క్రైమ్ కథ

ఆమె ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి కారు హెడ్‌లైట్ల కాంతిలో నాకు రోడ్డు మధ్య ఓ ఆకారం కనిపించడంతో కారు వేగాన్ని బాగా తగ్గించాను. దగ్గరికి వెళ్లాక అది స్ర్తి ఆకారం అని అర్థమైంది. ఆమె సన్నగా ఉంది. దుస్తులు చిరిగి చిందరవందరగా ఉన్నాయి. అది నన్ను దోచుకోడానికి దొంగలు నా కారుని ఆపడానికి వేసిన ఎత్తని అనిపించింది.
‘దయచేసి సహాయం చేయండి’ ఆమె కోరింది.
నా కుడి చెయ్యి నా రివాల్వర్ మీద ఉంది. ఏ క్షణంలోనైనా ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏ పొదల చాటు నించో నా దగ్గరికి రావచ్చని అప్రమత్తంగా అటు, ఇటు చూశాను. పొదల్లో ఎలాంటి కదలికలూ లేవు. ఆమె ఒంటరిగానే ఉందని అనుకున్నాను.
‘ఇంత నిర్మానుష్యమైన రోడ్ మీదకి నువ్వు ఎలా వచ్చావు?’ అడిగాను.
ఆమె నా దగ్గరికి నడిచింది. ఆమె మొహం మీది గాయాలని చూసాను.
‘నన్ను బలాత్కరించారు. మిస్టర్ మేన్ లారింగ్‌ని వాళ్లు చంపేసారు అనుకుంటాను’ ఆమె బలహీనంగా వణికే కంఠంతో చెప్పింది.
‘ఇదంతా ఎక్కడ జరిగింది?’ ఆ పేరు విన్నాక ఆమెని అడిగాను.
ఆమె చేత్తో రోడ్డుకి ఎడమవైపున్న చెట్ల వంక చేత్తో చూపించింది.
‘ఎంత దూరం?’ ప్రశ్నించాను.
‘సరిగ్గా చెప్పలేను. నేను వాళ్ల నించి తప్పించుకుని నడిచి వస్తున్నాను. ఓ చెక్క కేబిన్ దగ్గర ఇదంతా జరిగింది. దారిలో ఓ పాడైన విండ్‌మిల్ కనిపించింది.’
‘మిస్టర్ మేన్ లేరింగ్ ఎవరు?’ అడిగాను.
‘నా బాస్’
ఆమె చెప్పిందాంట్లో కొంత నిజం ఉందని అనుకున్నాను. అరగంట క్రితం నేను ఆ చెక్క కేబిన్ దగ్గరికి వెళ్లాను. దాని బయట ఉన్న మెయిల్ బాక్స్‌కి ఉన్న జెండా పైకి లేచి ఉంటే నేను ఆగి నా దగ్గరున్న పాకెట్‌ని అతనికి ఇచ్చి ఇంకో పాకెట్‌ని తీసుకోవాల్సి ఉంది. కాని జెండా కిందకి ఉంది. ఏదో జరిగిందని అనుమానించి నేను ఆ కేబిన్ ముందు కారుని ఆపలేదు.
‘అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు?’ అడిగాను.
‘మేన్ లేరింగ్, నేను మెంఫిస్ నించి వచ్చాం. మేము హై వేలోంచి ఓ చిన్న రోడ్లోకి అనుకోకుండా వెళ్లాం. మళ్లీ హై వేకి దారి తెలీలేదు. దగ్గరలో ఊరు కాని, మోటెల్ కాని రాత్రి తలదాచుకోడానికి కనపడలేదు. ఆ చెక్క కేబిన్, అందులోంచి వెలుగు కనిపించడంతో హై వేకి దారి అడగాలని అతను అక్కడ కారు ఆపాడు.’
‘తర్వాత?’ నేను కారు దిగుతూ అడిగాను.
‘ఇద్దరు మగాళ్లు మా కారు దగ్గరికి వచ్చి నన్ను కిందకి లాగారు. నేను ప్రతిఘటించడంతో నా బట్టలు ఇలా అయ్యాయి. మేన్ లేరింగ్ ఆ ఇద్దరిలోని ఒకర్ని కొట్టాడు. రెండో అతను రివాల్వర్ పిడితో ఆయన నెత్తి మీద బాదగానే మేన్ లేరింగ్ గట్టిగా అరిచి.. నేల కూలిపోయాడు’ దుఃఖంగా చెప్పింది.
ఆమెని చూస్తే ఒప్పుకోకపోతే బలాత్కరించాలని ఏ మగాడికైనా అనిపిస్తుందని నాకు అనిపించింది. ఏం చేయాలో నిర్ణయించుకోలేక పోయాను. ఆమె చలికి వణుకుతూంటే నా ఓవర్ కోట్‌ని తొడుక్కోడానికి ఇచ్చాను. ఆమె అబద్ధం ఆడుతోందని నాకు అనిపించింది. ఐనా కష్టంలో ఉన్న ఓ అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన రోడ్ మీద వదిలి వెళ్లాలని ఏ మగాడికీ అనిపించదు. నేను కారు తలుపు తెరచి చెప్పాను.
‘ఎక్కు. నువ్వు ఎలా తప్పించుకున్నావు?’
‘తర్వాత వాళ్లు కేబిన్‌లోకి వెళ్లి తాగడం ఆరంభించారు. నన్ను పట్టించుకోలేదు’
నేను కారుని కేబిన్ వైపు పోనించాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో అర్థం కాగానే ఆమె భయంగా చూస్తూ అడిగింది.
‘ఎక్కడికి వెళ్తున్నాం?’
‘నీ బాస్ ఎలా ఉన్నాడో చూడ్డానికి. ఆయన్ని ఎక్కించుకుని తీసుకెళ్లడానికి’
‘వద్దు’
‘మీ బాస్‌ని రక్షించద్దా?’
‘ఆయన పోయాడు. ఇంక రక్షించడానికి ఏం ఉంది? దయచేసి మళ్లీ మనం అక్కడికి వెళ్లద్దు’
‘వెళ్లకపోవడానికి ఓ సబబైన కారణం చెప్పు’ అడిగాను.
‘మన ప్రాణాలు’
‘ఆ కారణంతో నన్ను మోసం చేయలేవు’
‘నన్ను దగ్గర్లోని ఏదైనా ఊరుకి తీసుకెళ్లండి. ఏ ఊరికైనా సరే. కాని ఆ కేబిన్ దగ్గరికి మాత్రం ఒద్దు. వాళ్లు దుర్మార్గులు’ భయంగా చెప్పింది.
‘దగ్గరలోని ఊరు బెర్రీవిల్. అది ఆపోజిట్ డైరెక్షన్‌లో ముప్పై మైళ్ల దూరంలో ఉంది. నిన్ను తప్పక అక్కడ డ్రాప్ చేస్తాను. కాని ముందుగా నీ బాస్ ఎలా ఉన్నాడో చూడాలి’
ఆమె ప్రపంచం ముణిగిపోయినట్లుగా సీట్లో వెనక్కి జారగిలబడింది. కాసేపాగి అడిగింది.
‘ఆ కేబిన్ దగ్గరికి వెళ్లాలని ఎందుకు అంత గట్టిగా అనుకుంటున్నారు?’
నేను అసలు కారణం చెప్పదలచుకోలేదు.
‘మీ కారు దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ నించి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లచ్చు. లేదా నా కార్లో దింపుతాను.’
‘నేనా కారు కోసం వెదికాను. అది కనపడలేదు’
‘డ్రింక్స్ తేవడానికి మూడో వాడు అందులో వెళ్లాడా?’
‘అయుండచ్చు’ ఆమె చెప్పింది అబద్ధం అని. అది నేను గ్రహించానని ఆమెకి అర్థమైంది.
‘నువ్వు, మీ బాస్ మెంఫిస్ నించి కార్లో వచ్చారు. ఈ చిన్న రోడ్లోకి పొరపాటున తిరిగారు. చివరికి మీరు తప్పిపోయారని గ్రహించారు. మీరా కేబిన్‌ని, అందులోని లైట్లని చూశారు. మేన్ లేరింగ్ దారి కనుక్కోడానికి ఆ కేబిన్‌లోకి వెళ్లాడు. అవునా?’
‘అవును’
‘ఇద్దరు మగాళ్లు బయటకి వచ్చారు. వాళ్లు నిన్ను బయటకి లాగి ఆ కేబిల్‌లోకి తీసుకెళ్లారు. మేన్ లేరింగ్ అడ్డుపడితే అతని తల పగలగొట్టారు. అవునా?’
‘అవును... అవును.. నేను వాళ్లని ప్రతిఘటించాను’
ఆమె వణికిపోతోంది. అది నిజం కాకపోతే ఆమె గొప్ప నటి.
‘తర్వాత వాళ్లు మళ్లీ తాగుతూంటే నువ్వు తప్పించుకుని ఈ పొగమంచులో రోడ్ మీదకి దారి వెదుక్కుని వచ్చావు’
‘అవును’
అది అబద్ధం. ఎవరో వదిలేసిన ఆ చెక్క కేబిన్‌లో నిక్ జేమ్స్, మేన్ లేరింగ్ కలుసుకుని, ఇద్దరూ బ్రీఫ్ కేస్‌లని మార్చుకోవాలి. నేను, అతను!
కాని దాని బయట ఉన్న మెయిల్ బాక్స్ జెండా ఎత్తి ఉంటే, అంతా సరిగ్గా ఉన్నట్లు. లేదా లేదు. ఎత్తి ఉంటే ఆ కేబిన్‌లో అతన్ని కలిసి క్షణాల్లో పని పూర్తి చేసుకుని, ఎలాంటి ప్రశ్నలు, మాటలు లేకుండా ఎవరి దారిన వాళ్లం వెళ్లాలి. ఈ వ్యాపారంలో ఆసక్తి ఉండకూడదు. ఆజ్ఞలని గుడ్డిగా పాటించాలి.
నిక్ కన్నా ముందు వచ్చే మేన్ లేరింగ్ మెయిల్ బాక్స్ జెండాని ఎందుకు ఎత్తలేదు? దానికి, ఈమెకీ ఏమైనా సంబంధం ఉందా? ఏదో మోసం జరిగింది. అందులో ఈమె పాత్ర కూడా ఉంది.
ఆ కేబిన్‌లో ఇద్దరు మగాళ్లున్నారన్న కథని నేను నమ్మలేదు. ఇందాక నేను ఆ కేబిన్ ముందు నించి డ్రైవ్ చేస్తూంటే అంతా ప్రశాంతంగా కనిపించింది. కాని ఎవరో ఈమెని ఏదో చేసారు. ఎవరో గోళ్లతో ఈమెని రక్కారు. దెబ్బలు కూడా తగిలాయి. అందుకే కుడికన్ను వాచింది.
‘దయచేసి కారుని వెనక్కి తిప్పండి. అక్కడికి వెళ్లద్దు’ ఆమె నా చేతిని పట్టుకుని అర్థించింది.
నేను కారు ఆపి ఆమె వైపు తిరిగి చెప్పాను.
‘ఇక నాటకాలు ఆపు. ఆ కేబిన్‌లో నువ్వు, మేన్ లేరింగ్ తప్ప ఇంకెవరైనా ఉన్నారంటే నేను నమ్మను. ఎందుకో మీరు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. బహుశా అతను నిన్ను కోరి ఉంటాడు. నువ్వు నిరాకరించి ఉంటావు. దాంతో అతను నిన్ను బలవంతం చేసాడు. నువ్వు అతని రివాల్వర్‌ని తీసుకుని అతన్ని కాల్చి చంపావు’
‘ఏమిటి మీరనేది?’
‘మేన్ లేరింగ్ మరణించి ఉంటే అతన్ని చంపింది నువ్వే. అందుకని అక్కడికి వద్దని చెప్తున్నావు’
ఆమె సన్నగా నవ్వి చెప్పింది.
‘మీరు అతని శవాన్ని తప్పక చూస్తారు. కాని నేను ఆ హత్య చేసానని మీరు ఆధారాలతో నిరూపించలేరు’
‘అది నీ పనే. ఎందుకు? అతను బ్రీఫ్‌కేస్‌లో ఏం తెచ్చాడు?’ అడిగాను.
ఆమెలో కోపంతోపాటు జాగ్రత్త ప్రవేశించింది. నా వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
‘మీరేమంటున్నారు?’
‘నువ్వు మేన్ లేరింగ్‌తో మెంఫిస్ నించి కార్లో ఆ కేబిన్‌కి వచ్చి ఉంటే అతను అక్కడ ఇంకొకర్ని కలుస్తాడని నీకు తెలిసే ఉండాలి’
‘ఎవర్ని కలవడానికి?’
‘నన్ను. అతను కావల్సింది. బ్రీఫ్‌కేస్‌లని మార్చుకోవాల్సింది నాతోనే’
‘నా బాస్ అంత దూరం నించి ఇంత నిర్మానుష్య ప్రదేశానికి మిమ్మల్ని కలవడానికి ఎందుకు వస్తాడు?’ అడిగింది.
‘నా బ్రీఫ్‌కేస్‌లో అతనికి కావాల్సింది, అతని బ్రీఫ్‌కేస్‌లో నాకు కావాల్సింది ఉండి ఉండచ్చు’
‘ఏమిటది?’
‘ఏదో వస్తువు. నాకు తెలీదు’
‘మీ బ్రీఫ్‌కేస్‌ని తెరచి అదేమిటో చూడచ్చుగా?’
ఆమె చూడకపోయినా నా దగ్గర ఓ బ్రీఫ్‌కేస్ ఉందని ఆమె ఊహించిందని గ్రహించాను.
అకస్మాత్తుగా నా తల మీద బరువైన వస్తువుతో పెద్ద దెబ్బ పడింది. కొద్ది క్షణాల్లో నా కారు రోడ్ దిగి పల్లంలోకి బోల్తాకొడుతుంది అన్నది నా ఆఖరి ఆలోచన. ఆమె కారు స్టీరింగ్ వీల్‌ని తిప్పడం ఒక్కటే నాకు తెలుసు.
నాకు స్పృహ వచ్చేసరికి ఆమె కార్లో నా పక్కన లేదు. అది ఓ చెట్టుకి గుద్దుకుని పల్లంలోకి పడకుండా ఆగి ఉంది. మెకానిక్ స్పర్శ తగిలితే కాని ఇక ఆ కారు కదలదని దాని ఇంజన్‌ని చూసి నాకు అనిపించింది. నేను కార్లోంచి బయటకి పాకాను. నా ఎముకలేం విరగనందుకు చాలా సంతోషించాను.
ఆమె నా తల మీద ఏదో బరువైన వస్తువుతో మోదింది. అది రివాల్వర్ అని ఇట్టే గ్రహించాను. మేన్ లేరింగ్‌ని చంపిన రివాల్వరే. కొద్ది దూరం నడిచాక మొద్దుబారిన నా మెదడు తేరుకుంది. కేబిన్ వైపు వెళ్తూంటే ఓ మూలుగు వినిపించింది. అటు వెళ్లి చూస్తే కుడి భుజానికి, ఛాతీకి మధ్య గాయమైన ఓ వ్యక్తి కనిపించాడు.
‘మీరు మేన్ లేరింగా?’ ప్రశ్నించాను.
‘అవును’ బలహీనంగా చెప్పాడు.
‘నేను నిక్‌ని. ఈ కేబిన్‌లో మిమ్మల్ని కలవాల్సిన నిక్‌ని. ఆ కేబిన్‌లో ఇద్దరు మగాళ్లని చూసారా?’
‘లేదు. కాని ఆమె.. లిఫ్ట్ అడిగితే..’
‘నీలం డ్రస్‌లోని ఆమేనా?’
‘అవును. ఆమె నా బ్రీఫ్‌కేస్‌ని దొంగిలించింది’
‘ఆమెని నేను పికప్ చేసాను. ఆమె దగ్గర అది లేదు’ చెప్పాను.
‘ఆమె నా బ్రీఫ్‌కేస్‌ని దొంగతనంగా తెరుస్తూంటే పట్టుకున్నాను. ఇద్దరం పోరాడాం. రివాల్వర్‌తో.. కాల్చింది’
అతను రక్తస్రావంతో నా కళ్ల ముందే మరణించాడు.
ఆమె దగ్గర రివాల్వర్, బ్రీఫ్‌కేస్ ఉన్నాయి. మరి అవి ఏవి? ఏం చేసింది? అతను బ్రీఫ్‌కేస్‌లో తెచ్చిన డబ్బుని ఏం చేసింది? ఆమె బట్టలు అలా అవడానికి కారణం బలాత్కారం కాదు. దొంగతనాన్ని ఆపే ప్రయత్నం.
నాకు గురి పెట్టబడ్డ రివాల్వర్ కదికలు లేక స్థిరంగా ఉంది.
‘ఇప్పుడు అంతా అర్థమైందా? మేన్ లేరింగ్‌కి నువ్వు చెప్పినట్లుగా నువ్వు నిక్‌వి కావు. నేను నిక్ మాజీ భార్యని. నిక్ ఐదు లక్షల డాలర్ల డ్రగ్స్, మేన్ లేరింగ్ అంతే విలువైన కేష్‌తో ఇక్కడ కలుస్తున్నారని తెలిసింది. ఇక్కడికి నలభై మైళ్ల దూరంలో మేన్‌ని కలిసి లిఫ్ట్ అడిగాను. నేను లిఫ్ట్ అడిగితే ఇవ్వని మగాడే ఈ ప్రపంచంలో లేరు. నిక్ మాఫియాని మోసం చేయడానికి భయపడతాడు కాని నాకా భయం లేదు.’
‘నువ్వు నిజమైన నేరస్థురాలివి’ చెప్పాను.
రివాల్వర్ గొట్టం నా తల వెనక ఆనింది.
‘నిక్ ఎక్కడ?’ ప్రశ్నించింది.
‘అతని కోసం నన్ను చంపుతావా?’
‘తప్పదు’
‘అతను జైల్లో ఉన్నాడు’
‘ఐతే నువ్వు ఏంటి - నార్కోటిక్ స్క్వేడ్‌కి చెందిన వాడివి అన్నమాట’
‘డబ్బు ఎక్కడ దాచావు?’ అడిగాను.
‘ఆ చెట్టు కింద తవ్వి.. అంతా చల్లారాక తీసుకుందామని.’
నేను నా తలని ముందుకి వంచి బలంగా వెనక్కి మోదాను. తక్షణం పక్కకి పడ్డాను. పేలిన ఆమె రివాల్వర్‌లోని గుండు భూమాతని తాకింది. రెండో గుండు నా కుడి చేతి జబ్బలో గుచ్చుకుంది. ఆ తర్వాత నేను మూడో గుండుని పేల్చనివ్వలేదు. ఆమె మెడని నా ఎడమ చేతి కింద ఉంచి అదమసాగాను. వెంటనే ఆ అందగత్తె ఉపయోగించిన భాష! నిమిషంలోగా ఆమె రివాల్వర్‌ని స్వాధీనం చేసుకుని నా ఎడం జేబులోని రివాల్వర్‌ని బయటకి తీసాక కాని ఆమె లొంగలేదు.
*
(కెప్టెన్ కాంప్ల్రైస్ గ్రోవర్ అండ్ బ్రింక్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి