క్రైమ్ కథ

సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టు హాల్లో కూర్చుని ఉన్న నవోమీ తన లాయర్ భర్త కోసం ఆందోళనగా వేచి ఉంది. ఆ కేసులో అతని వాదన పూర్తయ్యాక సమీపంలోని రెస్టారెంట్‌కు లంచ్‌కి తీసుకెళ్తానని చెప్పాడు. అక్కడ తమ భవిష్యత్ గురించి చర్చించుకోవాలి.
క్రితం రాత్రి అతను తనతో అన్న మాటలు నవోమీకి గుర్తొచ్చాయి.
‘నా జీవితంలోకి మరొకామె ప్రవేశించింది. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.’
నివ్వెరపోయిన నవోమీ ఏదో చెప్పబోతూంటే ఆమెకి అడ్డుపడి చెప్పాడు.
‘విడాకుల విషయంలో నేనో నిర్ణయానికి వచ్చాను. షరతుల గురించి ఈ కేసు పూర్తి అయ్యాక మాట్లాడుకుందాం’
‘నాకు విడాకులు ఇష్టం లేదు’
‘రేపు లంచ్ అవర్లో పదకొండున్నరకి కోర్టుకి రా’
ఓసారి అతను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి వెళ్లడని ఆమెకి తెలుసు. అందుకే ఆమె మనసంతా ఆందోళనగా ఉంది.
నవోమీ నిందితుడు జెరోమ్ వంక చూసింది. పంతొమ్మిదేళ్ల అతను ధైర్యంగా కనపడే ప్రయత్నం చేస్తున్నాడు.
కోర్ట్ క్లర్క్ హెన్రీని బోనెక్కించాడు. నవోమి భర్త అర్నాల్డ్ ప్రధాన సాక్షి హెన్రీని క్రాస్ ఎగ్జామ్ చేయసాగాడు.
‘నా క్లైంట్ జెరోమ్ కారు ఎర్ర లైటు వెలుగుతున్నా ముందుకి వెళ్లి ఏగ్నెస్ అనే ఆమెని ఢీకొట్టడం నువ్వు చూసానని సాక్ష్యం చెప్పావు. నువ్వు పోలీసులకి ఆ మాటే చెప్పావా?’
‘అవును... అదే’
‘అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయా?’
‘ఉన్నాయి..’
‘నా క్లైంట్ జెరోమ్ ఆకుపచ్చ లైట్ వెలుగుతూండగా తన కారుని పోనించానని చెప్తున్నాడు. మరి నువ్వు ఎర్ర లైటు వెలుగుతూండగా కారు వెళ్లిందని ఎలా చెప్పగలవు?’
‘నేను చూసాను కాబట్టి’
‘అంటే నా క్లైంట్ అబద్ధం ఆడాడని ఆరోపిస్తున్నావా?’ అర్నాల్డ్ ప్రశ్నించాడు.
‘సాక్షిగా నేను అబద్ధం చెప్పడం లేదు..’
నవోమీకి తన భర్త ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దగ్గర చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
‘ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం లేదు. కాబట్టి ఒకప్పటి మాటలు కట్టిపెట్టు. నేను ఇప్పుడు ప్రేమించేది నిన్ను కాదు’
అర్నాల్డ్ మళ్లీ సాక్షిని ప్రశ్నించాడు.
‘మీరా చౌరస్తాలో ప్రమాదం జరిగిన సమయంలో నిలబడి ఉన్నావు. అవునా?’
‘కాదు. అక్కడి బస్‌స్టాప్‌లోని బెంచీ మీద బస్ కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నాను’
‘ఆ సమయంలో హతురాలు ఏగ్నెస్ రోడ్ మీద నడిచి రావడం నువ్వు చూసావా?’
‘చూశాను’
‘ఎటు వైపు నించి వస్తోంది?’
‘తూర్పు నించి. ఆవిడ తన మనవడ్ని చూసి ఇంటికి వెళ్లాలంటే తూర్పు వైపు నించే రావాలి’
‘ఆ సంగతి నీకు ఆవిడ ఎప్పుడు చెప్పింది? మరణానికి మునుపా? తర్వాతా?’
‘ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత ఇది పోలీసులు చెప్పారు.’
‘ఇతరులు చెప్పింది కాక సాక్షిగా నువ్వు చూసింది మాత్రమే ఇక్కడ చెప్పాలి. లేదా జూరీ సభ్యులు పొరబడే అవకాశం ఉంది. అర్థమైందా?’ అర్నాల్డ్ అడిగాడు.
‘అయంది..’ హెన్రీ చెప్పాడు.
‘నువ్వు కూర్చున్న బెంచికి, ట్రాఫిక్ లైట్స్‌కి మధ్య ఎంత దూరం ఉంది?’
‘సుమారు ఏభై గజాలు’
‘అంటే ఇక్కడ నించి ముద్దాయి జెరోమ్ కూర్చున్నంత దూరమా?’
‘సుమారుగా అంతే..’
‘నాకు నువ్వు ఓసారి ఇది వివరించాలి. ప్రమాదానికి మునుపు నువ్వు ఏగ్నెస్‌ని చూడలేదని చెప్పావు. నువ్వు బెంచీ మీద కూర్చుని బస్ కోసం వేచి ఉన్నావు. ఏగ్నెస్ చౌరస్తాకి తూర్పు వైపు నించి వస్తోంది..’
కోర్టు సిబ్బంది ఒకరు జడ్జికి, జూరీ సభ్యులకి కనపడేలా బ్లాక్ బోర్డ్‌ని అమర్చారు. దాని మీద చౌరస్తా, అతను కూర్చున్న బెంచ్, ప్రమాదం జరిగిన ప్రదేశం బొమ్మలు గీసి ఉన్నాయి. అర్నాల్డ్ సూచన మీద ఏగ్నెస్ ఎట్నించి వస్తోందో అక్కడ ఇంటూ గుర్తు పెట్టారు.
‘ఆవిడ అడుగుల చప్పుడు నీకు వినిపించిందా?’
‘విన్నానో లేదో నాకు గుర్తు లేదు. నేను సెంచరీ క్లబ్‌లో రాత్రి రెండు దాకా పని చేసి, ఇంటికి వెళ్తున్నాను’
‘అప్పుడు టైం...?’
‘తెల్లారి రెండు గంటలకి’
నవోమీకి భర్త ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
‘నేను అర్నాల్డ్‌ని.. ఇంత రాత్రి ఫోన్ చేస్తున్నందుకు సారీ... జెరోమ్ కేసులో ఓ సాక్షి పేరు హెన్రీ. అతని గురించి మొత్తం తెలుసుకోవాలి. సెంచురీ క్లబ్‌లో అతను జానెటర్‌గా పని చేస్తున్నాడు.. అలాగే, రేపు అక్కడే కలుద్దాం ఫ్రాన్’
‘ఈ రాత్రి మీరు ఆలస్యంగా రావడానికి కారణం మీ సెక్రటరీ ఫ్రానేనా?’ నవోమీ అడిగింది.
‘దాని గురించి త్వరలోనే మాట్లాడదాం. ఇప్పుడు కాదు’
అతని కంఠధ్వని చిన్నపిల్లలు ఏదైనా కోరితే, ‘ఇప్పుడు కాదు. తర్వాత..’ అని చెప్పినట్లుగా ఉంది.
‘రాత్రి నా క్లైంట్ డ్రైవ్ చేసిన కారు హెడ్ లైట్స్‌ని గమనించావా? అవి వెలుగుతున్నాయా?’
‘వెలుగుతున్నాయి’
‘నువ్వు చూసిన హెడ్‌లైట్ల కాంతిని ఏగ్నెస్ చూసి ఉంటుందా?
‘చూసే ఉంటుంది’
‘నీకు ట్రాఫిక్ లైట్లు ఎటు వైపు ఉన్నాయి?’
‘కుడి వైపు’
‘ఏగ్నెస్ నీకు ఎటు వైపు నుంచి వచ్చింది?’
‘ఎడమ వైపు నుంచి’
‘కారు?’
‘కుడి వైపు నుంచి’
‘నువ్వు ట్రాఫిక్ లైట్లని చూడాలంటే తలని ఎటువైపు తిప్పాలి?’
‘కుడి వైపునకు’
‘ఆవిడని చూడాలంటే...’
‘ఎడమ వైపునకు’
‘ట్రాఫిక్ లైట్ ఎరుపు నించి ఆకుపచ్చకి మారడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?’
‘నిమిషాలు కాదు... క్షణాల్లో మారుతుంది..’
‘ఇంత సమయం చాలా?’ అర్నాల్డ్ చిటికె వేసి అడిగాడు.
‘చాలనుకుంటాను’
‘నువ్వు కుడివైపు ఎర్ర లైట్‌ని చూసి ఆవిడ అడుగుల చప్పుడు విని తల తిప్పి ఎడమ వైపు చూశావు. ఆ క్షణంలో లైట్స్ మారి ఉండచ్చా?’
‘మారి ఉండచ్చు. కానీ మారలేదు. ఎందుకంటే నేను మళ్లీ కుడి వైపు చూశాను’ హెన్రీ చెప్పాడు.
‘ఏగ్నెస్ కారు హెడ్‌లైట్లని చూసి కూడా ఎందుకు ఆగలేదు?’ అర్నాల్డ్ ప్రశ్నించాడు.
‘నాకు తెలీదు’
‘ఆవిడ ఎర్రలైటు పచ్చలైటుగా మారుతుందని గ్రహించక ఆగకపోయి ఉండచ్చుగా’
‘అవును. ఎర్రలైట్ పచ్చలైట్‌గా మారలేదు’
‘కాని ఆ సమయంలో నువ్వు ఎటు చూసావు? కుడి వైపా? లేక ఎడమ వైపా? లైటు మారిందో లేదో గమనించే అవకాశం నీకు లేదు. కారణం ఆ సమయంలో నువ్వు ఏగ్నెస్‌ని చూస్తున్నావు హెన్రీ. నిన్ను సెంచురీ క్లబ్‌తో ఉదయం షిఫ్ట్ నించి రాత్రి షిఫ్ట్‌కి ఎందుకు మార్చారు?’
హెన్రీ జవాబు చెప్పలేదు.
‘పగలు ఉద్యోగంలో ఉన్నప్పుడు లేడీస్ బాత్‌రూంలోకి వెళ్తూండే వాడివి కదా?’
‘అవును’ హెన్రీ తలవంచుకుని చెప్పాడు.
‘కారణం నీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది. జెంట్స్ బాత్‌రూం తలుపునకు ఎర్రరంగు, లేడీస్ బాత్‌రూం తలుపునకు ఆకుపచ్చ రంగు వేశారు. నీకా రంగుల మధ్య తేడా తెలీక లేడీస్ బాత్‌రూంలోకి వెళ్తూండటంతో రాత్రి పది తర్వాత క్లబ్ సభ్యులంతా వెళ్లిపోయాక డ్యూటీ వేశారు కదా? నీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది కదా?’
‘అవును’
అర్నాల్డ్ జడ్జ్ వైపు తిరిగి చెప్పాడు.
‘కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న ఇతను సరైన సాక్షి కాదు కాబట్టి ఇతని సాక్ష్యాన్ని కొట్టేయవలసిందిగా కోరుతున్నాను’
ప్రాసిక్యూషన్ వాళ్లు అందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో కేసు కొట్టేశారు.
* * *
‘పద’ అర్నాల్డ్ విజయగర్వంతో భార్యతో చెప్పాడు.
నవోమీ పార్క్ చేసిన తన కారుని రివర్స్‌లో బయటకి తీసి రోడ్ మీదకి తీసుకురాగానే ఎదురుగా రోడ్‌ని క్రాస్ చేసే అర్నాల్డ్ కనిపించాడు. కొన్ని క్షణాలు సంశయించినా ఆమె కారు వేగంగా వెళ్లి అతన్ని గుద్దింది. వెంటనే అరుపులు. కారు దిగి నవోమీ ఏడుస్తూ చెప్పింది.
‘అయ్యో! అర్నాల్డ్. నా కారు బ్రేక్‌మీంచి ఏక్సిలెటర్ మీదకి స్లిప్పైంది...’
పోలీస్ ఆఫీసర్ ఓ బెంచి మీద కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘ఇప్పుడు జరిగింది నువ్వు చూసావా?’
‘చూశాను. ఆమెకి ఆ లాయర్ ఏమవుతాడు?’ అతను అడిగాడు.
‘ఆమె భర్త’
వెంటనే అతను చిన్నగా నవ్వి చెప్పాడు.
‘నా పేరు హెన్రీ. ఇప్పుడే ఆ లాయర్ నేను కోర్టులో సాక్షిగా పనికి రానని తీర్మానం చేశాడు. కాబట్టి నా సాక్ష్యం పనికిరాదు.’
అతను తప్ప అక్కడ మరో సాక్షి లేడు. నవోమీ హెన్రీ వంక చూసింది. ఆమె కళ్లల్లో కృతజ్ఞత కనిపించింది. *

-మల్లాది వెంకట కృష్ణమూర్తి