క్రైమ్/లీగల్

చెన్నమనేని పౌరసత్వంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టే ఉత్తర్వులను హైకోర్టు మరోమారు పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకూ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు జరిగిన విచారణలో చెన్నమనేని రమేశ్ ఇప్పటికీ జర్మనీ పాస్ పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్టు కేంద్ర హోం శాఖ కోర్టుకు తెలిపింది. తద్వారా రమేశ్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెబుతూనే మరోవైపు జర్మనీ పౌరసత్వంతో ఎందుకు వెళ్లావని న్యాయస్థానం చెన్నమనేనిని ప్రశ్నించింది. దీంతో ఆయన స్పందిస్తూ జర్మనీ పౌరసత్వాన్ని ఎపుడో రద్దు చేసుకున్నట్టు తెలిపారు.జర్మనీ సిటిజన్‌షిప్‌ను వదులుకున్నారా అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా అని హైకోర్ట ప్రశ్నిచింది. జర్మనీ పౌరసత్వాన్ని రుద్దు చేసుకున్నట్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెన్నమనేనిని కోర్టు ఆదేశించింది. కాగా వాస్తవాలను దాచి మోసపూరితంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని పొందినట్టు నిర్ధారించి కేంద్ర హోం శాఖ గత ఏడాది నవంబర్ 20న ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుండి న్యాయ పోరాటం చేస్తున్నారు. తప్పుడు ధృవపత్రాలతో భారత్ పౌరసత్వాన్ని రమేశ్ పొందారని ఆయన ఆరోపించారు. అందుచేత రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన
వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రెండుమార్లు విచారణ జరిపి రమేశ్ పౌరసత్వం చెల్లదని పేర్కొంది.
భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 2008 మార్చి 31న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5(1)(ఎఫ్) ప్రకారం పౌరసత్వం కోరే దరఖాస్తు దారుడు అంతకు ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమచారాన్ని ఇచ్చారనేది ఆరోపణ. 2008 నవంబర్ 21న అంతకుముందు 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోం శాఖ కోరగా, తాను విదేశాలకు వెళ్లలేదని 2008 నవంబర్ 27న బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 2009 ఫిబ్రవరి 4న ఆయనను కేంద్ర హోం శాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 2009 జూన్ 15న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం 2007 మార్చి 1 నుండి 2007 జనవరి 26 వరకూ, అలాగే 2007 డిసెంబర్ 20 నుండి 2008 ఫిబ్రవరి 28 వరకూ రమేశ్ విదేశాల్లో ఉన్నారని దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 2009 సెప్టెంబర్ 1న ధృవీకరించిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా, ఆ కమిటీ 2017 మార్చి 10న ఒక నివేదికను సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ స్వచ్ఛందంగా వెల్లడించలేదని 2008 నవంబర్ 27న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ పేర్కొంది. పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం తప్పుడు సమచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, ఆయన పౌరసత్వాన్ని తొలగించాల్సి వస్తుందని కమిటీ వివరించింది.

*చిత్రం... చెన్నమనేని రమేశ్