క్రైమ్/లీగల్

రూ. 5లక్షల పరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 12: హత్య కేసులో పెరోల్‌పై విడుదలైన దోషికి బదులుగా మరొకరిని అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగానికి చివాట్లు పెడుతూ అమాయక వ్యక్తిని జైలులో పెట్టిన నేరానికి ఐదు లక్షల రూపాయిల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకొంది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన హుసన్ (68)ను అకారణంగా నాలుగు నెలల పాటు జైలులో నిర్బంధంలో ఉంచారంటూ ఆయన కుమారుడు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాడు. పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌సీ శర్మ, శైలేంద్ర శుక్లాల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. హత్యకేసులో దోషిగా నిర్దారించిన హుస్నా అనే వ్యక్తిని పెరోల్‌పై విడుదల చేశారు. అయితే, పెరోల్‌పై ఉన్న హుస్నా 2016 సంవత్సరం సెప్టెంబర్ పదో తేదీన చనిపోయాడు. పెరోల్ గడువు ముగిసినప్పటికీ హుస్నా ఎంతకూ తిరిగి రాకపోవడంతో సంబంధిత యంత్రాంగం సదరు వ్యక్తిని అరెస్టు చేసి తీసుకురావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో హుసన్, హస్నా పేర్లతో తికమక పడిన సదరు పోలీసు యంత్రాంగం చనిపోయిన హుస్నా స్థానంలో హుసన్‌ను 2019 సంవత్సరం అక్టోబర్ 18న బలవంతంగా జైలులో పెట్టారు. తాను అమాయకుడిననీ.. హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంతగా మొత్తుకున్నా ఎవరూ అతని మాట వినలేదు. నువ్వే దోషివి అంటూ మూర్ఖంగా తీసుకెళ్లి జైలులో ఉంచారు. దీంతో హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని 68ఏళ్ల హుసన్ బలవంతంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నేపథ్యంలో హుసన్ కుమారుడు తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో ఉంచారంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదాల అనంతరం పోలీసులు అత్యుత్సాహంతో చనిపోయిన హుస్నాకు బదులుగా హుసన్‌ను అరెస్టు చేశారని రుజువైంది. దీంతో అక్రమంగా నాలుగు నెలల పాటు జైలు ఉంచినందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హుసన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయిల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా గర్హిస్తూ సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.