క్రైమ్/లీగల్

మూడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 7: విజయవాడ - హైదరాబాదు 65వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా సరిహద్దు రవాణా చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మూడు బస్సులు, ఒక కారు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాద సంఘటనలో ఒకరు మృతి చెందగా 27 మందికి గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళుతున్న ఎల్‌విఆర్ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ బస్సు రవాణా చెక్‌పోస్టు వద్ద నిలిపి ఉన్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దాని వెనుక వస్తున్న జయభారతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి నిలిపివేసే ప్రయత్నం చేయగా అదే మార్గంలో వెనుక వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు జయభారతీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దాని వెనుక వస్తున్న కారు సైతం ఈ బస్సులను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ప్రమాదం కారణంగా బస్సుల ముందు వెనుక భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో జయభారతి బస్సుకు చెందిన హాల్టింగ్ డ్రైవర్ వనంశెట్టి శ్రీనివాసరావు (31) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణీకులకు తీవ్రంగా, స్వల్పంగా గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న సీఐ జయకుమార్, చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లు సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రవాణా చెక్‌పోస్టు అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను 108, జీఎంఆర్, హైవే అంబులెన్స్‌లతో పాటు వివిధ వాహనాల్లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులు అందరూ విజయవాడ, హైదరాబాదు, ఉభయ గోదావరి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారు. క్షతగాత్రులకు జగ్గయ్యపేటలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం విజయవాడ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి బాధితులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద కారణంగా హైవేపై ఒక పక్క వాహన రాకపోకలు నిలిచిపోగా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదానికి గురైన బస్సులను యంత్రాలతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపి కేశినేని నానిలు అధికారుల ద్వారా ప్రమాదంపై ఆరా తీసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.