క్రైమ్ కథ

ఎక్స్‌ట్రా సర్వీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత షోర్ రోడ్ సమీపంలోంచి వెళ్ళే సూపర్ హైవే చౌరస్తాలో ఎడ్డీస్ డైనర్ అనే రెస్టారెంట్ ఉంది. పాత రైల్వే డైనింగ్ కారే ఆ రెస్టారెంట్. దాని తలుపు మీద ‘సర్వీస్ డీలక్స్’ అనే ఎర్ర నియోన్ లైట్ ఆరి వెలుగుతోంది.
ఆ డైనర్‌లోకి వెళ్తూ టోబర్ ఆ సైన్‌ని చూసి నవ్వుకున్నాడు. అతని దృష్టిలో ఎడ్డీస్ డైనర్ యజమాని ఎడ్వర్డ్ మూర్ఖుడు. తన కస్టమర్లకి మంచి సర్వీస్ ఇస్తే మళ్ళీ మళ్ళీ వస్తారని ఎడ్డీ నమ్మకం. ఆ ప్రకారమే అతను కస్టమర్లతో మసలుకుంటాడు. కానీ చాలా దూరం వెళ్తూ హైవే మీద నుంచి దానికి వచ్చే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని ఆ రెస్గారెంట్‌కి వస్తారనే నమ్మకం టోబర్‌కి లేదు.
పీపుల్స్ డ్రగ్స్ అనే అమెరికన్ చెయిన్ మందుల షాపు యజమాని నించి ఆ ఉదయమే అతనికో ఈమెయిల్ వచ్చింది. హైవే సమీపంలో ఏదైనా షాప్ అద్దెకి లేదా అమ్మకానికి దొరుకుతుందా అన్నది దాని సారాంశం. అక్కడ తమ బ్రాంచ్ తెరవాలన్నది వారి ఉద్దేశ్యం. ఎప్పటినుంచో ఎడ్డీస్ డైనర్ కస్టమర్లని అధిక సంఖ్యలో ఆకర్షించే లొకేషన్‌లో ఉంది. అది ఆ మందుల కంపెనీ వాళ్ళకి నచ్చచ్చు.
ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేదాకా ఆగి హైవే మీద అంతు లేకుండా వెళ్ళే కార్లని చూశాడు. అతను ఆ రెస్టారెంట్‌కి వెళ్ళేసరికి అత్యంత శుభ్రంగా ఉన్న ఆ చిన్న రెస్టారెంట్లో ఇద్దరు కస్టమర్లు భోజనం చేస్తూ కనిపించారు. అలసినట్లు కనిపించిన వాళ్ళిద్దరూ ప్రయాణీకులని టోబర్ ఊహించాడు. వారిలో స్థానికుడైన ఒకర్ని గుర్తుపట్టాడు.
టోబర్ ఓ బల్ల ముందు కూర్చున్నాడు. అప్పటికే శుభ్రంగా ఉన్న గ్లాసులని తుడిచే ఎడ్డీ పలకరింపుగా నవ్వుతూ అతని ముందుకి వచ్చాడు. అతను వాటిని తుడవడం వెయ్యిసార్ల పైనే చూసిన టోబర్‌కి అది చిరాకుని తెప్పించింది. అదేం ఫైవ్‌స్టార్ హోటల్ కాదుగా? చాలాసార్లు టోబర్ అతనితో బట్టతో గ్లాసులని, కౌంటర్ని అన్నిసార్లు తుడవడం అంటే డస్టర్ బట్టకోసం అనవసరంగా అధికంగా ఖర్చు చేయడమేనని అనేకసార్లు హెచ్చరించాడు. ఎడ్డీ నవ్వి దానికి ఎప్పుడూ ఒకే జవాబు చెప్తాడు.
‘‘కస్టమర్లకి అంతా శుభ్రంగా కనిపిస్తే బావుంటుంది. ఇది తాము పొందే అదనపు సేవ అనుకుంటారు.’’
‘‘మీ హెల్పర్ ఏడి?’’ మెనూ కార్డ్ అందుకుంటూ టోబర్ అడిగాడు.
‘‘డేన్స్ పార్టీకి వెళ్తానంటే శెలవు ఇచ్చాను.’’
‘‘దాంతో ఇద్దరి పనీ నువ్వే చేయాల్సి వచ్చింది. అవునా?’’
‘‘అవును. అప్పుడప్పుడు ఇతరులకి సహాయం చేయడం వల్ల నేనేం నష్టపోను.’’
టోబర్ తనకేం కావాలో చెప్పాడు. ఎడ్డీ వెళ్ళాక తన బల్లవంక చూశాడు. అలాంటి చాలా రెస్టారెంట్లలోలా కాక జిడ్డు, మురికి లేకుండా తళతళలాడుతోంది. అతను టోస్ట్ తీసుకువచ్చాక టోబర్ చెప్పాడు.
‘‘ఎడ్డీ! ఈ ఆస్తి మీద తనఖా చెల్లింపు ఆఖరిరోజు రేపే. ఇరవై ఐదు వేల డాలర్లు నువ్వు నాకు చెల్లించాలి.’’
‘‘నేను మర్చిపోలేదు టోబర్. కానీ ఆ మొత్తం ఇప్పడు నేను ఒక్కసారిగా చెల్లించలేను.. ఎక్స్‌క్యూజ్ మి.’’ చెప్పి ఎడ్డి ఓ కస్టమర్ దగ్గరకి వెళ్ళి అడగడం టోబర్ అసహనంగా విన్నాడు.
‘‘అంతా సరిగ్గానే ఉంది కదా. మీ స్టేక్ మీకు కావాల్సిన విధంగా ఉడికింది కదా? ఇంకాస్త వెన్న కావాలా?’’
ఎడ్డీ మూర్ఖుడని టోబర్ మరోసారి అనుకున్నాడు. ఆ కస్టమర్ మళ్ళీ ఇటువైపే రాకపోవచ్చు. వచ్చినా ఈ రెస్టారెంట్‌ని గుర్తుపెట్టుకుని దీంట్లోకే వస్తాడనే హామీ కూడా లేదు. ఒకవేళ స్టేక్ సరిగ్గా ఉడకలేదని ఫిర్యాదు చేస్తే? ఎక్కువ వెన్నంటే ఎక్కువ డబ్బు ఖర్చు.
ఎడ్డీ మళ్ళీ టోబర్ దగ్గరకి వచ్చి చెప్పాడు.
‘‘నీకు ఇప్పుడు సగం ఇస్తాను. మిగిలిన అప్పుని మరో ఆరునెలల అదే వడ్డీ రేటుతో పొడిగించు. వ్యాపారం ఇలా సాగుతూంటే అంతకాలం కూడా ఆగకుండా ఇంకా ముందే చెల్లిస్తాను.’’
టోబర్ తన చిరకాల మిత్రుడు ఎడ్డీ వంక చూడలేక కాఫీలోకి చూస్తూ బాంబ్ పేల్చాడు.
‘‘వెరీ సారీ ఎడ్డీ. అందుకు స్నేహితుడిగా నేను అంగీకరించాలి. కానీ వ్యాపారం వ్యాపారమే. వ్యాపారస్థుడిగా నేను వ్యవహరించాలి. రేపు నువ్వు మొత్తం పాతికవేలు చెల్లించకపోతే నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.’’
ఎడ్డీ అతని వంక నమ్మలేనట్లుగా చూశాడు. వెంటనే ఏదో చెప్పబోయి, ఇందాకటి కస్టమర్ లేచి నిలబడటం చూసి అతని టేబుల్ దగ్గరికి వెళ్ళాడు.
‘‘అంతా తృప్తికరంగా ఉందా సార్?’’ అడిగాడు.
తల ఊపి, అతను డబ్బు చెల్లించి బయటకి వెళ్తూండగా ఎడ్డీ మళ్ళీ చెప్పాడు.
‘‘్థంక్ యూ సర్. దయచేసి మళ్ళీరండి.’’
ఈ అదనపు మర్యాదతో కూడిన సేవ వృథా అని టోబర్ అనుకున్నాడు.
ఎడ్డీ ప్లేట్‌లో టోస్ట్‌ని తెచ్చాడు.
‘‘నీ చిరకాల మిత్రుడి విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించడం బాలేదు మిత్రమా! ఇది తాత్కాలిక ఇబ్బంది. మా బావ పోవడంతో మా అక్కకి ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది. ఈ రోజు దీన్ని నీ తనఖా సొమ్ముకి నాలుగు రెట్లకి అమ్మగలను. హైవే పడ్డాక దీని విలువ బాగా పెరిగింది.’’
‘‘లేదు ఎడ్డీ. నువ్వు అమ్మలేవు. మన తనఖా అగ్రిమెంట్ షరతు ప్రకారం అది చెల్లదు. నువ్వు సరిగ్గా చెల్లించాల్సిన రోజున తనఖా మొత్తం చెల్లించకపోతే దీని కొనే హక్కు నాకుంది. నీకు గుర్తుందా? ఆ అగ్రిమెంట్ చేసిన రోజునే దీని విలువ కూడా రాసుకున్నాం. ఆనాటి విలువతోనే నువ్వు అమ్మాలన్నది నియమం.’’ టోబర్ చెప్పాడు.
ఎడ్డీ మొహంలో మొదటిసారి ఆందోళన కనిపించింది.
‘‘కానీ టోబర్! అది కొత్త హైవే రాని మునుపటి విలువ... ఓ! నేను రేపు ఉదయం బ్యాంక్‌కి వెళ్ళి అప్పు తీసుకుని నీ బాకీ చెల్లించేస్తాను.’’ ఎడ్డీ చిరుకోపంగా చెప్పాడు.
‘‘సారీ! బ్యాంక్‌కి నీ ఆస్తి మీద అప్పు ఇచ్చే ఆసక్తి లేదు.’’ టోబర్ చెప్పాడు.
టోబర్‌కి ఆ బ్యాంక్‌లో చాలా షేర్లు ఉన్నాయి. ఆ మేరకి అప్పటికే అతను బ్యాంక్ ప్రెసిడెంట్‌తో మాట్లాడి ఉంటాడని ఎడ్డీ అనుకున్నాడు.
ఇంకోచోట అప్పు తీసుకోడానికి ఎడ్డీకి ఇరవై నాలుగు గంటలు సరిపోవు. ఆ ఆస్తి తనకి కాబోతోంది అని టోబర్ భావించాడు. ఎడ్డీ మొహం వెంటనే ఎర్రబడింది. అతని చేతిలోని డస్టర్ బట్టతో టోబర్ పక్క బల్లని తుడవసాగాడు.
వారిద్దరి సంభాషణ విన్న, దూరంగా కూర్చున్న షెరీఫ్ డేన్ ఎడ్డీ వంక సానుభూతిగా, టోబర్ వంక కోపంగా చూశాడు. అది చట్టరీత్యా తప్పు కాదు కానీ నైతికంగా తప్పు అని అప్పటికే షెరీఫ్ భావించాడు.
తెల్ల దుస్తుల్లోని ఓ యువకుడు తలుపు తెరచుకుని లోపలకి వచ్చాడు. అతను కౌంటర్ ముందున్న గుండ్రంగా తిరిగే స్టూల్ మీద కూర్చుని దాన్ని తిప్పుతో ఓసారి చుట్టూ చూశాడు. అతని దృష్టి ఎదురుగా గోడకి వేలాడే, మహాగని చెక్కతో చేసిన ఫ్రేమ్‌లోని పది డాలర్ల నోట్ మీద పడింది. దాని కింద రాసింది చదివాడు.
‘ఈ డైనర్లో చెల్లించిన మొదటి పది డాలర్ల నోట్ ఇది. ఇక్కడ ఈ వ్యాపారం కొనసాగేంతవరకూ ఇది ఉపయోగించకుండా ఇక్కడే ఉంటుంది’ కింద తారీకు ఉంది.
అతను సన్నగా నవ్వాడు. అకస్మాత్తుగా అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షం అయింది.
‘‘నేను దొంగని. మీరంతా చేతులు ఎత్తండి.’’
ముగ్గురూ అతని చేతిలోని ఆయుధాన్ని చూసి ఆ పనిచేశారు.
‘‘ఆ నోటివ్వు.’’ అతను ఎడ్డీని ఆజ్ఞాపించాడు.
ఎడ్డీ సందేహించకుండా ఆ ఫ్రేమ్‌ని గోడ మీద నుంచి తీసి దానివెనుక భాగాన్ని తెరిచి పది డాలర్ల నోట్‌ని ఆ యువకుడికి ఇచ్చాడు. అతని మొహంలో డాలర్ నోటు ఇచ్చేటప్పుడు తన కస్టమర్‌ని చూసి నవ్వే నవ్వు టోబర్‌కి కనిపించింది.
‘‘మీ నుంచి దొంగతనం చేయను. నాకు చట్టం అంటే గౌరవం.’’ షెరీఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు.
ఎడం చేత్తో అతని హోల్‌స్టర్‌లోని రివాల్వర్‌ను అందుకుని నేలమీద ఉంచి ఓ మూలకి తన్నాడు. తర్వాత టోబర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు.
‘‘నీ పర్స్ తీయి.’’
అతని పర్స్‌లో మూడు డాలర్లు మాత్రమే ఉండటం చూసిన ఆ యువకుడి మొహం నల్లబడింది.
‘‘నువ్వు దద్దమ్మవి.’’ ఆ యువకుడు టోబర్ వంక కోపంగా చూస్తూ అరిచాడు.
క్యాష్ బాక్స్ తెరచి చూశాడు. అందులో ఏడు డాలర్లు మాత్రమే లభించాయి.
‘‘ఇంత తక్కువా? నీ వ్యాపారం బాగుండాలిగా?’’ అడిగాడు.
‘‘ఇది క్యాష్ సేఫ్ క్యాష్ బాక్స్. హైవే మీద ఉంది కాబట్టి షెరీఫ్ సలహా మీద దీన్ని ఏర్పాటుచేశాను.’’ ఎడ్డీ చెప్పాడు.
క్యాష్ బాక్స్ అడుగున ఉన్న నోట్లని కిందకి పడేసే కంతలోంచి నోట్లని లోపలికి వేసే సదుపాయం ఉండే క్యాష్ బాక్సే సేఫ్ క్యాష్ బాక్స్. దొంగల బెడద నుంచి బయటకి పడటానికి ఇది. అడుగు భాగంలోని నోట్లని తీయాలంటే స్క్రూలతో పై క్యాష్ బాక్స్‌కి ఉన్న స్క్రూలన్నింటినీ విడదీయాలి. ప్రత్యేక స్క్రూలకి ప్రత్యేక స్క్రూడ్రైవర్ని వినియోగించి అన్నిటినీ విప్పడానికి ఇరవై నిమిషాలు పడుతుంది. వారానికోసారి బ్యాంక్‌లో డిపాజిట్ చేయబోయే ముందు దాని తెరుస్తారు.
ఆ డబ్బుతో బయటకి వెళ్తూ చెప్పాడు.
‘‘నన్ను పట్టుకోడానికి ఎవరైనా బయటకి వస్తే ఇంతే సంగతులు.’’
‘‘గుడ్‌నైట్ సర్. దయచేసి ఇంకోసారి రండి.’’ వెళ్తున్న అతనితో ఎడ్డీ ప్రతీ కస్టమర్‌తో చెప్పేంత మర్యాదగా చెప్పాడు.
టోబర్ షెరీఫ్ వంక చూసి అడిగాడు.
‘‘డేన్! నువ్వు అతన్ని పట్టుకోడానికి వెళ్ళవే? అది నీ బాధ్యత.’’
‘‘నేను రివాల్వర్ ఉన్న ఓ దొంగని పట్టుకోడానికి వాడి వెంట మూర్ఖంగా పరిగెత్తను. ఖర్మకాలి వాడే రేపటికల్లా పట్టుబడచ్చు.’’
చెప్పి రెండు నిముషాల తర్వాత షెరీఫ్ లేచి తన పోలీస్ కార్ దగ్గరకి వెళ్ళి రేడియోలో ఆ దొంగ వర్ణనని చెప్పాడు.
***
మర్నాడు ఉదయం ఎడ్డీ రెస్టారెంట్‌కి ఎడ్డీ, షెరీఫ్‌లు ఎదురు చూసినట్లుగా టోబర్ ఉదయం తొమ్మిదికి రాలేదు. పదకొండున్నరకి టోబర్ హడావుడిగా వచ్చాడు.
‘‘నా అకౌంట్లో మొత్తం పాతికవేల డాలర్లు ఇందాక కట్టేసావా? ’’ వాడిపోయిన మొహంతో వచ్చి అడిగాడు.
‘‘అవును. మా అబ్బాయిని కట్టగానే నీకు ఫోన్ చేసి చెప్పమన్నాను. సాయంత్రంలోగా వెళ్ళి తనకా డాక్యుమెంట్‌ని బ్యాంక్ నుంచి తీసుకుంటాను.’’ ఎడ్డీ చెప్పాడు.
‘‘నిన్న నీ దగ్గర సగమే ఉందని ఎందుకు అబద్ధం ఆడావు?’’
‘‘ఎడ్డీ దగ్గర నిజంగా డబ్బు లేదు.’’ షెరీఫ్ డేన్ చెప్పాడు.
‘‘మరి? ఇవాళ్టికల్లా ఎలా వచ్చింది?’’ టోబర్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నిన్నటి ఆ దొంగని రాత్రి తొమ్మిదిన్నరకి పట్టుకున్నారు. ఫ్రేంలోంచి దొంగిలించిన ఆ పది డాలర్ల నోట్ నంబర్ని ఇరవై ఐదు మైళ్ళ దూరంలోని అన్ని షాప్‌లకి ముందే ఇచ్చాను. ఎవరైనా ఆ నోట్‌ని కస్టమర్ తెస్తే, అది దొంగిలించిన సొమ్మని అర్థమని హెచ్చరించాను. నిన్న అందరికీ అలర్ట్ రీ టెక్ట్స్ మెసేజ్ కూడా పంపాను. ఓ లిక్కర్ స్టోర్లో దాన్ని మారుస్తూ ఆ దొంగ పట్టుబడ్డాడు.’’
‘‘అది బానే ఉంది. కానీ పనె్నండున్నర వేల డాలర్లు ఎడ్డీకి ఎలా వచ్చాయి అన్నది నా ప్రశ్న.’’ టోబర్ అడిగాడు.
‘‘ఆ దొంగని పట్టుకుంటే ఇరవై ఐదు వేల డాలర్ల బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. దానికి కారణమైన పది డాలర్ల నోట్ ఎడ్డీది కాబట్టి అతనికి అందులో సగం వెళ్తుంది. కాబట్టి నేను ఎడ్డీకి నా అకౌంట్లోంచి పనె్నండున్నర వేల డాలర్లు అప్పుమీద వచ్చాను. ఆ సొమ్ము అతనికి నెల్లోగా రాగానే అతను నాకు పనె్నండు వేల ఐదువందల ఒక్క డాలర్లు చెల్లించాలి. ఒక్క డాలర్ అప్పు మీద వడ్డీ.’’
టోబర్ మాడిపోయిన మొహంతో వెనక్కి తిరిగి వెళ్తూంటే ఎడ్డీ చెప్పాడు.
‘‘గుడ్ డే టోబర్. దయచేసి మళ్ళీ రండి.’’ ఎడ్డీ మర్యాదగా చెప్పాడు. *

--మల్లాది వెంకట కృష్ణమూర్తి