్చరికల్ని చేస్తున్న సంస్థలన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటుచేసినవే కావడం గమనార్హం! పాలన చేపట్టిన నుంచి రాజకీయ లబ్ది చేకూరే పథక రచనలకు ఇచ్చే ప్రాధాన్యతను, ఈ విపత్తుల నివారణకు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కాని, తాము సృష్టించిన సంక్షేమ పథకాల ప్రచారానికి మాత్రం జనాల సొమ్మును మాత్రం దండిగా ఖర్చుచేస్తున్నారు.
పైగా ప్రతీ ప్రభుత్వం పట్టణాభివృద్ధి గూర్చి మాట్లాడుతూనే వున్నది. గాంధీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం శుష్కనినాదమైంది. ఒకప్పుడు బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పట్టణీకరణ రోగానికి గురైంది. పది శాతంగా గల పట్టణ జనాభా 38 శాతానికి చేరగా, దీన్ని చైనాలాగా 50 శాతానికి పెంచాలనేది నాయకుల ఆలోచన! బీజింగ్ లాంటి మహానగరం కాలుష్యం కోరల్లో ఎలా చిక్కుకుందో ఈమధ్యన చూసాం! విదేశాల్లో పర్యటించే మన నాయకులు ఆ మహానగరాల సోయగాల్ని చూసి, మురిసి, మైమరిచి అదే సూత్రీకరణను భారత్‌కు అన్వయించాలని చూస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే, రాబోయే దశాబ్దకాలంలోనే పట్టణాల జనాభా 50శాతం కూడా దాటుతుంది. గ్రామీణ వ్యవస్థ వల్లకాడుగా మారుతుంది. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ మరింత వేగవంతవౌతుంది. పట్టణాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయిన వ్యవసాయం, సంబంధిత చేనేత, ఇతర కుటీర పరిశ్రమలు, కుల వృత్తులు నిరాదరణకు గురికావడం చూస్తున్నదే! దీంతో యువకులే కాదు, కుటుంబాలకు కుటుంబాలే పొట్టచేత పట్టుకొని పట్నం బాటపట్టడం జరిగింది. చదువుకున్న యువత దేశాన్ని దాటుతుంటే, గల్ఫ్ బాట పడుతుంటే, మిగతావారు పట్టణాల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు. గ్రామాల్లో నిరాశ్రయులైనవారు, పట్టణాల్లో రోడ్లవెడల్పు పనుల్లో కూలీలుగా మారిపోయారు. ఇలా బతుకుతెరువుకోసం వచ్చిన జనం ఫుట్‌పాత్‌లపైన, మురికికాలువ గట్ల పక్కన, నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కాందిశీకులుగా కాలం వెళ్ళదీస్తూ వుంటారు.
ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి కుతుబ్‌మినార్ మీదుగా కొత్త ఢిల్లీవైపు ప్రయాణం చేస్తుంటే, ఇరువైపుల వెలసిన గుడిసెలు, నివాసాలు ఈ దేశ పరిస్థితికి అద్దంపడుతాయి. ఒకప్పుడు నదీ తీర ప్రాంతాల్లో, ఒడ్డున వెలసిన ఈ మహానగరాలు, ఈ నదుల్నీ ఆక్రమించడంతో అవి మురికి కాలువలుగా మారిపోయాయి. ఏ పట్టణం వీటికి మినహాయింపు కాదు. పోనీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయా అంటే అదీ లేదు. నైజాం కాలంలో రూపొందిన హైదరాబాద్ ప్రణాళిక నాటి మూడు లక్షల జనాభాకే తీర్చిదిద్దబడితే, ఈ రోజు 60-70 లక్షల జనాభాకు ఆశ్రయాన్ని ఇస్తున్నది. నాడు 6 శాతంగా వున్న రోడ్లే, ఈ జనాభాకు మృత్యువుదారులుగా మారాయి. ముంబాయి నగరంలో 20 శాతంగా నాటి బ్రిటీషు పాలకులు ఏర్పాటుచేసిన రోడ్ల వ్యవస్థను కూడా భారతీయ పాలకులు పట్టించుకోవడం లేదు. వీటిని గుణపాఠంగా తీసుకోవడం లేదు. కనీస వర్షం పడినా తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మన హైటెక్ సిటీకే లేదనే కథనం ఈమధ్యన పత్రికల్లో చూసాం. మొన్నటి చెన్నైలాంటి వర్షం పడితే, లోతట్టు ప్రాంతాలే కాదు, ఎత్తయిన ప్రాంతాలు కూడా జలమయం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు.
దీనికితోడు మన పట్టణ పాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్థం. పాశ్చాత్య నగరాలు నగర పాలిక సంస్థ కిందకే మొత్తం వ్యవస్థలు నడుస్తే, మన నగరాల్లో ఈ స్థానిక వ్యవస్థకు పరిమితమై అధికారులు, నిధులు వుండడంతో, మిగతా అజమాయిషి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో వుండడంతో నగర జీవనం నరక కూపంగా మారింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రయాణ సాధనాలు, ఇతర సౌకర్యాలు అభివృద్ధి చెందాలని భావించడం సహజం! కాని, జనాభా పట్టణాల్లో ఈ విధంగా ఎందుకు పెరుగుతున్నదో చర్చగాని, నివారణ చర్యలుగా లేవు. పట్టణాలే అన్నింటికి కేంద్ర బిందువుగా మారడం ఈ దారుణాలకు కారణం. వీటిని వికేంద్రీకరించడానికి ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదు. పైగా రండి, మా నగరాల్ని విశ్వనగరంగా మార్చండి,సింగిల్ విండోతో మీకు అన్ని సౌకర్యాలు సమకూర్చుతాం, ప్రతిఫలంగా కావాల్సినంతగా దోచుకుపొండి అనే నినాదాలు ఎక్కువయ్యాయి.
ఓ పట్టణం పెరగడానికి లభించే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రధానమైతే, లభించే విద్యావకాశాలు మరో కారణం. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు ఒకప్పుడు ప్రాంతాలనుబట్టి, వనరులనుబట్టి ఏర్పాటయ్యేవి. ఆ ప్రాంత జనాభాకనుగుణంగా విద్యాలయాలుండేవి. వృత్తి విద్యాకోర్సులు ముఖ్యమైన జిల్లా, పట్టణ కేంద్రాల్లో ఏర్పాటు జరిగేవి. దీంతో జనాభా, విద్యార్థులు అన్ని ప్రాంతాలకు పంపిణి జరిగేది. అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకునేవి. నైజాం కాలంలో ఈ వ్యవస్థ స్పష్టంగా కనపడుతుంది. దీనికి భిన్నంగా నేటి పాలకులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే మంత్ర జపంతో అన్నింటికి మహానగరాల్ని కేంద్రంగా మార్చివేస్తున్నారు. అవసరానికి మించిన విద్యాలయాల్ని అనుమతించడంతో మండల, జిల్లాస్థాయిలల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు విధిగా నగరాలకు రావల్సివస్తున్నది. వీరితోబాటు తల్లిదండ్రులు తరలడం, లేదా పిల్లల్ని హాస్టల్లోవేసి జేబుల్ని ఖాళీ చేసుకోవడం జరుగుతున్నది. పైగా ఈ విద్యాసంస్థలు కొంతమంది ఎంపిక చేసిన విషయ బోధకులతో తమకు సంబంధించిన సంస్థల్లో వంతులవారిగా కార్లల్లో తిరుగుతూ బోధించడంతో, కొందరికే అవకాశాలు లభిస్తున్నాయి. కిందిస్థాయిల్లో లభించాల్సిన ఉద్యోగ అవకాశాలు కూడా పట్టణాలకు పరిమితంకావడంతో ఈ ఉద్యోగార్థులు విధిగా పట్టణాలకు చేరాల్సి వస్తున్నది.
కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం సంవత్సరంలో హైదరాబాద్ 254 కాలుష్య రోజులుగా గుర్తించబడగా కేవలం మూడురోజులు మాత్రమే కాలుష్య రహితంగా వుంటున్నదట. ఇక పంజగుట్ట ప్రాంతం అత్యంత ప్రమాదకర కాలుష్య ప్రాంతంగా గుర్తించారు. ప్రపంచ వ్యాపితంగాగల 20 కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే వుండడం నిజంగా మన నాయకులకు గర్వకారణమే! నగరాల స్థితి ఇలా వుంటే, మోదీ వంద నగరాల్ని స్మార్ట్ సిటీలుగా ప్రకటించడం తెలిసిందే. ఈ స్మార్ట్ సిటీలు అభివృద్ధి చెందితే 2029నాటికి 4.58 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ తగ్గుముఖం పడుతుందని సెలవిస్తున్నారు. వీటితోపాటు ప్రకటించిన స్వచ్ఛ్భారత్ ద్వారా 5.35 మిలియన్ టన్నులు, అమృత్ పథకం ద్వారా 107.53 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ తగ్గిపోతుందట! మొన్న ప్యారిస్‌లో జరిగిన సిఓపి-21 సదస్సులో పబ్లిక్ రవాణ వ్యవస్థగూర్చి, టన్నులకొద్ది పోగుపడుతున్న మహానగరాల చెత్త గూర్చి (డ్యజజూ త్ఘీఒఆళ) అసలు చర్చకే రాలేదని, మన దేశంనుంచి ప్రాతినిధ్యం చేసిన కరుణగోపాల్ ప్రకటించడం గమనించాల్సిన అంశం!
నేషనల్ ఎయర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎన్‌ఎక్యూఐ) ప్రకారం జైపూర్, ముజఫర్‌పుర్ నగరాలు ఢిల్లీని మించిపోయి 100శాతం కాలుష్యంతో చైనాను మించి పోయాయని మొన్న టి 15వ తేదీన ప్రకటించడాన్నిబట్టి, మన మహానగరాలు జనా ల పాలిట ఎలా శాపగ్రస్తంగా మారుతున్నాయో తెలుస్తున్నది. వీటి నివారణ మన నాయకులకు సాధ్యమా అనేది సమాధానం లేని ప్రశ్ననే!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162