క్రైమ్/లీగల్

తక్షణ విచారణ కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 9:దేశం క్లిష్ట పరిస్థితుల్లో సాగుతున్నందున ఈ పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై వెంటనే విచారణ జరుపలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే సారధ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచి గురువారం ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాపించజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పిటిషనర్ పునీత్‌కౌర్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ఆమె అడ్వకేట్ వినీత్ ధండా ప్రస్తావించినప్పుడు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిఒక్కరూ శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలని బాబ్డే సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్యమాలు కొనసాగటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు బి.ఆర్.గవయ్, న్యాయమూర్తి సూర్యకాంత్ బెంచి ముందు అడ్వకేట్ వినీత్ ధండా తన పిటిషన్ గురించి ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే దీనిపై స్పందిస్తూ ఇలాంటి పిటిషన్లపై విచారణ జరపటం వలన పరిస్థితులు చక్కబడే బదులు మరింత చెడిపోతాయన్నారు. దేశంలో శాంతి నెలకొన్న తరువాతనే ఇలాంటి పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ గత నెల దాఖలైన దాదాపు అరవై పిటిషన్లపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వతోపాటు పలువురు ఇతరులకు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై జనవరి 22న విచారణ జరుపునున్నది. వినీత్ ధండా పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే పౌరసత్వం సవరణ చట్టానికి అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు ఇప్పుడిప్పుడే విచారణకు చేపట్టకపోవచ్చు. ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలోని వివిధ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టుకు బదిలీ చేసి ఇక్కడే విచారణ జరపాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఇలాంటి పిటిషన్లు ఎంత మాత్రం తోడ్పడవని బాబ్డే అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి సంబంధించిన హింసాత్మక సంఘటనలు ఆగిన తరువాత దీనిపై విచారణ చేపట్టేందుకు బాబ్డే అంగీకరించటం గమనార్హం. పిటిషనర్ తరపు న్యాయవాది వినీత్ ధండా తన వాదన వినిపిస్తూ దేశంలోని ముస్లిం మైనారిటీల మనస్సుల్లో భయోత్పాతం సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని ప్రకటించటంతోపాటు ఈ చట్టం గురించి అపోహలు సృష్టిస్తున్న కార్యకర్తలు, విద్యార్థులు, మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వినీత్ ధండా డిమాండ్‌ను ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తోసిపుచ్చారు. పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టం రాజ్యాంగబద్ధమేనని తామెలా ప్రకటించగలమని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ప్రశ్నించారు. ప్రతి చట్టానికి సంబంధించిన రాజ్యాంగబద్ధతను పరిశీలించవలసి ఉంటుందన్నారు. ‘మీరు ఎల్‌ఎల్‌బి విద్యార్థి అయి ఉంటే మీకిది తెలిసి ఉండా’లంటూ పటిషన్ తరపు న్యాయవాదికి చురకలు వేశారు. చట్టం చెల్లుబాటును నిర్ణయించటం కోర్టు పని తప్ప అది రాజ్యాంగబద్ధమేనని ప్రకటించటం కాదని ముగ్గురు న్యాయమూర్తుల బెంచి స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుంటే తామీ అంశంపై ఎలా విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమని ప్రకటించటంతోపాటు దేశంలోని ఏ ఒక్క పౌరుడికి కూడా ఇది వ్యతిరేకం కాదని కోర్టు ప్రకటించాలన్న పిటిషన్ డిమాండ్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.