క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, జూన్ 18: మండలంలోని గొల్లమారనపల్లి గ్రామానికి చెందిన పూజారి (28) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూజారి తండ్రి సన్న తిమ్మప్ప గత ఏడాది క్రితం రూ. 5లక్షలు అప్పు చేసి వంద గొర్రెలను కొని వాటిని మేపేందుకు కర్నాటక రాష్టమ్రైన మైసూరుకు తరలించి వాటిని పూజారి ఆధ్వర్యంలో సంరక్షణ చేసేవాడు. అయితే గత నెల రోజుల క్రితం దాదాపు 70 గొర్రెలు రోగాల బారిన పడి మృత్యువాత పడ్డాయి. మిగిలిన గొర్రెలతో చేసిన అప్పులు రూ. 5లక్షలను ఎలా తీర్చాలి, వడ్డీ ఎలా కట్టాలి, చెల్లెలి వివాహం ఏ విధంగా చేయాలని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం పూజారి మైసూరు నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చి సోమవారం ఉదయం గ్రామ పొలిమేరలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎఎస్సై వీరన్న తెలిపారు. తండ్రి సన్నతిమ్మప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యువకుడి ఆత్మహత్య
ఆత్మకూరు, జూన్ 18: ఆత్మకూరు గ్రామానికి చెందిన అంకే రాధాకృష్ణ (30) అప్పుల బాధ తాళ లేక తోటలో సోమవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వైకాపా కార్యకర్తపై దాడి
తాడిపత్రి, జూన్ 18: మండల పరిదిలోని చుక్కలూరు వరదాయపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివప్రసాద్‌రెడ్డిపై సోమవారం టీడీపీ వర్గీయులు దాడి చేశారు. శివప్రసాద్‌రెడ్డి పొలంలో టీడీపీ వర్గీయులు గొర్లు తోలిన విషయంలో శివప్రసాద్‌రెడ్డి మందలించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శివప్రసాద్‌రెడ్డి స్టాటర్ మరమ్మతుకు తాడిపత్రికి వస్తుండగా గ్రామం సమీపంలోని వంక వద్ద దారికాచిన ప్రత్యర్థులు వేటకొడవలితో, రాడ్లతో దాడి చేయగా శివప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలపాలైనాడు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకై అనంతపురం తరలించారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో శివప్రసాద్‌రెడ్డిని వైకాపా సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, విఆర్ రామిరెడ్డి, స్వర్ణలత పరిమర్శించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
407 వాహనం బోల్తా- నలుగురికి గాయాలు
చిలమత్తూరు, జూన్ 18: మండల పరిధిలోని కనుమ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మామిడి కాయలతో వెళుతున్న 407 వాహనం బోల్తా పడిన సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలమత్తూరు వైపు వేగంగా వెళుతున్న 407 వాహనానికి స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో కూలీలు పార్వతమ్మ, రత్నమ్మ, రామాంజినమ్మ, పద్మావతమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం చిలమత్తూరు నుండి లేపాక్షికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న శ్రీనివాసరెడ్డిని బొలేరో వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బొలేరో వాహన డ్రైవరు అతిగా మద్యం సేవించి ఉండటంతోనే ప్రమాదం చోటు చేసుకొన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గాయపడ్డ అతనిని 108 వాహనంలో చికిత్సల నిమిత్తం హిందూపురం తరలించారు.
15 మంది బైండోవర్
చిలమత్తూరు, జూన్ 18: ఇటీవల మండలంలోని కోడూరు గ్రామంలో కల్తీకల్లు తాగి 9 మంది అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ సంఘటనను పురస్కరించుకుని సోమవారం మండలంలోని 15 మంది కల్లు యజమానులను ఎక్సైజ్ సీఐ సరోజాదేవి బైండవర్ చేసి స్థానిక తహసీల్దార్ మారుతీ ఎదుట హాజరుపరచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్లు సేవించే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడరాదని, నాణ్యమైన కల్లునే దుకాణాల్లో విక్రయించాలన్నారు. ఇకపై దుకాణాల్లో విక్రయించే కల్లు కల్తీ కల్లు అని తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం వారిని స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సతీష్‌కుమార్, కానిస్టేబుళ్ళు జయమ్మ, భరత్‌కుమార్‌లు ఉన్నారు.
పాఠశాలలో చెట్లు నరికివేత
బొమ్మనహాళ్, జూన్ 18: మండలంలోని ఉద్దేహాల్ జడ్పీ హైస్కూల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు 3 సంవత్సరాలు వయస్సుగల వంద మొక్కలను నరికివేశారని గ్రామ సర్పంచ్ మారుతిప్రసాద్ మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విలేఖరులతో సర్పంచ్ మాట్లాడుతూ కరవుగా మారుతున్న అనంతపురం జిల్లాలో చెట్టు-నీరు కింద గత మూడు సంవత్సరాల క్రితం ఉద్దేహాల్ హైస్కూల్‌లో నాటిన మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేయడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని మొక్కలు నరికి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకం ఫిర్యాదు చేశామన్నారు.