తెలంగాణ

పరువు కోసం కాంగ్రెస్ పాకులాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎమ్మెల్సీ’ పోటీకి ముందుకు రాని ముఖ్య నేతలు
అనుచరులలో ఒకరిని బరిలోకి దింపేందుకు సన్నాహాలు

నిజామాబాద్, డిసెంబర్ 5: గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కూడా కాంగ్రెస్‌కు కంచుకోటలా నిలిచిన నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చట్టసభలోకి అడుగిడేందుకు ఎన్నికల రూపంలో అవకాశం వచ్చినప్పటికీ, పోటీలో నిలబడేందుకు తటపటాయిస్తున్నారంటే జిల్లా లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి దైన్య స్థితికి చేరిందో ఊహించుకోవచ్చు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్లు సమర్పించే గడువు దగ్గరపడినా ప్రధాన ప్రతిపక్షంలో స్పష్టత రావడం లేదు. జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ హేమాహేమీ నేతల్లో ఒక్కరంటే కనీసం ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్సీ బరిలో తలపడేందుకు ముందుకు రాలేకపోతున్నారు. మొత్తానికే పోటీ చేయకపోతే పార్టీ ప్రతిష్ఠ మంటగలుస్తుందనే భావనతో తమ ముఖ్య అనుచరుల్లో ఎవరో ఒకరిని పోటీకి దించి కొంతలో కొంతైనా పరువు కాపాడుకోవాలని తలపోస్తున్నారు. ఈ దిశగా జిల్లా నేతలు గత మూడు రోజుల నుండి భేటీలు అవుతూ ఎవరిని బరిలోకి దించాలనే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు. అయితే సదరు ముఖ్య నేతలు ప్రతిపాదిస్తున్న వారంతా వారివారి అనుచర గణాలే ఉండడం విశేషం. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పిసిసి కార్యదర్శి నరాల రత్నాకర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నగేష్‌రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి బి.తిరుపతిరెడ్డిల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు చట్టసభలకు ప్రాతినిథ్యం వహించలేదు. డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ రెండు పర్యాయాలు పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్న సమయంలోనూ ఆయనకు చైర్మెన్ పదవిని కేటాయించలేకపోయారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆయనను బరిలోకి దించి పార్టీ పరువును కాపాడుకోవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు తలపోస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు భిన్నంగా ముఖ్య నేతల్లో నుండి ఎవరైనా ఒకరు ఎమ్మెల్సీ బరిలో నిలిస్తే, కొంతవరకైనా గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగానే ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మధుగౌడ్ యాష్కీ తదితర హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వీరిలో షబ్బీర్‌అలీ ఇప్పటికే పెద్దల సభలో కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతుండగా, మిగతా వారంతా గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం వచ్చినప్పటికీ ఏ ఒక్కరూ సాహసించని దైన్య స్థితి నెలకొని ఉంది. ముఖ్య నేతలు తమ అనుచరుల్లో ఎవరిని పోటీలో నిలిపినా ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఏకపక్షంగానే వెలువడుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. మరోవైపు అధికార తెరాస పార్టీలో ఎనలేని కదనోత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున డాక్టర్ భూపతిరెడ్డి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుండగా, అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయిగా మారింది. స్థానిక సంస్థల్లో బలాబలాలను బేరీజు వేసుకుంటే తెరాస అభ్యర్థి ఎవరైనప్పటికీ, గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించి అనేక మంది ఆశావహులు అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ టిక్కెట్‌ను దక్కించుకునేందుకు ఎవరికివారు లాబీయింగ్ యత్నాల్లో నిమగ్నమై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటొచ్చీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.