కడప

పరిహారం పండ్లతోటలకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లా పర్యటన సందర్భంగా భారీ వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటల రైతాంగానికి నష్టపరిహారం ప్రకటించి, సాంప్రదాయ పంటలువేసిన రైతులను పట్టించుకోకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ భారీ వర్షాలకు వరి, వేరుశెనగ, వాణిజ్యపంటలు, కూరగాయల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు పంటనష్టంపై సర్వే ప్రారంభించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 10వేల హెక్టార్ల పైబడి జిల్లాలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు. అయితే తాజా సర్వే ప్రకారం ఈ నష్టం శనివారం నాటికి రెట్టింపుగా ఉందని, ఇంకా సర్వే కొనసాగుతోందని అధికారులు అంటున్నారు. పండ్లతోటల రైతులకే సిఎం నష్టపరిహారం ప్రకటించడంతో భారీగా పంటలు కోల్పోయిన రైతాంగం ఆందోళనకు గురవుతోంది. అభివృద్ధి పనుల్లో పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడవద్దని, ప్రజలు కూడా భాగస్వాములై సహాయ, సహాకారాలు అందించాలని సిఎం కోరారు. సిఎం ప్రకటనతో ప్రస్తుతం వరదల్లో దెబ్బతిన్న రోడ్లు, కాజ్‌వేలు, వాగులు, వంకలకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం నిధులు అందుతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాను దశాబ్దకాలంగా కరవు పట్టిపీడిస్తోంది. వ్యాపారపరంగా, పారిశ్రామికపరంగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ తరుణంలో పంటలు నష్టపోయిన రైతులకు ఏమేరకు పరిహారం అందిస్తారు, వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, మరమ్మతులకు ప్రభుత్వం ఎంత నిధులు అందిస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అనుకోకుండా భారీ వర్షాలు కురవడంతో పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. జిల్లాలోని అధికారపార్టీ నేతలంతా తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై అర్జీలు కుప్పలు తెప్పలుగా సిఎంకు అందజేశారు. వాటిని పరిశీలిస్తామని చెప్పారే తప్ప సిఎం ఎవరూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. జిల్లాపర్యటనలో ముఖ్యమంత్రి అస్పష్ట హామీతో రైతాంగానికి నిరాశే ఎదురైంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం సుడిగాలి పర్యటన
రైల్వేకోడూరు, నవంబర్ 20: భారీ వర్షాలకారణంగా దెబ్బతిన్న రైల్వేకోడూరు ప్రాంతంలోని పండ్లతోటలు, వాగులు, పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లోని గుంజన వాగు, బి.కమ్మపల్లి, బిపి రాచపల్లిలో దెబ్బతిన్న పండ్లతోటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇందులో భాగంగా పట్టణ శివారులో గుంజన వాగుతోపాటు బిపి రాచపల్లె వద్ద గొట్టిమానుకోన వాగు వరద ఉధృతి కారణంగా కొట్టుకుపోయిన వంతెనను సిఎం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్, బి.కమ్మపల్లి, బిపి రాచపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు, వరదబాధితులను కలసిన సిఎం వారి సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు. మరో వైపు బొమ్మవరం గ్రామంలో అలుగువంకను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ వాగులు, వంకలు ఆక్రమించి ఇళ్లునిర్మించుకున్నా, పొలాలుగా తయారుచేసుకున్నా భారీ వర్షాలకు ఇబ్బందిపడేది మీరేనని బాధితులతో అన్నారు. గాలేరు-నగరి కాలువను త్వరితగతిన పూర్తిచేసి మారుమూల గ్రామాల రైతులకు తాగునీటితోపాటు సాగునీటిని అందిస్తామన్నారు. ఈ ఏడాదినుంచి ప్రతి ఏటా 5వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఖజానా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన పరిధిలో వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సిఎం పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పండ్లతోటలు దెబ్బతిన్న రైతాంగానికి రూ.10వేలు వంతున నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికపై చేపట్టాలని, ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
రైల్వేకోడూరులో 2గంటలపాటు సాగిన సిఎం పర్యటన
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె , కోడూరు మండలాల్లో శుక్రవారం మద్యాహ్నం 1.35గంటల నుంచి 3.30నిమిషాల వరకు సుమారు రెండు గంటలపాటు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలు, పండ్లతోటలు, వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మొదట కోడూరు పట్టణ శివారులోని గుంజనవాగును పరిశీలించిన ఆయన అంతకుమునుపు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30గంటలకు కోడూరుకు చేరుకున్నారు.
ప్రత్యేక వాహనంలో సిఎం గుంజనవాగు పరిశీలించిన తర్వాత రోడ్డుమార్గాన ఓబులవారిపల్లె మండలం బి.కమ్మపల్లె, బిపి రాచపల్లి గ్రామపంచాయతీలకు వెళ్లి పలుగ్రామాల్లో దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించారు. స్థానిక రైతులతో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే బిపి రాచపల్లి వద్ద కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. రెండుగంటల పాటు కోడూరు, ఓబులవారిపల్లె మండలాలను పరిశీలించిన అనంతరం కోడూరుకు చేరుకుని హెలికాప్టర్‌లో సిఎం చంద్రబాబు నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.
సిఎంకు ఘన స్వాగతం
రైల్వేకోడూరు వరద ప్రాంతాలను చూసేందుకు వచ్చిన సిఎం చంద్రబాబునాయుడుకు కోడూరు హెలిప్యాడ్ వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, చీప్ విఫ్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, శాసన మండలి ఉపాధ్యక్షుడు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కెవి రమణ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, మాజీ ఎంపి గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, రమేష్‌రెడ్డి, రైల్వేకోడూరు టిడిపి ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాధనాయుడు, పార్టీ జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), మహిళా అధ్యక్షురాలు కుసుమ కుమారి, ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మలు ఘనస్వాగతంపలికారు.ఈకార్యక్రమంలో స్థానిక ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఆర్డీవో ప్రభాకర్ పిళ్లై, డిఎస్పీ అరవింద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్ట పరిహరం
ఓబులవారిపల్లె, నవంబర్ 20:వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహరం అందజేస్తామని, అదే విధంగా ఎకరాలకు రూ. 10 వేలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని బి.కమ్మపల్లె, బొమ్మవరం, జి వై పురం తదితర గ్రామాలలో సిఎం వర్షాలకు నష్టపోయిన ఉద్యాన పంటలు, గ్రామాలలోని రోడ్లు, ఏడాది క్రితం గుంజనేటిలో నిర్మించిన బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ బి.కమ్మపల్లెలో దాదాపు 70 ఎకరాల అరటితోటలు దెబ్బతిన్నాయని, దీని వలన నష్టపోయిన ప్రతి ఒక రైతును ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. ప్రకృతి వైఫరీత్యం వలన వర్షాలు కొద్ది వరకే కురిసి ఉంటే బాగుండేదని, భారీ వర్షాలతో రైతులు నష్టపోయారన్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఓబులవారిపల్లె మండలంలో ఏయే పంటలకు నష్టం జరిగింది, రైతుల వివరాలను జిల్లా అధికారులు అంచనా వేసి నివేదించాలని సిఎం ఆదేశించారు. అదే విధంగా రోడ్లు, భవనాలు, హైవే బ్రిడ్జిలు, మండలంలోని కాలువలు, బ్రిడ్జిలు, దెబ్బతిన్న ఇళ్లు, చెరువుల నష్టాలలో మరో రెండు రోజులలో నివేదించాలన్నారు. అనంతరం గుంజనేటిలో నిర్మించిన బ్రిడ్జిని పరిశీలించారు. ఏడాది క్రితం నిర్మించిన బ్రిడ్జి ఈ వర్షాలకు దెబ్బతినడం దారుణమన్నారు. నాణ్యతగా పనులు నిర్వహించాలన్నారు. మహిళా రైతులు మాట్లాడుతూ పంటల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. పంటల సాగు విధిలేక రుణాలు చేసి మరీ చేస్తున్నామని, ప్రకృతి మాపై కనె్నర్ర చేయడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామన్నారు. దెబ్బతిన్న పంటలకు మొత్తం రుణమాఫీ చేయాలని కోరారు ఈ గ్రామానికే రుణమాఫీ చేస్తే రాష్టమ్రంతా చేయాల్సి ఉంటుందని, అందరికీ మేలు జరిగేలా ఎకరాకు రూ. 10 వేలు చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. బి.కమ్మపల్లె, బొమ్మవరం సర్పంచ్‌లు జనార్ధన్‌నాయుడు, చెంగల్రాజు మాట్లాడుతూ మంగంపేట గనులు, మిల్లుల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, వ్యర్థ పదార్ధాలతో పంటలు కలుషితం అవుతున్నాయని, తాగునీటికి ఇబ్బందిగా మారిందన్నారు. మంగంపేట నీటిని చెరువులకు నింపితే పంటల సాగుకు అనువుగా ఉంటుందని, ఎపిఎండిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే జీవనోపాధికై ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ఇబ్బంది ఉండదన్నారు. ఇందుకు స్పందించిన సిఎం మాట్లాడుతూ ఈ సమస్యలపై అందరికి న్యాయం జరిగేలా నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.