క్రైమ్ కథ

మరణించిన వారు మాట్లాడుతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్ కథ.....

నేల మీది ఆ శవం చిన్నపిల్లాడు ఆడి విసిరేసిన ఆటబొమ్మలా కనిపిస్తోంది. తల నించి నెత్తురు కారుతోంది. అది కార్పెట్ కింది నేలలోకి ఇంకసాగింది.
తన పథకం ప్రకారం చంపాక ఆ హంతకుడు ప్రాథమిక, మానసిక నివ్వెరపాటు నించి తేరుకున్నాడు. అనేక రోజులు అతను ఆ గుడ్డి హతుడు తన ఉద్దేశాన్ని కనిపెడతాడేమోనని భయపడ్డాడు. గుడ్డివాళ్లకి ఓ అదృశ్య ఏంటెనా ఉన్నట్లుగా ఇతరుల మాటలని బట్టి వారి ఉద్దేశాలు తేలిగ్గా పసిగట్టగలరని అతను విని ఉన్నాడు.
పోకర్‌లని (నిప్పుని తోసే ఇనప రాడ్) ఉంచే హోల్డర్‌ని కిందకి, హతుడి తల మీదకి బలంగా తోశాడు. అది గాయాన్ని వెడల్పు చేసింది. తర్వాత హంతకుడు తను చంపడానికి ఉపయోగించిన పోకర్ని అందుకుని, దానికి అంటిన రక్తం పోయేలా ఆ ఫాంహౌస్‌లోని సింక్‌లో శుభ్రంగా కడిగి, దాన్ని యథాస్థానంలో ఉంచే ముందు నిప్పులో కొద్దిసేపు వేడి చేశాడు. షెరీఫ్ హతుడి మిత్రుడు కాబట్టి అతను ప్రతీది అనుమానంగా పరీక్షిస్తాడని హంతకుడికి తెలుసు. ఆయన ఊళ్లో లేడని తెలియడంతో ఆ రోజుని హత్యకి, దొంగతనానికి పూనుకున్నాడు.
ఓ స్టూల్‌ని తన్నాడు. మరి కొన్ని వస్తువులని స్థానభ్రంశం చేశాక ఆ గదిని పరిశీలించి తృప్తి పడ్డాడు. ఇప్పుడు అది హత్యలా కాక గుడ్డివాడైన హతుడు ప్రమాదవశాత్తు కాలుజారి ఇనప వస్తువు మీద పడటంతో తల పగిలి మరణించాడు అనిపించేలా కనిపిస్తోంది అనుకుని తృప్తిపడ్డాడు.
తర్వాత అతను ఫైర్ ప్లేస్ లోపల ఉన్న కొన్ని ఇటుకలని తడిమి, ఒక దాన్ని బయటకి లాగి, అక్కడ ఏర్పడ్డ కంతలోంచి, ఓ రోజు తను కాకతాళీయంగా చూసిన లోహపు పెట్టెని బయటకి తీశాడు. తెరచి చూస్తే దాన్నిండా నోట్ల కట్టలు కనిపించాయి. అతను ఇంటి వెనక్కి వెళ్లి నేలలో ఆ పెట్టెని పాతి పెట్టి తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇటుకని యథాస్థానంలో ఉంచే ముందు దాని మీది తన వేలిముద్రలని శుభ్రంగా తుడిచేశాడు. తర్వాత గ్లవ్స్ తొడుక్కుని ఇటుకని ఉంచాక, ఇంటి తలుపు మూసాడు. తనని పట్టించేది ఏదైనా హతుడు రాసిపెట్టాడా అని టెడ్ ఇల్లంతా వెతికి అలాంటిదేం లేదని తృప్తి పడ్డాడు. తన యజమాని ప్రమాద మరణాన్ని పోలీసులకి ఫిర్యాదు చేయడానికి కొద్ది దూరంలోని నగరానికి కాలినడకన బయలుదేరాడు.
‘హలో టెడ్!’ షెరీఫ్ అతన్ని పలకరించాడు.
ఆ హంతకుడు కొన్ని క్షణాలు నివ్వెరపోతూ షెరీఫ్ వంక చూశాడు.
‘నేను ఇప్పుడే ఓ కాన్ఫరెన్స్‌కి హాజరై చికాగో నించి తిరిగి వస్తున్నాను. నీ యజమానిని చూద్దామని వస్తున్నాను’
‘నేను మీ దగ్గరకే బయలుదేరాను. నేను వచ్చి చూస్తే ఆయన్ని ఎవరో చంపేశారు!’ విచారం నటిస్తూ టెడ్ చెప్పాడు.
షెరీఫ్ హత్య జరిగిన ఆ గదిని పరీక్షించాక టెడ్ ఆశించినట్లే అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించాడు. తర్వాత అడిగాడు.
‘నువ్వేం కదిలించలేదుగా? నువ్వు చూసినప్పుడు ఎలా ఉందో ఈ గది అలాగే ఉందిగా?’
‘అవును’
పంజరంలోని పక్షి తప్పించుకోడానికి రెక్కలు ఎలా కొట్టుకుంటుందో టెడ్ గుండె అలా కొట్టుకోసాగింది. షెరీఫ్ అన్ని వస్తువులని పరీక్షించాక హతుడి చేతిలోని తాడుని చూసి చెప్పాడు.
‘నేను దీన్ని తీసుకెళ్తాను. బిల్, నేను పడవలో వెళ్లేప్పుడు దీనే్న ఉపయోగించేవాడు’
‘అలాగే షెరీఫ్’ టెడ్ చెప్పాడు.
‘నీ భవిష్యత్ ఏమిటి?’
‘యజమాని పోయాక ఇక ఈ ఊళ్లో నాకేం పని? ఇంకో ఊరుకి వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను’ టెడ్ జవాబు చెప్పాడు.
‘ఎప్పుడు వెళ్తావు?’
‘రేపో, ఎల్లుండో’
‘నువ్వు వెళ్లేలోగా నేను మళ్లీ వస్తాను. అంత దాకా నీ యజమాని ఇంట్లోనే ఉండు. ఇంకో అరగంటలో పోలీస్ డాక్టర్ వస్తాడు’ షెరీఫ్ చెప్పాడు.
‘వేలిముద్రల నిపుణుడు?’
‘ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి వాళ్ల అవసరం లేదు’
షెరీఫ్ వెళ్లిపోయాక టెడ్‌కి ప్రశాంతంగా అనిపించింది. తను తెలీక ఏదైనా ఆధారం వదిలాడా అని భయపడ్డాడు. ఇక భయం లేదని తెలిసింది.
* * *
మర్నాడు ఉదయం టెడ్ తన సూట్‌కేస్‌ని సర్దుకుని మూసాడు. బయట ఆగే కారు శబ్దాన్ని విని కిటికీలోంచి బయటకి చూశాడు.
షెరీఫ్ కారు!
షెరీఫ్ వచ్చేలోగా వెళ్లిపోవాలనుకున్నాడు కాబట్టి తన దురదృష్టానికి చింతించాడు. అతను లోపలకి వచ్చి టెడ్ సూట్‌కేస్‌ని చూసి అడిగాడు.
‘వెళ్తున్నావా?’
‘అవును’
షెరీఫ్ ఆ సూట్‌కేస్‌ని అందుకుని చెప్పాడు.
‘నిన్ను రైల్వేస్టేషన్‌లో దింపుతాను. నా మంచి మిత్రుడు బిల్‌కి సేవ చేసిన నీకు నేను చేయగలిగే ఆఖరి సహాయం ఇదే. పద’
షెరీఫ్ కంఠంలో స్వల్పంగా ఎగతాళి ధ్వనించింది.
‘్థంక్స్. కాని మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు’ టెడ్ మృదువుగా నిరాకరించాడు.
షెరీఫ్ సూట్‌కేస్‌తో బయటకి నడిచాడు.
కారు బయలుదేరిన కాసేపటి దాకా ఇద్దరి మధ్యా వౌనం. కారుని పోలీసుస్టేషన్ వైపు తిప్పుతూ షెరీఫ్ చెప్పాడు.
‘నా ఆఫీస్‌లో ఒకటి తీసుకోవాలి. ఫర్వాలేదుగా? నీ రైలుకి ఇంకా టైం ఉంది’
మనసులో అయిష్టంగా ఉన్నా టెడ్ బదులు చెప్పలేదు. కొద్దిసేపట్లో వారి కారు రెండంతస్థుల భవంతి ముందు ఆగింది. దిగుతూ షెరీఫ్ చెప్పాడు.
‘నాతో రా టెడ్. నీకోటి చూపించాలి’
లోపలకి వెళ్లాక షెరీఫ్ టెడ్‌ని ఓ చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఓ బల్ల, రెండు కుర్చీలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఓ కుర్చీలో బట్టతల గల ఓ మధ్య వయస్కుడు కూర్చుని ఉన్నాడు.
‘ఆ కాగితం ఇవ్వు పీటర్’ షెరీఫ్ అతన్ని కోరాడు.
పీటర్ తల ఊపి బల్ల సొరుగు తెరిచి ఓ కాగితాన్ని షెరీఫ్‌కి ఇచ్చాడు. దాన్ని చూసి షెరీఫ్ దాన్ని టెడ్‌కి ఇచ్చి చెప్పాడు.
‘చదువు. ఇది నీకు ఆసక్తిగా ఉంటుంది’
టెడ్ దాన్ని అందుకుని దాని మీద టైప్ చేసిన వాక్యాలని చదివాడు. వెంటనే ఉలిక్కిపడ్డాడు. అది టెడ్ అరెస్ట్ వారెంట్.
తర్వాతి అరగంటా ఏం జరుగుతోందో టెడ్‌కి సరిగ్గా అర్థం కాలేదు. సెల్‌లో ఓ మూల ఇనప మంచం, తలవైపు చాలా ఎత్తులో ఓ కిటికీ. అతను మంచం అంచున కూర్చుని తన యజమానిని తను చంపాడన్న సంగతి వాళ్లు ఎలా కనుక్కున్నారా అని బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు. తనని అందుకే అరెస్ట్ చేసారని అరెస్ట్ వారెంట్‌లో అతను చదివాడు. షెరీఫ్ ఆ గదిలోకి రాగానే అడిగాడు.
‘ఏ ఆధారంతో నన్ను హంతకుడిగా నిర్ణయించారు?’
షెరీఫ్ నవ్వి చెప్పాడు.
‘అది నీకు కొరుకుడు పడదని నాకు తెలుసు. హతుడు బిల్ చెప్పాడు టెడ్’
‘బిల్ చెప్పడం ఏమిటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలేదు’
‘నువ్వు అతని తల మీద కొట్టాక బిల్ ఆ సంగతి చెప్పాడు’
టెడ్‌కి అది అబద్ధం అని తెలుసు. ఆ సమయంలో అక్కడ మూడో వ్యక్తి లేడు. బిల్ రక్తంతో ఏదైనా రాసాడా అని కూడా తను పరీక్షించాడు. అలాంటిదేం లేదు. మరి?
‘ఒకవేళ నేను తల మీద కొట్టడం నిజమే అనుకుంటే, బిల్ ఎవరికి చెప్పాడు?’ టెడ్ కోపంగా ప్రశ్నించాడు.
‘నువ్వు చేపల దారాన్ని విస్మరించావు టెడ్. మరణించిన బిల్ చేతిలోని దానికి అనేక ముళ్లు వేసి ఉండటం గమనించాను. ఎన్నడూ బిల్ దానికి ఒక్క ముడి కూడా వేయలేదు. దాంతో నాకు ఆసక్తి కలిగి దాన్ని నా వెంట తీసుకెళ్లాను. అవన్నీ ఓ పద్ధతిలో వేసిన ముళ్లుగా గ్రహించాను. నేవీలో పని చేసిన నాకు ఓసారి అవి ఏమిటో అర్థం అయాక వాటి ద్వారా బిల్ చెప్పింది గ్రహించడం తేలికైంది’
‘ముళ్లా? నాకేం అర్థం కావడంలేదు’ టెడ్ భయంగా చెప్పాడు.
‘మోర్స్ కోడ్ టెడ్. దాని గురించి ఎప్పుడైనా విన్నావా? టేప్ చేసి పంపడమే కాదు. చెప్పదలుచుకున్న దాన్ని మోర్స్ కోడ్‌ని ఉపయోగించి అనేక విధాలుగా చెప్పచ్చు. నేవీలో రేడియో ఆపరేటర్‌గా పనిచేసిన బిల్‌ని నువ్వు చంపింది. గుడ్డివాడైన అతను ఎలాంటి పొరపాటు చేయకుండా తనని నువ్వు చంపదలచుకున్నావని చెప్పాడు. తనని చంపడానికి నీకు మాత్రమే కారణం ఉందని, తను మరణిస్తే నిన్ను అనుమానించమని చెప్పాడు.’
‘నాకు ఇంకా అయోమయంగానే ఉంది. నేను ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటాను?’ టెడ్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఆ చేపల వైర్ మీద మోర్స్ కోడ్‌లోని చుక్కలు, గీతలని రిప్రజెంట్ చేసే ముళ్లు వేశాడు. అది మోర్స్ కోడ్ అని గ్రహించడానికి నాకు కొంత సమయం పట్టింది. బిల్ ఆఖరి సందేశం తెలుసుకోవాలని ఉందా? చదువు’
షెరీఫ్ ఇచ్చిన ఇంకో కాగితం మీద టైప్ చేసింది టెడ్ చదివాడు.
‘డబ్బు ఫైర్ ప్లేస్‌లోని రహస్యపు అరలో నేను ఉంచడం టెడ్ చూశాడు. దానర్థం నేను మరణిస్తే అతను నన్ను చంపాడని’
‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. అసలు నేను ఆయన చెప్పింది చూడనే లేదు’ టెడ్ అబద్ధం చెప్పాడు.
‘ఆ డబ్బు మరి నీ సూట్‌కేస్‌లోకి ఎలా వచ్చింది? బిల్ గుడ్డివాడేమో కాని మూగవాడు కాదు టెడ్. నువ్వాయన నోటిని మూసేయలేక పోయావు. స్మశానం నించి కూడా బిల్ మాట్లాడాడు’ షెరీఫ్ చెప్పాడు.
బిల్ జ్ఞాపకార్థం ఉంచిన ఆ తాడుని షెరీఫ్ లండన్‌లోని పోలీస్ మ్యూజియానికి ఆ కేసు వివరాలతో పాటు పంపించాడు.
*

-మల్లాది వెంకట కృష్ణమూర్తి