క్రైమ్ కథ

ఆనాటి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డార్లింగ్. నువ్వు ఆమెని చంపావని ఒప్పుకో. అంతే. కాని పాతకథకే కట్టుబడితే నువ్వు నన్ను, నిన్ను కూడా మోసం చేసుకున్నట్లే. అప్పుడు మనం ఆనందంగా ఉండగలమా?’ ఇరవై ఏడేళ్ల జుడిత్ అడిగింది.
జుడిత్ చిన్నపిల్లల డాక్టర్. ఐదు వారాల ప్రేమ తర్వాత తనకి మూడేళ్ల సీనియరైన పీటర్‌తో ఆమె ఈ మాటలు చెప్పింది. ఆమె రిఫ్రెషర్ కోర్స్ తీసుకునే యూనివర్సిటీ హాస్పిటల్లో అతనితో పరిచయమవగానే తలమునకలుగా ప్రేమలో పడింది. తమకి పెళ్లైతే కాని ఆనందం లేదని వాళ్లిద్దరికీ అనిపిస్తోంది.
ఐతే వాళ్లిద్దరూ అపరిచితులు కారు. ఒకరితో మరొకరు మాట్లాడకపోయినా చాలా ఏళ్లుగా వాళ్లకి పరిచయం.
జుడిత్, పీటర్ స్ప్రింగ్‌మీడ్‌లోనే పెరిగారు. ఇరవై రెండేళ్ల క్రితం 1933లోని వేసవిలో అక్కడ ఓ దుర్ఘటన జరిగింది. జుడిత్ అక్క పదహారేళ్ల డొరిండా ఊరి బయట నది ఒడ్డున శవమై కనిపించింది. స్పోర్ట్స్ తుపాకీతో దగ్గర్నించి కాల్చి చంపబడింది. ఆ తుపాకీ సమీపంలోని గడ్డి మీద కనిపించింది. అంతకు గంట క్రితం ఆమె తమ కుటుంబ పడవలో ఒంటరిగా ప్రయాణించింది. అది ఒడ్డుకి కట్టబడి ఉంది.
అప్పుడు జుడిత్ చిన్నపిల్ల కాబట్టి ఆ విషాద సంఘటన సరిగ్గా గుర్తు లేదు. పెరిగి పెద్దయ్యాక దాన్ని గురించి తెలుసుకుంది. ఆ తుపాకీ పీటర్ తండ్రిది. ఆ సమయంలో ఆయన ఎనిమిదేళ్ల పీటర్‌ని హౌస్ కీపర్‌తో వదిలి తన భార్యతో కార్లో వీకెండ్ గడపడానికి వెళ్లాడు. పీటర్ ఆ తుపాకీని ఉపయోగించడం నిషేధం. దాన్ని తీసుకున్నందుకు వాడ్ని అనేకసార్లు శిక్షించారు కూడా.
వాడి అభిమాన వేట ప్రదేశం నది ఒడ్డు. దాదాపు అరడజను మంది సాక్షులు నది ఒడ్డున చంకలో తుపాకీతో నడిచే చిన్నపిల్లవాడ్ని చూసామని పోలీసులకి చెప్పారు. ఆ హత్య ఎలా జరగిందన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. పీటర్ ఆమెకి తుపాకీని చూపిస్తూనో, లేదా సరదాకి ఆమెకి గురి పెడితేనో పొరపాటున పేలి ఉండచ్చని అనుకున్నారు. పోలీసులు పీటర్ని ప్రశ్నిస్తే మొదట తనకేం తెలీదని దబాయించాడు. కానీ తల్లి నచ్చజెప్పాక పోలీసులకి మళ్లీ కొత్త కథ చెప్పాడు.
నీటి ఎలుకలని వేటాడడానికి ఆ తుపాకీతో నది ఒడ్డుకి వెళ్లాడు. వాడు మోకాళ్ల మీద ఓ మాను పక్కన కూర్చుని ఉండగా, డొరిండా ఆ చెట్టుకి కట్టిన తన పడవ తాడుని విప్పుతోంది. ఆమె పాడుతూంటే పీటర్ ఆమెని నిశ్శబ్దంగా ఉండమని అరిచాడు. ఆమె ఉలిక్కిపడి పీటర్ని కోప్పడింది. వాడు తుపాకీ తేవడం వాడి తండ్రికి తెలుసా అని అడిగితే తెలీదన్నాడు. దాంతో ఎవరికీ హాని కలక్కముందే దాన్ని తనకి ఇవ్వమని కోరింది.
కానీ పీటర్ అందుకు ఇష్టపడలేదు. వాడు సరాసరి ఇంటికి వెళ్తే తను ఆ తుపాకీని తెచ్చిస్తానని, వాడి తండ్రికి చెప్పనని మాటిచ్చి దాన్ని తీసుకుంది. డొరిండా పడవని విప్పి తుపాకిని పడవలో ఉంచి, నది మీద వెళ్లిపోయింది.
ఈ కథని ఎవరూ నమ్మలేదు. ఆ ఊళ్లోని అంతా జరిగిందానికి బాధపడి రెండు కుటుంబాలకీ తమ సానుభూతిని తెలియజేశారు. అధికారులు పీటర్ చెప్పింది నమ్మారు. పీటర్ని బోర్డింగ్ స్కూల్‌కి పంపారు. క్రమంగా అంతా దాన్ని మర్చిపోయారు. ఆ రెండు కుటుంబాల మధ్యా మాటల్లేవు.
ఇరవై రెండేళ్ల తర్వాత ఆ రోజు డొరిండా చెల్లెలు జుడిత్ యూనివర్సిటీ గార్డెన్‌లో పీటర్‌తో ఆ విషయం ప్రస్తావించింది.
‘అది ఏ పిల్లవాడి వల్లైనా జరిగే ప్రమాదం. అప్పుడు నువ్వు భయపడి నిజం చెప్పలేదు. అది నీ వయసుకి సహజ స్పందన. కాని ఇప్పుడు నాకు నిజం చెప్పచ్చుగా?’
‘అది అబద్ధమని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. మా అమ్మతో సహా ఎవరూ నన్ను నమ్మలేదు. నాకు పిచ్చి లేకపోతే సరిగ్గా నేను చెప్పినట్లుగానే జరిగింది. ఆ తుపాకీని నేను ఆఖరిసారి చూసింది దాన్ని డొరిండా పడవలో ఉంచేప్పుడే. నన్ను నేను మోసం చేసుకోవడం లేదు. మన మధ్య బహుశ కుదరదు. ఆ సంఘటనని, నన్ను మర్చిపో’ పీటర్ కోపంగా అరిచాడు.
‘లేదు. నువ్వు చెప్పింది నమ్ముతాను పీటర్’ ఆమె అతని చెయ్యి పట్టుకుని చెప్పింది.
‘నమ్ముతావా? నా కోసం అబద్ధం ఆడుతున్నావా? అది మంచిది కాదు. ఎటూ ప్రాణనష్టం జరిగింది. అది నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఒకోసారి నాకు తెలీకుండా అయోమయంలో ఆమెని చంపానేమో అనిపిస్తూంటుంది కూడా. అదే నిజమైతే నాకు అది గుర్తు రాకుండా ఉంటుందా? అలా మళ్లీ నేనెవరినైనా చంపుతానా? నన్ను భయపెట్టే ఈ ఆలోచన నాకు తరచు వస్తోంది.’
‘నేను కనుక్కుంటాను. మా అక్క ఎలా పోయిందో నేను కనుక్కుని నీకు మనశ్శాంతిని ఇస్తాను. నువ్వు ఎంత బాధపడుతున్నావో’ జుడిత్ ఆవేదనగా చెప్పింది.
‘ఎలా కనుక్కోగలవు? చాలామంది ప్రయత్నించారు కదా? నా చిన్నప్పుడు మా నాన్న నా గురించి బాధపడి, డొరిండా ఎలా మరణించిందో తెలుసుకునే తీవ్ర ప్రయత్నం చేశాడు. తను విన్న ప్రతీ వదంతినీ పరిశీలించాడు. చివరికి నిజం తెలుసుకోకుండానే మరణించాడు’ పీటర్ చెప్పాడు.
‘సరే! నువ్వు చెప్పిందే నేను నమ్ముతాను. నేను అప్పుడు చాలా చిన్నపిల్లని. డొరిండా గురించి నువ్వు అప్పట్లో వదంతులు ఏమైనా విన్నావా? మా అక్క నాకు గుర్తు లేదు కాని ఫొటోలో చూశాను’ జుడిత్ చెప్పింది.
‘డొరిండా ఫొటోని చూసి గీసిన చిత్రం దాని పేరు ‘గర్ల్ విత్ ది యూకలేలే’. ఆమె మరణించిన రెండేళ్ల తర్వాత గీయించారు. దాన్ని అకాడెమీలో ప్రదర్శించినప్పుడు సెనే్సషనైంది. పత్రికల్లో ఆ ఫొటో చూసి డొరిండా విషాదం గురించి రాశారు. జాన్ రైడర్ గీసిన ఆ చిత్రం మా నాన్నకి చాలా నచ్చింది. ఆ సంగతి అతనికి ఉత్తరం కూడా రాశారు’ పీటర్ చెప్పాడు.
‘అతను డొరిండా మరణించినప్పుడు తన భార్యతో కలిసి జాన్సన్స్ కాటేజ్‌ని అద్దెకి తీసుకుని ఉండేవాడు. ఆ రోజుల్లో డొరిండా వయసున్న అందరు అమ్మాయిల స్కెచ్‌లని అతను గీశాడు. అందువల్లే దాన్ని బాగా గీయగలిగాడు’ జుడిత్ చెప్పింది.
‘అతను రెండో ప్రపంచ యుద్ధానంతరం సౌత్ ఆఫ్రికాలో మరణించాడు. కాబట్టి అతనికి గుర్తున్నది అడిగే ప్రసక్తే లేదు. ఐనా అతను సంహరించే మనిషి కాదు’ పీటర్ చెప్పాడు.
‘అవును. అతను తన భార్యతో పోట్లాడేవాడని విన్నాను’ జుడిత్ చెప్పింది.
‘అవును. ఆమె స్పానిష్ జిప్సీ. జాన్ ఆమెని చూసి భయపడేవాడు.’
‘ఆమె కూడా పోయిందా?’
‘తెలీదు. ఆమెని కనుక్కోలేం. నువ్వు అచ్చం మా నాన్నలానే ప్రవర్తిస్తున్నావు. ఆయన కూడా ఇలాగే ఏదీ వదిలేవాడు కాదు. మనిద్దరం ఆ గతాన్ని మర్చిపోతే కాని మనకి భవిష్యత్ ఉండదు.’
‘కానీ నేను నిజం తెలుసుకోవాలి. తప్పక తెలుసుకుంటాను. మా అమ్మా నాన్న యూరప్‌లో ఉన్నారు. మా ఇంటి తాళం చెవి పక్కింటి వాళ్ల దగ్గర ఉంది. అటక మెట్ల కింద షెల్ఫ్‌లో, ఓ సంచీలో ఓ మూట ఉంది. అవన్నీ డొరిండా మరణ విచారణ మూసేసాక పోలీసుల నించి వచ్చినవి. మా నాన్న వాటిని మళ్లీ చూడటానికి ఇష్టపడలేదు. నేను టీనేజ్‌లో ఉండగా ఓసారి దాన్ని తెరవబోతే నన్ను తిట్టారు. అందుకే నాకది గుర్తుంది’ జుడిత్ చెప్పింది.
‘బట్టలు కూడానా? ఆమె వేసుకున్న ఆకుపచ్చ రంగు గౌను నాకు గుర్తుంది. అది కొత్తది. మొదటిసారి వేసుకుంది. పోలీసుస్టేషన్‌లో దాన్ని చూసి మా నాన్న దానికి రక్తం అంటిందని చెప్పారు.’
‘ఆ గౌను లేదు. పడవలో తనతో ఉన్న వస్తువులు మాత్రమే వచ్చాయి. ఆమె చదివే పుస్తకం, ఊలు అల్లేది, యూకలేలే (ఓ వాద్య పరికరం)... నాకు అది బాగా గుర్తు. మనం ఇప్పుడు వెళ్లి వాటిని చూద్దాం పీటర్’ ఆమె ఉత్సాహంగా చెప్పింది.
‘ఇప్పుడా?’
‘అవును. ఇక్కడికి ముప్పై మైళ్లేగా? అందులో మనకి పోలీసులకి దొరకనిది ఏదైనా ఆధారం దొరకచ్చు.’
‘సరే. ప్రయత్నించడంలో తప్పులేదు. ఎంతోమంది ఆ తుపాకీని ముట్టుకోవడంతో వాళ్లు ఆ తుపాకీ మీది వేలిముద్రలని కూడా తనిఖీ చేయలేదు.’
గంటన్నర తర్వాత వాళ్లకి ఓ షెల్ఫ్‌లో ఆ మూట కనిపించింది. విప్పితే ఆ చిత్రం కనిపించింది. ఎర్రజుట్టు గల డొరిండా ఓ చెట్టుకి ఆనుకుని యూకలేలేతో మోకాళ్ల మీద నవ్వుతూ కూర్చుని ఉంది.
ఆ కాలంలో ఆడపిల్లలు పడవ షికారుకి తీసుకెళ్లే సాధారణ వస్తువులే ఆ మూటలో కనిపించాయి. ఖాళీ చాక్లెట్ పెట్టె, పాత కెమేరా, రంగురంగుల రిబ్బన్లు కట్టిన యూకలేలే, ఓ గ్లవ్, ఎలినార్ గ్లిన్ రాసిన ఓ నవల.
జుడిత్ ఆ కెమేరాని తీసుకుని చూస్తే అందులో ఫిల్మ్ కనిపించింది. ఇండికేటర్ సర్కిర్‌ని తుడుస్తే అద్దం కింద ఒకటి అంకె కనిపించింది.
‘డొరిండాకి ఒకటికి మించి ఫొటోలు తీసే సమయం ఉన్నట్లు లేదు. నన్ను హైస్ట్రీట్‌లోని ట్రైస్ స్టూడియోకి తీసుకెళ్లు. అతని షాప్ ఇప్పుడు మూసే ఉంటుంది. కాని దాని పై అంతస్థులోనే అతను ఉండేది. ఇరవై ఏళ్ల క్రితంది కాబట్టి బొమ్మ వస్తుందో, రాదో చూడాలి’ జుడిత్ ఉత్సాహంగా చెప్పింది.
‘రీల్ ఉపయోగించలేదని పోలీసు అనుకుని ఉంటారు. బహుశ మా నాన్నకి చూపించడానికి తుపాకీతో ఉన్న నన్ను ఫొటో తీసి ఉంటుంది’ పీటర్ నవ్వుతూ చెప్పాడు.
గంట తర్వాత మిస్టర్ ట్రైస్ చెప్పాడు.
‘ఎనే్నళ్ల క్రితం దీన్ని తీసారన్నావు జుడిత్? ఇరవై ఏళ్లు దాటిందా? ఐనా ఫిల్మ్ ఎంత మాత్రం పాడవకపోవడం అసాధారణమే. బొమ్మ ఎక్స్‌పోజ్ ఐంది. తర్వాత దాన్ని రెండో నంబర్‌కి తిప్పలేదు’
‘అది ఎనిమిదేళ్ల పిల్లవాడి ఫొటోనా?’ జుడిత్ పీటర్ వంక ఓసారి చూసి ట్రైస్‌ని అడిగింది.
‘కాదు’ చెప్పి ట్రైస్ దాన్ని ఆమె చేతికి ఇచ్చాడు.
డొరిండా!
తన కొత్త డ్రెస్‌లో యూకలేలే వాయించే డొరిండా!
‘పీటర్! గమనించావా? జాన్ రైడర్ గీసిన చిత్రంలోది ఇదే బొమ్మ. నదిలో పడవ. ఒడ్డున అది చెట్టుకి కట్టి లేదు. గుంజకి కట్టి ఉంది. ఈ నేపథ్యం వదిలేస్తే మిగతాదంతా ఈ ఫొటోలో లానే ఉంది.’
పీటర్ ఆ ఫొటో వంక చూసి అర్థం కానట్లుగా తల అడ్డంగా ఆడించాడు.
‘ఏం జరిగిందో తెలిసింది. రెండేళ్ల తర్వాత జాన్ రైడర్ దీనే్న చిత్రంగా గీశాడు. ఈ ఫొటోని ఎవరు తీసినట్లు? డొరిండాని ఇంత స్పష్టంగా గుర్తుంచుకున్న వ్యక్తే. దీన్ని డెవలప్ చేయకపోయినా చూసినంత కచ్చితంగా గీసిన జాన్ రైడర్‌ని అక్కడ కలుసుకునే ఏకాంతాన్ని నువ్వు భగ్నం చేసావనే కోపంతో డొరిండా నీ మీద అరిచింది’ జుడిత్ వణికే కంఠంతో చెప్పింది.
‘చిత్రకారుడు! జాన్ రైడర్! అతను చంపాడా?’
‘నువ్వు వెళ్లాక అతను ఆమెతో ఉన్నాడు. సాక్ష్యం వెనక కట్టిన పడవ. ఆమె ఈ డ్రస్‌ని మొదటిసారి వేసుకుంది. తను ఆమెని ఆ రోజంతా చూడలేదని జాన్ రైడర్ పోలీసులకి చెప్పాడు. అది అబద్ధం. ఎందుకు చంపాడు? అతన్ని హేళన చేసిందా? ఆమెతో సన్నిహితంగా ఉండగా అతని భార్య వచ్చి చూసి చంపిందా? ఈ ప్రశ్నలకి మనకి ఎప్పటికీ జవాబులు దొరకదు. కాని ముఖ్యమైన ఆధారం ఈ ఫొటో. నువ్వు భావిస్తున్నట్లుగా నువ్వు మా అక్కని చంపలేదు పీటర్. మొదటి నించీ నేను ఇదే నమ్మాను’ జుడిత్ చెప్పింది.
‘నిజంగా? మరి నీకు సాక్ష్యం ఎందుకు అవసరమైంది?’ పీటర్ అడిగాడు.
‘నీకు రూఢీ చేయడానికి. ఇందాక నువ్వు చెప్పావుగా, నీకు తెలీకుండా చంపావేమోనని భయపడుతున్నావని? అది నిజం కాదు.’
ట్రైస్ వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు.

(మార్జరీ అలింగ్‌హోం కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి