క్రైమ్/లీగల్

సీఏఏపై ‘స్టే’ ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపి వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై తమ వాదన దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టంపై విచారణను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రకటించింది. ఈ ధర్మాసనంలోప్రధాన న్యాయమూర్తి బాబ్డేతోపాటు న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం, దీని అమలును వెంటనే నిలిపి వేయాలంటూ 143 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నాయకత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల లోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించడంతో పాటు సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ పూర్తి కానంత వరకు హైకోర్టులేవీ దీనిపై విచారణ జరపకూడదని స్పష్టం చేసింది. అయితే అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించిన పిటిషన్లపై విడిగా విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టంతో ఈ రాష్ట్రాలకు ఉన్న సమస్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నందున ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఏఏ పిటిషన్లపై వేరుగా
విచారణ జరుపుతామని కోర్టు వివరించింది. పౌరసత్వ సవరణ చట్టం అంశంపై ప్రజలందరి దృష్టి ఉన్నందున దీనిని విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టు ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనాని అప్పగించటంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన ఎన్‌పీఆర్ ప్రక్రియను కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదించారు. సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలని పలువురు పిటిషన్‌దారుల తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ మొత్తం 143 పిటిషన్లు దాఖలైతే ప్రభుత్వానికి కేవలం 60 పిటిషన్ల కాపీలు మాత్రమే కేంద్రానికి అందాయి, మొత్తం 143 పిటిషన్లపై స్పందించేందుకు తమకు కొంత సమయం అవసరమని కోర్టుకు వివరించారు. పౌరసత్వ సవరణ చట్టంపై విచారణ రాజ్యాంగ ధర్మాసనం జరపాలని తాము కూడా భావిస్తున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం వాదన వినకుండా సీఏఏ అమలును నిలిపి వేయలేమని, అందుకే స్టే ఇవ్వటం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాతే సీఏఏను వ్యతిరేకిస్తున్న వారికి ఏదైనా తాత్కాలిక ఉపషమనం కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా ఏకపక్షంగా సీఏఏ అమలు, ఎన్‌పీఆర్ ప్రక్రియను నిలిపివేయటం తమకు ఎంత మాత్రం సాధ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచి ఖరాఖండీగా చెప్పింది. అస్సాంలో పౌరసత్వానికి కట్ ఆఫ్ తేదీ 1971 మార్చ్ 24 కాగా పౌరసత్వ సవరణ చట్టం తరువాత దీనిని 2014 డిసెంబర్ 31వరకు పొడిగించడం జరిగిందని కోర్టు తెలిపింది. అస్సాం, త్రిపుర పిటిషన్లపై తాత్కాలిక స్టే ఇవ్వాలని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ విజప్తి చేయగా త్రిపుర, అస్సాంకు సంబంధించిన సీఏఏ పిటిషన్లపై విడిగా విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. సీఏఏ రూల్సు తయారు కానప్పటికీ దీనిని అమలు చేస్తున్న ఉత్తర ప్రదేశ్ వ్యవహారంపై కూడా విడిగా విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. అదనపు పిటిషన్ల దాఖలును నిషేధించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సూచించారు. పిటిషన్ల ప్రాధాన్యతను నిర్ణయించాలని ఇందిరా జైసింగ్ కోరారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు సూచించారు. ఎన్‌పీఆర్ ప్రక్రియను నిలిపి వేయకపోతే ప్రజల పౌరసత్వం అనుమానాస్పద స్థితిలో పడిపోతుందని కెవి విశ్వనాథ్ కోర్టుకు తెలిపారు. ఎన్‌పీఆర్ ప్రక్రియ కొనసాగుతున్న ఉత్తర ప్రదేశ్‌లో చాలా మంది పౌరసత్వం అనుమానంలో పడిపోయింది, ఇప్పటికే చాలా మందిని పౌరుల జాబితా నుండి తొలగించాలని అభిషేక్ మను సింఘ్వి వాదించారు. సీఏఏకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లపై విచారణ ఎలా జరగాలనేది చాంబర్‌లో నిర్ణయిస్తామంటూ నాలుగు వారాల గడువు పూర్తి అయిన తరువాత దీనిపై రోజువారీ విచారణ జరిపించవచ్చునని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే చెప్పారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆర్‌జెడి నాయకుడు మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ లోకసభ సభ్యురాలు మహువా మొయిత్రీతో పాటు మొత్తం 143 మంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరు న్యాయశాస్త్రం విద్యార్థులు కూడా సీఏఏకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయటం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోంది, దేశంలోకి అక్రమంగా వచ్చిన శరణార్థులకు మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తోందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తమ పిటిషన్‌లో ఆరోపించింది. సీఏఏ రాజ్యాంగం ప్రాథమిక సిద్దాంతాలకు వ్యతిరేకం, కేవలం హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్దులు, జైనులు, పార్సీలకు మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తూ ముస్లింల పట్ల వివక్ష చూపిస్తోందని ఐయుఎంఎల్ తమ పిటిషన్‌లో ఆరోపించింది. సీఏఏ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడి చేస్తోంది, సమానులను అసమానులుగా చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సీఏఏ ముస్లింల పట్ల వివక్ష చూపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.