క్రైమ్/లీగల్

భూ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 27: భూ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన చంద్రయ్య యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం వెంకట్రామ్‌నగర్, మస్తాన బిల్డర్స్‌లో నివాసముండే పోతురాజు రామచంద్రుడు అలియాస్ చంద్రయ్య యాదవ్ (53) 1999 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గతంలో జీడిమెట్లలోని డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో యూనియన్ లీడర్‌గా ఉన్న సమయంలో డీసీఎం ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారస్థుడు గుడిమెట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సురేశ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.
చంద్రయ్య యాదవ్, సురేశ్ రెడ్డి ఇద్దరూ కలిసి సూరారం, గాజులరామారం, బాచుపల్లి గ్రామాలలో ఉన్న ఖాళీ స్థలాలు, ప్లాట్‌లను ఆక్రమించుకోవాలని పథకం వేసుకున్నారు. సురేశ్ రెడ్డి రూ.12లక్షలను చంద్రయ్య యాదవ్‌కు ఇచ్చి నకిలీ పత్రాలను చేయాలని చెప్పాడు. 1983 నుంచి అన్ని పత్రాలు కూడా కంప్యూటరైజేషన్ అయినందున 1982లో రికార్డు మార్చాలని ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులైన సాయిబాబ, మురళీకృష్ణ సహాయంలో బుక్-1, వాల్యూమ్ 440ని తెప్పించుకున్నారు. అందులో ఉన్న ఒరిజినల్ మాటిగేజ్ పత్రాలను ఏడింటిని తొలగించి వాటి స్థానంలో ఆరు తప్పుడు సేల్ డీడ్ పత్రాలను తయారు చేయించారు. వాల్యూమ్ 440లో యథావిధిగా చేర్చి తిరిగి ప్రైవేటు ఉద్యోగులైన సాయిబాబ, మురళికృష్ణకు ఇచ్చి రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డు గదిలో పొందుపరిచారు. బాచుపల్లి గ్రామం సర్వే 140, 141లోని 32.33 ఎకరాల స్థలానికి చెందిన అసలు యజమాని దామోదర్ రావు తన స్థల పత్రాలను ఫోర్జరీ చేసి ఆక్రమణకు గురవుతుందని తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని సురేశ్ రెడ్డి, మురళీకృష్ణ, సాయిబాబను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ప్రధాన నిందితుడైన చంద్రయ్య యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ పత్రాలను సృష్టించడానికి సహకరించిన సాయిబాబ, మురళీకృష్ణకు రూ.5 లక్షలు ఇచ్చారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న చంద్రయ్య యాదవ్ బుక్-1, వాల్యూమ్ 440లో నుంచి తొలగించిన ఒరిజినల్ మాటిగేజ్ పత్రాలు, నకిలీ సేల్‌డీడ్‌లు, రబ్బర్ స్టాంప్‌లను తన కారులో తీసుకుని జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిలో దగ్ధం చేశారు. చంద్రయ్య యాదవ్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఓ కారు, ద్విచక్ర వాహనం, ఆరు సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్, ప్రింటర్, రబ్బర్ స్టాంప్స్ తయారీ మిషన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.