క్రైమ్/లీగల్

క్రెడిట్ కార్డులతో బ్యాంకులకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ‘కూటికోసం కోటి విద్యలు’ అనే రోజులు పోయాయ.. ఇప్పుడంతా దోచుకోడానికి సవాలక్ష మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటిదే తాజాగా ‘లేని ఉద్యోగుల పేరిట’ నకిలీ పత్రాలతో క్రెడిట్ కార్డులు తీసుకుని నాలుగు బ్యాంకుల నుంచి ఏకంగా రూ.1,52,10,705 మొత్తాన్ని కాజేశారు. ఒక బోగస్ కంపెనీ ఏర్పాటు చేసి, దానిలో కొందరు ఉద్యోగులు పని చేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి తద్వారా క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకుల నుంచి భారీగా నగదు డ్రా చేసుకున్నట్లు నిర్ధారణ అయంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చీటింగ్ వెలుగు చూడ్డంతో బ్యాంకులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఎస్‌బీసీ, ఆర్‌బీఎల్ బ్యాంకుల నుంచి నకిలీ ధ్రువపత్రాలతో 125 క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. పర్నిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోగస్ కంపెనీ స్ధాపించి, ఈ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల డేటాబేస్‌ను తయారు చేసి బ్యాంకులను సంప్రదించి లేని ఉద్యోగులు ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందజేసి, మధ్యలో ఉన్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లకు డబ్బు ఆశ చూపించి వారిని మేనేజ్ చేయడం ద్వారా సులభంగా క్రెడిట్ కార్డులను దక్కించుకున్నారు. ఈ మొత్తం రాకెట్‌కు సూత్రధారి నల్గొండ జిల్లా వాసి, ప్రస్తుతం హయత్‌నగర్‌లో ఉంటున్న కుంభం రంగారెడ్డిగా గుర్తించారు. ఈ కీలక నిందితుడితో పాటు తిప్పర్తి వినయ్‌కుమార్‌రెడ్డి, మేకా సంతోష్‌రెడ్డి, వరికుప్పల శ్రీకాంత్, మక్కాల నరేష్, గోపతోటి కిషోర్‌బాబు, గోరంట్ల శైలేష్‌కుమార్, రెడ్డిపల్లి సందీప్‌కుమార్, ఉప్పు ఆనంద్, ముద్దునూరు పరమేశ్‌కుమార్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. రంగారెడ్డికి రెండో నిందితుడు వినయ్‌కుమార్ రెడ్డి స్వయానా బావమరిది. నిందితుల్లో ఒకరైన జిహెచ్‌ఎంసి ఎలక్షన్ సెల్‌లో పని చేసే మక్కాల నరేష్ సహాయంతో ఓటర్ ఐడి కార్డులు సృష్టించి తద్వారా పాన్ కార్డులు కూడా పొందారు. వీటన్నింటి ఆధారంగా తొలుత హెచ్‌డిఎఫ్‌సి సంతోష్‌నగర్ శాఖలో శాలరీ అక్కౌంట్లు ప్రారంభించారు. 48 మంది ఉద్యోగుల నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా 48 క్రెడిట్ కార్డులను సొంతం చేసుకున్నారు. 2013 అక్టోబర్ నుంచి 2015 ఫిబ్రవరి మధ్య రూ.45.72 లక్షలు ఆ క్రెడిట్ కార్డుల ద్వారా నగదు డ్రా చేసుకున్నారు. ఇలా ఎస్‌బీఐకి చెందిన 33 క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.25,28,265 నగదును కొట్టేశారు. ఆ తర్వాత స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంకు నుంచి 41 క్రెడిట్ కార్డులు, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి 3 క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.77,84,440, రూ.3,26,000 నగదు డ్రా చేసుకున్నారు. సాధారణ బ్యాంకుల ఆడిట్‌లో హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో విచారణలో మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ రాకెట్‌ను టాస్క్ఫోర్స్ నార్త్ జోన్ బృందం చేధించింది. ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌ఐలు కెఎస్ రవి, బి.శ్రావణ్‌కుమార్, పి.చంద్రశేఖరరెడ్డి, కె.శ్రీకాంత్ తదితరులు టాస్క్ఫోర్స్ బృందంలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.6.90 లక్షల నగదు, 19 సెల్‌ఫోన్లు, మూడు సీపీయూలు, 3 మానిటర్లు, రెండు కలర్ ప్రింటర్లు, కొన్ని ఒరిజినల్, డూప్లికేట్ క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు.

చిత్రం..బోగస్ క్రెడిట్ కార్డులను చూపుతున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు