క్రైమ్ కథ

స్వర్గం - నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రాత్రి హెన్రీ వేలంటైన్ సౌత్ ఈస్ట్ లోన్స్ ఆఫీస్ తలుపుని తెరచుకుని లోపలకి రహస్యంగా ప్రవేశించాడు. ఐరన్ సేఫ్‌ని మారుతాళం చెవుల గుత్తితో అరగంటలో చాకచక్యంగా తెరిచాడు. ఐతే సేఫ్ తెరవగానే పోలీసుస్టేషన్‌లో అలారం మోగిందని అతనికి తెలీదు.
అందులో తాకట్టు పెట్టిన విలువైన వస్తువులన్నీ తనతో తెచ్చుకున్న సంచీలో వేసుకున్నాడు. ఓ ఉంగరం అతన్ని ఆకర్షించింది. అది తన వేలికి పడుతుందా అని పెట్టుకుని చూస్తూంటే పోలీస్ సైరన్ వినిపించింది.
తక్షణం అతను సంచీని తీసుకుని వెనక తలుపు తెరచుకుని బయటకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో రెండు పోలీస్ కార్లు వచ్చి ఆ ఆఫీస్‌కి ముందొకటి, వెనక ఒకటి ఆగాయి. పారిపోతున్న హెన్రీని చూసి పోలీస్ ఆఫీసర్ కారు దిగి అతని వెనకే పరిగెత్తుతూ అరిచాడు.
‘ఆగు!’
వేలంటైన్ ఆగకుండా పరిగెత్తుతూంటే పోలీస్ ఆఫీసర్ మళ్లీ అరిచాడు.
‘ఆగు. లేదా కాలుస్తాను’
పక్క సందులోని ఓ చెక్కగోడని ఎక్కే హెన్రీ మీదకి పోలీస్ ఆఫీసర్ ఓసారి కాల్చాడు. గుండు వెళ్లి సరాసరి అతని తలలో దిగబడటంతో ఆరడుగుల ఎత్తు నించి అతను నేల కూలాడు. కూలుతూ అనుకున్నాడు. తన జీవితం ముగిసిందని.
* * *
వేలంటైన్ పక్కన రెండు కాళ్లు వచ్చి ఆగాయి.
‘మిస్టర్ వేలంటైన్.. మిస్టర్ వేలంటైన్’ ఆ వ్యక్తి రెండుసార్లు పిలిచాడు.
వేలంటైన్ ఆ మాటలకి కళ్లు తెరచి చూశాడు. తెల్లటి గడ్డం. అరవై పైబడ్డ ఆయన గోధుమ రంగు సూట్‌ని ధరించాడు.
‘మీరు ఎవరు?’ వేలంటైన్ ప్రశ్నించాడు.
‘నా పేరు పిప్. నేను నీ మార్గదర్శకుడి లాంటి వాడిని’
‘నాకేమైంది? నా పేరు మీకు ఎలా తెలుసు?’ అతను అడిగాడు.
‘తెలుసుకోవడం నా వృత్తి. ఎలా ఉంది?’
‘తల్లో ఏదో రంధ్రం అయినట్లుగా ఉంది. మీరు పోలీసా? నా పేరు ఎలా తెలుసు?’ వేలంటైన్ లేచి కూర్చుంటూ అడిగాడు.
‘నీకు ఇప్పటికే చెప్పాను’
‘నువ్వేం చెప్పలేదు’
‘నీకు జూదం అంటే ఇష్టం. రౌలెట్ టేబిల్, కాయిన్ మెషీన్, క్రాక్‌జాక్‌లు ఇష్టం. నీ తొమ్మిదో ఏట నించి నువ్వు జూదం ఆడుతున్నావు. నా పని నీకు అంతా సౌకర్యంగా ఉండేలా అమర్చడమే’
‘అందుకు బదులుగా నీకు ఏం కావాలి?’ లేచి నిలబడి వేలంటైన్ అడిగాడు.
‘ఏం వద్దు’
‘జోక్ చేస్తున్నావా? ఈ ప్రపంచంలో నాకు ఏదీ ఉచితంగా లభించలేదు.’
తన రివాల్వర్‌ని ఆయనకి గురి పెట్టి అడిగాడు.
‘కమాన్. నీ పర్స్ ఇవ్వు’
‘నాకు పర్స్ లేదు’
‘ఐతే నీ జేబులోని డబ్బివ్వు’
ఆయన కొన్ని వంద డాలర్ల నోట్లని జేబులోంచి తీసి ఇచ్చాడు. వాటిని లెక్క పెట్టాడు. ఏడు.
‘అది చాలా?’ పిప్ అడిగాడు.
‘ఇంకా ఉందా?’
‘నీకు కావాల్సినంత ఉంది’
‘ఐతే అక్కడికి పద’ వేలంటైన్ ఆయన వీపునకు రివాల్వర్ గొట్టాన్ని గుచ్చి ముందుకు తోశాడు.
* * *
తలుపు తెరచుకుని ముందు పిప్, వెనకే వేలంటైన్ ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ పెద్ద గదిని, అందులోని ఖరీదైన ఫర్నిచర్‌ని చూసి వేలంటైన్ చెప్పాడు.
‘నువ్వు అవినీతి పరుడైన రాజకీయ నాయకుడివై ఉంటావు.’
‘ఇది మీదే మిస్టర్ వేలంటైన్ - మీకు నచ్చితే’
‘నచ్చింది. కానీ ఇది నాదా?’ ఆ గదిని చూస్తూ అడిగాడు.
పిప్ తలుపు తెరచి అతన్ని బయటకి తీసుకెళ్లి నేమ్ బోర్డ్‌ని చూపించాడు. దాని మీద హెన్రీ ఫ్రాన్సిస్ వేలంటైన్ అనే పేరు రాసి ఉండటం చూశాడు.
వేలంటైన్ ఆ గది గోడలకి వేలాడే రెండు అందమైన అమ్మాయిల ఫొటోలని చూశాడు. పిప్ అతన్ని పడక గదికి తీసుకెళ్లి చూపించాడు. ఎక్కువగా జైలు గదుల్లో గడిపిన వేలంటైన్ అంత ఖరీదైన, సౌకర్యమైన పక్కలో ఎన్నడూ పడుకోలేదు.
‘ఈ వార్డ్ రోబ్‌లోని దుస్తులన్నీ నీ కోసమే. నీకు పసుపు రంగు టైలంటే ఇష్టం కాబట్టి ఆ రంగు టైలు కూడా అనేక డిజైన్స్‌లో ఉన్నాయి’ పిప్ చెప్పాడు.
ఓ సూట్‌ని తొడుక్కుని వేలంటైన్ అడిగాడు.
‘మీ టైలర్‌కి నా ఒంటి సైజులు తెలిసినట్లున్నాయి. ఇప్పుడు చెప్పు. వీటికి బదులుగా ఏం కావాలి? ఇవన్నీ ఇస్తున్నావంటే ట్రిక్. ట్రిక్ ఏమిటి? ఈ ఇల్లు ఎవరిది?’
‘నా బాస్‌ది.’
‘ఐతే నీ బాస్ రౌడీనో, గూండానో అయి ఉంటాడు. ఆయన్ని నేను కలవాలి. ఆయన్ని పిలు’ కోరాడు.
‘ఆయన ఓ పట్టాన నీకు కనపడడు. నీకు ఆకలిగా ఉందనుకుంటాను.’
పిప్ అతన్ని డైనింగ్ టేబిల్ దగ్గరకి తీసుకు వెళ్లాడు.
అక్కడ ఉన్న రుచికరమైన పదార్థాలన్నీ తనకి ఇష్టమైనవే అని వేలంటైన్ గ్రహించాడు. చికెన్ స్టేక్‌ని అందుకుని తినబోతూ అనుమానంగా ఆగి చెప్పాడు.
‘ముందు నువ్వు తిను.’
‘నేను తినను. ఆకలి లేదు. నిజానికి నేను తిని వందల ఏళ్లైంది’ పిప్ జవాబు చెప్పాడు.
‘నాకు అర్థమైంది. స్నానం, మంచి బట్టలు, తర్వాత విషం కలిపిన అన్నం. ఆ తర్వాత నీ పథకం ఏమిటి?’ వేలంటైన్ ప్రశ్నించాడు.
‘నువ్వేం కోరితే అది’
‘అది నా ప్రశ్నకి జవాబు కాదు పిప్. చెప్పు. లేదా ఛస్తావు’ లేచి రివాల్వర్‌ని ఆయనకి గురి పెట్టి వేలంటైన్ కోపంగా చెప్పాడు.
పిప్ నిర్భయంగా దూరంగా వెళ్లి నవ్వుతూ ఆగాడు. వేలంటైన్ రెండుసార్లు కాల్చాడు. పిప్ నేలకి ఒరగకపోవటంతో చెప్పాడు.
‘బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించావు. ఈసారి చూడు’
తలకి గురి పెట్టి మళ్లీ రెండుసార్లు కాల్చాడు. పిప్ నవ్వుతూ చేతులు కట్టుకుని తన వంక చూస్తూండటంతో అర్థం కానట్లుగా చెప్పాడు.
‘ఈ దూరంలో నా గుండు ఎప్పుడూ గురి తప్పదు. ఇది బొమ్మ పిస్తోలా?’
అనుమానం వచ్చి టేబిల్ లేంప్‌కి గురి పెట్టి కాల్చాడు. అది పగిలి గలగల శబ్దం చేస్తూ గాజు ముక్కలు నేల రాలాయి.
‘అలసిపోయావు. లిక్కర్ తాగు’ పిప్ చెప్పాడు.
డైనింగ్ టేబిల్ మీది ఖరీదైన స్కాచ్ బాటిల్‌ని, గ్లాసులని చూసి వేలంటైన్ చెప్పాడు.
‘ఇందాక అది లేదు. ఇంతలో ఎక్కడ నించి వచ్చింది? నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు ఎవరు?’ అయోమయంగా చూస్తూ అడిగాడు.
‘నేను నీ సహాయకుడ్ని’
‘ఈ ఇల్లు, ఈ బట్టలు, ఈ మందు.. నేను స్వర్గంలో ఉన్నానా?’
‘ఇందాక నువ్వు చెప్పింది నిజం. నీ తల్లో రంధ్రం ఉన్నట్లుగా ఉందన్నావు. పోలీస్ ఆఫీసర్ పేల్చిన గుండు నీ తల్లో గుచ్చుకుంది.’
‘అంటే నేను మరణించానా? నువ్వు నా గార్డియన్ ఏంజెల్‌వా?’
‘దాదాపుగా అలాంటి వాడినే. నీకేం కావాలంటే అది ఇవ్వడమే నా బాధ్యత’ పిప్ చెప్పాడు.
‘నాకు డబ్బు కావాలి.. పది లక్షల డాలర్లు.. అన్నీ ఐదు డాలర్ల నోట్లే. ఇంకా అందమై అమ్మాయి కావాలి.’
‘ఆ డ్రాయర్లో ఉంది చూడు’
వేలంటైన్ దాన్ని తెరచి చూస్తే ఐదు డాలర్ల నోట్లు కనిపించాయి. వాటిని గుప్పిళ్లతో తీసుకుని ఆనందంగా అరుస్తూ గాల్లోకి ఎగరేశాడు. అక్కడి గ్రామఫోన్ రికార్డ్ దానంతట అదే స్టార్ట్ అయి ఓ పాట మొదలైంది. గాల్లోంచి ఓ అందమైన అమ్మాయి ప్రత్యక్షం అయి ఆ సంగీతానికి అనునయంగా నాట్యం చేయసాగింది. అతను ఆనందంగా అరుస్తూ ఆమెతో కలిసి నృత్యం చేస్తూ అరిచాడు.
‘నేను స్వర్గంలో ఉన్నాను. హుర్రే! నేను స్వర్గంలో ఉన్నాను’
‘ఇంకేమైనా కావాలా?’ పిప్ నవ్వుతూ చూస్తూ అడిగాడు.
* * *
‘మీ బెట్స్‌ని ఉంచండి. దయచేసి మీ బెట్స్‌ని ఉంచండి’ జూద గృహంలో సూట్‌లోని వ్యక్తి కోరాడు.
ఆ టేబిల్ ముందు కూర్చున్న వేలంటైన్ నోట్లో సిగరెట్ వెలుగుతోంది. తను అంతదాకా గెలుచుకున్న చిప్స్‌ని తొమ్మిదో నంబర్ మీదకి తోశాడు. రౌలెట్ చక్రం తిరుగుతూంటే వేలంటైన్ ఆందోళనగా చూశాడు. అది ఆగింది - సరిగ్గా తొమ్మిది మీదే.
‘మళ్లీ గెలిచాను!’ తన వెనక నిలబడ్డ ముగ్గురు అందమైన అమ్మాయిలతో గర్వంగా చెప్పాడు.
ఈసారి పధ్నాలుగు రెడ్ మీద పందెం కాశాడు. మళ్లీ గెలిచాడు.
‘హుర్రే! గంటలో పధ్నాలుగు వేల డాలర్లు గెలిచాను! నువ్వు బట్టలు కొనుక్కో’ తను అక్కడికి రాక మునుపు రతిలో పాల్గొన్న అందమైన అమ్మాయితో చెప్పాడు.
‘కాయిన్ మెషీన్ అటువైపుంది’ పిప్ చెప్పాడు.
వేలంటైన్ లేచి ఆ యంత్రం దగ్గరికి వెళ్లి అందులో క్వార్టర్ వేసి లివర్ లాగాడు. తక్షణం లోపల నించి గలగలమంటూ నాణాలు బయటకి వచ్చి పడ్డాయి. వాటిని తన టోపీని తీసి పట్టుకుంటూ వేలంటైన్ ఎక్సయిటింగ్‌గా అరిచాడు.
‘మళ్లీ గెలిచాను. కనీసం ఆరు వందల డాలర్లు! ఇంక విసుగు పుడుతోంది. ఇంటికి వెళ్దాం.’
బయటకి రాగానే వాచ్‌మేన్ డోర్ తెరిచాడు. వాడికి వంద డాలర్ల నోట్‌ని టిప్‌గా ఇస్తే ఆనందంగా సెల్యూట్ చేశాడు. పిప్ ముందు సీట్లో, ముగ్గురు ఆడవారు వెనక సీట్లో కూర్చున్నాక వేలంటైన్ కారుని ముందుకి పోనించాడు.
* * *
వేలంటైన్ వాళ్లని పడక గదిలోకి వెళ్లమని పిప్‌తో చెప్పాడు.
‘కూర్చో. నీతో మాట్లాడాలి’
ఆయన కూర్చున్నాక అడిగాడు.
‘నేను నాకు తెలిసి ఇంతదాకా ఎలాంటి మంచీ చేయలేదు. నాలాంటి వారు కాక స్వర్గానికి స్కూల్ టీచర్స్ లాంటి వారు వస్తారని విన్నాను.’
‘ఇక్కడ కొందరు స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. నీకు తెలుసుకోవాలని ఉంటే హాల్ ఆఫ్ రికార్డ్స్‌లో నీ రికార్డ్ ఉంది’ పిప్ చెప్పాడు.
‘ఇంత రాత్రి అది తీసి ఉంటుందా?’
‘్భలోకంలో లాగా ఇక్కడ టైమింగ్స్ అంటూ ఉండవు.’
* * *
మెట్లెక్కి రికార్డులు ఉన్న షెల్ఫ్‌ల వరసలోని ఓ దాని ముందు ఆగి పిప్ ఓ డ్రాయర్ తెరచి అందులోని ఓ ఫైల్‌ని తీసిచ్చాడు. ఫైల్ మీద తన పేరు ఉండటం గమనించి వేలంటైన్ దాన్ని తెరిచి చదివాడు.
‘్ఫర్ నైంటీ బ్రూక్లిన్. న్యూయార్క్... అది నా చిరునామా. వయసు ముప్పై రెండు. ఏడో ఏట డైమ్ స్టోర్‌లోంచి పధ్నాలుగు బొమ్మలని దొంగిలించాడు. నిజమే. ఎనిమిదో ఏట గేంగ్‌ని స్థాపించాడు. ఇదీ నిజమే. ఏంజెల్స్ అని దాని పేరు. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? తొమ్మిదో ఏట సైకిళ్ల దుకాణంలో దొంగతనం చేసి జూదం ఆడాడు.. ఇందులో నేను చేసిన ఒక్క మంచి పని కూడా లేదు కదా? ఏదైనా పొరపాటు జరిగి ఉండచ్చా?’
‘అసాధ్యం. నాతో అవసరం ఉంటే పి ఐ పిని డయల్ చేయండి. సరేనా?’ పిప్ కోరాడు.
* * *
జూద గృహంలో రౌలెట్ టేబిల్ ముందు కూర్చున్న వేలంటైన్ గిరగిర తిరిగ రౌలట్ చక్రం వంక విసుగ్గా చూశాడు. అది అతను ఊహించినట్లుగానే అతను పందెం కాసిన పదమూడో నంబర్ మీద ఆగింది. చిరాగ్గా లేచి వెళ్తున్న అతనితో ఉద్యోగి చెప్పాడు.
‘మీ చిప్స్ సర్’
‘పోస్ట్ చేయి’ చెప్పి కాయిన్ మెషీన్ దగ్గరికి వెళ్లి క్వార్టర్‌ని వేశాడు. అతను ఎదురు చూసినట్లుగా లోపల నించి గలగల మంటూ మళ్లీ నాణాలు బయటకి వచ్చాయి.
ఆ రాత్రి మంచం మీద మిగిలిన ముగ్గురు అందగత్తెలతో పేకాట ఆడుతున్నాడు.
‘నేను గెలిచాను. స్ట్రెయిట్ ఫ్లెష్’ ఒకామె చెప్పింది.
విసుగ్గా తన చేతిలోని ముక్కలని కింద పడేశాడు.
‘ఓ! రాయల్ ఫ్లెష్! మీరే గెలిచారు’ ఆమె ఆనందంగా చెప్పింది.
‘గెలవడం, గెలవడం, గెలవడం. ఇంతకు మించి ఇంకేం జరగదా? వెళ్లండి. మీరంటే నాకు విసుగు పుట్టింది. ఇంక వెళ్లండి’ వేలంటైన్ ఆ ముగ్గుర్నీ బయటకి తరిమేసి తలుపు మూశాడు.
అక్కడ కొత్తగా కనిపించిన బిలియర్డ్స్ బల్లని చూశాడు. బాల్యంలో అతనికి అది ఇష్టమైన ఆట. దాని దగ్గరికి ఆనందంగా వెళ్లి స్టిక్‌ని తీసుకుని గురి చూసి స్ట్రెకర్ బాల్‌ని కొట్టాడు. ఒక్క బంతి కూడా బోర్డ్ మీద ఉండకుండా అన్నీ రంధ్రాల్లోంచి కింద పడి అతను గెలిచాడు. వెంటనే కోపంగా ఆ స్టిక్‌ని మధ్యకి విరిచి పారేశాడు. అతనికి అక్కడ ఆ వారం రోజులుగా గడిపిన జీవితం పరమ విసుగ్గా ఉంది. ఎదురుగా ఫోన్ కనిపించింది. దాని డయల్ మీద పి ఐ పి అన్న అక్షరాలు మాత్రమే కనిపించాయి. వాటిని డయల్ చేయగానే వెనక నించి ప్రత్యక్షం అయిన పిప్ అడిగాడు.
‘ఏమిటి? మీకేం కావాలంటే అది తెస్తాను. ఏదైనా సమస్యా?’
‘అవును. అన్నీ సమస్యలే. నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ కిక్ లేనే లేదు. ఎక్సయిట్‌మెంట్ అసలు లేదు. ప్రతీసారి నేనే గెలవడం ఖాయం. నాకు వచ్చే డబ్బు విరాళంగా అనిపిస్తోంది తప్ప జూదంలో గెలిచినట్లుగా అనిపించడం లేదు. నేను సరిగ్గా చెప్పలేకపోయాను.’
‘నీ వృత్తికి దూరం అయ్యావనా? ఈ సందు చివర ఓ పెద్ద బేంక్ ఉంది. పారిపోవడానికి నీకు ఏ కారు కావాలి? బిఎండబ్ల్యు? రెనో?...’
‘అక్కడ నన్ను ఎవరైనా పట్టుకునే అవకాశం ఉందా?’
‘ఊహు. ఒకవేళ మీకలా అనిపిస్తే సరే. అప్పుడు పట్టుకుంటారు’
‘అదే.. అదే నాకు నచ్చనిది. అంతా నా కోరిక ప్రకారం జరిగితే ఇక జీవితంలో థ్రిల్ ఏముంటుంది? ప్రతీసారి నేను గెలుస్తాను. ఒకే ఆడవారితో ఒకే రకం సెక్స్‌ని నేను అన్నిసార్లు చేయలేను. వాళ్లు బానిసల్లా అనిపిస్తున్నారు కాని చక్కటి బెడ్ మేట్స్‌గా ప్రవర్తించడం లేదు. ఇది నాకు సరిపడే చోటు కాదు. నేను ఇంకో చోటుకి వెళ్తాను. అదీ నా కోరిక. ఈ ప్రదేశం, ఈ ఇల్లు నాకు నచ్చలేదు. ఇక్కడ ఇంకో రోజుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. కోరిందంతా ఈ స్వర్గంలో దొరుకుతోంది. దాంతో కలిగే విసుగు పోవాలని కోరినా పోవడం లేదు’ ఆవేదనగా చెప్పాడు.
‘స్వర్గం? ఇది స్వర్గమని ఎవరు అన్నారు మిస్టర్ వేలంటైన్? ఇది ఆ ఇంకో చోటు’ చెప్పి పిప్ పెద్దగా నవ్వసాగాడు.
(్ఛర్లెస్ బ్యూమాంట్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి