క్రైమ్ కథ

సులువైన దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాక్ తన గదిలోకి రాగానే అతని బాస్ మేకిన్‌తోష్ చెప్పాడు.
‘తలుపు మూసి వచ్చి కూర్చో’
తను చదివే ఉత్తరాలని పూర్తి చేసేదాకా మేకిన్‌తోష్ జాక్ వంక చూడలేదు. తర్వాత అతన్ని అడిగాడు.
‘సిగరెట్ కావాలా జాక్?’
‘వద్దు సర్’
తను ఉద్యోగంలో చేరిన ఇనే్నళ్లల్లో ఆయన తనకి సిగరెట్ ఆఫర్ చేయడం అదే మొదటిసారి కాబట్టి జాక్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు.
‘్భయపడక. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయడం లేదు. నీకో అసాధారణ ప్రతిపాదన చేద్దామని పిలిచాను’ జాక్ మొహంలోని భయాన్ని గమనించి మేకిన్‌తోష్ చిరునవ్వుతో చెప్పాడు.
‘ఎస్సార్’
‘చెయ్యాల్సిన పనికి నువ్వు సరైన వాడివా కావా అని నిర్ణయించుకోడానికి నీ వ్యక్తిగత జీవితం గురించి కొంత విచారించాను’
జాక్ మాట్లాడలేదు.
‘నువ్వు కొన్ని వేల డాలర్ల అప్పులో ఉన్నావు. అవునా?’
‘అవును సర్’
‘సాధారణంగా మన కంపెనీలోని ఉద్యోగి అంత మొత్తం అప్పుల్లో పడితే అతన్ని కొనసాగించేందుకు సంకోచిస్తాం. కాని భయపడక. చెప్పాగా. నిన్ను తీసేయడం లేదు. మీ నాన్న లేరు కాబట్టి మీ అమ్మ అనారోగ్య చికిత్స బాధ్యత నీ మీదే ఉంది. కాలేజీలో చదివే నీ తమ్ముడి బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావు. ఆర్థికంగా కుదుటపడ్డాక పెళ్లి చేసుకుందామని నీ కాబోయే భార్యకి చెప్పావు’
‘మీరు నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు సర్’
‘నువ్వు ఇరవై ఐదు వేల డాలర్ల అప్పు చేసావు. నీకు ఇక్కడ వారానికి వెయ్యి డాలర్ల జీతం వస్తుంది. కాబట్టి ఇప్పట్లో ఆమెని పెళ్లి చేసుకునే అవకాశం నీకు లేదు.’
‘అవును సర్’ తన వ్యక్తిగత విషయాలని ఆయన తెలుసుకున్నందుకు జాక్‌కి వచ్చిన కోపాన్ని బయటకి ప్రదర్శించలేదు.
‘నేను నిన్ను ఇక్కడికి నీ ఆర్థిక సమస్యలు చర్చించడానికి పిలవలేదు. నా ప్రతిపాదనకి నువ్వు సరైన వ్యక్తని భావించి పిలిపించాను’
జాక్ వౌనంగా దాని కోసం ఎదురుచూశాడు.
‘ఆ పాతిక వేల డాలర్లు నీకు నేను ఇవ్వబోతున్నాను’
‘నిజంగానా సర్? నేను ఎవర్ని చంపాలి?’ జాక్ హాస్యంగా అడిగాడు.
‘అవును. అందుకు బదులుగా నువ్వు నా భార్యని చంపాలి’
‘ఏమిటి?’ జాక్ తుళ్లిపడ్డాడు.
‘మా ఆవిడ్ని చంపాలన్నాను’
‘నాకు మీ జోక్ అర్థం కాలేదు సర్’
‘అర్థమవడానికి అందులో జోక్ అంటూ లేదు’
‘కాని నేను ఎవర్నీ చంపలేను. ముఖ్యంగా మీ ఆవిడని’
‘ఎందుకు చంపలేవు? ఆమె నీకు పరిచయస్థురాలు కాదు’
‘ఒకర్ని చంపడానికి అది సరైన కారణం అనుకోను సర్’
‘ఓ భార్య హత్య చేయబడితే మొదటి అనుమానితుడు ఆమె భర్తే అవుతూంటాడు. భర్తకి పటిష్టమైన ఎలిబీ ఉంటే తప్ప’
‘కాని మీ ఆవిడ్ని చంపితే నాకు ఎలిబీ ఉండదు’ జాక్ నెమ్మదిగా తేరుకుంటూ చెప్పాడు.
‘అనవసరం. నిన్ను ఎవరు అనుమానిస్తారు? నా భార్యని చంపేందుకు నీకు ఏం కారణం ఉంటుంది?’
‘నేను ఇందుకు ఒప్పుకుంటానని మీరు ఎలా భావించారు సర్?’
‘అందరికీ డబ్బు మీద ఆసక్తి ఉంటుంది. తీర్చలేని అప్పుల్లో ఉన్నవారికి ఇంకా ఉంటుంది. పాతిక వేల డాలర్లు సరైన కారణం అవుతుంది.’
‘నేను తిరస్కరించి, ఇది పోలీసులకి చెప్తే?’
‘సాక్ష్యం లేకుండా నిన్ను వాళ్లు నమ్ముతారా?’
‘నమ్మరు. కాని తర్వాత మీ భార్య మరణిస్తే ఇది వాళ్లకి గుర్తొస్తుంది’
‘వాళ్లకి ఫిర్యాదు చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి?’
‘ఒకరు హత్య చేయబడకపోవడమే నా లాభం. కాని నాకు పాతికవేలు కూడా ముఖ్యమే. అందువల్ల నా పెళ్లికి ఆలస్యం అవదు. ఆమెని నేను ఎలా చంపాలని అనుకుంటున్నారు?’ జాక్ అడిగాడు.
‘అది నీ ఇష్టం’
‘ఎప్పట్లోగా?’
‘అదీ నువ్వే చెప్పు. అవసరమైన ఏర్పాట్లు చేసుకుని నాకు ముందుగా చెప్పు. నేను ఆ సమయంలో ఎలిబీని ఏర్పాటు చేసుకుంటాను’
‘కాని నాకు డబ్బు ముందుగా కావాలి సర్’
‘అంటే నన్ను నమ్మవా?’
‘అది సమస్య కాదు. ఒకవేళ నేను పట్టుబడితే? అందుకని ఈలోగా నా కుటుంబానికి నేనా డబ్బుని ఇవ్వాలి’
‘సరే. ముందుగా ఇస్తాను’
‘ఆమెని ఎందుకు చంపుదామని అనుకుంటున్నారు?’
‘అది నీకు అనవసరం’
‘నన్ను క్షమించండి మిస్టర్ మేకిన్‌తోష్. బాస్‌గా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు అనుకోకండి. బాస్, క్లర్క్‌గా కాక అడుగుతున్నాను. నేను ఎవర్నైనా చంపాల్సి వస్తే, అందుకు కారణం తెలుసుకునే హక్కు నాకు ఉంటుంది’ జాక్ వినయంగా చెప్పాడు.
‘అసూయ. అంతకన్నా ఎక్కువ చెప్పను. నా కారణం వ్యక్తిగతం. నీ కారణం ఆర్థికం. నేను ఊహించిన దానికన్నా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు’
‘అది నాకూ ఆశ్చర్యంగా ఉంది. మీరు అనుమతిస్తే నేను ఇంటికి వెళ్లిపోతాను. ఏదైనా పథకం ఆలోచించడానికి ఆఫీసులో కుదరదు’
ఇంటికి వెళ్తూంటే, తన తల్లి దగ్గర తన తండ్రి రివాల్వర్ ఒకటి ఉందని అతనికి గుర్తొచ్చింది. ఏభై - అరవై ఏళ్ల క్రితం దాన్ని అమ్మిన షాప్ మూసేశారు. అది ఎవరిదో పోలీసులు తెలుసుకోలేరు. నలభై మైళ్ల దూరంలో యూనివర్సిటీలో తన తమ్ముడు చదివే ఊళ్లోని తన తల్లి ఉండే ఇంటికి వెళ్లాడు. అతను గతంలో ఎక్కడ దాన్ని చూశాడని గుర్తుందో ఆ రివాల్వర్ సరిగ్గా అక్కడే ఉంది. బట్టల అలమరలో కింది అరలో. దాని పక్కనే గుళ్ల పెట్టె కూడా ఉంది.
లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని తమ్ముడు తిరిగి వచ్చేలోగా ఆ రివాల్వర్ని శుభ్రం చేశాడు. అందుకు అతనికి గంటన్నర పట్టింది. తన తల్లి తిరిగి వచ్చేసరికి అతను బయటకి వచ్చేశాడు.
తిరిగి వస్తూ కారుని ఓ చోట ఆపి దూరంగా ఉన్న చెట్లలోకి నడిచి పేల్చాడు. అది పేలిన శబ్దం ఎంత గట్టిగా ఉందంటే అతను భయంతో ఉలిక్కిపడ్డాడు. అది జాం కాకుండా పని చేస్తోందని తెలుసుకున్నాడు.
ఆ రాత్రి అతని తమ్ముడి నించి జాక్‌కి ఫోన్ వచ్చింది.
‘నువ్వు వచ్చి వెళ్లావని పక్కింటి వాళ్లు వచ్చి వెళ్లారు. ఏదైనా సమస్యా?’
‘లేదు’
‘మరి? వేళ కాని వేళ ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్లావు?’
‘ఊరికే’
* * *
మర్నాడు జాక్ మేకిన్‌తోష్ గదిలోకి వెళ్లి ఆయన కూర్చోమనకుండానే కూర్చున్నాడు. మేకిన్‌తోష్ కళ్లల్లో కొంత అసహనం కనిపించింది.
‘ఈ రాత్రికే’ జాక్ చెప్పాడు.
‘అంత త్వరగానా?’
‘నాకు నచ్చని పని కాబట్టి ఎంత తొందరగా చేస్తే నాకు అంత శాంతి. లేదా మనసులో అదో బరువు’
‘ఎలా చేస్తున్నావు. ఒద్దు. చెప్పక. పోలీసుల నించే తెలుసుకుంటాను’
‘డబ్బు సిద్ధంగా ఉందా సార్?’
బల్ల మీది తన సిగరెట్ పెట్టెలోంచి జాక్ చనువుగా ఓ సిగరెట్ తీసి వెలిగించడం గమనించిన మేకిన్‌తోష్ మొహం చిట్లించాడు.
‘సాయంత్రం ఐదుకి బ్యాంక్‌లోంచి డ్రా చేసి ఇస్తాను. ఇంత త్వరగా అని నేను ఎదురుచూడలేదు’
‘ఈ రాత్రికి మీకు ఎలిబీ ఉండాలి’ జాక్ గుర్తు చేశాడు.
‘అలాగే’
‘మీ ఆవిడ ఇంట్లోనే ఉంటుందిగా?’
‘ఉంటుంది’
‘ఒంటరిగానా?’
‘అవును. ఒంటరిగానే ఉంటుంది’
‘పదింటికి ఓకేనా?’
మేకిన్‌తోష్ సరే అన్నట్లుగా తల ఊపాడు. సిగరెట్‌ని ఏష్‌ట్రేలో ఆర్పేసి లేచి బయటకి వెళ్లిపోయాడు.
సాయంత్రం ఐదుకి జాక్ ఆఫీస్ నించి ఇంటికి వెళ్తూ మేకిన్‌తోష్ గదిలోకి వెళ్తే డబ్బు ఇచ్చాడు.
సరాసరి తన తల్లి ఇంటికి చేరుకుని తమ్ముడికి ఆ డబ్బుని ఇచ్చాడు.
* * *
రాత్రి పదికి మేకిన్‌తోష్ భార్య తన పడక గదిలో టీవీ చూస్తోంది. ముందుగా చెప్పకుండా తన భర్త ఆ రాత్రి ఇంటికి రానందుకు ఆమెకి కోపంగా ఉంది. డోర్ బెల్ చప్పుడు విని లేచి వెళ్లి తలుపు తెరచింది. తన భర్తని తిట్టాలనుకున్న ఆమె ఆ అపరిచితుడ్ని ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఒంట్లోకి రెండు గుళ్లు దిగాయి.
* * *
జాక్ అపార్ట్‌మెంట్‌లో కొద్ది గంటలుగా పార్టీ జరుగుతోంది. తెల్లవారుఝామున రెండుకి డోర్ బెల్ విని తలుపు తెరచిన ఒకతను పోలీసులని చూసి గట్టిగా అరిచాడు.
‘జాక్.. పోలీసులు. బహుశా పక్కింటి వాళ్లు మన మీద ఫిర్యాదు చేసినట్లున్నారు’
‘బేంగో డ్రమ్స్‌ని శ్రావ్యంగా వాయించానని అనుకున్నానే?’ జాక్ తూలుతూ పోలీసుల దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘మేం వచ్చింది దాని గురించి కాదు. మీతో వ్యక్తిగతంగా మాట్లాడచ్చా?’ లెఫ్టినెంట్ కోరాడు.
‘నువ్వు అంతర్జాతీయ గూఢచారివని నాతో ఎన్నడూ చెప్పలేదే?’ తాగి ఉన్న ఓ యువతి జాక్‌తో నవ్వుతూ చెప్పింది.
‘సారీ! ఈమెకి నా గురించి అంతా తెలుసు. నా కాబోయే భార్య కదా. మా ఎంగేజ్‌మెంట్ పార్టీ జరుగుతోంది. ఆమె లేకుండా నేను పోలీసులతో మాట్లాడాల్సింది ఏమీ లేదు’ జాక్ చెప్పాడు.
‘ఈ రాత్రి పదికి మీరు ఎక్కడ ఉన్నారు?’
‘ఇక్కడే. ఎందుకు?’
‘అది రుజువు చేయగలరా?’
జాక్ చిరునవ్వు నవ్వాడు.
‘ఇక్కడున్న ఇరవై మందినీ అడగండి. వాళ్లు ఏం చెప్తారో వినండి’
‘అవును. సూర్యుడు ఉన్నప్పుడు మొదలెట్టాం. సూర్యోదయం దాకా ఈ పార్టీని ఆపం’ ఆ యువతి చెప్పింది.
వెంటనే లెఫ్టినెంట్, సార్జెంట్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు.
‘మా వాడు రాత్రి పదికి ఎక్కడో ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు?’ అతని మిత్రుడు అడిగాడు.
‘మీకు మేకిన్‌తోష్ తెలుసా?’ లెఫ్టినెంట్ అడిగాడు.
‘తెలుసు’
‘ఇవాళ మధ్యాహ్నం మీరు ఆయన్ని బెదిరించారా?’
‘లేదు. ఏం జరిగింది?’
‘మీరు బెదిరించారని రిపోర్ట్ చేశాడు’
‘మీకు ఆయన అబద్ధం చెప్పాడు’
‘అతని భార్యని రాత్రి పదికి ఎవరో చంపారు’ సార్జెంట్ చెప్పాడు.
‘అలాగా? వెరీ సారీ’
‘ఎందుకు సారీ? ఆమె మీకు పరిచయమా?’
‘లేదు. కాని నాకు పరిచయం లేని మనిషి మరణించినా నాకు బాధ కలుగుతుంది’
‘మేకిన్‌తోష్ మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసారని, మీరు ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన్ని బెదిరించారని ఫిర్యాదు చేశాడు’
‘ఓ! అదా? నన్ను తీసేసినందుకు ఆయన బాధ పడతాడని చెప్పాను. అతని పోటీ వ్యాపారస్థుడి దగ్గర చేరితే అతని వ్యాపారం తగ్గుతుందని చెప్పాను’
‘ఐతే రాత్రి ఎనిమిది నించి మీరు ఇక్కడే ఉన్నారా?’
‘ఇంకోసారి వీళ్లని అడగండి’
‘ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. కాని నిజం తెలుసుకోవడం మా బాధ్యత’
‘్భర్తే ఎప్పుడూ ప్రధాన అనుమానితుడు అనుకుంటాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారు?’ జాక్ అడిగాడు.
‘మీరు తనని బెదిరించారని, తనని బాధ పెట్టడానికి ఆవేశంతో మీరా హత్య చేసి ఉండచ్చని చెప్పాడు’
‘మేకిన్‌తోష్ ఇవాళ సాయంత్రం పాతిక వేల డాలర్లు ఎందుకు డ్రా చేశాడో, దాన్ని ఎవరికి ఇచ్చాడో కనుక్కున్నారా?’
వెంటనే ఆ ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు.
‘అలాగా? మీకెలా తెలుసు?’ లెఫ్టినెంట్ అడిగాడు.
‘ఎవరితోనో ఫోన్‌లో, రాత్రికి పని పూర్తి చేయమని, సాయంత్రం బేంక్ నించి పాతిక వేల డాలర్లు డ్రా చేసి ఇస్తానని చెప్తూంటే విన్నాను’
‘్థంక్స్. కోర్టులో ఇది సాక్ష్యంగా చెప్తారా?’
‘దేశ పౌరుడిగా అది నా బాధ్యత. తప్పక చెప్తాను’
* * *
మర్నాడు జాక్ తన తమ్ముడికి ఫోన్ చేశాడు.
‘మేకిన్‌తోష్ నమ్మదగ్గ వాడు కాదని నువ్వు చెప్పింది నిజమే’
‘ఎందుకంటే నువ్వు అతనికి ప్రమాదకరమైన మనిషివి అవుతావని, బ్లాక్‌మెయిల్ చేస్తావని భయపడి ఇక నిన్ను ఉద్యోగంలో ఉంచడు. ఎవరి మీదైనా నింద పడకపోతే పోలీసులు అతనే్న అనుమానిస్తారని అతనికి తెలుసు.’
‘ఇప్పుడు అనుమానం అతని మీదకే మళ్లింది’
‘అందుకే నిన్ను ఇన్‌వాల్వ్ కావద్దంది’
‘ఆ పని చేయడానికి నీకు ఇబ్బందేం కలగలేదుగా?’
‘లేదు. గుమ్మంలోనే పని త్వరగా పూర్తి చేశాను’
‘్థంక్స్’
‘ఒద్దన్నావు కాని సోదరుడిగా మన కుటుంబానికి నేనా మాత్రం చేయలేనా?’
‘రివాల్వర్ ఏం చేసావు?’
‘నదిలో ఉంది. ఏం?’
‘ఇంకో రివాల్వర్‌ని సంపాదించాలి’
‘దేనికి?’
‘నాకు ఉద్యోగం లేదు. పాతిక వేలు తేలిగ్గా సంపాదించే మార్గం కదా అది’ జాక్ చెప్పాడు.
(గ్లెన్ కేనరీ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి