క్రైమ్/లీగల్

హత్య కేసులో నిందితులు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 23 : పనె్నండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుదీర్ఘ కాలం వేచి చూచి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. శనివారం స్థానికి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ రామాంజనేయులురెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2006లో చేజర్ల మండలం మాముడూరు గ్రామానికి చెందిన అట్లా కొండారెడ్డిని అదే గ్రామానికి చెందిన ఉత్సలమూరి చిన్నారెడ్డి చంపించాడనే అభియోగంతో చేజర్ల పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారన్నారు. విచారణ జరిపిన పోలీసులు చిన్నారెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. ఆ కేసును 2008లో కోర్టు కొట్టి వేసిందన్నారు. జైలు నుండి విడుదలైన చిన్నారెడ్డి కుటుంబంతో సహా కేశమనేనిపల్లికి వలస వెళ్లాడన్నారు. సొంత గ్రామమైన మాముడూరులో చిన్నారెడ్డికి రెండున్నర ఎకరాల సాగు భూమి ఉందన్నారు. పదేళ్లపాటు కేశమనేనిపల్లిలో ఉండి ఈ ఏడాది మేలో చిన్నారెడ్డి అతని భార్య ధనమ్మలు మాముడూరు గ్రామానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ పొలం పనులు చేసుకుంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో పాత పగను మనసులో పెట్టుకున్న కొండారెడ్డి కుమారుడు అట్లా నరేంద్ర, తన తండ్రిని చంపిన చిన్నారెడ్డి హత్యకు పథకం రచించాడన్నారు. బిట్రగుంటకు చెందిన కొరిసిపాటి ప్రసన్నకుమార్‌రెడ్డి, సత్తుపాటి శ్రీకాంత్‌లకు రూ. 3 లక్షలు సుపారీ ఇచ్చి చెన్నారెడ్డి హత్యకు పురిగొల్పాడన్నారు. నరేంద్ర నుండి నగదు తీసుకున్న ప్రసన్నకుమార్‌రెడ్డి, శ్రీకాంత్ తమకు తెలిసిన మురగంద పెంచలరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, మెట్టుకూరు బ్రహ్మానందంలతో పాటు మరి కొతమంది సహకారంతో చిన్నారెడ్డి హత్యకు పథకం పన్నారన్నారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన పొలంలో పని చేసుకుంటున్న చిన్నారెడ్డిని ఇనుప రాడ్డుతో కొట్టి, కత్తితో పొడిచి చంపారని వెల్లడించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, చేజర్ల ఎస్‌ఐ బాజిరెడ్డిలు ప్రత్యేక నిఘా ఉంచి నిందితులను శుక్రవారం అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, కత్తి (బటన్ నైఫ్) లను స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం ఏడు మంది నిందితులను కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు. మిగతా ముద్దాయిలను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, చేజర్ల ఎస్‌ఐ బాజిరెడ్డి, ఇతర పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.