క్రైమ్/లీగల్

శ్రీనివాస్ రెడ్డికి ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామం ముగ్గురు బాలికల హత్యాచారం కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ గురువారం నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి (14), తిప్పరబోయిన మనీషా (17), తుంగని కల్పన (11)లను ఇదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసి తన వ్యవసాయ క్షేత్రంలోని పాత బావుల్లో పూడ్చివేసిన ఘటనలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో రాచకొండ పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 2019 జూలై 31న చార్జిషీట్ దాఖలు చేసి నిందితుడు ముగ్గు రు బాలికలను హత్యాచారం చేసిన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్, సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఫోక్సో కోర్టు అక్టోబర్ 14 నుండి విచారణ
చేపట్టి ఇరువర్గాల వాదనలు విని 101 మంది సాక్షులను విచారించడంతో పాటు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వాదన సైతం విని గత జనవరి 17వ తేదిన విచారణ పూర్తి చేసింది. ముగ్గురు బాలికల హత్యాచారం కేసులను వేర్వేరుగా నమోదు చేయడంతో కోర్టు విచారణ కూడా కేసుల వేర్వేరుగా నిర్వహించి నిందితుడికి శ్రావణి, మనీషాల కేసుల్లో ఉరి శిక్షను, కల్పన కేసులో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. రాచకొండ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని సిట్ బృందాన్ని నియమించి పక్కా ఆధారాలతో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్ కావడం, సమత హత్యాచార కేసులో నిందితులు ముగ్గురికి ఉరి శిక్ష పడిన నేపధ్యంలో హాజీపూర్ బాలికల హత్యాచారం కేసుల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించింది. చివరకు కోర్టు మానవ మృగం శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం పట్ల బాధిత కుటుంబాల్లో, మహిళా సంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మర్రి శ్రీనివాస్‌రెడ్డికి నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు ఉరి శిక్ష విధించడం ద్వారా న్యాయ, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచిందని ఇందుకు కృషి చేసిన పోలీస్‌శాఖకు, ఇతర ప్రభుత్వ శాఖలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తీర్పు అనంతరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపారు. గురువారం పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.వి.నాథ్‌రెడ్డి ముందు హాజరుపరుచగా అతడికి ముగ్గురు బాలికల హత్యాచారం కేసుల్లో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను చదివి వినిపించి ఈ కేసుల్లో దోషిగా తేల్చారు. నిందితుడు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? అన్న ప్రశ్నకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కన్నీరు పెడుతూ తనకు బాలికల హత్య కేసులతో సంబంధం లేదంటూ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులను తానే చూసుకోవాలని, తన ఇల్లు ధ్వంసం చేసి, భూములు లాక్కొన్నారని, తనపై దయ చూపాలంటూ జడ్జిని వేడుకున్నాడు. తుది తీర్పును భోజన విరామానికి తర్వాతకు వాయిదా వేసిన జడ్జి సాయంత్రం 6:30 గంటలకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పు వెలువడగానే శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యాచారానికి గురైన శ్రావణి, మనీషా, కల్పనల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమకు న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. మహిళా న్యాయవాదులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.

*చిత్రం...నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న పోలీసులు