క్రైమ్ కథ

అసాధారణ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఫ్రాన్స్‌లోని చిత్రకారులు అధికంగా ఉండే గ్రామం. ఆ చిన్న గ్రామంలో చర్చ్ గంటలు మోగుతూండగా మేడం లెర్గ్యూ చిత్రాల దుకాణానికి వచ్చిన ఓ అమెరికన్ పర్యాటక దంపతులు డిస్‌ప్లే కిటికీలోని పిల్లుల బొమ్మని చూసి ముచ్చట పడి లోపలికి వెళ్లారు.
‘అదెంత?’ భార్య ఆవిడని అడిగింది.
‘రెండు వేల ఫ్రేంకులు’ మేడం లెర్గ్యూ చెప్పింది.
‘ఎంత?’ భర్త అదిరిపోయి అడిగాడు.
‘మీ కరెన్సీలో నాలుగు వందల ఇరవై ఐదు డాలర్లు. నేను లాభానికి దాన్ని అమ్మడం లేదు. దాన్ని ఎంతకి కొన్నానో తెలుసా? పద్దెనిమిది వందల ఫ్రేంకులు. షాప్ అద్దె, ఇతర ఖర్చులు పోను నాకు మిగిలేది తక్కువ. ఈ గ్రామంలోని చిత్రకారులని పోషించడానికే దీన్ని నడుపుతున్నాను. వారు మా వారసత్వ సంపద. దీన్ని గీసిన చిత్రకారుడి బొమ్మల విషయంలో బేరం ఆడలేం. అతను ఎంత చెప్తే అంతకే కొని తీరాలి.’
భార్య పట్టుబట్టడంతో ఆయన దాన్ని కొన్నాడు.
‘ఇది మీ పిల్లలకి పెట్టుబడి. ఈ చిత్రకారుడి కళాఖండాల ధర పెరుగుతుంది తప్ప తగ్గదు.’
ఆ సమయంలో తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన ఓ చిత్రకారుడు హెన్రీని చూసి లెర్గ్యూ గట్టిగా అరిచింది.
‘ఒక్క నిమిషం’
వాళ్లు వెళ్లాక హెన్రీని పైకి రమ్మని ఆవిడ మెట్ల మీద తన ఆఫీస్ గదిలోకి వెళ్లింది.
‘నా పిల్లులు అమ్ముడైనట్లున్నాయి?’ అతను ఆ గదిలోకి వచ్చాక అడిగాడు.
‘పెద్ద లాభానికి కాదు. వాళ్లని కొన్ని కొనమని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. కొత్త చిత్రం గీసావా?’ అతని చేతిలోని గోధుమరంగు కాగితంలో చుట్టిన ఫ్రేమ్‌ని చూస్తూ అడిగింది.
‘అవును.’
‘గుర్తుందిగా. నేను ఇక్కడ రాసిన మొత్తం కన్నా ఒక్క ఫ్రేంక్ ఎక్కువ అడిగినా ఇక నేను దాన్ని కొనను. ఎప్పటికీ.’
‘మీరు నిజంగా ఈ పద్ధతిని ఇష్టపడుతున్నారు కదూ?’
‘ఇది నా జీవనం. నీ జీవనం కూడా. ఈ గ్రామంలో నాకు తమ చిత్రాలని అమ్మే ఇతరుల జీవనం కూడా. మీ చిత్రాల విలువ ఎక్కువని మీరు భావించడం సహజం. కాని వాటి విలువ, అవి ఎంతకి అమ్ముడవుతాయి అన్నది నాకు బాగా తెలుసు. దాని ధర ఈ కాగితంలో రాస్తాను. ఎక్కువ అడిగితే కొనను. కాబట్టి నేను రాసిందానికన్నా తక్కువ అడుగు. నువ్వు నష్టపోకుండా నేనేం రాసానో ఊహించు. బంతి నీ కోర్ట్‌లో ఉంది.’
హెన్రీ కొద్దిగా ఉత్కంఠగా చెప్పాడు.
‘నాలుగు వందలు... కాదు. మూడు వందలు.. మూడు వందల...’
‘లేదు. నువ్వు ఎక్కువ చెప్పావు’ లెర్గ్యూ చెప్పి తను రాసిన కాగితాన్ని అతనికి చూపించింది.
దాని మీద వంద అంకెని చూసి నివ్వెరపోయాడు.
‘దాని విలువ అంతే.’
‘దీని ధర? ఈసారి ఎక్కువ అడగను. రెండు వందల ఫ్రేంకులు’ హెన్రీ తనతో తెచ్చిన ఇంకో చిత్రాన్ని చూపించి అడిగాడు.
‘నేను ఎంత రాసానో తెలుసుకోవాలని లేదా?’ ఆ డబ్బుని తీసుకుని అతను బయటకు వెళ్లే అతన్ని అడిగింది.
‘లేదు’
‘కాని ప్రతీ వాళ్లు తెలుసుకోవాలని అనుకుంటారు.’
ఆవిడ అతని వంక నవ్వుతూ చూసి తను రాసిన కాగితాన్ని చూపించింది.
‘వెయ్యి ఫ్రేంకులు?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. కేష్. బహుశ ఈ రాత్రి నీకు నిద్ర పట్టదనుకుంటాను’ నవ్వుతూ ఎకసెక్కంగా చెప్పింది.
* * *
ఆ షాప్‌కి ఎదురుగా ఉన్న బార్‌లో కూర్చుని ఉన్న మరో చిత్రకారుడు గ్రిమ్ దగ్గరికి వచ్చిన ఫాతిమా అడిగింది.
‘అలా డల్‌గా ఉన్నావే? మేడం లెర్గ్యూ దగ్గరికి వెళ్లొచ్చావా?’
అతను జవాబు చెప్పలేదు.
‘తాగడం ఆపు. నువ్వు భోజనం చేసి ఎంత కాలమైంది?’
గ్రిమ్ దానికీ జవాబు చెప్పలేదు.
‘ఇలా తాగుతూ తినకపోతే ఛస్తావు’ కోపంగా మందలించింది.
‘అది మంచి పని’ అతను నిరసనగా చెప్పాడు.
ఆమె అతన్ని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. అతను తింటూంటే అడిగింది.
‘తాగడానికి నీ దగ్గర డబ్బుంది. దేన్ని అమ్మావు గ్రిమ్?’
‘కేథలిక్ పోప్ చిత్రం’
‘మేడం లెర్గ్యూకేనా?’
‘అవును. నేను మా ఊరు వెళ్లిపోవాలి అనుకుంటున్నాను’ గ్రిమ్ చెప్పాడు.
‘ఎప్పుడు?’
‘వెంటనే. కానీ నేను అనుకున్నంత డబ్బు సంపాదించలేదు’
‘మేడం లెర్గ్యూకి నేనంటే ఇష్టం లేదు’ ఆమె చెప్పింది.
భోజనం అయ్యాక అతను ఆమెతో పడక గదిలో కొద్దిసేపు గడిపి, ఆమె నగ్నంగా నిలబడితే ఈజిల్ మీది సగం గీసిన చిత్రాన్ని పూర్తి చేశాడు. తర్వాత సగం గీసిన లేండ్‌స్కేప్‌ని ఈజిల్‌కి అమర్చాడు.
‘నువ్వు ఆఖరిసారి లేండ్‌స్కేప్‌ని ప్రకృతిలో చూస్తూ ఎప్పుడు గీసావు?’ అడిగింది.
‘అనవసరం. ఏవైనా ఇలాగే అమ్ముడవుతాయి.’
‘ఎంతకి?’
‘మేడం లెర్గ్యూ నావి ఎప్పుడూ ఒకే ధరకి కొంటూంటుంది. నాలుగు వందల ఫ్రేంకులకి. నేనెప్పుడూ ఆవిడతో ధర గురించి వాదించను’ గ్రిమ్ చెప్పాడు.
‘కాని నువ్వు ఎక్కువ అడగాలి. ఈసారి రెట్టింపు అడుగు.’
‘ఎనిమిది వందల ఫ్రాంకులా? ఇవ్వదు.’
ఆ మాటన్నాక అతను దాని గురించి ఆలోచించాడు.
* * *
తన దగ్గరకి కొత్త చిత్రంతో వచ్చిన గ్రిమ్‌ని చూసి లెర్గ్యూ చెప్పింది.
‘నువ్వు మోడల్ ఫాతిమాతో కలిసి జీవిస్తున్నావు కదా? నా దగ్గరికి ఎన్నడూ నగ్న చిత్రాలని తీసుకురాకు. వాటిని నేను కొనను. అమ్మను. అలాంటివంటే నాకు అసహ్యం. పైకి రా’
‘ఒక్క నిమిషం. పైకి వెళ్లబోయే ముందు.. మీరు నా చిత్రాలని రెండేళ్ల నించి కొంటున్నారు. ఈ రెండేళ్లల్లో కాస్ట్ఫా లివింగ్ బాగా పెరిగింది’ అతను కోరాడు.
‘ఈ మాట ఫాతిమా అడిగింది కదా? బంతి నీ కోర్ట్‌లో ఉంది.’
‘ఎనిమిది వందలు’ ఆవిడ వెంట పైకి వెళ్లి చెప్పాడు.
ఆమె నాలుగు వందలు ఫ్రేంకులు రాసిన కాగితం చూపించి చెప్పింది.
‘ఇంకోసారి తెలివిగా ప్రవర్తించు. ఫాతిమా పిచ్చి సలహాలను పాటిస్తే నష్టపోతావు.’
* * *
ఆ రాత్రి గ్రిమ్ తాగి తను గీసిన లేండ్‌స్కేప్ చిత్రాన్ని నదిలో గిరాటేసి ఇంటికి ఆలస్యంగా తూలుతూ చేరుకున్నాడు.
‘ఏమైంది?’ ఫాతిమా ఆసక్తిగా అడిగింది.
‘ఇంకా మేలుకునే ఉన్నావా? ఇంక మనం ఎన్నడూ సంపాదించలేనంత డబ్బు ఇచ్చింది’ అతను తూలుతూ చెప్పాడు.
‘నువ్వు అబద్ధాలకోరువి.’
‘అవును. రెట్టింపు ఇవ్వనంది. ఇవన్నీ చెత్త. విలువ లేనివి’ ఆ మత్తులో తను గీసిన చిత్రాలని తలుపు తెరచి బయటకి గిరాటేశాడు.
‘ఆగు’ ఫాతిమా అతన్ని అడ్డుకుంది.
‘నేను ఇవాళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లొచ్చాను. నేను నెల తప్పానని ఆయన చెప్పాడు.’
తను చెప్పింది అతనికి వెంటనే అర్థం కాలేదని గ్రహించి అతని తలని పట్టుకుని ఊపుతూ మళ్లీ గట్టిగా అదే మాట చెప్పింది.
‘అర్థమైందా? నేను గర్భవతిని. పుట్టబోయే మన బిడ్డకి నువ్వే తండ్రివి.’
‘ఓ! చాలా మంచి శుభవార్త’ అతను ఆనందంగా చెప్పాడు.
‘మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. నా బిడ్డకి చట్టరీత్యా తండ్రి ఉండాలి. మంచి ఇంట్లో పెరగాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’
‘ఇల్లు?’ నవ్వాడు.
‘ఎక్కడ సదా ఎండ ఉంటే ఆ దేశంలో. ఏ దేశంలో ఎండ ఉంటుంది?’
‘అల్జీరియాలో’
‘సరే. మా అల్జీరియాలో అమ్మమ్మ దగ్గర, మేనమామల దగ్గరే వాడు పెరగాలి.’
‘అందుకు నేను బొమ్మలు గీసి లక్షలు గడించాలి. అవునా? మన వల్ల కానిది అదే. గీస్తాం కాని డబ్బు రాదు.’
‘నన్ను నగ్నంగా గీయి.’
‘లెర్గ్యూ నగ్నచిత్రాలు కొనదు’ గ్రిమ్ గుర్తు చేశాడు.
‘నువ్వు గీసే దీన్ని మాత్రం కొంటుంది’ ఫాతిమా స్థిరంగా చెప్పింది.
‘కొనదు. ఆవిడకి నగ్నచిత్రాలంటే పరమ అసహ్యం. అది ఓ మానసిక జబ్బు కూడా.’
‘నేను చెప్పినట్లు విని గియ్యి’ ఫాతిమా ఆజ్ఞాపించింది.
* * *
మర్నాడు అతను మంచం మీద నగ్నంగా పడుకున్న ఫాతిమా చిత్రాన్ని గీయడం ఆరంభించాడు. అది పూర్తి చేయడానికి అతనికి మూడు రోజులు పట్టింది. ఆమె ఓపికగా అతనికి మోడల్‌గా పని చేసింది. పూర్తయిన దాన్ని చూసి ఫాతిమా బొమ్మలోని తన మొహాన్ని చేత్తో మూసి, మిగిలిన శరీరాన్ని చూసి చెప్పింది.
‘అందం అంటే ఇదే’
‘చెయ్యి తియ్యి. నీ మొహం అందంగా లేకపోతే నీతో ప్రేమలో పడతానా?’ గ్రిమ్ అభ్యంతరం చెప్పాడు.
‘నేను అనుకున్న దానికన్నా బాగా గీసావు. నీకు ఇష్టమైన ఓ మంచి బహుమతి ఇస్తాను. రా’ ప్రేమగా ఆహ్వానించింది.
* * *
మేడం లెర్గ్యూ తన షాపులోకి ఓ చిత్రంతో వచ్చిన ఫాతిమాని చూసి కోపంగా అరిచింది.
‘ఆగు. బయటకు నడు. నేను మోడల్స్‌తో వ్యాపారం చేయను.’
‘ఇవాళ చేస్తావు. నేను గ్రామ కూడలి రోడ్లలోని ఇతర చిత్రకారుల చిత్రాల పక్కన ఉంచి అమ్మేది కాదిది. ఇది మాస్టర్‌పీస్. దీన్ని చూస్తే నువ్వు తిరస్కరించవు’ చెప్పి ఆ పెద్ద ఫ్రేమ్‌ని గోడకి ఆనించి దానికి అడ్డుగా ఉంచిన కాగితాన్ని ఫాతిమా చింపింది.
లెర్గ్యూ దాని వంక నివ్వెరపోతూ చూసింది. అది ఓ స్ర్తి నగ్న చిత్రం. మంచం మీద విలాసంగా పడుకున్న ఆ నగ్న చిత్రంలోని మొహం ఫాతిమాది కాదు. లెర్గ్యూది! అది తనదని గ్రహించగానే బల్ల ముందు నించి లేచి దాని వైపు అడుగులు వేస్తూ అడిగింది.
‘ఏమిటీ విపరీతం?’
‘ఓ వేశ్య మాత్రమే చిత్రకారుడి ముందు ఇచ్చే పోజిది. అది నువ్వే’ కోపంగా చెప్పి ఫాతిమా వెళ్లి ఆవిడ ఖాళీ చేసిన ఆవిడ కుర్చీలో కూర్చుంది.
‘లే అక్కడ నించి’ ఆవిడ అరిచింది.
‘నువ్వు దాన్ని కొన్నాక లేస్తాను.’
‘కొనడమా? ఛస్తే కొనను’
లెర్గ్యూ దాన్ని అందుకోబోతూంటే ఫాతిమా గొంతు చించుకుని అరిచింది.
‘దాన్ని ముట్టుకోకు.’
లెర్గ్యూ వెనక్కి తిరిగి చూస్తే ఫాతిమా చేతిలో మడతకత్తి మెరుస్తూ కనిపించింది.
‘అది నీది అయ్యేదాకా దాన్ని ముట్టుకోకు. లేదా గాయపడతావు.’
‘ఇంతటి అశ్లీల చిత్రాన్ని నేనెలా కొంటానని అనుకున్నావు?’
‘నువ్వు కొనకపోతే ఇలాంటివి కొనే ఫ్లోరెల్ కొంటాడు. దాన్నతను తన షాప్ కిటికీలో ఉంచుతాడు. అప్పుడు అంతా దీన్ని చూస్తారు. అమెరికా నించి వచ్చే పర్యాటకులు కూడా. ఎందుకంటే కనీసం ఏడాది పాటు దీన్ని అమ్మద్దని నేను ఫ్లోరెల్‌ని కోరుతాను. జాగ్రత్తగా ఆలోచించు. నీ షాప్‌కి కొనడానికి వచ్చే పర్యాటకులంతా ఇక మీద కొనడానికి కాక నువ్వా చిత్రంలోలా ఉంటావా, ఉండవా అని చూడటానికి వస్తారు. మొహం తప్ప శరీరం నీది కాదని నీ లావు శరీరం చూసి గ్రహించి నీ మొహం మీదే నవ్వుతారు. నిన్ను ఎగతాళి చేస్తారు.’
‘ఇది బ్లాక్‌మెయిల్!’
‘కాని నువ్వు దీన్ని కొన్నాక కావాలనుకుంటే నాశనం చేసుకోవచ్చు’ ఫాతిమా గుసగుసగా చెప్పింది.
‘ఎంత? నా నించి నువ్వు బాహాటంగా ఎంత దొంగిలించ దలచుకున్నావు?’ లెర్గ్యూ అడిగింది.
ఫాతిమా ద్వేషంగా నవ్వుతూ చెప్పింది.
‘అది నీకే తెలియాలి. బంతి నీ కోర్ట్‌లో ఉంది. నువ్వు చేసిందే నేనూ చేస్తున్నాను. ఈ కాగితంలో నేనో ధరని రాసాను. నీకు తెలుసుగా? ఈ ఆటలో నీకు ఒక్కటే అవకాశం ఉంటుంది. ఈ ఆటని నువ్వే కనిపెట్టావు కదా? నువ్వు చిత్రకారులని ఎలా పీడిస్తావో అందరికీ తెలుసు. నీవల్ల గ్రిమ్ తాగుడికి బానిసయ్యాడు. అతనే దీన్ని గీసాడు. నీ ఆటకి వాళ్లు ఎలా ఫీలవుతారో తెలుసుకునే వంతు నీకు ఇప్పుడు వచ్చింది. నా శరీరానికి, నీ మొహానికి నువ్వు ఎంత చెల్లించదలచుకున్నావో సరిగ్గా నిర్ణయించు. ఇందులో నేను అమ్మే ధర రాసానని గుర్తుంచుకో’ తన బ్లౌజ్‌లోంచి మడిచిన ఓ కాగితాన్ని తీసి లెర్గ్యూకి చూపించింది.
లెర్గ్యూ ఓసారి ఆ అశ్లీల చిత్రం వంక అసహ్యంగా చూసి అడిగింది.
‘నీకు ఎంత కావాలో స్పష్టంగా చెప్పు?’
‘అది తెలుసుకునే ఆధారాలు చెప్తాను. సరేనా? నేను, గ్రిమ్ అల్జీరియాకి వెళ్లిపోతున్నాం. మాకు ప్రయాణానికి డబ్బు కావాలి. సూట్‌కేస్‌లు, బట్టలు. అక్కడ మేం ఓ చిన్న ఇంటిని కొనాలి.’
‘ఇల్లా! అంత నేనివ్వను’ లెర్గ్యూ ఆక్రోశంగా అరిచింది.
‘ ఫ్లోరెల్‌ దీన్ని ప్రదర్శనలో ఉంచాక అందరికీ ఇది అక్కడికి ఎందుకు చేరుకుందో, నువ్వు ఎంత కపటివో, పిసినారివో కూడా తెలుస్తుంది. నీ వ్యాపారం ఇబ్బందుల్లో పడి నువ్వు నవ్వుల పాలవుతావు. చివరికి నాశనమై పోతావు. ఇంకా నేను, గ్రిమ్ అందరూ గౌరవనీయమైన మనుషుల్లా కొంత సొమ్ము బ్యాంక్‌లో దాచాలి. అందువల్ల గ్రిమ్ చవక బొమ్మలు గీసి అమ్మాల్సిన అవసరం రాదు. మా అవసరాలు తీరిస్తే ఈ బొమ్మని నువ్వు చింపేయచ్చు. ఆలోచించుకో’ ఫాతిమా చెప్పింది.
లెర్గ్యూ మరోసారి ఫాతిమా చేతిలోని కత్తి వంక, అశ్లీల చిత్రం వంక చూసింది. తర్వాత బాధని అణచుకుంటూ చెప్పింది.
‘ఇంటికి లక్ష ఫ్రేంకులు’
‘గ్రిమ్ కోసం స్టూడియో కూడా ఆ ఇంట్లో వుంటుంది. లక్షన్నర. నీ పరువుని, మొహాన్ని కాపాడుకోవడానికి అదనంగా ఎంతిస్తావు? నిర్ణయించు లెర్గ్యూ. నేనీ కాగితంలో రాసిందానికి తగ్గితే తక్షణం నేనా చిత్రంతో వెళ్లిపోతాను. అలాంటి మరి కొన్ని వరదలా ముంచెత్తుతాయని గుర్తుంచుకో’ ఫాతిమా హెచ్చరించింది.
‘సరే. బ్యాంక్‌లో దాచడానికి ఏభై వేల ఫ్రేంకులు’
‘లెర్గ్యూ నువ్వు ఇదే పద్ధతిలో లక్షల ఫ్రేంకులని సంపాదించావని మర్చిపోకు. త్వరగా తేల్చు’
‘ఈ చిత్రం ఎంత అశ్లీలంగా ఉందో! మూడు లక్షల ఫ్రేంకులు’ లెర్గ్యూ బాధగా చెప్పింది.
‘సరిగ్గా ఆలోచించి చెప్పు లెర్గ్యూ’
‘నాలుగు లక్షల ఫ్రేంకులు. అది నా ఆఖరి మాట. లేదా ఏం చేస్తావో అది చేసుకో’
ఫాతిమా ఆవిడ కళ్లల్లోకి విజయగర్వంతో చూస్తూ చెప్పింది.
‘సరే. పది గంటలకి నేను నిన్ను బ్యాంక్ బయట కలుస్తాను’
ఫాతిమా ఆ చిత్రంతో బయటకి నడిచింది.
* * *
లెర్గ్యూ వేచి ఉన్న ఆ జంట వంక కారులోంచి నిప్పులు కక్కుతూ చూసి తన ఒళ్లోని బ్రీఫ్‌కేస్‌ని తెరిచింది. గ్రిమ్ ఆ నోట్ల కట్టలని లెక్కపెట్టుకుంటూ తన చేతిలోని సంచీలో వేసుకున్నాడు.
‘దీంతో నేను కొంత పెయింట్‌ని కొంటాను’ నవ్వి చెప్పి అతను ఆ చిత్రాన్ని ఆవిడకి ఇచ్చాడు.
‘పోనీ డ్రైవర్’ ఆవిడ చెప్పింది.
‘ఒక్క క్షణం మేడం లెర్గ్యూ’ ఫాతిమా చెప్పింది.
‘ఇంకేం పని? నీకు నీ డబ్బు ముట్టింది. నాకు నా చిత్రం వచ్చింది. డ్రైవర్ పోనీ’ ఆవిడ కోపంగా చెప్పింది.
ఫాతిమా తన బ్లౌజ్‌లోంచి ఎడం చేత్తో ఓ కాగితాన్ని తీసి ఆవిడకి ఇస్తూ చెప్పింది.
‘ఇది మీకు. నేను ఎంతకి దీన్ని అమ్మాలని అనుకున్నానో ఈ కాగితంలో ఉంది.’
కారు కదిలింది. ఆవిడ దాన్ని తెరిచి చూసింది. ఏభై ఫ్రేంకులు అని రాసి ఉంది. తక్షణం లెర్గ్యూ పెట్టిన కేక ఆ వీధంతా వినిపించింది.
*
(స్టాన్లీ ఎలెన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి