క్రైమ్/లీగల్

స్పీకర్ల వ్యవస్థ విఫలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధుల అనర్హత అంశాన్ని నిర్ణయించే విషయంలో స్పీకర్ల వ్యవస్థ విఫలమైందని సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అనర్హత అంశంపై స్పీకర్లు మూడు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అనర్హత అంశాన్ని స్పీకర్ల నుండి తొలగించి మాజీ నాయయమూర్తులతో కూడిన ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌కు అప్పగించడం గురించి పరిశీలించాలని సుప్రీం కోర్టు పార్లమెంటుకు సూచించింది. న్యాయమూర్తులు ఆర్.ఎఫ్.నారిమన్, అనిరుద్ధబోస్, వీ రామసుబ్రమణ్యంతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు ఇచ్చి చరిత్ర సృష్టించింది. మణిపూర్ శాసన సభకు సంబంధించిన అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. కాగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన ఈ తీర్పు ప్రభావం తమిళనాడు, గోవా మరికొన్ని రాష్ట్రాలపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల అనర్హత వివాదాలు స్పీకర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధి ఒక్కరోజు కూడా సభ్యుడుగా కొనసాగకూడదన్నది తమ అభిప్రాయమని ధర్మాసనం పేర్కొంది. అనర్హత విషయంపై మూడు నెలల్లోగా ఒక నిర్ణయానికి రాలేని పక్షంలో స్పీకర్లు కారణాలు వివరించవలసి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ప్రజాప్రతినిధుల అనర్హతను నిర్ధారించేందుకు ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ను సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించే లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు ప్రజాప్రతినిధుల అనర్హత అంశంపై మూడు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. స్పీకర్లు తమ రాజకీయ విధేయతల మూలంగా నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నారని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కిహోటోహొల్లోహన్ వర్సెస్ ఝచిల్హు, ఇతరుల కేసు తీర్పులో స్పీకర్లు తమ రాజకీయ విధేయతల మూలంగా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనడం నిజమేనని ముగ్గురు న్యాయమూర్తులు చెప్పారు. స్పీకర్లు నిష్పక్షపాతంగా ఉండలేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని అనర్హతల అంశాన్ని నిర్ణయించేందుకు ఒక స్వతంత్ర యంత్రాంగం, పదవీ విరమణ చేసిన మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్లకు అప్పగించే అంశంపై పార్లమెంటు పునరాలోచించవలసిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. అనర్హత అంశాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్లకు ఉండకుండా చేసేందుకు రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని పార్లమెంటు సమీక్షించాలన్నారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల అనర్హత అంశాన్ని నిర్ణయించే బాధ్యతను అప్పగించాలని సుప్రీం సూచించింది. ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా పనిచేసేందుకు ఇది ఎంతో అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. మణిపూర్‌లో 2017లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన అభ్యర్థి పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి ఆ మరుచటిరోజే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో చేరిన సదరు సభ్యుడిపై కాంగ్రెస్ అనర్హత వేటువేసినా శాసనసభ స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేశారు. దీనితో కాంగ్రెస్ మొదట హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టులో పిటిషను దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించిన అనంతరం మంగళవారంనాడు ఈ తాజా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.