క్రైమ్/లీగల్

నన్ను ఉరి తీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఉన్నావో కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టులో గురువారం అసాధారణమైన వాదనలు చోటు చేసుకున్నాయి. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ముద్దాయిగా ఉన్నారు. 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి పోలీసులు కస్టడీలో చనిపోయాడు. కేసు విచారించిన కోర్టు సెంగార్‌కు జీవించే వరకూ యావజ్జీవ కారాగారం విధిస్తూ గత ఏడాది డిసెంబర్ 20 కోర్టు తీర్పును ఇచ్చింది. 2017లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసులోనూ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మొదటి కేసుకు సంబంధించి గురువారం జిల్లా కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. దోషి సెంగార్ తన వాదన వినిపిస్తూ బాధితురాలి తండ్రి మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను తప్పుచేసినట్టు రుజువైతే ఉరి తీయాలని, తన కళ్లలో యాసిడ్ పోయాలంటూ బీజేపీ నేత ఉద్వేగానికి గురయ్యాడు. ‘నాకు న్యాయమైనా చేయండి, లేదా ఉరి తీయండి. నేను తప్పుచేసినట్టు రుజువైతే నా కళ్లలో యాసిడ్ పోయండి’అని జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎదుట వాదించాడు. సెంగార్‌తోపాటు ఏడుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. న్యాయమూర్తి శర్మ మాట్లాడుతూ ‘సెంగార్‌పై సాక్ష్యాధారాలు ఉన్నందునే కోర్టు దోషిగా తేల్చింది. తన ప్రమేయం లేదని అతడు చేస్తున్న వాదన సరైందికాదు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు సెంగార్ అక్కడి అధికారులతో ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలున్నాయి’అని అన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలున్నారని, వారు కూడా తన విడుదలకు న్యాయమూర్తిని అభ్యర్థించారని సెంగార్ చెప్పుకొచ్చాడు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీకు కుటుంబం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. నేరం ఎలా చేయాలో మీకు తెలుసు. దాని కోసం చట్టాలను ఎలా అతిక్రమించాలో తెలుసు. ఇప్పుడేమో నాకేమీ తెలియదని అంటున్నావు’అని పేర్కొన్నారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్, సహ ముద్దాయిలకు గరిష్టంగా శిక్ష విధించాలని సీబీఐ కోరింది. దోషుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. మఖి పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అశోక్ సింగ్ బహదూరియా, ఎస్సై కేపీ సింగ్‌ను కోర్టు ముద్దాయిలుగా ప్రకటించి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులన్న తరువాత ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుందని అయితే ఇద్దరు పోలీసు అధికారులు శాంతి భద్రతలు పరిరక్షించడంలో, బాధితురాలి తండ్రికి సకాలంలో వైద్యం చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని సీబీఐ న్యాయవాది తెలిపారు. ఈ కేసులో శుక్రవారం కూడా కోర్టులో వాదనలు జరుగుతాయి. మార్చి 4న బీజేపీ నేత సెంగార్, మరో ఏడుగుర్ని కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సెంగార్ చెప్పాడు. సెంగార్, బహదూరియా, సింగ్, వినీత్ మిశ్రా, బీరేంద్రసింగ్, శశి ప్రతాప్ సింగ్, సుమన్ సింగ్, అతుల్(సెంగార్ సోదరుడు)ను కోర్టు దోషులుగా తీర్పునిచ్చింది. కానిస్టేబుల్ అమిర్‌ఖాన్, శైలేంద్ర సింగ్, రామ్‌శరణ్ సింగ్, శరద్‌వీర్ సింగ్‌ను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అత్యాచార బాధితురాలి మామ, తల్లి, సోదరి, తండ్రి స్నేహితుడి నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. తానే ప్రత్యక్ష సాక్షినని ఆమె తండ్రి స్నేహితుడు కోర్టుకు తెలిపాడు.