క్రైమ్ కథ

దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఓడలోంచి మెక్సికోలోని వెంటా ప్రియట హార్బర్‌లో దిగాను. నేను అక్కడ మూడు వారాలు విశ్రాంతి తీసుకోడానికి వచ్చాను. అది ప్రధానంగా జాలర్లు అధికంగా ఉండే పల్లె. అక్కడ కనీసం రెండు కథలకైనా నాకు ఐడియాలు రావాలనే కోరిక నా మనసులో ఉంది.
హోటల్లో దిగాక నేను విచారిస్తే ఆ గ్రామం మొత్తానికి డాస్ ఈక్విస్ అనే రెస్ట్‌రెంట్‌లో చవకగా రుచికరమైన భోజనం దొరుకుతుందని తెలిసింది.
రెండో రాత్రి నేను అక్కడ భోజనం చేస్తూండగా ఒకతను లోపలికి వచ్చి అక్కడ కస్టమర్లలోని ఎవరి కోసమో వెతుకుతూండటం గమనించాను. అతని కళ్లు నా మీద ఆగాయి. వెంటనే అతను సరాసరి నా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్‌లో అడిగాడు.
‘ఇక్కడ కూర్చోవచ్చా?’
అతని వాలకం చూసి ఇష్టపడకపోయినా నవ్వుతూ తల ఊపాను. ఉచ్ఛారణని బట్టి అతను ఆరిజోనా ప్రాంతానికి చెందిన అమెరికన్ అని గ్రహించాను.
‘సాటి అమెరికన్ని కలుసుకున్నందుకు సంతోషం. అమెరికా నించి ఎవరో వచ్చారని నాకు ఒకరు చెప్పారు’ అతను కరచాలనానికి చేతిని చాపి చెప్పాడు.
నేను అయిష్టంగానే అతనితో కరచాలనం చేశాను. కారణం అతని దుస్తులు. అవి మాసి వాసన వేస్తున్నాయి. తైల సంస్కారం లేని జుట్టు, స్నానం చేసి చాలా కాలమైనట్లుంది. అతని మొహం ఉబ్బి తాగుడికి బాగా అలవాటు పడ్డాడని తెలిసిపోతోంది.
‘మీరు ఈ ఊరికి పర్యాటకుడిగా వచ్చారా?’
‘అవును’
‘సాటి అమెరికన్‌కి ఓ డ్రింక్ కొనిస్తారా?’ అతను కోరాడు.
అమెరికన్స్‌కి అంత సూటిగా అడగటం మర్యాద కాదు. కాని అతను మర్యాదస్థుడిగా తోచక పోవడంతో నేను అది పట్టించుకోలేదు. అతను సైగ చేయగానే వెయిటర్ మా దగ్గరికి వచ్చాడు. అతనికి ఏం కావాలో వెయిటర్‌కి తెలుసు. ఓ చవక లిక్కర్ బాటిల్‌తో వచ్చి, అతని వెనక నిలబడి, ‘ఇవ్వనా?’ అన్నట్లుగా నాకు సైగ చేశాడు. నేను తల ఊపాక దాన్ని, ఓ గాజు గ్లాస్‌ని అతని ముందుంచి వెళ్లాడు. వణికే వేళ్లతో అతను గ్లాస్‌లోకి ఆ సీసాలోని మద్యాన్ని సగం దాకా పోసుకుని, ఓ గుక్కలో మొత్తం తాగాక మళ్లీ గ్లాస్ నింపుకున్నాడు. తర్వాత ఎడం అరచేతి వెనక భాగంతో నోటిని తుడుచుకుని నా వంక నవ్వుతూ చూస్తూ చెప్పాడు.
‘్థంక్స్. నా పేరు హేరీ. వెంటా ప్రియటాకి స్వాగతం. మీ పేరు?’
చెప్పాను.
‘ఏం చేస్తూంటారు?’
‘రచయితని. తక్కువగా నవలలు, ఎక్కువగా కథలు రాస్తూంటాను.’
అతని చూపు ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి మీద పడింది. చాలా అందంగా ఉన్న ఆమె నా వంక చూసి నవ్వింది.
‘ఆమె పేరు రోసిటా. ఆ పేరు గలవాళ్లు మెక్సికోలో లక్షల మంది ఉన్నారు. కాని ఎవరూ ఆమె అంత అందంగా ఉండరు.’
అతను రోసిటా వైపు గాల్లోకి ముద్దులు విసిరాడు. ఆమె మొహం చిట్లించుకుని మరోవైపు తిరిగింది. హేరీ పకపకా నవ్వాడు.
‘ఈ ఊళ్లో ఇంకో అమెరికన్ ఉన్నాడు. అతను గాల్లోకి ముద్దు విసిరితే బదులిస్తుంది. ఒకప్పుడు నాకూ బదులిచ్చేది’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
ఓ అమెరికన్ మెక్సికోలో ఎలా ఉన్నాడో, ఇంత బీద స్థితిలో ఎందుకు ఉన్నాడో నాకు బోధ పడలేదు.
‘నేను అమెరికన్స్ అందరికీ స్వాగతం చెప్తూంటాను. ఒకే దేశస్థులం కాబట్టి మనం ఒకరినొకరం జాగ్రత్తగా చూసుకోవాలి’ గ్లాస్ పూర్తి చేసి చెప్పాడు.
ఆ బార్‌లోకి మరొకరు వచ్చారు. నేను గమనించలేదు కాని హేరీ గమనించి అతన్ని చూడమన్నట్లుగా సైగ చేశాడు. తల తిప్పి ఓ తెల్లవాడ్ని చూశాను. అతని వయసు ఏభైలలో ఉంటుంది. ఖరీదైన, శుభ్రమైన దుస్తులు వేసుకుని ఉన్నాడు.
‘నేను చెప్పిన అమెరికన్ అతనే’ హేరీ చెప్పాడు.
‘అమెరికాలో మీరేం చేస్తూండేవాళ్లు?’ అడిగాను.
‘ఓ బేంక్‌లో పని చేస్తూండేవాడిని. వాషింగ్టన్ రాష్ట్రంలో, సియాటిల్ సమీపంలోని చిన్న ఊళ్లో’
‘ప్రపంచం అంచులో ఉన్న ఇక్కడికి ఎలా తేలారు?’
‘ప్రతీ మనిషికీ ఓ కథ ఉంటుంది. ప్రతీ కథలో ఇంకొన్ని పాత్రలు ఉంటాయి. నా కథలో కూడా అలాగే జరిగింది.’
అతని కంఠంలో కొంత సీరియస్‌నెస్ వచ్చింది.
‘మీకు నా కథ చెప్తాను. ఇక్కడ నా కథ ఎవరూ వినరు. ఈ మెక్సికన్స్‌కి ఏ విషయంలో పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక్కడికి వచ్చే అమెరికన్స్ కూడా. నేను సాటి అమెరికనే అయినా, అసలు నా ముందు కూర్చోవడానికే ఇష్టపడరు. మీరు మాత్రం పెద్దమనిషి. అక్కడ కూర్చున్న అమెరికన్‌ని చూడండి. శివార్లలో మంచి ఇల్లుంది. అతను పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి ముందే రిటైరయ్యాడు కాబట్టి పెన్షన్ కూడా వస్తుంది. నిద్ర లేచాక, మళ్లీ నిద్ర పోబోయే ముందు ఆదాయం కోసం అతను ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. అతను పని చేయకుండానే ఆదాయాలు వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.’
హేరీ గ్లాస్‌లోకి లిక్కర్ని వొంచుకుని దాన్ని మూడు వంతులు తాగి ఖాళీ సీసాని బల్ల మీద పడుకోబెట్టి చెప్పాడు.
‘నేను దొంగని’
‘దొంగా?’ ఆశ్చర్యంగా అడిగాను.
‘అవును. నేను పని చేసే బేంక్‌లో తప్పుడు అకౌంట్లు రాస్తూ బేంక్ డబ్బుని మింగి, వాటిని కొన్ని దొంగ అకౌంట్స్‌లో రాయడం ద్వారా ఆడిటర్లకి దొరక్కుండా మేనేజ్ చేస్తూ వచ్చాను. అందుకోసం నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకునే వాడిని కాను. పది డాలర్లతో దొంగతనం మొదలెట్టి దాన్ని క్రమంగా వందలకి, చివరికి వేలకి విస్తరించారు. ఆ డబ్బు ఏమైందో ఆడిటర్లకి తెలీదు. అవి అకౌంట్లో నల్లక్షరాల్లో కనిపిస్తూనే ఉండేవి. వారి ప్రశ్నలకి తెలివిగా, తడబడకుండా జవాబు చెప్పేవాడిని. ఓ ఆడిటింగ్ క్లర్క్ ఓసారి నా మీద అనుమానం వ్యక్తం చేస్తే ‘హేరీ మా బేంక్‌లో చాలా కాలంగా పని చేస్తున్నాడు, నిజాయితీపరుడు, ఇంతదాకా ఎన్నడూ సెంట్ కూడా తేడా రాలేదు. బేంక్ పేపర్ క్లిప్ లేదా రబ్బర్ బేండ్‌ని కూడా ఇంటికి తీసుకెళ్లడు. మేము ఎన్నో సందర్భాల్లో అతని మీద ఆధారపడ్డాం’ అని మా మేనేజర్ జవాబు చెప్పాడు.
అతను గ్లాసుని ఖాళీ చేసి ఇంకాస్త కావాలన్నట్లుగా ఖాళీ గ్లాస్‌ని చూపించాడు. నేను వెయిటర్‌కి సైగ చేసి అడిగాను.
‘తర్వాత?’
‘నేను మధ్యతరగతి మనిషిలానే జీవించేవాడిని. దొంగిలించిన డబ్బులోంచి ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయలేదు. నా జీవన శైలి వల్ల ఎవరికీ అనుమానం రాకూడదని జాగ్రత్త పడ్డాను. నేను పెట్టుకున్న పరిమితి ఐదు లక్షల డాలర్లు. అది ఆరంభించిన ఆరేళ్లల్లో దొంగిలించాను. ఆ డబ్బుతో పారిపోయి ఇక జీవితాంతం కష్టపడకుండా దర్జాగా జీవించాలన్నది నా పథకం. అక్కడ నించి ముందుగా నేను రీసెర్చి చేసి ఎన్నుకున్న ఈ ఊరికి వచ్చాను’
వెయిటర్ ఇంకో సీసాని తెచ్చి బల్ల మీద ఉంచి వెళ్లాడు.
‘చూశారా? మీ కోసం సీసా తెస్తే మూత తీసి గ్లాస్‌లో పోసి వెళ్తాడు. నాకో? ఈ మెక్సికన్ వెధవలంతా ఇంతే.’
అతను వెయిటర్ని పిలిచి స్పేనిష్ భాషలో గట్టిగా అరుస్తూ ఏదో చెప్తే వాడు నిర్లక్ష్యంగా నవ్వుతూ సీసా మూతని తెరిచి బల్ల మీద ఉంచి వెళ్లాడు.
‘వెధవకి టిప్ ఇవ్వకండి’ హేరీ కోపంగా గ్లాస్‌లోని మద్యాన్ని వంచుకుంటూ చెప్పాడు.
‘మీరు మధ్యలో ఆపారు. ఇక్కడికి ఐదు లక్షల డాలర్లతో వచ్చారా?’ అడిగాను.
‘అవును.’
‘ఆ డబ్బంతా ఏమైంది? మీరింత బీదగా ఎలా మారారు?’ ఆసక్తిగా అడిగాను.
‘మా బేంక్ సొమ్ముని ఇన్సూర్ చేసింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఐదు లక్షలు పెద్ద మొత్తం. పోలీసులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో వాళ్లు నన్ను వెతికి పట్టుకోవడానికి ఓ డిటెక్టివ్‌ని నియమించారు. భార్య, మాట వినని కొడుకుల్ని వదిలి మాయమైన నన్ను పట్టుకోవడం కష్టమే కాని ఆ డిటెక్టివ్ జేమ్స్‌కి మనుషుల్ని వెతికి పట్టుకోవడంలో విశేషానుభవం ఉంది. ఎలా తెలుసుకున్నాడ కాని ఓ రోజు ఇక్కడికి చేరుకుని నా గురించి విచారించాడు. ఇంత చిన్న ఊళ్లో ఆర్నెల్లుగా ఉంటున్న ఏకైక అమెరికనైన ననన్ను అతను తేలిగ్గా కనుక్కున్నాడు. ప్రపంచంలో ఓ మూలకి విసిరేసినట్లున్న ఇంత చిన్న ఊళ్లో నేను దాక్కున్నానని అతను ఎలా తెలుసుకున్నాడో ఆశ్చర్యమే. అడిగినా అతను నాకు చెప్పలేదు.’
హేరీ మొహంలో నాకు ఆవేశం కనిపించింది. గ్లాస్‌లోని మొత్తం తాగేసి నోటిని తుడుచుకున్నాడు.
‘తర్వాత?’ అతను చెప్పడం ఆగడంతో అడిగాను.
‘చివరి దాకా వినండి. అతను వెంటనే బయటపడలేదు. ఓ పర్యాటకుడిగా నటిస్తూనే నేనా ఐదు లక్షల డాలర్లని ఎక్కడ దాచానో కనుక్కున్నాడు. కేమన్ ఐలాండ్స్‌లోని ఏ బేంక్‌లో ఏ పేరుతో దాన్ని దాచానో, నెల నెలా నాకా బేంక్ నించి వచ్చే వడ్డీ చెక్కుల కవర్ల మీది ఫ్రం అడ్రస్ చదివి తెలుసుకున్నాడు. ఈలోగా నాకు రోసిటాతో పరిచయమైంది. దాదాపు ప్రతీ రాత్రి ఆమెతో గడిపేవాడిని. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేసే ఎవరికైనా ఆమె సుఖాన్ని ఇస్తుంది. నేను శివార్లలో కొన్న ఓ ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా వచ్చేది. నాకు అందులో చిన్న బార్ ఉండేది కాబట్టి నేనీ బార్‌కి వచ్చేవాడిని కాను. నన్ను రమ్మని దీని యజమాని నాలుగైదు సార్లు మా ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించాడు.’
హేరీ కొద్ది క్షణాలు ఆలోచనగా సాగి మళ్లీ కొనసాగించాడు.
‘ఆ డిటెక్టివ్ స్థానిక పోలీసుల సహాయంతో నన్ను అరెస్ట్ చేయడానికి అవసరమైన పత్రాలని సిద్ధం చేసుకున్నాక ఓ రోజు మా ఇంటికి వచ్చి వాటిని చూపించాడు. గత రెండున్నర ఏళ్లుగా అతను ఈ ఊళ్లో ఉంటూ ఇక్కడ ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతను జీవితకాలం అనేక చోట్లకి తిరుగుతూ, మనుషుల్ని వేటాడే క్రమంలో ఆ ఉద్యోగంతో విసిగిపోయాడు. కాని అతనికి ఆ పని తప్ప ఇంకో పని తెలీదు. కాబట్టి అయిష్టంగానే ఆ ఉద్యోగంలో కొనసాగుతూ పెళ్లి కూడా చేసుకోకుండా జీవిస్తున్నాడు. అతనికి కూడా నాకు వచ్చిన ఆలోచనే వచ్చింది.
‘ఓ రోజు అతను మా ఇంటికి వచ్చి ఆ పత్రాలు చూపించి చెప్పాడు. ‘నువ్వు నా వెంట తిరిగి అమెరికా బయలుదేరటానికి సిద్ధపడాలి.’ నేను అందుకు ఇష్టపడలేదు. ‘నాతో అమెరికాకి పోలీస్ ఎస్కార్ట్‌తో వచ్చి శేష జీవితం జైల్లో గడుపుతావా? లేక నువ్వు కేమన్ ఐలాండ్స్‌లో బేంక్‌లో దాచిన సొమ్ముని, ఈ ఇంటిని నాకు బదిలీ చేసి ఇక్కడే స్వేచ్ఛగా జీవిస్తావా? నువ్వు అది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.’ ఈ పరిణామానికి నేను ఆశ్చర్యపోయాను’ హేరీ దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు.
‘అతను చెప్పిన రెండు ఛాయిస్‌లలో దేంట్లోను నా సొమ్ము నాకు ఉండదు. అమెరికాకి నేను వెళ్తే ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ తీసేసుకుంటుంది. నాకు జైలుశిక్ష తప్పదు. అతనికి ఆ డబ్బు ఇస్తే ఇక్కడే కనీసం స్వేచ్ఛగానైనా జీవించవచ్చు. ఆ రెండిటిలో నేను రెండోదే కోరుకున్నాను. సెంట్ కూడా లేక ఇలా బికారినయ్యాను. అతను మళ్లీ అమెరికాకి వెళ్లకుండా నేను కోరుకున్న జీవితాన్ని నేను కొట్టేసిన డబ్బుతో ఎలాంటి శిక్షా లేకుండా అనుభవిస్తున్నాడు. దాంతో రోసిటా నన్ను వదిలేసి అదే బంగ్లాలో రాత్రుళ్లు ఇప్పుడు అతనితో గడుపుతోంది.’
నేను దూరంగా బల్ల ముందు కూర్చున్న ఆ అమెరికన్ వంక చూశాను. రోసిటా అతనికి లిక్కర్‌ని సర్వ్ చేస్తోంది. ఆమె అతని ఒళ్లో కూర్చుని అతని గ్లాస్‌లోని వైన్‌ని చొరవగా తాగడం కూడా గమనించాను. వాళ్ల మధ్య కొన్ని చుంబనాలు కూడా జరిగాయి.
రెండు సీసాలు పూర్తిగా తాగడంతో హేరీ మత్తుగా బల్ల మీద తలని వాల్చేశాడు. కొద్ది సేపట్లో అతని గుర్రు వినిపించసాగింది. నేను బేకన్ తిని బిల్ చెల్లించి నెమ్మదిగా లేలచాను. తాగి తూగుతూ నడిచే జేమ్స్ నడుం చుట్టూ చేతిని వేసి రోసిటా అతన్ని జాగ్రత్తగా కారు ఎక్కించడానికి బయటకి తీసుకెళ్లడం గమనించాను.
(డాన్ సేన్‌ఫోర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి