క్రైమ్ కథ

పుస్తకాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్‌స్టేట్ హైవేకి ఉత్తరాన అరవై ఏళ్ల క్రితం కట్టిన చవకైన అపార్ట్‌మెంట్లలో అదొకటి. నేను మెట్లెక్కుతూంటే కింద చాక్లెట్ రేపర్స్, ఖాళీ బీర్ టిన్స్ కనిపించాయి. ముప్పై ఐదో నంబర్ అపార్ట్‌మెంట్ బయట ఆగి తలుపు అరంగుళం తెరచి కనపడింది. సరాసరి లోపలకి వెళ్లకుండా ఎవరైనా వస్తారని బెల్ నొక్కాను. కాని రాలేదు. మరోసారి బెల్ కొట్టినా ప్రయోజనం లేకపోయింది. నేను తలుపుని తోసి అడిగాను.
‘హలో ఎవరైనా ఉన్నారా? మిస్టర్ హేట్‌ఫీల్డ్?’
సమాధానం లేదు.
నేను చేయకూడని పని చేశాను. లోపలకి వెళ్లి మూసి ఉన్న రెండు తలుపుల్లోని కుడి తలుపుని తెరిస్తే లివింగ్ రూంలోని హేట్‌ఫీల్డ్ కనిపించాడు. కనిపించిన వ్యక్తి అతనే అనుకున్నాను. అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు. తెల్ల జుట్టు, బట్టతల గల అతను నీలంరంగు సూట్‌లో ఉన్నాడు. వెలిసిపోయిన కార్పెట్ మీద వెల్లకిలా పడి ఉన్నాడు. రక్తం కనిపించకపోవటంతో హార్ట్ ఎటాక్ అనుకున్నాను.
నేను వంగుని అతని మెడ నరం మీద చేతిని వేసి పల్స్ కోసం చూస్తూంటే అతని తల పగిలి ఉండటం, ఆట్టే రక్తం కారకపోవడం గమనించాను. నాకు భయం వేసింది. చుట్టూ చూస్తే కార్పెట్‌కి ఉన్న రంధ్రంలో హేట్‌ఫీల్డ్ బొటనవేలు, పక్కనే బలమైన ఓక్ బల్ల కనిపించాయి. అతని తల ఆ బల్లకి తాకి కిందపడి పోయాడని గ్రహించాను.
ఆ బల్ల కింద క్రితం రోజు దినపత్రికతోపాటు పబ్లిక్ లైబ్రరీ పుస్తకం ‘ది సౌండ్ ఆఫ్ సింగింగ్’ కనిపించింది. నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. నేను కూడా ఓ రకంగా పోలీస్‌నే. ఐతే నేను ఆయుధాన్ని దగ్గర ఉంచుకోను. నేను అరెస్ట్ చేసేప్పుడు సాధారణంగా ఎవరూ తిరగబడరు. పోలీస్ శాఖ లోంచి రిటైరయ్యాక నేను పబ్లిక్ లైబ్రరీకి రావాల్సిన పుస్తకాలని స్వాధీనం చేసుకునే ఉద్యోగంలో చేరాను. అవును. నేను లైబ్రరీ డిటెక్టివ్‌ని. దొంగిలించబడ్డ లేదా కాలపరిమితి దాటి వెనక్కి రాని పుస్తకాలని నేను వేటాడుతాను.
ఆ సోమవారం హేట్‌ఫీల్డ్ పేరు, అడ్రస్‌తోపాటు పుస్తకాలు తిరిగి ఇవ్వని మరి కొందరి జాబితా నా దగ్గర ఉంది. వారిలో కొందరు పుస్తక ప్రియులు. వాటిని తిరిగి ఇవ్వరు. కొందరు మతిమరుపుతో ఇవ్వరు. ఫైన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని సేకరించడానికి నేను వెళ్తూంటాను.
నిన్న నా జాబితాలోని మొదటి పేరు మిసెస్ విలియం కానే్వ. నేను ఎందుకోసం వచ్చానో చెప్పాను.
‘అయ్యో మిస్టర్ జాన్సన్. నాకు సిగ్గుగా ఉంది. లైబ్రరీ నించి నోటీస్ రాగానే వాటిని వెంటనే తిరిగి ఇవ్వాల్సింది. కాని నా చెల్లెలు హాస్పిటల్లో ఉండటంతో తీరిక సమయాలన్నీ ఆమెతో గడుపుతూ లైబ్రరీకి రాలేదు’
ఆమె టేబిల్ మీద సిద్ధంగా ఉంచిన పుస్తకాల దొంతరని ఇస్తే నేను ఎంత ఫైన్ చెల్లించాలో చెప్పాను.
‘ఓ పుస్తకం తగ్గింది’ లెక్క పెట్టి చెప్పాను.
‘ఏం పుస్తకం?’ అడిగింది.
‘ది సౌండ్ ఆఫ్ సింగింగ్’
‘అది చాలా మంచి నవల. మీరు దాన్ని చదివారా?’ కళ్లతోనే గదిని వెదుకుతూ అడిగింది.
‘లేదు. చాలామంది దాన్ని తీసుకెళ్తూంటారు. మీ భర్త కాని, పిల్లలు కాని దాన్ని చదవడానికి తమ గదిలో ఉంచారేమో?’ సూచించాను.
‘నాకు పిల్లలు లేరు. మా ఆయన సరదా పుస్తకాలే చదువుతారు. ఆయన లాయర్’ ఆమె ఫైన్ డబ్బుని చెల్లిస్తూ చెప్పింది.
తర్వాత ఆమె ఇంకో గదిలోకి వెళ్లి ఆ నవలతో వచ్చి చెప్పింది.
‘మీరు చెప్పింది నిజమే. మా వారి టెలీఫోన్ బుక్ బల్ల మీద ఉంది. దీన్ని విలియం నిన్న రాత్రి నేను బయటకి వెళ్లినప్పుడు తీసుకున్నట్లున్నాడు.’
నేనా పుస్తకం రెండు అట్టలని పట్టుకుని పేజీలని కిందకి వచ్చి గట్టిగా ఊపాను. తరచు పాఠకులు పేజీలు గుర్తుంచుకోడానికి పుస్తకాల్లో ఏదైనా ఉంచుతూంటారు కాబట్టి ఇలా తప్పనిసరిగా చేయాలని నియమం.
మధ్యాహ్నం ఒంటిగంటకల్లా జాబితాలోని ఆఖరి పేరు టిక్ చేశాను. నా కారు వెనుక సీటు నిండా తిరిగి వచ్చిన పుస్తకాలు, జేబు నిండా ఫైన్ డబ్బు. రోజుకి కొన్ని సెంట్ల ఫైన్ కలిపితే లైబ్రరీకి చాలా ఆదాయమే వస్తుంది. క్రితం సంవత్సరం నేను వసూలు చేసిన పుస్తకాల విలువ, ఫైన్స్ నలభై వేల డాలర్లు.
లైబ్రరీలో వాటిని అప్పజెప్పాను. రెండు గంటలకి లైబ్రరీ కేఫ్టీరియాలోని నా దగ్గరికి మిసెస్ విలియమ్ కానే్వ వచ్చింది. ఆమె బుగ్గ మీద అర డాలర్ నాణెం సైజ్‌లో కందిపోయింది. నుదుటి మీద లోతైన గీత కనిపించింది. మేకప్‌తో ఆమె వాటిని కప్పిపుచ్చే విఫల ప్రయత్నం చేసిందని గ్రహించాను.
‘మీరు వెళ్లాక నేను మెట్ల మీంచి పడ్డాను. మీరు ఉదయం తీసుకున్న ది సౌండ్ ఆఫ్ సింగింగ్ పుస్తకాన్ని నేను మళ్లీ తీసుకోవచ్చా? లంచ్‌కి మా వారు ఇంటికి వచ్చాక మీకా పుస్తకం ఇచ్చానని తెలిసి కోప్పడ్డారు’
‘తప్పకుండా. మా దగ్గర ఆ నవల కాపీలు పనె్నండు ఉన్నాయి.’
‘కాదు. మా వారికి అదే పుస్తకం కావాలి. ఆయన అందులో క్లైంట్ ఇచ్చిన పెద్ద మొత్తం చెక్‌ని ఉంచారట’ చెప్పింది.
‘కాని మీ ముందే నేను దాన్ని దులిపినప్పుడు అది కింద పడలేదు’
‘కావచ్చు. విలియం దాన్ని అందులోనే ఉంచానని చెప్పాడు.’
‘సరే. నేనా పుస్తకాన్ని లైబ్రేరీయన్‌కి ఇచ్చాను. ఈపాటికి షెల్ఫ్‌లో పెట్టి ఉంటుంది. ఎవరూ దాన్ని తీసుకెళ్లలేదనే ఆశిద్దాం.’
నేను ఇంటర్ కం రిసీవర్ ఎత్తి చెకౌట్ డెస్క్ ఉద్యోగిని అడిగాను.
‘గంటలోగా మీరు పుస్తకం నెంబర్ 15208, ది సౌండ్ ఆఫ్ సింగింగ్ అనే పుస్తకాన్ని ఎవరికైనా ఇచ్చారా?’
కొద్ది నిమిషాల తర్వాత ఆమె చెప్పింది.
‘అరగంట క్రితం అది బయటకి వెళ్లింది. కార్డ్ నంబర్ పి.సి. 28382.’
నేనా నంబర్ని పేడ్‌లో రాసుకుని ఆమెకి థాంక్స్ చెప్పి, మిసెస్ విలియంతో చెప్పాను.
‘సారీ. ఆ కాపీ బయటకి వెళ్లింది.’
ఆమె బాధగా చూసింది.
‘ఈ రోజంతా చెడే జరుగుతుంది. మీరు రాసుకున్న ఆ నంబర్ ఏమిటి మిస్టర్ జాన్సన్? ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడ ఉందో ఆ నంబర్ వల్ల తెలుస్తుందా?’ అడిగింది.
‘నాకు తెలుస్తుంది. కాని అనేక కారణాల వల్ల నేను మీకు ఆ సమాచారం చెప్పకూడదు. దాన్ని తీసుకెళ్లిన వ్యక్తి కార్డ్ నంబర్ ఇది’ వివరించాను.
‘ఇది ఇంకా దురదృష్టం’ ఆమె దుఃఖంగా చెప్పింది.
నేను లైబ్రరీ నియమాన్ని అతిక్రమిస్తూ ఆమెకి ఆ సమాచారాన్ని ఇవ్వాలని క్షణకాలం అనుకున్నాను. కాని ఆ నియమాన్ని భంగం చేయకూడదు అని తక్షణం అనిపించడమే కాక, మరోటి కూడా నన్ను ఆపింది. నేనా పుస్తకాన్ని దులిపినప్పుడు అంటిన చెక్ పుస్తకంలో ఉండి ఉంటే కింద పడేది. ఆమె మొహంలో దెబ్బలు మెట్ల మీద పడటంవల్ల కాక పిడికిళ్లతో గుద్దినవని వృత్తిపరమైన అనుభవంతో తేలిగ్గా గ్రహించాను.
‘నేను ఆ వ్యక్తికి ఫోన్ చేసి చెక్ గురించి అడుగుతాను. అది ఆ పుస్తకంలో ఉంటే వాళ్లు దాన్ని మీకు పోస్ట్ ద్వారా పంపుతారు’ చెప్పాను.
వెంటనే ఆమె కళ్లల్లోకి వెలుగు ప్రవేశించింది.
‘నిజంగా ఈ సహాయం చేస్తారా? థాంక్స్ మిస్టర్ జాన్సన్’
నేను రిసీవర్ అందుకుని మెయిన్ లైబ్రేరియన్‌కి ఫోన్ చేసి అడిగాను.
‘జాన్సన్‌ని. దయచేసి కార్డ్ నంబర్ పి.సి. 28382 ని బయటకి తీస్తావా కేటీ?’
ఆమె కొద్ది క్షణాల్లో జార్జ్ హేట్‌ఫీల్డ్ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పి పెట్టేసింది. నేను అతని నంబర్ వెదికి డయల్ చేస్తూంటే మిసెస్ విలియం నా వైపు ఆదుర్దాగా చూడసాగింది. అవతలి వైపు ఎవరూ రిసీవర్ ఎత్తలేదు.
‘నేనో గంట తర్వాత మళ్లీ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బహుశ ఇంట్లో ఎవరూ ఉండి ఉండరు. అతను దొరగ్గానే మీకా చెక్‌ని పోస్ట్ చేయమని చెప్తాను. మీ అడ్రస్ నా దగ్గర ఉంది. సరేనా?’ అడిగాను.
ఆమె అయిష్టంగానే లేచి నిలబడి చెప్పింది.
‘మా వారికి చెప్తాను. థాంక్స్’
ఆ సాయంత్రం ఆమె నాకు ఫోన్ చేసి పోయిన చెక్ అతని డ్రాయర్లోనే దొరికిందని చెప్పింది. ఆమె కంఠంలో ఎంతో రిలీఫ్ కనిపించింది. ఆమెలోని విచారం తగ్గినా చేయని తప్పుకి ఆమె భర్త ఆమెని కొట్టాడనే కోపం నాలో తగ్గలేదు. ఇది నిన్న జరిగింది.
ఈ రోజు ఉదయం తొమ్మిదికి నేను లైబ్రరీకి వెళ్లగానే కేటీ అడిగింది.
‘కార్డ్ నంబర్ పి.సి. 28382 అడ్రస్ కదా నిన్న మీరు అడిగింది?’
‘అవును. ఐతే?’ ప్రశ్నించాను.
‘మీరు మర్చిపోయారా?’
‘ఏం మర్చిపోయాను?’ అడిగాను.
‘మళ్లీ నాలుగున్నరకి మీరు నాకు అదే సమాచారం కోసం ఫోన్ చేశారంటే, మర్చిపోయారనే కదా?’
‘నేనా?’
‘అవును మీరే’
‘నాలుగున్నరకి నేను మీకు ఫోన్ చేయలేదు’
‘ఎవరో ఫోన్ చేసి మీరే అని చెప్పారు’
‘నా కంఠంలా ఉందా?’ ప్రశ్నించాను.
‘అవును. అందమైన ఆడవాళ్లంటే ఆసక్తిలేని మీ కంఠం లాంటిదే’ నవ్వుతూ చెప్పింది.
‘్థంక్స్. ఎవరో ప్రాక్టికల్ జోక్ వేసుంటారు. నేను కాదు’ చెప్పాను.
నేను ఈ రోజు వెళ్లాల్సిన చిరునామాల జాబితా కోసం వేచి ఉన్నప్పుడు కేటీ చెప్పిన ఆ రెండో ఫోన్ కాల్ గురించి ఆలోచించాను. ఆలోచించిన కొద్దీ అది నన్ను ఇబ్బంది పెట్టింది. దాంతో నేను ముందుగా జార్జ్ హేట్‌ఫీల్డ్ ఇంటికే బయల్దేరాను.
* * *
హేట్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌కి యూనిఫాంలోని అధికారి వచ్చేదాకా నేనేం ముట్టుకోలేదు. పెట్రోల్ మేన్ లెఫ్టినెంట్ రేండల్‌తో నేను కొనే్నళ్ల క్రితం డిటెక్టివ్ బ్యూరోలో కలిసి పని చేశాను.
జరిగింది చెప్పాక అతను అంబులెన్స్‌కి ఫోన్ చేసి అనుమానంగా చెప్పాడు.
‘అంత తేలిగ్గా దీన్ని నమ్మకూడదు’
దాంతో నేను మిసెస్ విలియం, ఆమె భర్త గురించి, ది సౌండ్ ఆఫ్ సింగింగ్ పుస్తకం గురించి, నా పేరుతో ఎవరో కేటీకి ఫోన్ చేసి ఈ అడ్రస్ తీసుకోవడం గురించి చెప్పాను. అతను బల్ల కింద పుస్తకాన్ని చూసి అడిగాడు.
‘అదేనా?’
‘తెలీదు. ఇంకా దాన్ని తాకలేదు. మీ కోసం వేచి ఉన్నాను’ చెప్పాను.
‘ఐతే ఇప్పుడు చూడు’
తీసి చూస్తే పుస్తకం నంబర్ 15208. నిన్న నేను మిసెస్ విలియం నించి తీసుకున్న పుస్తకమే అది. పేజ్ నంబర్ 101 మార్జిన్‌లో, మొదటి పేజీలో అదే నంబర్ రాసి ఉంది.
‘ఇదే’ చెప్పాను.
‘నువ్వు అనుకున్నట్లు హేట్‌ఫీల్డ్ హత్యకి, ఈ పుస్తకానికి సంబంధం ఉంటే అదేమిటో ఈ పుస్తకం చెప్పగలగాలి’ రేండెల్ చెప్పాడు.
‘అది నిజమే. కాని ఆఖరి కాగితం చింపేసారు’ చెప్పాను.
‘ఆ కాగితం మీద రాసిందేదో విలియంకి రహస్యమైంది అయుండచ్చా?’ రేండెల్ అడిగాడు.
‘కావచ్చు’
‘నిన్న పుస్తకం తీసుకున్నప్పుడు అక్కడేం రాసుందో చూశావా?’
‘లేదు. దులిపానంతే’
‘ఎవరైనా పబ్లిక్ లైబ్రరీ పుస్తకం వెనక ఖాళీ పేజీలో రహస్యమైంది లేదా తనని పట్టించేది ఎందుకు రాస్తారు?’
‘అతని భార్య ఈ పుస్తకం అతని గదిలో టెలిఫోన్ టేబిల్ మీద దొరికిందని చెప్పింది. ఫోన్‌లో మాట్లాడుతూ ఏదైనా రాసుండచ్చు.’
‘లైబ్రరీ బుక్‌లోనా?’
‘అవును. బహుశ అందుబాటులో ఉన్న ఏకైక ఖాళీ కాగితం అదే అయి ఉండచ్చు.’
‘ఐతే అతను రాసింది చెరిపేసేలోగా అతని భార్య పుస్తకం నీకు ఇచ్చిందని చెప్తున్నావా?’
‘లేదా చూసి ఇంకో చోట రాసుకునే లోగా లేదా గుర్తుంచుకునేలోగా’
‘నేనీ పుస్తకాన్ని కొన్ని రోజులపాటు స్వాధీనం చేసుకుంటాను. పోలీస్ లేబ్‌లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో చూస్తాను’ రేండెల్ చెప్పాడు.
‘అలాగే’
నేను బయటకి నడిచాను.
* * *
మర్నాడు సాయంత్రం నేను లైబ్రరీ లోంచి వెళ్లే సమయంలో రేండెల్ నించి నాకు ఫోన్ వచ్చింది.
‘నువ్వు విలియంని చూసావా? ఆయన్ని గుర్తు పట్టగలవా?’
‘లేదు. చూడలేదు. అతని ఇంట్లో అతని ఫొటోని చూశాను’ చెప్పాను.
‘సరే. ఇరవై నిమిషాల్లో నువ్వు స్టేన్‌హోప్‌లోని ఎంకోర్ బార్‌కి రాగలవా?’ రేండెల్ కోరాడు.
‘తప్పకుండా. ఎందుకు?’
‘వచ్చాక చెప్తాను.’
ఆ బార్లో అరడజను మంది కస్టమర్సే ఉన్నారు. రేండెల్ ఓ బూత్‌లో
నా కోసం వేచి ఉన్నాడు. అతని ముందు నేను కూర్చున్నాక చెప్పాడు.
‘విలియం ఆ పుస్తకం వెనక ఖాళీ కాగితంలో ఏదో రాసాడు. లేదా ఎవరో రాసారు. లేబ్‌లో ఆ కాగితం వెనక అట్ట మీద ఆ కాగితం మీద రాసిన ట్రేస్ పడింది. కాని చదవడానికి వీలుగా లేదు. కొంత భాగమే కనుక్కోగలిగారు’
రేండెల్ జేబులోంచి ఓ కాగితం తీసిచ్చాడు.
ట్రాన్స్ 3212/5/13 ఎం.1
ఎన్‌కోర్ హార్పర్. 6/12 అని ఉంది. దాన్ని శ్రద్ధగా చదివి నేనో నిమిషంసేపు ఆలోచించాను.
‘నీకేమైనా అర్థమైందా?’ రేండెల్ అడిగాడు.
‘ఐంది. ట్రాన్స్ ఓషనిక్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 3212. మయామి నించి వెళ్లే ప్రయాణీకుడి పేరు హార్పర్. మే 13న. అంటే ఈ రోజే. ఎవరో ఈ బార్లో 6.12 నిమిషాలకి కలవాలి.

‘నా ఊహ కరెక్టే అన్న మాట. నేను కూడా సరిగ్గా నీలాగే అర్థం చేసుకున్నాను. కాని అందుకు నాకు అరగంట పట్టింది’
‘మరి చెక్ చేసావా?’ అడిగాను.
‘మయామి నించి ఇవాళ ట్రాన్స్ ఓషనిక్ ఫ్లైట్ 3212 ఉంది. అందులో హార్పర్ అనే ప్రయాణీకురాలు కూడా ఉంది. మిస్ జెనవీవ్ హార్పర్. ఆమె ఎయిర్‌హోస్టెస్.’
‘ఎన్‌కోర్ బార్ కూడా ఉంది. నగరంలో ఇంకో ఎన్‌కోర్ బార్ కూడా ఉండచ్చేమో?’
‘చాలా ఉన్నాయి. కాని ఎయిర్‌పోర్ట్ నించి ఈ ట్రాఫిక్‌లో హార్పర్ ఇరవై నిమిషాల్లో చేరుకోగలిగే బార్ ఇదే. సాయంత్రం ఐదు ఏభై రెండుకి ఆమె డ్యూటీ దిగుతుంది. విలియం కనక ఇక్కడికి వస్తే అతన్ని గుర్తు పట్టగలిగేది నువ్వే. అందుకే నిన్ను పిలిచాను. వాళ్లు ఎందుకు కలుస్తున్నారో నువ్వు ఊహించగలవా?’ రేండెల్ అడిగాడు.
నేను చేతి గడియారం వంక చూసుకున్నాను. ఐదున్నర.
‘ఆ విమానం మయామి నించి వస్తుంది కాబట్టి డ్రగ్స్ వ్యాపారం కావచ్చు. ఫ్రాన్స్ నించి అమెరికాకి హెరాయిన్ సౌత్ అమెరికా ద్వారా మయామికే వస్తుంది కదా?’
‘అవును’
విలియం ఇక్కడ డ్రగ్స్ డిస్ట్రిబ్యూటరై ఉండచ్చు. అతని ఫోన్ కాల్స్ విచారిస్తే సౌత్ అమెరికా నించి ఆదివారం రాత్రి అతనికి ఓ కాల్ వచ్చిందని తెలిసింది. బహుశ డెలివరీ ఎక్కడ తీసుకోవాలో అతను ఆ పుస్తకంలో రాసుకుని ఉంటాడు. అతని భార్య ఆ పుస్తకాన్ని నీకు ఇచ్చిందని తెలీగానే కోపంతో ఆమెని కొట్టడానికి కారణం అదే అయుండచ్చు’ రేండెల్ చెప్పాడు.
‘హేట్‌ఫీల్డ్‌ది ప్రమాద మరణం కాదన్న మాట’
‘కాదు. హత్య. మేం అనుకోవడం మిసెస్ విలియం నీకా పుస్తకం ఇచ్చిందని తెలిసి భర్త ఆమెని కొట్టాడు. ఆయన సూచన ప్రకారం దాన్ని మళ్లీ తీసుకోడానికి ఆమె వచ్చింది. కాని దాన్ని హేట్‌ఫీల్డ్ తీసుకున్నాడు. అతని అడ్రస్ కోసం విలియమే నీలా నటిస్తూ లైబ్రరీకి ఫోన్ చేసి ఉంటాడు. నువ్వు రాసుకున్న కార్డ్ నెంబర్ని ఆమె గుర్తుంచుకుని భర్తకి చెప్పి ఉంటుంది. ఆ సమాచారం తెలీగానే అతను సరాసరి హేట్‌ఫీల్డ్ ఇంటికి వెళ్లి ఉంటాడు. అతను ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి ఆ పుస్తకం కోసం వెదుకుతూండగా హేట్‌ఫీల్డ్ వచ్చి ఉంటాడు. దాంతో అతన్ని చంపి ఉంటాడు. బహుశ దాక్కుని అతను లోపలికి రాగానే తల మీద కొట్టి ఉంటాడు.’
‘అర్థమైంది. దాని తర్వాత ప్రమాదంగా చిత్రీకరించి పుస్తకాన్ని దొంగిలించడం ఇష్టంలేక ఆ కాగితాన్ని చింపి తీసుకెళ్లాడు.’
‘తన భార్యకి చెక్ దొరికిందని చెప్పి ఉంటాడు’ రేండెల్ చెప్పాడు.
‘కాని దీంట్లో ఏదీ నువ్వు రుజువు చేయలేవు’ చెప్పాను.
‘అప్పుడే కాదు. అతను నార్కోటిక్స్ నేరంలో పట్టుబడ్డాక అతని చేతే దాన్ని ఒప్పించచ్చు’
‘ఒకవేళ ఆ నేరం చేసింది విలియం కాకపోతే?’
రేండెల్ చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు.
‘మరో ఇరవై నిమిషాల్లో అది తెలుస్తుంది.’
ఐదు ఏభై ఆరుకి నేను ఫొటోలో చూసిన విలియం బార్లోకి వచ్చాడు. అతను తలుపుకి దగ్గరగా ఉన్న బూత్‌లో కూర్చుని స్కాచ్, సోడా కోసం ఆర్డర్ చేశాడు. అతనే అన్నట్లుగా రేండెల్‌కి సైగ చేశాను. ఆ తర్వాత మేమిద్దరం బేస్‌బాల్ ఆట గురించి మాట్లాడుకోసాగాం.
ఆరు పధ్నాలుగుకి లోపలకి వచ్చిన బంగారు రంగు జుట్టు యువతి సరాసరి విలియం బూత్‌లోకి వెళ్తూ అంతా వినేలా చెప్పింది.
‘హలో డార్లింగ్. నాకు ఎంత దాహంగా ఉందో, మంచినీళ్లు తాగుతాను’
ఫ్లైట్ యూనిఫాంలో, భుజాన బేగ్ ఉన్న ఆమె విలియం పక్కన కూర్చుంది.
రేండెల్ లేచి కిటికీ దగ్గరకి వెళ్లి తల మీద చేతిని ఉంచుకుని వెనక్కి తిరిగాడు. ఆ సంజ్ఞని గ్రహించిన మఫ్టీలోని పోలీసులు బయట నించి లోపలికి వచ్చారు. రేండెల్ వాళ్లకి విలయం బూత్‌ని చూపించారు. వాళ్లు ముగ్గురూ ఒకేసారి లోపలకి వెళ్లారు. హింస లేకుండా, గొంతులు వినపడకుండా అంతా ప్రశాంతంగా సాగింది. నార్కోటిక్స్ స్క్వేడ్‌కి చెందిన ఒకతను మిస్ హార్పర్ హేండ్‌బేగ్‌ని, ఎయిర్ బేగ్‌ని స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరూ విలియంకి, హార్పర్‌కి బేడీలు వేశారు. బేగ్స్‌ని తెరచి తనిఖీ చేశాక వాళ్లని తీసుకెళ్లిపోయారు. వారిలోని ఒకరు రేండెల్ చెవిలో ఏదో గొణిగి వెళ్లాడు. రేండెల్ నా వంక నవ్వుతూ చూస్తూ చెప్పాడు.
‘హార్పర్ బేగ్‌లో ఓ పౌన్ బాత్ పౌడర్ పెట్టెలు రెండున్నాయి. అందులో ఉన్నది హెరాయిన్. ఇది నాకు చక్కటి రికార్డ్ అవుతుంది. విలియం భార్యకి దీంట్లో భాగం లేదంటావా? తన భర్త చేసేది ఆమెకి తెలీదా?’
‘తెలీదనే నా నమ్మకం. తెలుసుంటే ఆమె ప్రవర్తన మరోలా ఉండేది’ చెప్పాను.
‘అది కూడా పరిశోధిస్తాను. నువ్వు చెప్పిందే నిజం అవచ్చు. ఈ రాత్రికి విలియం ఇంటికి రాడని ఆమెకి చెప్పాలి. ఎవరైనా చెప్పే వాళ్లున్నారా?’ అడిగాను.
‘నేను చెప్తాను’ చెప్పి లేచాను.
*
(జేమ్స్ హోల్డింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి