క్రైమ్ కథ

సినిమా ప్రియుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్ మేక్‌జీ ప్రతీ రాత్రి అస్టోరియాలోని తన ఇంటికి చేరుకున్నాక వీధి వాకిటి దాటి లోపలికి వచ్చి నిలబడి వాసన చూస్తాడు. అతని భార్య అతని అలికిడి విని వంట గదిలోంచి అరుస్తుంది.
‘నువ్వేనా జాన్?’
సినిమాల అభిమానైన జాన్ ఆ సబ్‌జెక్ట్ వదిలేస్తే ఇంకేం మాట్లాడలేని మితభాషి.
‘అవును’ జవాబు చెప్తాడు.
తర్వాత వంట గదిలోకి వెళ్లి మళ్లీ వాసన చూసి అడుగుతాడు.
‘స్ట్యూ?’
‘మీ అపరాధ పరిశోధన సక్సెస్. స్ట్యూ’ అతని భార్య జవాబు చెప్తుంది.
‘ఆహా’
‘ఇవాళ కొత్తది ఏమైనా జరిగిందా?’ ఆవిడ నిత్యం అడిగే ప్రశ్నని అడుగుతుంది.
‘లేదు’ జాన్ జవాబు చెప్తాడు.
ఇలా చాలా కాలంగా జరుగుతోంది. ఒకోసారి అతని భార్య మిత్రులు ఉంటే వాళ్లు అడుగుతారు.
‘మీది చాలా ఆసక్తికరమైన ఉద్యోగం కదా జాన్? నువ్వు పనిచేసే ఆ పెద్ద హోటల్లో ఒక్క ఆసక్తికరమైనదీ జరగదా?’
‘లేదు. ఒక్కటీ జరగదు’ అతను మెల్లిగా జవాబు చెప్తాడు.
తర్వాత జాన్ సంభాషణని సినిమాల వైపు మళ్లిస్తాడు. అతనికి సినిమా సమాచారం అంతా కొట్టిన పిండి. హాలీవుడ్ నటీనటులు ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారు? ఎందుకు? ఇప్పుడు ఏ హీరోయిన్ ఎవరి భార్య, ఏ హీరో ఎవరి భర్త? గత ఇరవై సంవత్సరాల్లో వాళ్లు నటించిన సినిమాలు ఎంత గడించాయి? వార్నర్ బ్రదర్స్ ఎంతమంది? మొదలైనవి అతన తేలిగ్గా మాట్లాడగలడు.
‘ఆర్టీ షా ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారు?’ అని ఎవరైనా అడిగితే ఠక్కున జవాబు చెప్పడమే కాక, అతని గురించిన మరిన్ని వివరాలు కూడా చెప్తాడు.
హోటల్ డెలెహిలోలో జాన్ మేక్‌జీ హౌస్ డిటెక్టివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని బాధ్యత లాబీలో కూర్చుని లోపలికి వచ్చే, బయటకి వెళ్లే మనుషులని గమనిస్తూ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ల దగ్గరికి తక్షణం వెళ్లి విచారించడం. ఐతే ఆ హోటల్ లాబీలోకి వచ్చే పౌరులు అనుమానాస్పదంగా ప్రవర్తించే రకం కారు. అరుదుగా కొందరు మర్యాదస్థులు కాని పౌరులు కూడా ఆ హోటల్లోకి వస్తూంటారు. అలాంటి వాళ్లు అతని దృష్టిలో పడగానే లేచి వాళ్ల దగ్గరికి వెళ్లి, ఒకోసారి వాళ్లు తిరగబడితే దెబ్బలాడి, వాళ్లని బయటకి పంపుతూంటాడు. అతనికి నిజానికి అలాంటి దెబ్బలాటంటే ఇష్టం. అతను యువకుడిగా ఉండగా పింకర్‌టన్స్ అనే డిటెక్టివ్ సంస్థలో పని చేస్తూండగా, ఈ హోటల్లోలా శాంతిగా, మర్యాదస్థుడిగా ప్రవర్తించడం కుదిరేది కాదు. జాన్‌కి వయసు పైబడ్డా కండరాలు దృఢంగా ఉన్నాయి.
ఐతే అతను హోటల్లో డిటెక్టివ్‌లా కనిపించకూడదు. ఈ విషయంలో జాన్ చాలా విజయవంతం అయ్యాడు.
* * *
ఆ రోజు అతన్ని లాబీలోని ఓ దృశ్యం ఆవిష్కరించింది.
ఖరీదైన దుస్తులు ధరించి, పెద్ద నల్ల కళ్లజోడు పెట్టుకున్న ఒకామె కుర్చీ వైపు నడుస్తూంటే ఆమె చేతిలోంచి కిందపడ్డ హేండ్‌బేగ్‌ని ఆమె తండ్రి వయసున్న ఒకాయన తీసి ఆమెకి ఇవ్వడం గమనించాడు.
‘్థంక్ యూ’ ఆమె చెప్పింది.
‘నాట్ ఎటాల్’ ఆయన బదులు చెప్పాడు.
ఆ ఇద్దరి మొహాలు తను ఎక్కడో చూశాడని జాన్‌కి అనిపించింది. ఆ యువతి మొహాన్ని గతంలో ఎక్కడ చూశాడా అని ఆలోచించాడు.
ఎక్కడ?
ఎవరికీ తాము చూసిన మొహం పేరు, ఎక్కడ చూశారో గుర్తుకు తెచ్చుకోకపోవడం నచ్చదు. ముఖ్యంగా తను చూసిన మొహాన్ని మర్చిపోనని గర్వపడే జాన్ మేక్‌జీకి అది అసలు నచ్చదు. అందుకే అతనికి ‘గద్ద కన్ను’ అనే ముద్దు పేరు కూడా హోటల్ సిబ్బంది పెట్టారు.
ఆమె ఎవరు?
డెట్రాయిట్ డోరా?... కాదు.
చికాగో కేటీ?... కాదు.
తన భార్య బంధువుల్లో ఒకరా?.. కాదు. ఆమె చాలా మంచి బట్టలు వేసుకుంది. తన భార్య బంధువులు వేసుకునే దుస్తులని చూస్తే అలాంటి హోటల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్లని లోపలకి అనుమతించరు. తను ఆమెని కొద్దిసేపే చూసి ఉంటాడు. ఎక్కడ?
జాన్ దృష్టిలో మరో దృశ్యం పడకపోతే బహుశా ఆ రోజంతా అదే ఆలోచిస్తూండేవాడు. అతను తక్షణం గుర్తు పట్టిన ఓ మొహం అతని కంట పడింది. ఆ వ్యక్తి కోటుకి ఓ రోజా పువ్వు గుచ్చబడి ఉంది. జాన్ కుర్చీకి కొన్ని అడుగుల దూరంలో అతను ఆగి, సిగరెట్ అంటించుకున్నాడు.
పింకర్టన్ డిటెక్టివ్ ఏజెన్సీలో పని చేసేప్పుడు జాన్ మేక్‌జీ అనేక బ్రాడ్‌వే హోటల్స్‌లోని ఓ హోటల్లో చూసిన ఆ మొహాన్ని తను ఎక్కడ చూశాడు అని ఆలోచించాడు. న్యూయార్క్? లండన్? పేరిస్? చికాగో? పోలీసులు చూడగానే గుర్తు పట్టే అతని పేరు హెబ్బట్ హిగ్స్. అలియాస్ పెర్సీ స్టోక్స్. అలియాస్ ఓటిస్ ఫిట్జ్‌పేట్రిక్, అలియాస్ చౌన్సీ కోబట్, అలియాస్ క్రిస్ట్ఫర్ రాబిన్ కార్క్. 1938లో అతన్ని జానే స్వయాన అరెస్ట్ చేశాడు. ఇప్పుడు అతన్ని పోలీసులు పదిహేను వేల డాలర్ల దొంగతనం నేరం మీద వెదుకుతున్నారని కూడా జాన్‌కి తెలుసు.
తన టెరిటోరీలోకి అతను వచ్చిన సాహసానికి కొద్దిగా అబ్బురపడుతూ జాన్ లేచి నించుని నెమ్మదిగా అతని వైపు మేక వైపు నడిచే సింహంలా నడిచాడు.
ఆ రెండో వ్యక్తి దుష్టుడు. అతనికి కూడా మొహాలని గుర్తు పెట్టుకునే విద్య తెలుసు. మేక సింహాన్ని పసికట్టినట్లుగా అతను జాన్ మేక్‌జీని పసికట్టాడు. జాన్ వంక చూసి కొద్దిగా నివ్వెరపోయాడు. ఐతే అతను చిన్నగా ఈల వేస్తూ జాన్‌ని పట్టించుకోకుండా మెట్ల వైపు నడిచాడు. జాన్ అతన్ని అనుసరిస్తూ చెప్పాడు.
‘ఆగు’
ఆగకుండా అతను మెట్లెక్కి మలుపు తిరుగుతూండగా చూసిన వాళ్లు ఇద్దరు అపరిచయస్థులు ఒకరి వెనక మరొకరు వెళ్తున్నారు అని మాత్రమే అనుకున్నారు. ఆ మలుపు మీద పెద్ద పాలరాతి దిమ్మ మీద అలంకారంగా పాలరాతి భూగోళం ఉంది. అకస్మాత్తుగా ఆ దుష్టుడు పరుగు లంకించుకున్నాడు. జాన్ కూడా అదే వేగంతో పరిగెత్తుతూ అతన్ని అనుసరించాడు. ఇద్దరూ పైన కారిడార్లోకి చేరుకున్నాక ఆ దుష్టుడు వెనక్కి తిరిగి జాన్ మీదకి లంఘించి జాన్ గొంతు పట్టుకుని పిసకసాగాడు. జాన్ కూడా అతన్ని కదలకుండా పట్టుకుని అతని గొంతుని పిసకసాగాడు. ఒకరికి మరొకరు అతుక్కున్నట్లున్న ఆ ఇద్దరూ కొద్ది క్షణాల్లో తూలుతూ మెట్ల వైపు నడిచి, అకస్మాత్తుగా మెట్ల మీంచి కిందకి దొర్లారు.
ఐతే దారిలో మలుపు దగ్గర భూగోళం ఉన్న పాలరాతి దిమ్మకి ఆ దుష్టుడి శరీరం గట్టిగా కొట్టుకోవడంతో జాన్‌కి దెబ్బ తగలకుండా కాపాడింది. ఆ గుండ్రటి భూగోళం అటు, ఇటు వణికి చివరికి దొర్లి జాన్ తలని తాకింది. అతనికి పగలే నక్షత్రాలు కనపడటం జీవితంలో అదే మొదటిసారి కాదు కాని ఆ దుష్టుడి వల్ల కనపడటం అదే మొదటిసారి. అనేక అసాధారణ సంఖ్యలోని పక్షుల కూతలు కూడా జాన్‌కి అదే సమయంలో వినిపించాయి. ప్రకృతి అతనికి అత్యంత దళసరి తలని ఇవ్వడంతో జాన్‌కి తీవ్రమైన నష్టమేమీ వాటిల్లలేదు. కాని అతని మెడ మీది ఆ దుష్టుడి చేతులు వదులయ్యాయి. ఆ దుష్టుడు లేచి మెట్ల మీంచి కిందకి పరిగెత్తాడు.
ఆ సమయంలో ఆ లాబీలోని యాభై మంది జరిగేది చూసి ఏం జరుగుతోందా అని గుసగుసలాడుకోసాగారు. చాలాకాలం తర్వాత ఆకస్మికంగా కలుసుకున్న ఇద్దరు మిత్రుల్ని ఒకర్నొకరి గొంతులు ఎందుకు పిసుక్కుంటున్నారా అనే అనుమానం చాలామందికి కలిగింది. ఒకవేళ వాళ్లు టీవీ కోసం అలా నటిస్తున్నారా అని అనుకున్న వాళ్ల కొందరి కళ్లు దర్శకుడు మిల్టన్ బెర్ల్ ఎక్కడున్నాడా అని వెదికాయి. అతను కనపడక పోవడంతో కెమేరాలేవి అనే అనుమానం కలిగింది.
వారిలోని ఒకరు వేగంగా వాస్తవాన్ని గ్రహించి బయట ఉన్న పోలీసులకి వీరి గురించి ఎవరో కబురు అందించడంతో వాళ్లు రివాల్వింగ్ డోర్‌లోంచి లోపలకి వచ్చారు. వాళ్లని చూసిన ఆ దుష్టుడు వెనక్కి తిరిగి మళ్లీ మెట్లెక్కి ఆ పాలరాతి దిమ్మ వెనక దాక్కున్నాడు.
సార్జెంట్ ఓ టూల్ తన సపోర్టింగ్ నటులు పెట్రోల్ మేన్ మేక్ జెన్నిస్, పెట్రోల్ మేన్ క్లెయిన్, పెట్రోల్ మేన్ జాబ్రిస్కీలతో లోపలకి వచ్చాడు. ఏం జరుగుతోందో అర్థం అవడానికి స్ఫూర్తిగా వాళ్లకి ఆ పాలరాతి దిమ్మ వెనక నించి రివాల్వర్ కాల్పులు వినిపించాయి. అందరికన్నా ముందే తెలివి తెచ్చుకునే లక్షణం వల్ల సార్జెంట్‌గా ప్రమోషన్ పొందిన ఓ టూల్ ఆ దిమ్మ వంక చేత్తో చూపిస్తూ అరిచాడు.
‘అడుగో! వాడే!’
ముగ్గురు పెట్రోల్ మేన్ ఆ దుష్టుడ్ని గుర్తించారు. ఆ సమయంలో అతన్ని ప్రశ్నిస్తే ఆ దుష్టుడు తన చివరి కోరిక ఆ దిమ్మ కన్నా పెద్ద దిమ్మ అని చెప్పేవాడు.
జాన్‌కి మాత్రం జరిగే దాంట్లో ఎలాంటి అభిప్రాయాలూ లేవు. కారణం అతను అంతరిక్ష శాస్త్రంలో ముణిగి ఉన్నాడు. కాని అతని కళ్ల ముందు నక్షత్రాలు తిరగడం ఆగి, పొగమంచు కరిగాక అతను లేచి నిలబడ్డాడు. అప్పుడు జరిగింది అర్థం కాగానే అతను ఆ దిమ్మ వైపు తీవ్రంగా చూశాడు. అతనికి ఆ దుష్టుడు రివాల్వర్ పేలుస్తున్నాడని గ్రహించాడు.
జాన్ దృష్టి పాలరాతి దిమ్మ మీది భూగోళం ఉన్న ఖాళీ ప్రదేశం మీద పడింది. అది తన మీద పడి తనకి తాత్కాలికంగా మత్తుని కలిగించినట్లుగానే, అదే భూగోళం హిగ్స్ - స్టోక్స్ - ఫిట్జ్‌పేట్రిక్ - కబోట్ - కార్క్‌ల కాంబినేషన్ తలల మీద - తల మీద - పడ్డా అదే ఫలితం కలుగుతుందని జాన్ ఊహించాడు. తన ఊహని పరీక్షించాలని అనుకున్నాడు.
ఎవరైనా తమ వృత్తికి బానిస కాకపోతే ఓ పాలరాతి దిమ్మ వెనక నక్కిన, చేతిలోని రివాల్వర్‌ని పేల్చే దుష్టుడి మీదకి తిరగబడడు. కాని తన జీతం పెద్ద మొత్తం కాకపోయినా అదృష్టవశాత్తు జాన్ తన వృత్తికి బానిస కాబట్టి తను జీతంగా పొందే ప్రతీ సెంట్‌ని న్యాయంగా ఆర్జించాలన్న తలంపుతో అతనికన్నా తక్కువ స్థాయికి చెందిన మనిషిని పోలీసులకి వదల్లేదు. చేత్తో పాలరాతి భూగోళాన్ని పట్టుకుని మృదువుగా, నెమ్మదిగా ముందుకి కదిలి ఆ పాలరాతిని ఆ దిమ్మ మీంచి అవతలికి విసిరాడు.
అది హెర్బర్ట్ హిగ్స్‌కి తాకకపోవచ్చు. లేదా అది అతని కోపాన్ని పెంచేలే కేవలం కాలి చిటికెన వేలుకి మాత్రమే తగలచ్చు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. అతను ఎగరేసిన ఆ ఆయుధం స్వర్గం నించి కురిసిన మృదువైన వానలా వెళ్లి ఆ దుష్టుడి పుర్రె పైభాగం మీద పడింది. వెంటనే అతని జుట్టు కింద చర్మం ప్రభావితం చెందింది. అతని అతి పెద్ద కేకతో బద్దలైంది. హెర్బర్ట్ హిగ్స్ దిమ్మ వెనక నించి ముందుకి వచ్చి జాన్‌కి రివాల్వర్‌ని గురి పెట్టాడు. అంతా హాహాకారాలు చేశారు. కాని అది పేలినా గురి తప్పింది. ఆ దుష్టుడికి స్పృహ తప్పి నేలకూలాడు.
సార్జెంట్ ఓ టూల్ తన సపోర్టింగ్ నటులు పెట్రోల్ మేన్ మేక్‌జిన్నిస్, పెట్రోల్ మేన్ క్లెయిన్, పెట్రోల్ మేన్ జాబ్రిస్కీ మెట్ల మీదకి పరిగెత్తుకొచ్చారు. జాన్ తన చేతులని దులుపుకుని ఏం జరగనట్లుగా వెళ్లి లాబీలోని తన కుర్చీలో కూర్చుని ఆ నల్లకళ్ల జోడు ఆమెని ఎక్కడ చూసానా అనే ఆలోచనని కొనసాగించాడు.
హోటల్ కస్టమర్స్ దుష్టుడి కోటు నించి రాలిన గులాబీని జాన్ మేక్‌జీకి బహూకరించారు.
ఆ రాత్రి జాన్ మేక్‌జీ అస్టారియో తన ఇంటికి చేరుకున్నాక వీధి వాకిటి దాటి లోపలకి వచ్చి నిలబడి వాసన చూశాడు. అతని భార్య అతని అలికిడి విని వంటగదిలోంచి అరిచింది.
‘నువ్వేనా జాన్?’
‘అవును’
తర్వాత వంట గదిలోకి వెళ్లి మళ్లీ వాసన చూసి అడిగాడు.
‘పోర్క్?’
‘మీ అపరాధ పరిశోధన సక్సెస్. పోర్క్’ అతని భార్య జవాబు చెప్పింది.
‘ఆహా’
‘ఇవాళ కొత్తది ఏమైనా జరిగిందా?’ ఆవిడ నిత్యం అడిగే ప్రశ్నని అడుగుతుంది.
‘ఏం జరగలే...’ జాన్ జవాబు చెప్పడం ఆపేశాడు.
‘ఏమైనా జరిగిందా?’
‘ఒకటి జరిగింది’ అతను పెద్దగా అరిచాడు.
ఏమిటన్నట్లుగా ఆమె తన భర్త వంక ఆసక్తిగా చూసింది.
‘నేను చెప్పేది నువ్వు నమ్మలేవు. నేను హోటల్ లాబీలో కూర్చుని ఉన్నానా? లోపలకి ఓ అందగత్తె వచ్చింది. తన హేండ్ బేగ్‌ని చేతిలోంచి పడేసుకుంది. అప్పుడు నేనేం చేశాను? దాన్ని తీసి ఆమెకి అందించాను. ‘ఓ! థాంక్ యు’ అని ఆమె చెప్పింది. ‘నాటెటాల్ మేడం’ అని నేను అన్నాను. నువ్వు వెయ్యిసార్లు ఊహించినా అసలు ఏం జరిగిందో ఊహించలేవు’
‘ఏం జరిగింది?’ ఆమె ఆత్రంగా అడిగింది.
‘ఆమెని చూడగానే నేను ఆమెని ఇదివరకు ఎక్కడో చూశాను అనుకున్నాను. కాని వెంటనే నాకు గుర్తొస్తేనా? ఇక్కడ ఇప్పుడే గుర్తొచ్చింది. మిన్నా నార్‌క్రాస్.’
‘మిన్నా నార్‌క్రాస్?’
‘మిన్నా నార్‌క్రాస్’
‘ఆ మిన్నా నార్‌క్రాసా?’
‘అవును. జార్జ్ డలాకౌర్‌ని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసి, సిరిల్ వెస్ట్‌మెకోట్‌ని చేసుకున్నాక వారి మధ్య పొసగక ఇప్పుడు స్పెన్సర్ హేలీడేని చేసుకున్న మిన్నా నార్‌క్రాస్. వాళ్ల మధ్య కూడా పొసగడం లేదని విన్నాను కాబట్టి వాళ్ల పెళ్లి కూడా త్వరలోనే పెటాకులు అవబోతోంది. ఇప్పుడు నేను నిన్ను చూసినంత దగ్గరగా ఆమెని చూశాను. తన హేండ్ బేగ్‌ని చేతిలోంచి పడేసుకుంది. అప్పుడు నేనేం చేశాను? దాన్ని తీసి ఆమెకి అందించాను. ‘ఓ! థాంక్ యు’ అని ఆమె చెప్పింది. ‘నాటెటాల్ మేడం’ అని నేను అన్నాను. ఆమె నల్లకళ్ల జోడు పెట్టుకోవడంతో నేను గుర్తించలేక పోయాను. తన హేండ్‌బేగ్‌ని తీసి ఆమెకి అందించేప్పుడు నేను గుర్తించి ఉంటే నన్నక్కడ పక్షి ఈకతో కొట్టినా పడిపోయేవాడిని.’
‘నేనది ఊహించగలను’
‘ఆమె నటించిన పెయింటెడ్ సిన్నర్ గుర్తుందా?’
‘ఉంది’
‘ఏస్ ఏ మేన్ సోస్?’
‘గుర్తుంది’
‘మిన్నా నార్‌క్రాస్. ఇప్పుడు నువ్వున్నంత దగ్గరగా ఉంది’
‘్భలే!’
‘తన హేండ్‌బేగ్‌ని చేతిలోంచి పడేసుకుంది. అప్పుడు నేనేం చేశాను? దాన్ని తీసి ఆమెకి అందించాను. ‘ఓ! థాంక్ యు’ అని ఆమె చెప్పింది. ‘నాటెటాల్ మేడం’ అని నేను అన్నాను.’
‘నువ్వు చాలా ఎక్సయిట్ ఎందుకయ్యావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇవాళ ఇంకేదైనా జరిగిందా?’
‘ఇంకేం జరగలేదు’ జాన్ మేక్‌జీ జవాబు చెప్పాడు.

పి.జి.ఓడ్‌హౌస్ కథకి స్వేచ్ఛానువాదం

-మల్లాది వెంకట కృష్ణమూర్తి