క్రైమ్/లీగల్

అంతర్జాతీయ ఫోన్‌కాల్స్ పక్కదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 12: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను పక్కదారి పట్టిస్తున్న నలుగురు ఘరానా మోసగాళ్లను కాకినాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. చైనాకు చెందిన స్కైలైన్ నెట్ అనే సంస్థతో రహస్య ఒప్పందం చేసుకుని సిమ్ కేరియర్ల ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్‌ను పక్కదారి పట్టిస్తూ భారత టెలికం ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేరానికి పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోలంగూడుకు చెందిన ఆదర్ల గణేష్, హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన గుమ శ్రీకొండ రామదాసు, హైదరాబాద్ నాగోల్‌కు చెందిన గుస్సా శ్రీ్ధర్, తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామానికి చెందిన ఉలవల ముసలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ రవివర్మ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సుమారు ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయి ఫోన్ కాల్స్ పక్కదారి పడుతున్నట్టు తమకు సమాచారం అందడంతో నిందితులపై నిఘా ఉంచామన్నారు. 2017వ సంవత్సరం నుండి సదరు నిందితులు కాకినాడ నగరంలోని నూకాలమ్మ గుడి, రామారావుపేట నైట్ హోటల్, కరణంగారి సెంటర్, డీ మార్ట్ తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకుంటున్నారని చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చే ఇంటర్నేషనల్ నెట్ కాల్స్‌ను కాల్ రూటింగ్ ద్వారా లోకల్ జీఎస్‌ఎం కాల్స్‌గా మార్చుతుంటారని, దీనివలన నిముషానికి రూపాయి మాత్రమే ఖర్చవుతుందన్నారు. చైనాకు చెందిన స్కైలైన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుని అపార్ట్‌మెంట్లలో వాటిని అమర్చుతున్నారన్నారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సిమ్‌కార్డులు అమర్చి, వాటిని నెట్ రూటింగ్ చేస్తారని చెప్పారు. దీనికి భారతదేశంలో అనుమతి లేదని, వీరు చేసిన రూటింగ్ కారణంగా దేశ ఆదాయానికి నష్టం కలుగుతోందని తెలిపారు. ఈవిధంగా చేసినందుకుగాను నిందితులకు నిముషానికి 4 పైసల వంతున కమీషన్‌ను చైనా స్కైలైన్ కంపెనీ వెస్ట్రన్ మనీ యూనియన్ ద్వారా పంపుతోందని వివరించారు. ఈ వ్యవహారంపై నిఘా ఉంచి బుధవారం ఉదయం నగరంలోని వివేకానంద పార్క్‌లో నిందితులను అరెస్ట్ చేసి, సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ విధించినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు.