క్రైమ్ కథ

ఇచ్ఛా మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏభై వేల డాలర్లు ఇస్తారా? దేనికి?’ సెలబ్ తల మీద గోక్కుని అడిగాడు.
‘అవును. ఏభై వేల డాలర్లు! నన్ను చంపడానికి. నీకు అది సమ్మతమేనా?’ అడిగాను.
‘ఆ.. కాని చంపాక మరణశిక్ష పడితే అప్పుడు డబ్బేం చేయను?’ సెలబ్ మళ్లీ తల గోక్కుని ప్రశ్నించాడు.
‘నేను మూర్ఖుడ్ని కాను. నీకు మరణశిక్ష పడదు. అసలు నీకు శిక్షే పడదు’
‘మిమ్మల్ని ఎవరు చంపారో ఎవరికీ తెలీకుండా చంపాలా?’
‘అంతా చూస్తూండగా బాహాటంగా చంపాలి’ కోరాను.
‘అప్పుడు సాక్షులు నాకు వ్యితిరేకంగా సాక్ష్యం చెప్పరా?’ సెలబ్ అనుమానంగా ప్రశ్నించాడు.
‘ఊహు. ఆత్మరక్షణకి చంపడం నేరం కాదు. కేసు విచారణ దాకా కూడా వెళ్లకపోవచ్చు. పోలీసులు ఛార్జ్‌షీట్ కూడా ఫైల్ చేయరు.’
‘అసలు ఎందుకు చంపడం?’
‘వారం క్రితం డాక్టర్ నేను ఇంక రెండు నెలలు మించి బతకనని, నాకు కేన్సర్ అని చెప్పాడు. ఆఖరి నెలన్నర బాగా బాధ అనుభవిస్తానని చెప్పాడు.’
‘వెరీ సారీ’
చిన్నగా నిట్టూర్చాను.
‘నా చెల్లెలు బెస్సీ నా తర్వాత రోడ్డున పడకూడదని. ఇంకో ఆర్నెల్లల్లో అది మేజర్ అవుతుంది. అయ్యాక దానికి పదిహేను లక్షల డాలర్ల ఇన్సూరెన్స్ సొమ్ము వస్తుంది. బెస్సీ బెనిఫిషరీగా నేను రెండేళ్ల క్రితం ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అది ఇంత త్వరగా పనికొస్తుందని నేను ఎదురుచూడలేదు.’
‘కాని హత్య చేయడం దేనికి? ఎటూ పోతారుగా?’
‘ఆఖరి దశలో శారీరక బాధ వద్దనుకున్నాను. నలభై ఐదు రోజులు బాధపడి మరణించే కంటే ఇప్పుడే పోతే తేడా ఏముంటుంది?’
‘ఆత్మహత్య చేసుకోవచ్చుగా?’ సెలబ్ అడిగాడు.
‘ఆ పాలసీలో ఆత్మహత్య చేసుకున్నా, పాలసీ తీసుకున్న ఏడాదిలో పోయినా డబ్బేమీ రాదు. కాబట్టి ఆత్మహత్య కుదరదు. ఇక మిగిలింది హత్య, లేదా ప్రమాదం. ప్రమాదంలో మరణిస్తే దాన్ని వాళ్లు ఆత్మహత్యగా అనుమానిస్తే బెస్సీకి వాళ్లతో పోరాడి ఆ డబ్బుని రాబట్టుకునే సమర్థత లేదు. కాబట్టి హత్య ఒక్కటే నాకు మిగిలిన దారి. ఎవరికీ నా మీద నన్ను చంపేంత ద్వేషం లేదు. హత్యలన్నీ డిటెక్టివ్ కథలకే పరిమితం. అందుకని నన్ను ఎవరైనా చంపాలని అనుకున్నాను. అందుకు నిన్ను ఎన్నుకున్నాను. దయచేసి నన్ను చంపు సెలబ్. చంపే రోజు నీకు ఏభై వేల డాలర్లు ఇస్తాను’ అర్థించాను.
‘మిమ్మల్ని చంపేంత ద్వేషం మీ మీద నాకు లేదు. కాబట్టి మిమ్మల్ని చంపితే నాకు పిచ్చి అనుకుంటారు. మనం ఎన్నడూ ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదు కూడా. మీరు చెప్పిందంతా చెప్తే మీకు అసలుకే మోసం వస్తుంది’ సెలబ్ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు.
‘నిజమే. దానికీ దారి ఆలోచించాను. మనిద్దరం అందరికీ తెలిసేలా పోట్లాడుకుందాం. ఏ విషయం మీద ఆలోచించి చెప్తాను. చివరకి ఓ రోజు నువ్వు నాకు ఎంత కోపం తెప్పిస్తావంటే నిన్ను చంపడానికి మీ ఇంటికి వచ్చి, నిన్ను బయటకి రమ్మని అరిచి రెండుసార్లు కాల్పులు జరుపుతాను. అవి నీ పక్కన గోడలో దిగుతాయి. వెంటనే ఆత్మరక్షణ కోసం నువ్వు నన్ను చంపుతావు’
సెలబ్ కొద్దిసేపు సీరియస్‌గా ఆలోచించి చెప్పాడు.
‘నన్ను చంపేంత ద్వేషం మీకు నా మీద ఉందని సాక్షులు నమ్మితే మీరన్నట్లు పోలీసులు నా మీద కేసు పెట్టరు. ఆ పథకం కూడా మీరు నాకు చెప్పాక ఏ సంగతీ చెప్తాను.’
అతను సగం అంగీకరించాడని అనుకున్నాను. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాను.
‘్థంక్స్ సెలబ్. మరో నాలుగైదు రోజుల్లో అది చెప్తాను’
‘ఇదంతా బెస్సీకి తెలుసా?’ అతను అడిగాడు.
‘లేదు. తనకి ఉన్నది నేనే కాబట్టి తెలిస్తే ఒప్పుకోదు. నువ్వూ చెప్పక’
‘కాని బెస్సీ నన్ను జీవితాంతం దుర్మార్గుడిగా భావించచ్చు. నన్ను పెళ్లి చేసుకోక పోవచ్చు కూడా’ సెలబ్ అయిష్టంగా చెప్పాడు.
‘నేను మన ఒప్పందం గురించి ఓ ఉత్తరం రాసి నీకు ఇస్తాను. పోలీస్ వ్యవహారం పూరె్తై ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చాక దాన్ని ఓ రోజు బెస్సీకి చూపించు. అందులో నేను నిన్ను పెళ్లి చేసుకోమని కూడా బెస్సీకి సూచిస్తాను. ఇంతదాకా ఆమె నా మాటని ఎన్నడూ కాదనలేదు.’
సెలబ్ మొహం వికసించడం గమనించాను.
‘మంచిది. అప్పటిదాకా బెస్సీ నన్ను దుర్మార్గుడిగా భావించడం నాకు బాధగా ఉంటుంది’ చెప్పాడు.
‘నువ్వు బెస్సీని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కాని ఆమె ఇంకా నీతో ప్రేమలో పడలేదు. నా ఉత్తరం చూశాక నువ్వు చేసిన త్యాగానికి నీతో ప్రేమలో పడుతుంది. నువ్వు చేసేది కూడా ప్రమాదంతో కూడిన పనే కదా?’
‘నేను మీకీ సహాయం చేస్తాను’
‘నీకు ఇంకో ఉపకారం కూడా చేస్తున్నాను. ఇందుకు నీకు ఏభై వేల డాలర్లు ఇస్తున్న సంగతి ఆ ఉత్తరంలో రాయను. అందువల్ల నీ మీద గౌరవం పెరుగుతుంది. లేదా నిన్ను కిరాయి హంతకుడిగా జమ కట్టే అవకాశం ఉంది.’
‘మీకు మీ చెల్లెలు బెస్సీ మీద ఉన్న ప్రేమకన్నా ఆమెకి మీ మీద ఉన్న ప్రేమ ఎంతో ఎక్కువ.’
‘అవును. అది అందరికీ తెలుసు. కారణం మా తల్లిదండ్రులు ఆ విమాన ప్రమాదంలో పోయాక నేను బెస్సీని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచుతున్నాను. నాకు ఒకటే బాధ. దాంతో గడిపే అవకాశం నలభై ఐదు రోజుల ముందుగానే పోతోంది. కాని అది దాని మంచి కోసమే కాబట్టి బాధని భరించగలను. లేదా డబ్బు లేని బెస్సీ చదువు ఆపేసి, జీవితాంతం చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది’ చెప్పాను.
* * *
వారాంతపు పార్టీలో సెలబ్ బెస్సీతో కలిసి నృత్యం చేస్తూండగా నేను వెళ్లి అతని వీపు మీద బలంగా తట్టాను. అతను గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు.
‘బెస్సీకి ఇతరులతో కూడా నృత్యం చేసే అవకాశం ఇవ్వమని చెప్పానా? లేదా?’ అంతా వినేలా చిరాకు నటిస్తూ చెప్పాను.
‘కాని నేను తప్ప బెస్సీతో ఎవరూ అందుకు ముందుకి వస్తారని అనుకోను’ సెలబ్ ముందుగా మేము అనుకున్నట్లే జవాబు చెప్పాడు.
నేను వెంటనే అతని గడ్డం కింద మోదాను. అతనెళ్లి దూరంగా పడ్డాడు. లేచి అతను నా మీదకి రాబోతూంటే ఇద్దరు అతన్ని పట్టుకుని ఆపారు. బెస్సీ నాతో కోపంగా చెప్పింది.
‘నువ్వు చేసిన పని సరైంది కాదన్నయ్యా’
నేను వౌనంగా బయటకి నడిచాను.
మర్నాడు ఉదయం సెలబ్‌కి ఫోన్ చేసి అడిగాను.
‘మరీ గట్టిగా కొట్టానా?’
‘నా నోట్లోంచి రక్తం కారడం చూడలేదా? కాని ఏభై వేల డాలర్లకి అది భరించదగ్గదే’ నవ్వుతూ చెప్పాడు.
‘మన మధ్య పోట్లాటకి నిన్న నాంది పడింది. ఈ సాయంత్రం తర్వాతి అంకం పూర్తి చేద్దాం’ చెప్పాను.
‘ఏమిటది?’ ఆసక్తిగా అడిగాడు.
* * *
ఆ సాయంత్రం డోర్ బెల్ విని తలుపు తెరిచాను. ఎదురుగా సెలబ్ నిలబడి ఉన్నాడు.
‘మిస్టర్ కార్టర్. నిన్న రాత్రి జరిగింది మర్చిపొమ్మని చెప్పడానికి వచ్చాను’ సెలబ్ నాతో చెప్పాడు.
‘ఐతే క్షమాపణ వేడుకో’ నేను ముందు గదిలోని నా స్నేహితుల వంక చూసి నవ్వుతూ చెప్పాను.
‘ముందుగా నన్ను కొట్టింది మీరు కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. జరిగింది మర్చిపొమ్మని చెప్పడానికి మాత్రమే వచ్చాను’ అతను చెప్పాడు.
‘ఐతే వెళ్లు’ నేను కోపంగా అరిచాను.
‘అదేమిటన్నయ్యా. అతన్ని లోపలకి రానీ’ డోర్ బెల్ విని ముందు గదిలోకి వచ్చి మా సంభాషణ విన్న బెస్సీ చెప్పింది.
‘అతను నాకు క్షమాపణ చెప్పకపోతే లోపలకి రావాల్సిన అవసరం లేదు’
‘కాని ఇది నీ ఇల్లే కాక బెస్సీ ఇల్లు కూడా. ఆమె రమ్మంటే వస్తాను’ సెలబ్ చెప్పాడు.
నేను తక్షణం ఇంట్లోంచి నా రైఫిల్‌ని తెచ్చి ఉగ్రంగా చెప్పాను.
‘ఇందులో గుళ్లున్నాయి. తక్షణం బయటకు నడు. లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు’
ఒకరిద్దరు మిత్రులు లేచి నన్ను పట్టుకుని ఆపారు.
‘ఒదలను. నీ సంగతి చూస్తాను’ వెళ్తున్న సెలబ్ వంక చూస్తూ గట్టిగా అరిచాను.
బెస్సీ గిరుక్కున తిరిగి లోపలకి వెళ్లిపోయింది.
ఆ రాత్రి భోజనాల దగ్గర బెస్సీ నాతో చెప్పింది.
‘నువ్వు నా అన్నయ్యవి మాత్రమే అని గుర్తుంచుకో. నాన్నవి కావు’
నేను బదులుగా నవ్వి ఆమె జుట్టుని ఆప్యాయంగా తడిమాను.
* * *
మర్నాడు ఉదయం షెరీఫ్ వచ్చి నాతో చెప్పాడు.
‘కార్టర్! నువ్వు నీ రైఫిల్‌తో మనుషుల్ని చంపుతానని బెదిరిస్తే దాని లైసెన్స్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు. నిన్ను అరెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది.’
‘ఆ సెలబ్ గాడు నా మీద రిపోర్ట్ ఇచ్చాడా?’ పళ్లు పటపట కొరికి అడిగాను.
‘ఈ కోపం నీకు మంచిది కాదని హెచ్చరించడానికే వచ్చాను. దాన్ని అదుపులో ఉంచుకో’ చెప్పి షెరీఫ్ వెళ్లిపోయాడు.
‘అన్నయ్యా! నువ్వు సెలబ్ మీద కత్తి కట్టక’ షెరీఫ్ వెళ్లాక బెస్సీ నన్ను అర్థించింది.
మొదటిసారిగా బెస్సీ జీవితంలోకి నేనే కాక మరో వ్యక్తి కూడా ప్రవేశించాడని గ్రహించాను.
‘షెరీఫ్ వచ్చాడా?’ మధ్యాహ్నం సెలబ్ నాకు ఫోన్ చేసి అడిగాడు.
‘వచ్చాడు.’
‘అంతా మీ పథకం ప్రకారమే జరుగుతోంది’
‘ఇందువల్ల బెస్సీకి నీకు మద్దతుగా నిలవాలనే ఆసక్తి కలిగింది. అది నీ మీద ప్రేమకి దారి తీయచ్చు. ఇది ఎదురుచూడని లాభం’ చెప్పాను.
* * *
‘నేను నా కుక్కని చంపుతాను’ సెలబ్‌కి చెప్పాను.
‘ఏమిటీ?’ అదిరిపడ్డాడు.
‘అవును. నా పెంపుడు కుక్క గ్రోవర్ని చంపుతాను. కాని అందరికీ అది నీ పనని చెప్తాను’
‘పాపం! దానె్నందుకు చంపడం?’ బాధగా అడిగాడు.
‘దాని వయసు పదమూడు. అంటే మనిషి వయసు డెబ్బై ఒకటికి సమానం. దాని నడక గమనించావా? దానికి కీళ్లనొప్పులు వచ్చాయి. నా తర్వాత బెస్సీకి దాన్ని చూసుకోవడం కష్టం. నేను ఉన్నప్పుడే అది పోతే బెస్సీని ఓదార్చడానికి నేను ఉంటాను’
‘ఐనా అది నాకు నచ్చలేదు’ అయిష్టంగా చెప్పాడు.
‘ఈ రాత్రికి దానికి విషం పెట్టి చంపుతాను. రేపు ఉదయం అది చూసాక ఏడున్నర - ఎనిమిది మధ్య మీ ఇంటికి రైఫిల్‌తో వచ్చి నిన్ను బయటకి పిలుస్తాను. నా రైఫిల్‌ని చూసి నువ్వు కూడా ఆత్మరక్షణకి నీ రివాల్వర్‌ని తెచ్చుకుంటావు. నేను రెండుసార్లు కాల్పులు జరిపాక నువ్వు కూడా నా మీద రెండుసార్లు కాల్పులు జరుపుతావు. నువ్వు రివాల్వర్‌ని గురి చూసి పేల్చడంలో ఛాంపియన్‌వి కాబట్టి నీ గుళ్లు నా ఛాతీలో దిగుతాయి. దాంతో మన ఒప్పందం పూర్తవుతుంది. ఇవాళ రాత్రి మీ ఇంటికి వచ్చి నీ మీద అరుస్తాను. నిజానికి వచ్చేది డబ్బివ్వడానికి. అంతా వినేలా అరిచి వెళ్తాను. మర్నాడు కుక్క చచ్చిపోతే అంతా అది నీ పనే అని అనుకుంటారు.’
సెలబ్ కుక్కని చంపిన నిందని భరించడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
ఆ రాత్రి అతని ఇంటి తలుపు కొట్టాను. అతను తెరిచాడు.
‘బెస్సీ గర్భవతి కాకమునుపే పెళ్లి చెయ్యరాదా? అని అన్నావా?’ అతని పక్కింటి వాళ్లు వినేలా గట్టిగా అరిచాను.
సెలబ్ బుర్ర ఆ పోట్లాటలో నా బుర్రకన్నా చురుగ్గా పని చేసింది.
‘అన్నానేమో? లేదా అనలేదో?’ నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు.
నేను అతనికి డబ్బున్న సంచీని రహస్యంగా ఇచ్చి వెనక్కి తిరగ్గానే అంతా వినేలా అరిచాడు.
‘ఇంకోసారి మీ కుక్క వచ్చి మా కోళ్లని తింటే దాన్ని కాల్చి పారేస్తాను’
‘దాన్ని నువ్వు కాలిస్తే నేను నిన్ను కాల్చడం తథ్యం’ బదులుగా అరిచాను.
అంతా ఇళ్ల బయటకి వచ్చి మా గొడవని ఆసక్తిగా చూశారు. దీని గురించి బెస్సీకి ఎవరో చేరేసారని ఆమె రాత్రి భోజనం దగ్గర ముభావంగా ఉండటంతో గమనించాను.
‘నువ్వు మరోసారి రైఫిల్‌తో గుళ్లు నింపినట్లయితే నేను షెరీఫ్‌కి ఆ రైఫిల్‌ని ఇచ్చేస్తాను’ దుఃఖంగా చెప్పింది.
ఆ రాత్రి గ్రోవర్‌కి పెట్టే మాంసంలో, ఆర్సెనిక్‌ని అది బాధ పడకూడదని హెచ్చు డోసులో కలిపాను.
మర్నాడు ఉదయం బెస్సీ చూసి కుక్క చచ్చిపోయిందని, దానికి విష ప్రయోగం జరిగిందని చెప్పింది. వెటర్నరీ డాక్టర్ గ్రోవర్ని చూసి అది నిర్ధారణ చేశాడు. నేను కోపం నటిస్తూ, రైఫిల్‌ని శుభ్రం చేసి దాంట్లో గుళ్లు నింపాను. తర్వాత గడ్డం గీసుకుని స్నానం చేసాను. నా జీవితంలో అదే ఆఖరి స్నానం అని నాకు తెలుసు. నలభై ఐదు రోజులు బాధతో పోరాడటం కంటే ఈ చావే మంచిదన్న నా నిర్ణయం చెదర్లేదు. అంతే కాదు. బలపడింది కూడా.
ఉరి తీయబోయే వాళ్లు ఆందోళన చెందుతారని చదివాను కాని నాలో అలాంటి ఆందోళన కూడా లేదు. నేను డ్రెస్ చేసుకుని రైఫిల్ కోసం చూస్తే అది లేదు. చూస్తే నా జీప్ కూడా షెడ్‌లో లేదు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. బెస్సీ షెరీఫ్‌కి ఆ రైఫిల్‌ని అందజేయాలని వెళ్లి ఉంటుంది.
కొద్దిసేపటికి బెస్సీ రైఫిల్‌తో ఇంట్లోకి వచ్చింది. ఆమె మొహం అంతగా పాలిపోయి, అంత దీనంగా ఉండటం నేను ఎన్నడూ చూడలేదు.
‘ఏమిటి? ఏం జరిగింది?’ అడిగాను.
‘అన్నా! నువ్వు సెలబ్‌ని చంపడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఇవాళ ఆపలేనని నాకు తెలుసు. గ్రోవర్ నా కుక్క కూడా. అందుకే నీ బదులు నేను ఎలక్ట్రిక్ చెయిర్‌కి వెళ్దామనుకుని...’
పెద్దపెట్టున ఏడ్చే బెస్సీ వంక అయోమయంగా చూస్తూండిపోయాను.
‘అమ్మానాన్నా పోయాక పెంచి పెద్ద చేసిన నీ రుణం తీర్చుకోవాలనే ఆలోచన నాలో ఎప్పటి నించో ఉంది. సెలబ్‌ని నేను చంపేసాను’ బెస్సీ ఏడుస్తూ చెప్పింది.
*
(రిచర్డ్ డెమింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి