క్రైమ్ కథ

మోసగత్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోటల్ డిటెక్టివ్ ఓక్స్ బార్లో విల్లిస్ పక్కన కూర్చుని ఉన్న ఆ అమ్మాయిని చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది.
ఐదేళ్ల ఉద్యోగానుభవంతో ఓక్స్ ఆమె మోసగత్తె అనుకున్నాడు. విల్లిస్ కోటీశ్వరుడని ఓక్స్‌కి తెలుసు. బహుశ ఆమె అతన్ని మోసం చేయడానికి ప్రయత్నించచ్చు. జరిగేది నిశ్శబ్దంగా చూడసాగాడు.
బార్ టెండర్ జిమీ ఆమె దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాడు. ఆమె కంఠం గట్టిగా వినిపించింది.
‘నా డ్రైవింగ్ లైసెన్స్ చూపించను. నేను మైనర్ని కానని నన్ను చూస్తే తెలీడం లేదా?’
‘మిస్. ప్లీజ్. ఇదేమీ వ్యక్తిగతమైంది కాదు. మైనర్స్‌కి ఈ రాష్ట్రంలో లిక్కర్ ఇవ్వకూడదు. నేను నా ఉద్యోగరీత్యా అది చూడాలి’
‘నేను మైనర్ని కానని నీకు తెలుసు. ఏజ్ ప్రూఫ్‌ని చూపించను’ ఆమె కోపంగా చెప్పింది.
ఆ వాదన దూరంగా కూర్చున్న ముగ్గురికి వినిపించింది. వారిలోని ఒకరు గట్టిగా చెప్పారు.
‘ఆమెకి డ్రింక్ ఇవ్వు. ఆమె మేజర్ అని చూస్తే తెలీడం లేదా?’
‘నేను ఇక్కడ ఉద్యోగిని సర్. ఏజ్‌ప్రూఫ్ చూడకుండా నేను ఆల్కహాల్ ఇచ్చినట్లు రుజువైతే నా ఉద్యోగం పోతుంది.’
విల్లిస్ ఆమె వంక చూశాడు. ఆమె తన హేండ్‌బేగ్ లోంచి డ్రైవింగ్ లైసెన్స్‌ని తీసి జిమీకి చూపించింది. దాన్ని చూశాక అతను క్షమాపణ కంఠంతో చెప్పాడు.
‘బార్ రూల్స్ మిస్ బేట్స్’
తర్వాత ఆమె కోరిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె దాన్ని ఓ గుక్కలో తాగి, ఎదురుగా అద్దం వంక చూసి అకస్మాత్తుగా ఏడవసాగింది. ఓక్స్‌కి దాదాపుగా నవ్వొచ్చింది. ఆమె మంచి నటి. నైపుణ్యం గల ఆమె బ్రాడ్‌వేలో వేషాలు సంపాదించచ్చు అనుకున్నాడు.
విల్లిస్ అనునయంగా ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు. ఓక్స్ చిన్నగా నిట్టూర్చాడు. ఆ మోసగత్తెకి మరో బాధితుడు దొరికాడు అనుకున్నాడు. ఆమె మోసగత్తెని, ఏదో మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తోందని అవకాశం వచ్చినప్పుడు విల్లిస్‌కి చెప్పాలని అనుకున్నాడు. ఏభై ఏళ్ల విల్లిస్ వొంటి మీది దుస్తులు అతను ధనవంతుడని సూచిస్తున్నాయి. వాళ్లిద్దరూ గొంతు తగ్గించి మాట్లాడుకోసాగారు.
‘నా బాయ్‌ఫ్రెండ్‌ని ఇక్కడ కలుసుకోవాలి. అతను రాలేదు. రేపు ఉదయం నేను వెళ్లిపోతున్నాను. అందుకని బాధగా ఉంది.’
ఆమెలో మళ్లీ దుఃఖం తన్నుకు వచ్చి లేచి బాత్‌రూం వైపు వెళ్లింది. ఓక్స్ వెంటనే విల్లిస్ దగ్గరికి నడిచాడు.
‘నేను హౌస్ డిటెక్టివ్‌ని. ఆమె మీకేదైనా ఇబ్బంది కలిగిస్తోందా?’ అడిగాడు.
‘లేదు. ఎందుకలా అడిగారు?’ విల్లిస్ అడిగాడు.
‘ఆమె ఏడవడం చూశాను. అది నటనేమో, మిమ్మల్ని డబ్బు అడుగుతోందేమోనని’
‘లేదు. నన్ను డబ్బు అడగలేదు’
‘జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్లు బట్టలు చింపుకుని ఇబ్బంది పెట్టచ్చు’
‘మీ సలహాకి థాంక్స్. కాని ఆమె కూడా నాలానే మామూలు కస్టమరై ఉండచ్చుగా?’
ఓక్స్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
‘వీళ్లు ఎప్పటికీ నేర్చుకోరు. ఆమె అతనితో అతని గదికి వెళ్తుంది అనుకుంటాం’ జిమీ ఓక్స్‌తో రహస్యంగా చెప్పాడు.
ఓక్స్ కేసినో గదిలోకి వెళ్లి ఆడేవాళ్లని జాగ్రత్తగా పరిశీలించాడు. వారిలోని కొందరు మోసగాళ్ల మొహాలు అతనికి గుర్తే. అరగంట తర్వాత ఓక్స్ మళ్లీ బార్లోకి వెళ్లాడు. వాళ్లిద్దరూ లేరు.
‘ఏరీ వీళ్లు?’ జిమీని అడిగాడు.
‘ఐదు నిమిషాల క్రితమే ఇద్దరూ లిఫ్ట్ వైపు వెళ్లారు’ అతను జవాబు చెప్పాడు.
ఓక్స్ రిసెప్షన్‌కి వెళ్లి విల్లిస్ గది నంబర్ తెలుసుకున్నాడు. అరగంట తర్వాత కొద్దిగా సందేహించాక లిఫ్ట్‌లో నాలుగో అంతస్థుకి చేరుకున్నాడు. 418 తలుపు దగ్గరకి నడిచి చెవిని తలుపునకు ఆనించి కొద్దిసేపు విన్నాడు. విల్లిస్ తన గదిలోని మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. చిన్న గురక కూడా. అతని డ్రింక్‌లోని క్లోరల్ హైడ్రేట్ ఎప్పుడు కలపబడిందో అని ఓక్స్ అనుకున్నాడు.
నిశ్శబ్దం. మళ్లీ సందేహించాక జేబులోంచి స్కెలిటెన్ కీని తీసి తలుపు తెరచి లోపలికి వెళ్లాడు. బాత్‌రూం తలుపు కొద్దిగా తెరచి ఉంది. నేల మీద పడున్న ఆమె పాదాలు ఓక్స్‌కి కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూశాడు. ఆమె వెల్లకిలా పడుకుని ఉంది. మొహం నీలం రంగులో ఉంది. అతను ఆమెని దాటి లోపలకి వెళ్లి గ్లాస్‌లో చన్నీరు తీసుకుని విల్లిస్ దగ్గరికి వెళ్లి అతని మొహం మీద చిలకరించాడు. తర్వాత చెంపల మీద గట్టిగా తట్టాడు. విల్లిస్ కళ్లు తెరిచి అయోమయంగా చూశాడు. తర్వాత లేచి మంచం మీద కూర్చుని చుట్టూ చూసి అడిగాడు.
‘ఇక్కడేం చేస్తున్నావు? నా గదిలోకి ఎలా వచ్చావు?’
‘ఇదెలా జరిగింది?’ ఓక్స్ చేత్తో చూపిస్తూ అడిగాడు.
తిరగబడ్డ కుర్చీ, విరిగిన టేబిల్ లేంప్‌ల వంక విల్లిస్ విభ్రాంతిగా చూశాడు.
‘ఎవడో రిసెప్షన్‌కి ఫోన్ చేసి మీ గదిలోని శబ్దాలు ఇబ్బంది పెడుతున్నాయని ఫిర్యాదు చేశారు. తలుపు కొట్టినా మీరు తెరవలేరు. అటు చూడండి. ఆమె మరణించింది. విష ప్రయోగం అని నా అనుమానం.’
విల్లిస్ అర్థం కానట్టుగా బాత్‌రూం వైపు చూశాడు. తర్వాత చటుక్కున మంచం దిగి వెళ్లి ఆమెని చూడగానే అతని మొహం పాలిపోయింది.
ఓక్స్ ఫోన్ రిసీవర్ అందుకుని చెప్పాడు.
‘మిస్టర్ విల్లిస్. కూర్చోండి. పోలీసులకి కబురు చెయ్యాలి.’
‘దయచేసి ఒక్క నిమిషం. రిసీవర్ పెట్టేయండి. ఓ నిమిషం ఆగండి.’
ఓక్స్ దాన్ని యథాస్థానంలో ఉంచాడు.
‘ఇది పోలీసులు చూడాల్సిన వ్యవహారం.’
‘నేను అసలు ఆమెని ముట్టుకోలేదు. ఆమెకి ఏం జరిగిందో నాకు తెలీదు. అకస్మాత్తుగా నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చి వెంటనే పడుకున్నాను. నాకు అంతే గుర్తుంది.’
‘మీరు ఇదే విషయాన్ని పోలీసులకి చెప్పచ్చు. ఆమె మరణానికి మిమ్మల్ని వాళ్లు దోషిని చేయకపోవచ్చు. నేను ఇందాక బార్లో చెప్పినట్టుగా ఆమె మోసగత్తె అనుకోవడం తప్పు కాదు. పోలీసులు ఆమె గురించి కూపీ తీస్తే ఇది ఎవరి పనో తెలుసుకుంటారు. ఐతే మీరు కొంత అపఖ్యాతి పాలవచ్చు. ఒకోసారి ఇలాంటి వాటి నించి తప్పించుకోలేం. మీరు నిర్దోషి అని తేలే దాకానే మీకు వత్తిడి.’
విల్లిస్ తల పట్టుకుని ఏదో గొణిగాడు.
‘నాకు వినపడలేదు’ ఓక్స్ చెప్పాడు.
‘మీరు ఈమె శవాన్ని గదిలోంచి బయటకి తీసుకెళ్తే మీకు పది వేల డాలర్లు ఇస్తాను. ప్లీజ్’ చెప్పాడు.
ఓక్స్ జవాబు చెప్పడానికి మునుపు కొంత సమయం తీసుకున్నాడు.
‘మీరు నన్ను చట్టాన్ని అతిక్రమించమంటున్నారా? అది ఇద్దరికీ ప్రమాదం. ఆమెని ఎవరూ చూడకుండా తీసుకెళ్లాలి. ఎప్పటికీ ఎవరూ కనుక్కోలేని చోట శవాన్ని దాచాలి’
‘నిజం చెప్తున్నాను. ఆమెని నేను ముట్టుకోలేదు’ విల్లిస్ కీచుగా చెప్పాడు.
‘బహుశ మీకు గుర్తుండకపోవచ్చు.’
‘నేను తప్ప తాగలేదు. కేవలం రెండు పెగ్గులే తాగాను. నాకు మనవలు ఉన్నారు. ఇది బయటకి వస్తే బంధుమిత్రులు...’ ఉద్వేగంతో ఆగిపోయాడు.
ఓక్స్ అతని వంక కొద్దిసేపు చూసి చెప్పాడు.
‘సరే. ఏభై వేలు. మీరు ఏం జరగనట్లే ఈ గది ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఇక్కడ జరిగింది ఎవరికీ తెలీదు.’
‘డబ్బు హోటల్ సేఫ్‌లో ఉంది. వెళ్లి వస్తాను.’
‘అలాగే. ఇద్దరం కలిసి వెళ్దాం’
లాకర్లోంచి డబ్బు తీసాక దాన్ని ఇస్తూ విల్లిస్ బాధగా చెప్పాడు.
‘జూదానికి తెచ్చిన ఈ డబ్బుతో కొంత గెలుచుకునే వాడిని. కాని ఇలా నష్టపోయాను.’
ఓక్స్ బట్టల తోపుడు బండిని గదిలోకి తీసుకువచ్చి ఆమెని అందులో పడుకోబెట్టి పైన కొన్ని దుప్పట్లు కప్పి బయటకి తీసుకుపోయాడు. ఇరవై నిమిషాల తర్వాత విల్లిస్ గది ఖాళీ చేశాడు.
సరిగ్గా అదే సమయంలో అతను ఖాళీ చేసిన గదిలో ఓక్స్, బేట్స్ ఆ డబ్బుని సమానంగా పంచుకున్నారు. జిమీ నవ్వి చెప్పాడు.
‘ఈ ట్రిక్ ఎప్పుడూ పని చేస్తుంది. మిస్ బేట్స్‌తో ఓసారి ఏ మగాడైనా మాట్లాడితే ఇక తప్పించుకోలేడు.’
‘ఈ రంగు నా మొహానికి హాని చేయదు కదా?’ నీలం రంగుని తుడుచుకుంటూ బేట్స్ అడిగింది.
‘చెయ్యదు. ఇంతదాకా ఏ అమ్మాయి ఈ విషయం చెప్పలేదు’ ఓక్స్ చెప్పాడు.

(మైఖేల్ బ్రెట్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి