తెలంగాణ

పైగా భూములు ప్రభుత్వానివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 60 ఏళ్లుగా వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న వివాదాస్పద ‘పైగా’ భూములపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుతో ఈ భూములపై ప్రత్యేకంగా సమీక్షించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. 1958 నుండి వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న సీఎస్-7, సీఎస్-14 కేసుల్లో అనేక మలుపులు తిరుగుతున్న వివాదాస్పద భూ వివాదం చివరకు కోర్టు ధిక్కరణ కేసు విచారణతో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతం చేసింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ సర్వే నెం.46లోని విలువైన భూములపై కోర్టులో కొనసాగిన విచారణలో తహసిల్దార్‌పై సింగిల్ జడ్జి వేసిన శిక్షను ద్విసభ్య ధర్మాసనం తాజాగా రద్దు చేయడం విశేషం. తప్పుడు పద్ధతుల ద్వారా పొందిన ఫైనల్ డిక్రీలు ప్రభుత్వానికి వర్తించవని, ప్రజాప్రయోజనాలను కాలరాసి, వేలకోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టలేమంటూ జస్టిస్ వీ. రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎన్. బాలయోగితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. అలాగే ఎం. లింగయ్య అనే వ్యక్తి వేసిన కోర్టు ధిక్కారణ కేసును కొట్టివేసింది. పైగా భూములపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుతో సీఎస్-7, సీఎస్-14 కేసుల్లో ‘పైగా’ భూ వివాదాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. దీంతో గతంలో పొందిన ఫైనల్ డిక్రీ ఉత్తర్వులు కుట్రలు, మోసం ఊహాజనితమైన పునాదులమీద కట్టిన పేకముడుల్లా కుప్పకూలిపోయాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
1952లో ఇనాం భూముల విచారణ చట్టం ప్రకారం పైగా ఆధీనంలోని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై న్యాయం చేయాలని బోర్డు ఆఫ్ రెవెన్యూలో అప్పటి నవాబు యార్‌జంగ్ బహదూర్ అప్పీలు చేయడంతో విచారణ చేపట్టింది. బోర్డు తుది నిర్ణయం తీసుకోకముందే దీనిపై ఉన్నత న్యాయస్థానంలో సిఎస్-7/1958 కేసును నవాబు సోదరి సుల్తాన జహనా బేగం కేసు వేశారు. ఈ కేసులో మొదట ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. అనంతరం పైగా వారసులు రాజీ పిటిషన్ దాఖలుచేసి 1959లో ఒక ప్రిలిమనరీ డిక్రీ పొందారు. అయితే అప్పటికే ప్రభుత్వానికి పైగా వారసులకు మధ్య రెవెన్యూ బోర్డులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లోని ఆస్తుల విషయంలో పైగా వారసులకు అనుకూలంగా తీర్పు వస్తే పంపకాలు చేసుకోవచ్చని ప్రిలిమినరీ డిక్రీ ఇచ్చింది. ఇలా ఉండగా 1976లో రెవెన్యూ బోర్డు రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 46లోని భూములపై పైగా వారసులకు ఎటువంటి హక్కులు లేవని తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ 2002లో ప్రైవేటు వ్యక్తులు సీఎస్-7/1958లో పైగా వారసుల వద్ద తాము సర్వే నెంబరు 46లోని భూములు కొనుగోలు చేసామని, ఫైనల్ డిక్రీలను పొజిషన్ మరియు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయాలని వేర్వేరు పిటీషన్లు వేసి అనుకూలంగా ఉత్తర్వులు పొందారు. అయితే రెవెన్యూ రికార్డులో తమ పేరు నమోదు చేయకపోవడంతో 2009లో కోర్టులో రివ్యూ-పిటీషన్ దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జ్ అడ్మిషన్ స్థాయిలోనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అవి ప్రభుత్వ భూములు కావడంతో వెంటనే ప్రభుత్వం అప్పీల్ చేయకపోయినా ఎటువంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం, మరోవైపు కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో రెవెన్యూ అధికారులపై కోర్టు ధిక్కారం కేసులు దాఖలు చేశారు. దీంతో శేరిలింగంపల్లి తహసిల్దార్ ఎస్ తిరుపతిరావుకు రెండు సంవత్సరాలు జైలు, 1500 రూపాయల జరిమానా విధించడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ధిక్కారణ కేసుపై అప్పీలు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎన్.బాలయోగిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కోర్టు రక్షించిందని ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. పైగా భూముల కేసులను వెంటనే ప్రత్యేకంగా సమీక్షించి సదరు భూములను రక్షించడానికి ప్రభుత్వం పూనుకుంది. రాయదుర్గ్‌లో సర్వే నెం.46లోని 84 ఎకరాలతోపాటు శంశీగూడలో సర్వే నెం. 57లోని 274 ఎకరాల భూమికి సంబంధించి సమీక్షించాలని నిర్ణయించింది. పైగా వారసులు ఫైనల్ డిక్రీ పొందే ముందు బోర్డు ఆఫ్ రెవిన్యూలో ఉన్న పెండింగ్ కేసుల్లో తీసుకున్న తుది నిర్ణయం మేరకు రికార్డులను సరిచేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించినట్లు సమాచారం. మక్తా బహదూర్ అలీ, మక్తా ఊట్‌పల్లి, శివరాంపల్లి, బాలాపూర్, రాయదుర్గ్, సౌగ్ బౌలి, సోమాజిగూడ, మక్తా నవాబ్, మక్తా మామా, మజీర్‌గూడ, అంజద్ నగర్, మహ్మమద్ నగర్, సంగీగూడ, మక్తా అలీసాబ్, చిత్తాగూడ, మక్తా యెల్లాకూర్, ఎర్వగూడ, కోల్ బౌలి, శంషీగూడ, రోషన్‌బౌలి తదితర ప్రాంతాల్లోని భూములపై ఉన్న కేసులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది.