క్రైమ్/లీగల్

సినీ ఫక్కీలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 7: నిందితులు చాకచక్యంగా వ్యవహరించి సినీ ఫక్కీలో చోరీకి పాల్పడగా, పోలీసులు తమదైన శైలిలో 24 గంటల్లో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతోపాటు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా గౌరారం సీఐ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అందించిన వివరాలిలా ఉన్నాయి. రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన ఇద్దరు కస్టోడియన్‌లు మెతుకు ప్రవీణ్‌కుమార్, మామిడిపల్లి హరికృష్ణలు 4వ తేదీన గజ్వేల్ నుంచి రూ. 22లక్షల నగదుతో మోటారు సైకిల్‌పై వర్గల్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో పెట్టడానికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో చాంద్‌ఖాన్‌మక్తా శివారులోకి రాగానే ముఖానికి నల్లటి మాస్క్, జాకెట్, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు బ్లూ కలర్ బూట్లు ధరించి నెంబర్‌లేని పల్సర్ బైకుపై అతి వేగంగా వస్తూ అగంతకుడు ఒక్కసారిగా వారి నుండి ఆ క్యాష్‌బ్యాగును లాక్కొని అక్కడి నుండి తప్పించుకున్నాడు. పారిపోతున్న అగంతకుడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రవీణ్‌కుమార్, మామిడిపల్లి హరికృష్ణలు చౌదర్‌పల్లి చౌరస్తా వరకు వెంబడించి రాజీవ్ రహదారి వైపు బైకును మలుపు తిప్పడంతో అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో వీరికి తీవ్ర గాయాలు కాగా, డబ్బు దొంగిలించిన అగంతకుడు వారికి చిక్కకుండా పరారయ్యాడు. దీంతో సదరు సంస్థకు చెందిన మేనేజర్ జనార్దన్ గౌరారం పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేయగా, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఆదేశాలతో నిందితుడిని పట్టుకునేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్, రూరల్ సీఐ శివలింగం, ఎస్‌ఐలు ప్రసాద్, వీరన్న, శ్రీశైలంలు టీంలుగా విడిపోయి తమ సిబ్బందితో గాలింపు చేపట్టారు. రాజీవ్ రహదారిపై గల సింగాయ పల్లి క్రాస్‌రోడ్డు, ముట్రాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద గల సీసీ కెమెరాలను పరిశీలించగా, నిందితుడి ఫోటోలు, వినియోగించిన బైకు ఒకే రకంగా ఉండడంతో పోలీసులకు సులువుగా ఆచూకీ లభించింది. పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసి రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన అరుణోజి నవీన్ ఘటన జరిగిన రోజు సెలవు పెట్టినట్లు తెలిసింది. దీంతో నవీన్‌పై దృష్టి పెట్టిన పోలీసులు ప్రజ్ఞాపూర్‌లో ఉంటున్న అతనిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారించగా, తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా డబ్బులు సులువుగా సంపాదించాలని పథకం అమలు చేశానని అంగీకరించాడు. తస్కరించిన అనంతరం అరుణోజి నవీన్, ప్రసాద్‌కుమార్‌లు శ్రీగిరిపల్లి శివారులోని అడవిలో రాళ్ల గుట్టల వద్ద కలుసుకొని డబ్బు బ్యాగును, అందులోని కొన్ని ధ్రువపత్రాలను అక్కడే దాచిపెట్టారు. అలాగే, నిందితుడు ప్రసాద్‌కుమార్ వినియోగించిన హెల్మెట్, జాకెట్, షూ, మాస్క్, గ్లౌజ్‌లను అక్కడే కాల్చివేసి ఆధారాలు లేకుండా చేశారు. అరుణోజి నవీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసుల బృందం ప్రసాద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, నేరం తామే చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో గుట్టల్లో దాచిపెట్టిన చోరీసొత్తు రూ. 22 లక్షల నగదు, చోరీలో వినియోగించిన బైకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

చిత్రాలు..క్యాష్ బ్యాగుతో బైకుపై వెళ్తున్న నిందితుడి సీసీ ఫుటేజీ
*స్వాధీనం చేసుకున్న సొత్తు చూపిస్తూ విలేఖరులకు వివరిస్తున్న పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్