రాష్ట్ర వార్తలు

‘మండలి’ ముప్పేట దాడి

  • 18/06/2013

హైదరాబాద్, జూన్ 17: స్టాండింగ్ కమిటీల నివేదికలను శాసన మండలికి సమర్పించే అంశంలో ప్రభుత్వం పక్షపాతం చూపిందని, పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండలి సభ్యులు సోమవారం సర్కారుపై ముప్పేట దాడికి దిగారు. ఒకవైపు టిడిపి, టిఆర్‌ఎస్, సిపిఐ, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్ర సభ్యులు సహా విపక్ష సభ్యుల నిరసనలతో భారీ ఎత్తున దాడి చేయగా, అధికారపక్ష సభ్యులు సైతం ‘వౌనం’ వహించి అండగా నిలిచారు. దాంతో ప్రభుత్వం ఇరుకునపడి సరైన సమాధానం చెప్పలేకపోయింది. సమస్యకు సభ్యులే పరిష్కారం చెప్పాలని ప్రభుత్వం తరఫున సభానాయకుడు, దేవాదాయ, ధర్మాదాయ మంత్రి సి రామచంద్రయ్య కోరారు. ప్రభుత్వ విధానాన్ని రామచంద్రయ్య సమర్థించేందుకు ప్రయత్నించినప్పటికీ, సరైన సమాధానం చెప్పలేదని సభ్యులు ఆరోపించారు. ఈ సమయంలో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, యువజన క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్, సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు సభలోనే ఉన్నప్పటికీ, వౌనంగానే కూర్చున్నారు. శాసన మండలి సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం కాగానే సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ ఎ చక్రపాణి చదవడం ప్రారంభించారు. స్టాండింగ్ కమిటీల నివేదికలను శాసనసభలో ముందుగా ప్రతిపాదించడాన్ని ప్రశ్నిస్తూ స్వతంత్య్ర సభ్యుడు ఎంవిఎస్ శర్మ వాయిదా తీర్మానం ఇచ్చారని చైర్మన్ చదువుతుండగానే, శర్మ లేచి ఈ అంశంపై మాట్లాడారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు గాని, ఆమోదిస్తున్నట్టు గాని చైర్మన్ ప్రకటించక ముందే దీనిపై చర్చ ప్రారంభమై దాదాపు గంటన్నర కొనసాగింది. శాసనమండలి చరిత్రలో ఇదొక రికార్డుగా నిలిచింది.
ఎంవిఎస్ శర్మ తొలుత ఈ అంశంపై మాట్లాడుతూ, శాఖల వారీ ఉభయ సభల సభ్యులతో ఏర్పాటయిన 12 స్టాండింగ్ కమిటీల్లో నాలుగు కమిటీలకు ఎమ్మెల్సీలే చైర్మన్లుగా ఉన్నారని గుర్తు చేశారు. మిగతా కమిటీల్లోనూ ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారని, నిబంధనల ప్రకారం స్టాండింగ్ కమిటీల నివేదికలను ఒకే పర్యాయం అటు శాసనసభలోనూ, ఇటు శాసన మండలిలలోనూ ప్రతిపాదించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా శాసనసభలో స్టాండింగ్ కమిటీల నివేదికలను మొదట ప్రతిపాదించారని, వీటి గురించి మీడియాలోనూ విస్తృతంగా వచ్చిందన్నారు. ఈ విధంగా ప్రభుత్వం చేయడం మండలిని కించపర్చడమేనని, నిర్లక్ష్యం చేయడమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించిన తీరు శాసన మండలికి, చైర్మన్‌కు, సభ్యులకు అవమానకరమని, టిడిపి సభ్యుడు, వౌలిక సదుపాయాల అభివృద్ధి స్థారుూ సంఘం చైర్మన్ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. తాను కూడా ఒక కమిటీకి చైర్మన్‌గా ఉండటం వల్ల తొలిరోజు తానే స్వయంగా ఈ నివేదికను మండలి సమావేశంలో చదవాలని భావించానని ఆవేదన వ్యక్తం చేశారు. స్థారుూ సంఘాల నివేదికలను శాసన మండలిలో, శాసనసభలో ఒకే పర్యాయం ప్రతిపాదించేందుకు వీలుగా రెండు సభలను ఒకే పర్యాయం సమావేశపరిస్తే శాసనమండలికి కూడా గౌరవం ఇచ్చినట్టయ్యేదన్నారు.
శాసనమండలిని ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలని టిడిపి సభ్యుడు బి వెంకటేశ్వర్లు నిలదీశారు. స్థాయిసంఘాల నివేదికలను శాసనసభలో ప్రతిపాదించేందుకు ప్రభుత్వం శాసనమండలి చైర్మన్ చక్రపాణి అనుమతి ముందుగా తీసుకున్నారా? అంటూ కె నాగేశ్వర్ ప్రశ్నించారు. చైర్మన్ చొరవతోనే స్థాయి సంఘాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. స్థారుూ సంఘం నివేదికలు ఉభయ సభల ఆస్తి అన్నారు. నివేదికలను తొలుత శాసనసభలో ప్రతిపాదించడం వల్ల శాసనమండలి హక్కులను ప్రభుత్వం కాలరాచిందని, చైర్మన్‌ను అవమానించిందని పేర్కొన్నారు. కమిటీ నివేదికలను శాసనసభకు ముందుగా సమర్పించే విషయాన్ని చైర్మన్ దృష్టికి ప్రభుత్వం తీసుకువచ్చిందా లేదా అంటూ నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ సభ్యుడు పి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు కె యాదవరెడ్డి, సిపిఐ సభ్యుడు పిజె చంద్రశేఖరరావు తదితరులు కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరుగుతుండగానే 10.30కు చైర్మన్ సభను వాయిదావేశారు.
సలహా ఇవ్వండి: రామచంద్రయ్య
శాసనమండలి 11.15కు ప్రారంభమైన తర్వాత సభానాయకుడు, దేవాదాయ మంత్రి సి రామచంద్రయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సలహా ఇవ్వాలని చైర్మన్‌ను, సభ్యులను కోరారు. ప్రభుత్వానికి కౌన్సిల్ అంటే గౌరవం ఉందని స్పష్టం చేశారు. కౌన్సిల్‌లో స్థాయి సంఘాల నివేదికలను ప్రతిపాదించకుండా శాసనసభలో ఇవే అంశాలపై చర్చించవచ్చా లేదా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకుంటూ పొరపాటు జరిగిందని సభ క్షమించాలని కోరారు. సభ్యులందరికీ ఇదే తన రెక్వెస్ట్ అన్నారు. తర్వాత అజండా ప్రకారం సభా కార్యక్రమాలను చైర్మన్ చక్రపాణి చేపట్టారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading