క్రైమ్ కథ

కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్ గ్రేసీ అనే ధనవంతురాలిని కిడ్నాప్ చేయడానికి ఏడం తగిన పథకాన్ని రచించాడు. ఆమె చమురు పరిశ్రమ అధినేత కూతురు. కోట్లాది డాలర్లకి వారసురాలు.
ఇందుకోసం ఏడం వేటగాళ్ళు అడవుల్లో ఉపయోగించే ఓ గుడారాన్ని కొన్నాడు. కిడ్నాప్ చేసాక ఆమెని విడుదల చేసేదాకా అందులో ఉంచదలిచాడు. అందుకు పైన్ వృక్షాలమధ్య నిర్మానుష్యంగా ఉండే ఓ ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకున్నాడు. అక్కడికి అనేకసార్లు వెళ్ళి వంట సామానుని, లిక్కర్ సీసాలని నిలవ ఉంచాడు.
ఓ సాయంత్రం ఇంపీరియల్ బార్‌కి వెళ్ళాడు. అతను ఊహించినట్లుగానే అక్కడ అతని జైలు మిత్రులు చంకీ, స్నేకీ తారసపడ్డారు. అప్పటికే వాళ్ళు కొంత తాగి ఉన్నారు. ఏడం వాళ్ళని చూసి ఆనందపడ్డట్లుగా నటిస్తూ చెప్పాడు.
‘‘చంకీ, స్నేకీ! ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి? నేను మీ టేబిల్లో కూర్చోవచ్చా?’’
‘‘తప్పకుండా.’’ చంకీ ఆహ్వానించాడు.
‘ఏం చేస్తున్నారు? ఇంకా చిన్నచిన్న దొంగతనాలేనా? లేక ఎదిగారా?’’ ఏడం గొంతు తగ్గించి అడిగాడు.
‘‘చిన్న చిన్న దొంగతనాలే. చిన్న దొంగల్ని పట్టుకోడానికి తగిన సిబ్బంది ఈ ఊళ్ళోని పోలీస్ చీఫ్‌కి లేదు.’’ స్నేకీ చెప్పాడు.
‘‘సగటున ఓ దొంగతనంలో ఎంత సంపాదిస్తారు?’’ ఏడం అడిగాడు.
‘‘ఏభై డాలర్లు. అదృష్టం బావుంటే రోజుకి రెండు, మూడు దొంగతనాలు చేస్తూంటాం.’’
కొద్దిక్షణాలు ఇద్దరి వంకా చూసి ఏడం ముందుకి వంగి గొంతు తగ్గించి చెప్పాడు.
‘‘మీ ఇద్దరికీ చెరో పదివేల డాలర్లు సంపాదించే మార్గం చెప్పనా?’’
‘‘అంతా? ఒద్దు. పోలీసులు దోషులు పట్టుబడే దాకా అలాంటి కేసులని వదలరు.’’ చంకీ నిరాకరించాడు.
‘‘జైల్ జీవితం వద్దు. పదివేల డాలర్లతో ఏదైనా వ్యాపారం ఆరంభించి ఆ తర్వాత నిజాయితీగా బతకచ్చు. చిన్న దొంగతనంలో పట్టుబడ్డా, లేక పెద్ద దొంగతనంలో పట్టుబడ్డా జైలుజైలే. తెలివిగా ప్రవర్తిస్తే పట్టుబడం.’’
‘‘బేంక్ దొంగతనమా?’’ చంకీ తన గ్లాస్‌లోని బీర్‌ని పూర్తిగా తాగి అడిగాడు.
‘‘కాదు. కిడ్నాప్.’’
‘‘ఎవర్ని?’’ స్నేకీ వెంటనే ప్రశ్నించాడు.
‘‘నాలుగు రోజుల పనికి మీ ఇద్దరికీ చెరో పదివేల డాలర్లు ఇస్తాను. మీరు సరే అంటే మిగతా విషయాలు చెప్తాను. ఆలోచించుకోండి. మీకు ఆసక్తి ఉంటే రేపీ సమయానికి ఇక్కడ నన్ను కలవచ్చు.’’ ఏడం చెప్పాడు.
***
మర్నాడు ఆ సమయానికి ఏడం ఇంపీరియల్ బార్‌కి వెళ్తే ఆ ఇద్దరు మిత్రులు అతనికోసం ఎదురుచూస్తున్నారు. దూరం నించి అతన్ని చూసి చేతులు ఊపారు. ఏడం వాళ్ళముందు కూర్చుని అడిగాడు.
‘ ఆలోచించారు?’’
‘‘నీతో చేతులు కలపాలని అనుకున్నాం. ఎందుకంటే నువ్వు తెలివైన వాడివి. పట్టుపడకపోవచ్చు. రోజూచేసే చిల్లర దొంగతనాలతో విసిగిపోయాం.’’ స్నేకీ చెప్పాడు.
‘‘పథకం ఏమిటి?’’ చంకీ ప్రశ్నించాడు.
‘‘ఓ ధనవంతుడి కూతుర్ని కిడ్నాప్ చేయాలి. డబ్బు అందేదాకా ఆమెని ఓచోట బంధించి ఉంచాలి. కిడ్నాప్ చేయడం, బంధించి ఉంచడం మీ పని. పథక రచన, ముఖ్యమైనచోట్ల ప్రమేయం చేసుకోకుండా నా పని.’’ ఏడం చెప్పాడు.
‘ఎవర్ని?’’
‘‘మిస్ గ్రేసీని. మీకు ఆమె ఎవరో తెలీకపోవచ్చు.’’
‘‘అవును. తెలీదు. ఎవరామె?’’
‘‘ఓ ధనవంతుడి కూతురు అని గుర్తుంచుకుంటే చాలు. మీరు ఇప్పుడు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది.’’
‘‘ఎక్కడ కిడ్నాప్ చేయాలి?’’ చంకీ అడిగాడు.
‘‘ఎప్పుడు?’’ స్నేకీ ఉత్సాహంగా అడిగాడు.
‘‘రేపు మధ్యాహ్నం.’’
‘‘రాత్రా? మధ్యాహ్నమా?’’ స్నేకీ అనుమానంగా ప్రశ్నించాడు.
‘‘కాదు. సరిగ్గా విన్నారు. అంతా చూస్తూండగా మధ్యాహ్నం. నార్త్ స్టార్ బార్ బయట.’’
‘‘నార్త్ స్టార్ బార్? అక్కడ రేట్లు ఎక్కువ.’’ చంకీ వెంటనే చెప్పాడు.
‘‘డబ్బున్నవాళ్ళు వెళ్ళేదానికి రేపు మిస్ గ్రేసీ ఒంటరిగా వస్తుంది. ఆమె ఆల్కహాలిక్. చాలా తాగుతుంది. తాగి బయటకి వచ్చాక మీరు కిడ్నాప్ చేయాలి.’’
‘‘మమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తే?’’
‘‘చంకీ! నువ్వు ఆమె భర్తలా నటించాలి. స్నేకీ. నువ్వు యూనిఫాం అద్దెకి తీసుకుని కార్ డ్రైవర్‌గా నటించాలి. బార్లోంచి బయటకి వచ్చిన ఆమె ఎంత తప్పతాగి ఉంటుందంటే, చంకీ ఆమెతో ‘రా హానీ. మనం ఇంటికి వెళ్దాం’అని ఆమెని మీ కారు ఎక్కించచ్చు. అక్కడ నించి నేను చెప్పినచోటికి వెళ్ళాలి. అందుకు వీలుగా మీరు ముందుగా ఓ కారుని దొంగిలించాలి. నేను ఇచ్చే అడ్రస్‌లోని ఇంటి బయట పార్క్‌చేసిన కారుని. అది వారి మూడో కారు. మిగిలిన రెండు లోపల గేరేజ్‌లో ఉన్నాయి.’’
‘‘ఆ ఇంటివాళ్ళు పోలీసులకి ఫిర్యాదుచేసే మొత్తం పథకం తలకిందులు అవుతుంది.’’ స్నేకీ అభ్యంతరం చెప్పాడు.
‘‘నేను మీలా మూర్ఖుడ్ని కాదు. వాళ్ళు శెలవలకి ఫ్లోరిడాలోని డిస్నీలేండ్‌కి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా కారు పోయిందనే ఫిర్యాదు పోలీసులకి అందదు.’’
‘‘సరే. కారులో మిస్‌గ్రేసీని ఎక్కడికి తీసుకెళ్ళాలి?’’
ఏడం జేబులోంచి రెండు కాగితాలని తీసి ఒకటి చంకీకి ఇచ్చి చెప్పాడు.
‘‘ఇది ఆ ఇంటి చిరునామా. కార్ నంబర్ కూడా రాసాను.’’
చంకీ దాన్ని స్నేకీకి, అది అతనిపనన్నట్లుగా ఇచ్చాడు. ఏడం రెండో కాగితాన్ని బల్లమీద పరిచి చెప్పాడు.
‘‘మీరు ఆమెని ఎక్కడికి తీసుకెళ్ళాలో మేప్ గీసాను. హైవేలోంచి ఈ ఇంటూ గుర్తుదగ్గర కుడివైపు మట్టి రోడ్డులోకి తిరగండి. ఆరు మైళ్ళ దూరంలో ఓ గుడారం కనిపిస్తుంది. అందులో ఆహార పదార్థాలు, స్టవ్, లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. మీరు ఆమెని అక్కడ బంధించి ఉంచండి. ఆమె తాగుతూనే ఉంటుంది కాబట్టి పారిపోతుందనే భయం లేదు.’’
‘‘ఎంత డబ్బు డిమాండ్ చేస్తున్నావు?’’ స్నేకీ అడిగాడు.
‘‘ఏభైవేల డాలర్లు. నాకు ముప్ఫై. మీ ఇద్దరికీ చెరో పదివేలు.’’
‘‘సమానంగా పంచుకుందాం.’’ స్నేకీ వెంటనే చెప్పాడు.
‘‘కాదు. తల ఇతనిది. తలకి ముప్ఫైవేలు. శరీర పనికి మనకి తలో పదివేలు. నాకు సబబే అనిపిస్తోంది.’’ చంకీ స్నేకీ వంక చూసి రహస్యంగా కన్ను కొడుతూ చెప్పాడు.
దాని అర్ధం గ్రహించిన స్నేకీ వెంటనే చెప్పాడు.
‘‘సరే. ఆ ధనికుడి నించి డబ్బు ఎవరిస్తారు? ఎవరు తీసుకుంటారు?’’
‘‘గ్రేసీ తండ్రి ఇస్తాడు. చంకీ వెళ్ళి తీసుకుని ఆ గుడారానికి చేరుకుంటాడు.’’
‘‘అంటే మమ్మల్ని నమ్ముతున్నావన్న మాట.’’స్నేకీ అడిగాడు.
‘‘అవును. మీరు సరాసరి గుడారానికి రండి. అక్కడ నేను సిద్ధంగా ఉంటాను. పంచుకుందాం.’’
‘‘అమ్మాయిని ఎప్పుడు విడిచిపెడతాం?’’
‘‘డబ్బు ముట్టి మనం ముగ్గురం కలిసాక.’’
‘‘ఆ గుడారంలో ఉందని తర్వాత పోలీసులకి ఫోన్‌చేస్తావా?’’ స్నేకీ అడిగాడు.
‘‘లేదు. మీ ఇద్దరి వేలిముద్రలు ఆ గుడారం నిండా ఉంటాయి. ఆమెని నగరంలోని లైబ్రరీ పక్కన పార్క్‌లోకి చేర్చి ఆమె తండ్రికి ఫోన్ చేస్తాను. మనదగ్గర ఉండే రెండు, మూడురోజులు ఆమె అడిగినంత లిక్కర్ పోస్తూండండి. ఇక పారిపోవడానికి కూడా ప్రయత్నించదు. అసలు తను కిడ్నాప్ అయిందని కూడా గ్రహించదు.’’
‘‘మనం మాత్రం తాక్కూడదు.’’ చంకీ స్నేకీకి హెచ్చరికగా చెప్పాడు.
‘‘ఇక డబ్బు ఎక్కడ తీసుకోవాలో చెప్తాను.’’
ఏడం ఆ మేప్ కాగితాన్ని వెనక్కితిప్పి చెప్పాడు.
‘‘ఇక్కడ నది ఒడ్డునగల పార్క్‌లో. ఆ పైన్ చెట్టు కొమ్మకున్న సంచీలో డబ్బువేసి వెళ్తాడు. పక్కనే చాలా పొదలున్నాయి.
చంకీ నువ్వు అందులో దాక్కుని బైనాక్యులర్స్‌తో చూడు. మఫ్టీలోని పోలీసుల కనిపిస్తే డబ్బు తీసుకోవద్దు. ఆ సమయంలో పార్క్ నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి మనుషులు ఉంటే వాళ్ళు పోలీసులే. డబ్బు తీసుకుని నదిలోకి ఈదుకుంటూ వెళ్తే వంద అడుగుల దూరంలోని మర పడవలో నేను సిద్ధంగా ఉంటాను. పోలీసులు ఉన్నా మనం నీటి మార్గంలో పారిపోతామని వాళ్ళు ఊహించరు. కాబట్టి నిన్ను వెంబడించలేరు. అవతలి ఒడ్డున పడవ దిగగానే కారు సిద్ధంగా ఉంటుంది.’’
‘‘మంచి పథకం.’’ స్నేకీ చెప్పాడు.
‘‘ఆయనకి తన కూతురంటే తగని ప్రేమ. అందుకే ఎంత తాగినా వద్దనడు. పోలీసులకి చెప్తే ఆమెని చంపేస్తామనే భయం కలిగించేలా ఫోన్‌లో మాట్లాడుతాను. కాబట్టి ఆ పనిచేస్తాడనుకోను. పైగా ఏభైవేల డాలర్లు ఆయనకి తృణప్రాయం. అనుమానాలేమైనా ఉన్నాయా?’’
‘‘పెద్దగా లేవు.’’ స్నేకీ చెప్పాడు.
***
పథకం వాళ్ళు అనుకున్నట్లుగానే సక్రమంగా సాగింది. మిస్ గ్రేసీని ఎవరికీ అనుమానం కలక్కుండా కిడ్నాప్ చేసారు. తాగి ఉన్న ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా, కార్లోని విస్కీ బాటిల్‌ని చూసి కారెక్కింది.
ఏడం ఎప్పటికప్పుడు వారిద్దరికీ ఫోన్ చేసి జరిగేది తెలుసుకుంటున్నాడు.
‘‘ఆమె పారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా?’’ మర్నాడు అడిగింది.
‘‘పారిపోదు. లిక్కరే ఆమెకి కాపలా. అంత తాగుతుందని మేము ఊహించలేదు.’’ చంకీ చెప్పాడు.
‘‘అది తండ్రి గారాబాల ఫలితం.’’
‘‘మమ్మల్ని బట్టలతో ఉండనీయడం లేదు. ఇది ముందు చెప్పలేదే?’’
‘‘నాకూ తెలీదు. సరే. ఇది బోనస్ అనుకుని మీ పనిని ఎంజాయ్ చేయండి. డబ్బుకోసం ఎప్పుడు వెళ్ళాలో మళ్ళీ చెప్తాను. ఫోన్లో మాటలు జరుగుతున్నాయి. ఏభైవేలు కావాలంటే రెండు లక్షలు అడగాలి. లక్షదాకా నేను వచ్చాను. నలభై వేల దాకా ఆయన వచ్చాడు. ఏభైవేలకి కొన్ని గంటల్లో సెటిల్ అవచ్చు. రేపు రాత్రి డబ్బు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇద్దరూ అదే పనిగా బలహీన పడకండి.’’ ఏడం నవ్వుతూ చెప్పాడు.
***
వారి పథకంలోని ఆఖరి అసలు భాగంకూడా సక్రమంగా జరిగింది. ఏభై వేల డాలర్లు ముట్టాక చంకీ నదిలోని పడవలోకి చేరుకున్నాడు. అవతలి ఒడ్డున దిగి కారులో పైన్ వృక్షాలమధ్యగల గుడారానికి చేరుకున్నారు. కాళ్ళు, చేతులు కట్టబడ్డ గ్రేసీ గుర్రుపెట్టి నిద్రపోతోంది.
‘‘ఇంతటి తాగుబోతు రాక్షసిని నేను ఎన్నడూ చూడలేదు.’’ స్నేకీ చిరుకోపంగా చెప్పాడు.
ఏడం తనతో కార్లో ఐస్ బాక్స్‌లో తెచ్చిన షాంపేన్ సీసాని, మూడు షాంపేన్ గ్లాసులని తీసి చెప్పాడు.
‘‘సెలబ్రేట్ చేసుకుని, డబ్బు పంచుకుని, ఎవరి దారినవాళ్ళు విడిపోదాం. మీ ఇద్దరూ ఓ నెలపాటు దూర దూరంగా ఉండటం మంచిదని నా సలహా.’
‘‘ఈ రాక్షసి సంగతి?’’
‘‘నేను నా కార్లో తీసుకెళ్ళి పార్క్‌లో ఓచోట పడుకోపెడతాను. తర్వాత ఈమె తండ్రికి ఫోన్‌చేసి చెప్తాను.’’
ఏడం షాంపేన్ బాటిల్‌ని బాగా కదిపి, దాని బిరడా మీదున్న ఇనప తీగల్ని పక్కకి లాగగానే టప్‌మనే శబ్దంతో దాని కార్క్ బిరడా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. మూడు గ్లాసుల నిండా నింపాడు. తెల్లటి నురగ ఉన్న మూడు గ్లాసులు కొట్టుకున్నాయి. మిత్రులు ఇద్దరూ దాన్ని రుచి చూసి చెప్పారు.
‘‘ఎన్నడూ ఇలాంటిది తాగలేదు.’’
ఇద్దరూ దాన్ని పూర్తిచేసి మళ్ళీ ఖాళీ గ్లాసులని ఏడంవైపు చూపారు. ఏడం వాళ్ళకా సీసాని అందించి, జేబులోంచి రెండు రివాల్వర్లని తీసి, రెంటితో ఒకేసారి ఇద్దరి ఛాతీల్లోకి కాల్చాడు. మరణించేవారి ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం తొంగి చూసింది.
ఏడం వెంటనే డబ్బు సంచీని తీసుకుని దాన్ని కారు డిక్కీలో ఉంచాడు. తర్వాత రెండు రివాల్వర్లని తన వేలి ముద్రలు లేకుండా శుభ్రంగా తుడిచి ఇద్దరి చేతుల్లో చెరో రివాల్వర్‌ని ఉంచాడు. చూడగానే ఒకర్నొకరు కాల్చి చంపుకున్నారు అనుకునేలా వాళ్ళని ఎదురుబొదురుగా పడేసాడు. షాంపేన్ బాటిల్‌ని, గ్లాసులని కూడా డిక్కీలోకి సంచీలో పడేసి, ఆమె చేతుల కట్లని విప్పి కారెక్కివచ్చిన దారిన పోనించాడు. వాళ్ళిద్దరికీ చెప్పని తన పథకంలోని ఆఖరి భాగం కూడా విజయవంతమైనందుకు ఏడంకి సంతోషంగా ఉంది.
***
ఏడం మర్నాడు దినపత్రికని ఆసక్తిగా చదివాడు. అతను ఎదురుచూసిన వార్త మూడో పేజీలో ఉంది.
మాయమైన వారసురాలు జీవించే ఉంది. డబ్బుకోసం ఇద్దరు కిడ్నాపర్లు ఒకర్నొకరు కాల్చుకుని మరణించారు. డబ్బు మాయమైంది. పోలీసుల అయోమయం.
అతను ఆ వార్త మొత్తాన్ని వివరంగా చదివాడు. మెలకువ వచ్చిన మిస్ గ్రేసీ తనో కొత్తచోట ఉండటం చూసి అక్కడున్న దొంగ సెల్‌ఫోన్ నించి తండ్రికి ఫోన్‌చేయడంతో ఆయన పోలీసులతో హుటాహుటీన వచ్చి ఆమెని ఇంటికి తీసుకెళ్ళాడని రాసారు. దినపత్రికలో మిస్ గ్రేసీని పత్రికా విలేకర్లు ప్రశ్నించిన ఉదంతంకూడా ఉంది. మరణించిన ఇద్దర్నీ తనని కిడ్నాప్ చేసిన వాళ్ళుగా గుర్తించింది. ఇద్దరే కిడ్నాపర్లని గట్టిగా చెప్పింది. ఏభైవేల డాలర్లని వాళ్ళు ఎక్కడ దాచారన్నది ఇంకా వీడని రహస్యం అని కూడా రాసారు.
ఏడం దినపత్రికని పక్కనపెట్టి మంచంకింద ఉన్న సంచీలోని డబ్బుని లెక్కపెట్టి దాన్ని సూట్‌కేస్‌లో ఉంచాడు. కాఫీ కలుపుకోడానికి వంట గదిలోకి వెళ్ళాడు.
డోర్ బెల్ మోగింది. వెళ్ళి తలుపుతెరిచాడు.
‘‘గుడ్ మార్నింగ్. నా పేరు లెఫ్టినెంట్ ఏండర్సన్. ఇతను సార్జెంట్ షైవర్. మీతో మాట్లాడాలి.’’
‘‘దేని గురించి?’’ ఏడం తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు.
‘‘విషయానికి సూటిగా వస్తాను మిస్టర్ ఏడం. పోలీస్ బాలిస్టిక్స్ లేబ్ రిపోర్ట్ మమ్మల్ని కొద్దిగా అయోమయపరిచిందనే చెప్పాలి.’’ ఏండర్సన్ చెప్పాడు.
‘‘పోలీస్ లేబ్ రిపోర్ట్?’’
‘‘అవును. ఆ విషయంలో మీరు సహాయం చేయగలరనే వచ్చాం.’’
‘‘మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థంకావడంలేదు.’’
‘‘మిస్ గ్రేసీ కిడ్నాపర్లు ఒకర్నిమరొకరు కాల్చుకుని మరణించారని పేపర్లలో చదివే ఉంటారు.’’
‘‘అవును. ఐతే?’’
మూడువేల మైళ్ళదూరంలోని ఆ రివాల్వర్లని తను తాకట్టు దుకాణంలో డబ్బిచ్చి కొని ఏడాదిన్నరైంది. ఆ రివాల్వర్లు తనవి అని ఎక్కడా నమోదు కాలేదు.
‘‘మీ సహాయం కోరి వచ్చాం.’’
‘‘ఏం సహాయం?’’
‘‘మీ మిత్రులు ఇద్దరి చేతుల్లోని రివాల్వర్లనించి వెలువడ్డ గుళ్ళవల్ల వాళ్ళు మరణించారు. ఐతే మీరు వాటిని తర్వాత వారి చేతుల్లో ఉంచి, ఒకర్నొకరు కాల్చి చంపుకున్నారనే భ్రమ కలిగించడంలో పెద్ద పొరపాటు చేసారు. ఎవరిని కాల్చిన రివాల్వర్‌ని వారి చేతుల్లో ఉంచారు. అలా కాక ఒకర్ని చంపింది మరొకరి చేతుల్లో ఉంచితే మేము మిమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేపోయే వాళ్ళం. ఎవరి రివాల్వర్‌తోవాళ్ళు ఆత్మహత్యని ఎదురు బొదురుగా నిలబడి ఎందుకు చేసుకుంటారు అని ఆలోచించాం.’’
ఏడంకి వెంటనే తన పొరపాటు అర్ధమైంది. కానీ అది తనని ఎలా పట్టిస్తోంది?
‘‘వాళ్ళిద్దరితో గత వారంగా ఎవరు సన్నిహితంగా కలిసారు అని విచారిస్తే, వాళ్ళు తరచువెళ్ళే ఇంపీరియల్ బార్లో నువ్వు అనేకసార్లు కలిసి మంతనాలు జరిపావని తెలిసింది. ఆ కిడ్నాప్‌లోని మూడో వ్యక్తి నువ్వేనని తెలిసాక ఆ డబ్బు ఎక్కడ ఉందో కూడా తెలిసింది.’’ ఏండర్సన్ కఠినంగా చెప్పాడు.
‘‘అది అబద్ధం. నేను, వాళ్ళు పూర్వం ఒకే జైల్లో గడిపాం కాబట్టి పరిచయం. నేనా బార్‌కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నాకు అక్కడ తటస్థపడితే సాధారణ విషయాలు మాత్రమే మాట్లాడాను.’’ ఏడం చెప్పాడు.
సార్జెంట్ షైవర్స్ అతని ఇల్లువెదికే సెర్చ్ వారెంట్‌ని చూపించి చెప్పాడు.
‘‘ఆ ఏభైవేల డాలర్లు ఇక్కడ దొరికితే మేం ఊహించింది ఋజువవుతుంది.’’
వెంటనే ఏడం మొహం పాలిపోయింది. అతని కాళ్ళు, చేతులు వణకసాగాయి. ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఏడం ఇంటిని వెతకడం ఆరంభించాం. ఏడం బయటకి చూస్తే గుమ్మందగ్గర కాపలాగా ఉన్న మరో ఇద్దరు పోలీసులు కనిపించారు.
*
(డబ్ల్యు షెర్‌వుడ్ హార్ట్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి